putaparthi
-
చేతిలో సంచి.. అందులో కత్తి.. పుట్టపర్తి కలెక్టరేట్‌కు మహిళ!
పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా): అచ్చం ఫ్యాక్షన్ సినిమా మాదిరిగానే ఉంది తాజా ఘటన. చేతిలో సంచి.. అందులో కత్తి పెట్టుకుని ఒక మహిళ ప్రభుత్వ కార్యాలయానికి రావడం ఫ్యాక్షన్ సినిమాను తలపిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. పుట్టపర్తి కలెక్టరేట్‌కు ఓ మహిళ కత్తితో రావడం తీవ్ర కలకలం రేపింది. చేతిలో సంచి పట్టుకుని అందులో కొన్ని డాక్యుమెంట్స్‌తో పాటు కత్తిని తీసుకుని కలెక్టరేట్‌కు రావడం చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా తనకున్న భూ సమస్యతో ఆమె కలెక్టరేట్‌కు వచ్చారు. అయితే తన భూ సమస్యకు సంబంధించి డాక్యుమెంట్స్ ను సంచిలో తీసుకొచ్చింది ప్రేమలత అనే మహిళ.అయితే సంచిలో కత్తి కూడా ఉండటంతో పోలీసులు అవాక్కయ్యారు. కలెక్టరేట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కర్నీ తనిఖీలు చేసే క్రమంలో ఆమెను కూడా తనిఖీ చేయగా కత్తి బయటపడింది. దాంతో అక్కడున్న పోలీస్ సెక్యూరిటీ ఒక్కసారిగా అలెర్ట్ అయ్యింది. అసలు ఆమెను కత్తిని ఎందుకు తీసుకొచ్చావ్ అని ప్రశ్నించగా, ఆత్మరక్షణ కోసం అంటూ సమాధానమిచ్చింది. దాంట్లో ఎంత వరకూ వాస్తవం ఉందని పదే పదే ప్రశ్నించిన పోలీసులు.. ఆమెను విడిచిపెట్టి కత్తిని మాత్రం స్వాధీనం చేసుకున్నారు. -
సీఎం జగన్ సభ.. కదిలొచ్చిన జనసంద్రం
అది సీఎం జగన్ పుట్టపర్తికి వచ్చిన సందర్భం. రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి సీఎం జగన్ పుట్టపర్తికి బయల్దేరివెళ్లిన వేళ. అయితే ఆ సభకు జనసంద్రం పోటెత్తింది. సీఎం జగన్ పుటపర్తికి వస్తున్నానరి తెలిసి అక్కడకు అశేష జనసందోహం తరలివచ్చింది. సీఎం జగన్ అక్కడకు వచ్చే సరికే సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఇసుకేసినా రాలనంతగా ‘జనసంద్రం’ పోటెత్తింది. సీఎం జగన్‌కు సంఘీభావం తెలపడానికి ప్రజలు ఇలా భారీగా తరలివచ్చారు. దీనికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇవి కూడా చదవండి: చంద్రబాబు, ఎల్లో మీడియాకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ప్రతీ విషయంలో అన్నదాతకు అండగా నిలబడ్డాం: సీఎం జగన్ -
Puttaparthi: ఆధ్యాత్మిక వైభవం.. పర్యాటక నందనం
సాక్షి, పుట్టపర్తి: శ్రీసత్యసాయి జిల్లా కేంద్రంగా ప్రకటించిన తర్వాత పుట్టపర్తి.. సాయి బాబా ఉన్నప్పటి రోజులను తలపిస్తోంది. గత కొన్ని రోజులుగా సాయిబాబా మందిరానికి భక్తుల తాకిడి ఎక్కువైంది. వివిధ పనులపై కలెక్టరేట్ తదితర ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వారు.. మందిరానికి వెళ్లి సాయిబాబా సమాధి సందర్శిస్తున్నారు. కొన్ని రోజులుగా నిత్యం రెండు వేలకు మందికి పైగా ఇక్కడికి వస్తున్నారు. మందిరం లోపల నిర్వహిస్తున్న క్యాంటీన్ (తక్కువ ధరకే)కు ప్రతి పూట సుమారు వెయ్యి మంది భోజనానికి వస్తున్నట్లు రికార్డుల ద్వారా స్పష్టం అవుతోంది. మ్యూజియం, నక్షత్రశాల కిటకిట.. పుట్టపర్తిలోని చైతన్యజ్యోతి మ్యూజియం, నక్షత్ర శాల సందర్శించే వారి సంఖ్య కూడా పెరిగింది. సాయిబాబా మరణం తర్వాత చైతన్యజ్యోతి మ్యూజియం చూసేందుకు రోజుకు సరాసరి 200 మంది మాత్రమే వచ్చేవారు. జిల్లా కేంద్రం అయ్యాక రోజుకు సగటున 400 మంది వస్తున్నారు. పక్కనే ఉన్న జంతుశాలకు కూడా జనం క్యూ కడుతున్నారు. ఇక్కడ సుమారు 300 మూగజీవులు ఉన్నాయి. జింకలు, కృష్ణజింకలు, దుప్పిలు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. ఎదురుగా ఉన్న నక్షత్రశాలను సందర్శించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. ఇక.. జిల్లా కేంద్రమైన తర్వాత ఏర్పాటు చేసిన చిత్రావతి నదిలో బోటింగ్‌కు వారాంతపు రోజుల్లో విపరీతమైన గిరాకీ ఉంటోంది. పెరిగిన రవాణా సౌకర్యాలు.. పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ప్రకటించిన తర్వాత రవాణా సౌకర్యాలు పెరిగాయి. జిల్లాలో మొత్తం 32 మండలాలు ఉండగా.. 30 మండలాలకు నేరుగా బస్సు సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే రామగిరి, కనగానపల్లి మండల కేంద్రాలకు బస్సు సర్వీసులు నగుపుతున్నట్లు జిల్లా రవాణా శాఖాధికారి మధుసూదన తెలిపారు. తిరుపతి, శ్రీశైలం తదితర పుణ్యక్షేత్రాలకు నేరుగా బస్సు సౌకర్యం ఉంది. దీనికి తోడు బెంగళూరులోని యలహంక జంక్షన్ నుంచి శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం వరకు ప్యాసింజర్ రైలును రెండు నెలల క్రితం పట్టాలెక్కించారు. సాయిబాబా విమానాశ్రయం అప్పటి నుంచి అందుబాటులో ఉంది. అతి చిన్న గ్రామంలో విమానాశ్రయం ఉండటం దేశంలోనే ప్రత్యేకం కావడం విశేషం. అంతేకాకుండా అతి చిన్న పంచాయతీలోనే వందల సంఖ్యలో పెద్ద పెద్ద భవనాలకు కేరాఫ్‌గా పుట్టపర్తిని చెప్పవచ్చు. భూముల ధరలకు రెక్కలు.. జిల్లా కేంద్రం ప్రకటించిన తర్వాత పుట్టపుర్తి నలుమూలలా భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే చుట్టూ పది కిలోమీటర్ల మేర రెట్టింపు ధరలు పలుకుతున్నాయి. కొత్తచెరువు మండల కేంద్రంలో వ్యాపారాలు వృద్ధి చెందాయి. నాలుగు ప్రధాన మార్గాలకు కేంద్రంగా ఉండటంతో ప్రైవేటు కంపెనీల షోరూం లు, బంగారు దుకాణాలు వెలిశాయి. ధర్మవరం, పెనుకొండ, కదిరి, బెంగళూరు మార్గాల కూడలిలో కొత్తచెరువు ఉంటుంది. నాణ్యమైన వైద్యం.. శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉచితంగా నాణ్యమైన వైద్యం అందిస్తారు. ఆప్తమాలజీ, యూరాలజీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్ విభాగాలకు వైద్యం చేస్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి వైద్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఆరు లేన్ల రహదారులు జిల్లాలోనే రెండు.. కొత్తగా ఏర్పడిన శ్రీసత్యసాయి జిల్లాలో రెండు ప్రధాన రోడ్డు మార్గాలు వెళ్లనున్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు 576 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల మార్గానికి డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) పూర్తయింది. మొత్తం రూ.4,750 కోట్లతో అంచనా వేశారు. అదేవిధంగా బెంగళూరు నుంచి కొడికొండ మీదుగా అమరావతికి నిర్మించనున్న మరో మార్గం శ్రీసత్యసాయి జిల్లాలో నుంచి వైఎస్సార్ కడప జిల్లాలో ప్రవేశించేలా ప్రణాళిక ఉంది. మొత్తం 332 కిలోమీటర్లకు గానూ 13 కట్ పాయింట్లుగా ఉండే మార్గానికి మొత్తం రూ.30 వేల కోట్లతో అంచనాలు తయారు చేశారు. ఆశాజనకంగా వ్యాపారాలు శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటయ్యాక పుట్టపర్తికి రాకపోకలు సాగించే వారి సంఖ్య పెరిగింది. ఫలితంగా వ్యాపారాలు ఆశాజనకంగా ఉన్నాయి. చిన్న హోటళ్లు, పెట్రోల్ బంకులకు గిరాకీ పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి మాకు మంచిగా వ్యాపారం ఉంటోంది. – హరినాథ్, సాయి గోకుల్ సూపర్ బజార్, పుట్టపర్తి రెట్టింపు సంఖ్యలో జనం జిల్లా కేంద్రం ఏర్పాటైనప్పటి నుంచి రెట్టింపు సంఖ్యలో జనాలు తరలి వస్తున్నారు. ఇలాగే కొనసాగితే మంచి లాభాలు వస్తాయి. సీఎం వైఎస్ జగన్ నిర్ణయానికి కృతజ్ఞులై ఉన్నాం. చిత్రావతి నదిలో బోటింగ్‌కు కలెక్టర్ కూడా స్పందించారు. కొనసాగించాలని కలెక్టర్ కోరారు. – కేశవ, బోటింగ్ నిర్వాహకుడు విపరీతమైన గిరాకీ గత మూడు నెలలుగా వ్యాపారం బాగుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఆస్పత్రులకు వస్తున్నారు. గతంలో సాయిబాబా ఉన్న సమయంలో మంచి స్పందన వచ్చేది. దుకాణంతో పాటు చుట్టుపక్కల అద్దె గదులు కూడా హౌస్‌ఫుల్ అవుతున్నాయి. – మనోహర్, చిల్లర దుకాణం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భూములకు రెట్టింపు ధరలు కొత్తచెరువు, బుక్కపట్నం, పుట్టపర్తి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తదితర ప్రాంతాల్లో భూముల ధరలు పెరిగాయి. కొత్త చెరువులో కార్ల షోరూం, ఈ–కామర్స్ స్టోర్లకు కూడా అడిగారు. అవి వస్తే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. – సత్యనారాయణ, కమ్మవారిపల్లి -
ఒకప్పుడు ప్రపంచంతో సంబంధం లేదు.. ఇప్పడు ఉద్యోగుల ఖిల్లా!
ఒకప్పుడు ఆ తండాకు ప్రపంచంతో సంబంధం లేదు. కనీస సౌకర్యాలు కరువు. రోడ్డు కూడా ఉండేది కాదు. తండా పెద్దలంతా నిరక్షరాస్యులు. అడవికి వెళ్లి కట్టెలు కొట్టడం...10 కి.మీ మేర మోసుకువచ్చి వాటిని విక్రయించగా వచ్చిన దాంతో పొట్టనింపుకోవడం. వారి పిల్లలూ వారిలాగే అడవిబాట పట్టారు. తల్లిదండ్రుల కష్టంలో పాలుపంచుకుంటూనే తలరాత మార్చుకునేందుకు అక్షరాలు దిద్దారు. బిడ్డలను ఉన్నత స్థానంలో చూడాలని తల్లిదండ్రులూ అహోరాత్రులు శ్రమించారు. ఫలితంగా ఒక్కొక్కరుగా ప్రభుత్వ కొలువులు సాధించారు. ఒకరిని చూసి మరొకరు ఉన్నతంగా ఉండేందుకు పోటీ పడ్డారు. గ్రామాన్ని ఉద్యోగుల ఖిల్లాగా మార్చేశారు. సాక్షి, పుట్టపర్తి/సోమందేపల్లి: కృషి ఉంటే మనుషులు రుషులవుతారు. మహా పురుషులవుతారు...అనేందుకు సోమందేపల్లి మండలం నాగినాయని చెరువు పంచాయతీలోని నాగినాయని చెరువు తండా నిదర్శనం. నాగినాయని చెరువు తండా..ఒకప్పుడు పేదరికానికి, వెనుకబాటు తనానికి, నిరక్షరాస్యతకు నిలయంగా ఉండేది. కానీ గిరిజనబిడ్డలు అక్షరాలను నమ్ముకున్నారు. ఒక్కోమెట్టు ఎక్కుతూ పేదరికంపై పోరు సాగించారు. ఎదిగిన వారు తరువాతి తరం కోసం సాయం చేశారు. ఫలితంగా ఇపుడు నాగినాయని చెరువు తండా సరస్వతీ పుత్రుల నిలయంగా మారింది. అందువల్లే గతంలో ఊరు పేరు చెప్పుకునేందుకు ఇబ్బంది పడే తండా వాసులు ఇప్పుడు...మాది నాగినాయని చెరువు తండా అని గర్వంగా చెప్పుకుంటున్నారు. రెక్కలు ముక్కలు చేసి తండాలోని గిరిపుత్రులందరిదీ రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. అటవీ ప్రాంతాల్లో కట్టెలు కొట్టి పట్టణానికి వెళ్లి వాటిని అమ్మితే వచ్చే రూ.2 లేదా రూ.5 సంపాదనతో అతి పేదరికంతో జీవనం సాగించారు. 70 ఏళ్ల క్రితం ఆ తండాకు రోడ్డు, పాఠశాల, విద్యుత్.. ఇలాంటి సౌకర్యాలేవీ లేవు. కానీ పేదరికం నుంచి బయట పడాలన్న లక్ష్యంతో తల్లిదండ్రులు కూలి పనులు చేసి తమ పిల్లలను చదివించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పిల్లలూ శ్రద్ధతో చదువుకుని అంచెలంచెలుగా ఎదిగారు. లక్ష్మానాయక్ స్ఫూర్తితో.. తండాకు చెందిన లక్ష్మా నాయక్ తొట్ట తొలి ఉద్యోగి. ఆయన తపాలా శాఖలో ఉద్యోగం సాధించారు. తరువాత మిగతా వారినీ చదువుకునేలా ప్రోత్సహించారు. అలా ఆ తండా అక్షరాస్యత వైపు అడుగులు వేసింది. తండాలో 150 గృహాలుంటే 100 మంది దాక ప్రభుత్వ శాఖల్లో కొలువులు సాధించారు. వీరిలో మోతిలాల్ నాయక్ (హైకోర్టు విశ్రాంత జడ్జి), రాంశంకర్ నాయక్ (విశ్రాంత ఐఏఎస్), రవీంద్ర నాయక్ (విశ్రాంత ఐపీఎస్), మరిలాల్ నాయక్(ఐఆర్ఎస్ ), రామాంజి నాయక్ (డీఎస్పీ) ఉన్నారు. తండాలోని ప్రతి ఇంట్లోనూ ఇద్దరు గ్రాడ్యుయేట్లు ఉండడం విశేషం. ఒకే ఇంట్లో నలుగురు ఉద్యోగులు తండాలో పాల నారాయణ నాయక్ ఇంట్లో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. పశుపోషణపై ఆధారపడిన నారాయణ నాయక్... పాల వ్యాపారం చేస్తూ తన కుమారులను చదివించారు. మొదటి కుమారుడు కృష్ణా నాయక్ మన జిల్లాలోనే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. మూడో కుమారుడు రామాంజినేయులు నాయక్ నంద్యాలలో డీఎస్పీగా పనిచేస్తున్నారు. నాలుగో కుమారుడు విజయ నాయక్ బ్రాహ్మణపల్లి ప్రధానోపాధ్యాయులుగా, ఐదో కుమారుడు రవినాయక్ బుక్కపట్నం డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. రెండో కుమారుడు శివ నాయక్ తండ్రికి ఆసరాగా ఉంటూ గ్రామంలో వ్యవసాయం చేస్తూ తన సోదరుల ఎదుగుదలకు కృషి చేశారు. ఐదేళ్లకోసారి అందరూ కలుస్తారు నాగినాయని చెరువు తండాకు సమీపంలోనే అక్కమ్మ కొండ ఉంది. అక్కమ్మ దేవతల ఆశీర్వాదంతోనే ఇంటింటా ఉన్నత విద్యావంతులు అవుతున్నారని ఇక్కడి వారు బలంగా విశ్వసిస్తున్నారు. తండాలో ఐదేళ్లకు ఓసారి మారెమ్మ జాతరను వైభవంగా నిర్వహిస్తారు. తండా వాసులు ఎక్కడున్నా తప్పకుండా ఈ జాతరకు వచ్చి తమ వాళ్లను కలుసుకుని మంచీచెడ్డలు మాట్లాడుకుంటారు. సీనియర్ల స్ఫూర్తితో.. మా తండాలో మా సీనియర్లు బాగా చదువుకుని ఉన్నత ఉద్యోగాలు సాధించారు. వారి స్ఫూర్తితో కష్టపడి చదువుకున్నా. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. మా తల్లిదండ్రులు మాపై ఎంతో నమ్మకంతో కష్టపడి చదివించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యుత్ శాఖలో ఉద్యోగం సాధించాను. మా పిల్లలూ ఉన్నత స్థానాల్లోకి రావాలనుకుంటున్నా. – శివశంకర్ నాయక్, విద్యుత్ ఉద్యోగి ప్రతి ఇంట్లో ఇద్దరు పట్టభద్రులు మా తండాలో 150 గృహాలుంటే ఇంటికి ఇద్దరు పట్టభద్రులున్నారు. తండా నుంచి వెళ్లి ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని స్ఫూర్తిగా తీసుకొని చాలా మంది చదువులో రాణిస్తున్నారు. నేను కూడా చాలా పేద కుటుంబం నుంచే వచ్చాను. చదువుతోనే బతుకులు బాగుపడాయని నమ్మి కష్టపడి చదువుకున్నాం. రాబోయే తరాల వారు ఇలాగే రాణించాలనుకుంటున్నా. – అంజనేయులు నాయక్, రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ కట్టెలు అమ్మి చదివించారు తండాలో చాలా మంది పేదలే. అందరూ కొండకు వెళ్లి కట్టెలు తెచ్చి వాటిని అమ్మి జీవనం సాగించారు. అరకొర సంపాదనతోనే తమ పిల్లల పుస్తకాలు, దుస్తులు, భోజన ఖర్చులకు డబ్బులు ఇచ్చారు. మా పిల్లలను ఉద్యోగులుగా చూడాలన్న బలమైన కోరితోనే ఎంత కష్టమైనా భరించారు. పిల్లలూ ఆ కష్టానికి తగ్గట్టే చదువుకున్నారు. – విజయ్ నాయక్, హెచ్ఎం, బ్రాహ్మణపల్లి మా ఊరికి ప్రత్యేక గుర్తింపు నాగినాయని చెరువు తండాకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. తండాలో ఎక్కువ మంది ఉద్యోగస్తులున్నారు కదా... అని గుర్తు చేస్తుంటారు. సీఎం వైఎస్ జగన్విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తేవడంతో పేద పిల్లలు ఉన్నత చదువులు చదవగలుగుతున్నారు. దీంతో మా లాంటి తండాలు ఎన్నో అభివృద్ధి చెందుతున్నాయి. – అంజినాయక్, సర్పంచ్ చదువు ఒక్కటే మార్గం మా తండ్రి పాల నారాయణ నాయక్... కష్టపడి పాలు అమ్మి మా కుటుంబాన్ని పోషించారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము చదువుకున్నాం. ఈ రోజు ఓ స్థాయిలో నిలబడ్డా. ఎంతో మంది యువకుల చదువుకు సహకరించాం. అక్షరాస్యతతోనే అభివృద్ధి సాధ్యం. భవిష్యత్తులో మా తండా పిల్లలు మాకన్నా ఉన్నత ఉద్యోగాలు సాధించాలి. – రామాంజినాయక్, డీఎస్పీ, నంద్యాల -
గజరాజుకు పూజారిగా మారిన మావటి
పుట్టపర్తి అర్బన్: సత్యసాయిబాబాకు ఎంతో ఇష్టమైన ఓ ఏనుగు చనిపోవడంతో దానికి ఆలయాన్ని నిర్మించగా.. దానిని సాకిన మావటి పూజారిగా మారి నిత్యపూజలు చేస్తున్నారు. నేపథ్యంలోకి వెళితే.. సత్యసాయిబాబా 1962లో తమిళనాడులోని బండిపూర అడవి నుంచి ఓ గున్న ఏనుగును కొనుగోలు చేసి పుట్టపర్తికి తీసుకొచ్చారు. దానికి ‘సాయిగీత’ అని పేరు పెట్టి.. ప్రేమతో పెంచుకుంటుండేవారు. ప్రశాంతి నిలయంలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ, పండుగల్లోనూ, ఊరేగింపుల్లోనూ బాబా ముందర సాయిగీత నడుస్తూ ఉండేది. దాని ఆలన కోసం ప్రత్యేకంగా మావటిలను ఏర్పాటు చేసి షెడ్డులో ఉంచి సంరక్షిస్తుండేవారు. ప్రతిరోజూ మావటిలు ఏనుగును వాకింగ్‌కు తీసుకెళ్లేవారు. వయసు మీద పడటంతో 2007లో ‘సాయిగీత’ చనిపోయింది. ఆత్మ బంధువుల అంత్యక్రియలకు సైతం వెళ్లని సత్యసాయి ఆరోజు సాయిగీత అంతిమ యాత్రలో పాల్గొని కన్నీటి పర్యంతమయ్యారు. స్థానిక నక్షత్రశాల పక్కనే దాని భౌతిక కాయాన్ని సమాధి చేశారు. అక్కడే ఓ ఆలయాన్ని నిర్మించారు. అనంతరం మరో గున్న ఏనుగును అప్పటి టీటీడీ చైర్మన్ ఆదికేశవుల నాయుడు సత్యసాయికి బహూకరించారు. అది అనారోగ్యంతో 2013లో మృతి చెందింది. దాన్ని సైతం సాయిగీత సమాధి పక్కనే ఖననం చేశారు. నిత్య పూజలు చేస్తున్న మావటి కాగా, సాయిగీతకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి మావటిగా దాదాపు 23 ఏళ్లపాటు సేవలందించారు. ఆయన ఇప్పటికీ పుట్టపర్తిలో ఉంటూ సాయిగీత ఆలయంలో నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సత్యసాయి బాబా ఎంతో ప్రేమగా చూసుకున్న సాయిగీతకు రెండు దశాబ్దాలకు పైగా సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. నేను చెప్పిన మాటను బాగా వినేది. చుట్టూ ఎంతమంది భక్తులున్నా బెదరకుండా నడిచేది. సాయిగీత లేకున్నా బాబా ఆశీస్సులతో ఆశ్రమంలోనే ఉంటున్నా. జీవితాంతం బాబా, సాయిగీత సేవలోనే ఉండిపోతా’ అని చెప్పారు. -
ముగ్గురు కుమార్తెలతో బావిలో దూకిన తల్లి
-
అనంతపురం జిల్లాలో విషాదం
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తల్లి తన ముగ్గురు కుమార్తెలతో కలిసి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన పుట్టపర్తి మండలం పెద్దమ్మవారిపల్లిలో జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు కుమార్తెలు మృతిచెందగా, తల్లిని స్థానికులు కాపాడారు. ఈ ఘటనలో కుమార్తెలు భవ్య(8),భార్గవి(8), చందన(5) మృతి చెందారు. తల్లి అరుణను ఆసుపత్రికి తరలించారు. తల్లి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. -
పుట్టపర్తిలో వైఎస్సార్ ఐటీ పార్క్
-
మరో దేవాలయం
నిజానికి ఇది మరో దేవాలయం. ఇది దొంగ శీర్షిక. అది తెలిసే ఎందుకు పెట్టాను? ఈ దేవాలయా నికి Focus ఇదొక్కటే కనుక. మీ కాలమ్ రుచి రహస్యమేమిటని కొందరు అడుగుతూంటారు. వారికి ఇవీ సూత్రాలు. మొదటి సూత్రం– అబద్ధం. అబద్ధానికి ఓ ‘రుచి’ ఉంది సరిగ్గా వండగలిగితే. అబద్ధం ఆశ్చర్యం, తీరా ముడి విప్పాక చిన్న కితకిత, ఎక్కువ సరదా, మీకు ముందే తెలిసిన విషయానికి ముక్తాయింపు– ఇన్ని కలగాలి. చాలా ముఖ్యంగా హర్ట్ చేయకూడదు, కోపం తెప్పిం చకూడదు. చిన్న మెలికకు నవ్వాలి. అందరితో చెప్పి నవ్వుకోవాలి. సరే. ఇంకో దేవాలయం ఏదీ? తొలుత మొదటి దేవాలయం గురించి. చాలా సంవత్సరాల కిందట పుట్టపర్తిలో భగవాన్ సత్యసాయిబాబా తమ్ముడు జానకి రామయ్యగారు నా గదికి వచ్చి నన్ను స్వామి దర్శనానికి తీసుకెళ్లారు. స్వామి మాకు ఇంటర్వూ్య ఇచ్చారు. అదొక గొప్ప జ్ఞాపకం. అటు తర్వాత జానకి రామయ్యగారు నన్ను పుట్టపర్తి దేవాలయానికి తీసుకెళ్లారు. అక్కడ మా పాదరక్షలు విడవబోతూ ఉంటే ఒకాయన పరుగున వచ్చారు. వాటిని భక్తితో అందుకున్నారు. నేను చేస్తా నంటే ఒప్పుకోలేదు. సగం వొంగి భక్తితో ప్రసా దంలాగా అందుకున్నారు. అతనక్కడ ఊడిగం చేసే పనివాడు కాదు, స్వామి సేవకి 15 రోజులు శెలవు పెట్టి వచ్చిన ఓ గెజిటెడ్ ఆఫీసర్. ఒళ్లు పులక రించింది. ఇప్పుడు ఆసుపత్రిలోకి అడుగుపెడుతూనే రికార్డు టైములో నిర్మించిన ఈ కట్టడాన్ని చూపి మాట్లాడుతూంటే జానకి రామయ్యగారికి కళ్లనీళ్లు ధారాపాతంగా వర్షించాయి. నిజానికి అది సిమెంట్, ఇసుకతో కట్టిన భవనం కాదు. ప్రేమ, డెడికేషన్ దాని మూలస్తంభాలు. అక్కడ నాకు తెలిసిన పాత ముఖాలు కని పిస్తున్నాయి. విశాఖ మునిసిపల్ కమిషనర్ ఆఫీసు సూపర్నెంటు, నా మిత్రుని భార్య, పంజాబు మిలట్రీ కల్నల్ భార్య ఎందరో ఆఫీసