మరో దేవాలయం | Gollapudi Maruthi Rao Went To Puttaparthi With Janakiramaiah | Sakshi
Sakshi News home page

మరో దేవాలయం

Published Thu, May 2 2019 1:01 AM | Last Updated on Thu, May 2 2019 1:01 AM

Gollapudi Maruthi Rao Went To Puttaparthi With Janakiramaiah - Sakshi

నిజానికి ఇది మరో దేవాలయం. ఇది దొంగ శీర్షిక. అది తెలిసే ఎందుకు పెట్టాను? ఈ దేవాలయా నికి Focus ఇదొక్కటే కనుక. మీ కాలమ్‌ రుచి రహస్యమేమిటని కొందరు అడుగుతూంటారు. వారికి ఇవీ సూత్రాలు. మొదటి సూత్రం– అబద్ధం. అబద్ధానికి ఓ ‘రుచి’ ఉంది సరిగ్గా వండగలిగితే. అబద్ధం ఆశ్చర్యం, తీరా ముడి విప్పాక చిన్న కితకిత, ఎక్కువ సరదా, మీకు ముందే తెలిసిన విషయానికి ముక్తాయింపు– ఇన్ని కలగాలి. చాలా ముఖ్యంగా హర్ట్‌ చేయకూడదు, కోపం తెప్పిం చకూడదు. చిన్న మెలికకు నవ్వాలి. అందరితో చెప్పి నవ్వుకోవాలి. సరే. ఇంకో దేవాలయం ఏదీ? తొలుత మొదటి దేవాలయం గురించి. చాలా సంవత్సరాల కిందట పుట్టపర్తిలో భగవాన్‌ సత్యసాయిబాబా తమ్ముడు జానకి రామయ్యగారు నా గదికి వచ్చి నన్ను స్వామి దర్శనానికి తీసుకెళ్లారు. స్వామి మాకు ఇంటర్వూ్య ఇచ్చారు. అదొక గొప్ప జ్ఞాపకం.

అటు తర్వాత జానకి రామయ్యగారు నన్ను పుట్టపర్తి దేవాలయానికి తీసుకెళ్లారు. అక్కడ మా పాదరక్షలు విడవబోతూ ఉంటే ఒకాయన పరుగున వచ్చారు. వాటిని భక్తితో అందుకున్నారు. నేను చేస్తా నంటే ఒప్పుకోలేదు. సగం వొంగి భక్తితో ప్రసా దంలాగా అందుకున్నారు. అతనక్కడ ఊడిగం చేసే పనివాడు కాదు, స్వామి సేవకి 15 రోజులు శెలవు పెట్టి వచ్చిన ఓ గెజిటెడ్‌ ఆఫీసర్‌. ఒళ్లు పులక రించింది. ఇప్పుడు ఆసుపత్రిలోకి అడుగుపెడుతూనే రికార్డు టైములో నిర్మించిన ఈ కట్టడాన్ని చూపి మాట్లాడుతూంటే జానకి రామయ్యగారికి కళ్లనీళ్లు ధారాపాతంగా వర్షించాయి. నిజానికి అది సిమెంట్, ఇసుకతో కట్టిన భవనం కాదు. ప్రేమ, డెడికేషన్‌ దాని మూలస్తంభాలు. అక్కడ నాకు తెలిసిన పాత ముఖాలు కని పిస్తున్నాయి. విశాఖ మునిసిపల్‌ కమిషనర్‌ ఆఫీసు సూపర్నెంటు, నా మిత్రుని భార్య, పంజాబు మిలట్రీ కల్నల్‌ భార్య ఎందరో ఆఫీసర్లు అక్కడ సేవకులు. వంగి నిలుచున్నారు. సేవకులు కూడా అంత ఒద్దికగా ఉండరు. అంతటా భక్తీ– ఏ ప్రతిఫలా
పేక్ష లేని సేవా తత్పరత– వీటన్నిటికీ మూల ధాతువు– స్వామి! అద్భుతం. బయటికి వస్తూ నేనూ ఏడ్చాను.

ఇప్పుడు మరో దేవాలయం. అపోలో ఆసు పత్రి. దీని వెనుక స్వాములు లేరు. పరమార్థం లేదు. పాపపుణ్యాల ప్రసక్తి లేదు. మరేం ఉంది? ఇక్కడ నాలుగు గోడల మధ్య వందలాది వర్కర్లున్నారు. డాక్టర్లున్నారు. పువ్వులాంటి దేవతలున్నారు (నర్సులు). ప్రపంచంలో అన్ని మూలల నుంచీ వచ్చిన అనూహ్యమైన యంత్రాలున్నాయి. వాటిని అలవోకగా నడిపే నిపుణులున్నారు. వీటన్నిటి సామూహిక దృక్పథం. ఆరోగ్యంమీద నమ్మకం, బతుకుతామన్న ధైర్యం, బతకడానికి చేయూత, వెరసి– ప్రాణ ధాతువు. లోపలికి రాగానే ఓ నర్సు నీ జాతకాన్ని ఇస్తుంది– క్షణాల్లో. నీ జ్వరం దగ్గర్నుంచి– నీ రుచుల దాకా– నీ ఊపిరి వివరాల దాకా కాగితం మీదకి వచ్చేసింది. వెంటనే రెండో విడత. సమస్య, ప్రారంభం, కష్టం, ఇక్కడికి రావడానికి కారణం. ఈలోగా రక్తనాళంలోకి సూది దిగుతూంటుంది. మరో రెండు నిమిషాల్లో మొదటి విడత చికిత్స ప్రారంభం. నువ్వు వచ్చి ఇంకా 5 నిమిషాలే అయింది. ఆ టీమ్‌ నీ హితుడో, నీ కోసం నియ మించిన ప్రాణ స్నేహితుడో అయి ఉండాలి. ఎందు కంటే సరిగ్గా 10 నిమిషాల్లో నువ్వు అక్కడికి వచ్చిన మొదటి ఫలితం దక్కిపోతుంది.

ఇటు తర్వాత డాక్టర్లు, వర్కర్లు, నిపుణులు– కేవలం నీ కోసం పుట్టినట్టు కృషి చేస్తారు. నీ నమ్మకం దేదీప్యమానమవుతుంది, విశ్వాసం వీర విహారం చేస్తుంది. ఇది శక్తి, నైపుణ్యం, ఏ కల్మషమూ లేని ‘సేవ’ నీకిచ్చే వరం. ఒకపక్క ఈ కృషి ప్రతీ క్షణం పుస్తకంలోకి ఎక్కుతుంది. అది త్వరలో ఫైలుగా మారి రేపటికి గ్రంథమవుతుంది. ప్రజల దేవుళ్లకి నాలుగు స్థానాలు– నీ మనస్సు, గుడి, నీ తాదాత్మ్యం– అన్నింటికీ మించి నీ నమ్మకం. ఇది సీతా సాధ్వా? అవును. ఇది తాదాత్మ్యం. అబ్బే రాయి.. అంతే ఓ గొప్పillusion is dead. Faith dies when the logic starts.. ఈ తెరని ఈ దేవాలయం నీకు తెలియకుండానే చెరిపేస్తుంది. ఈ నిజాన్ని ప్రపంచంలో 120 దేశాలు నమ్ముతున్నాయి. ఒక తీర్థయాత్రగా వస్తున్నారు. నీ విశ్వాసాన్ని ఉద్భుద్ధం చేసేది తీర్థం. కేవలం అవసరానికి పిలిచి, తీర్చి, నీకు తెలియకుండానే మరొక ప్లేస్‌కి నిన్ను బదిలీ చేసే విచిత్రమైన దేవా లయం పేరు– అపోలో. నేను కొండంత అనారోగ్యంతో– క్రిటికల్‌ కేర్‌లో మూడు రోజులుగా ఉంటూ డాక్టర్ల అనుమతితో ఈ ‘వ్యక్తిగత’ స్పందనని మీకు పంచుతున్నాను. ఇది ప్రకటన కాదు. కితాబు కాదు. వాటికి నేను ఆమళ్ల దూరం. మొదటి దేవాలయానికి– మహాస్వామి మూల హేతువు. రెండో దేవాలయానికి ‘విశ్వాసం’ మూల ధాతువు.

గొల్లపూడి మారుతీరావు

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement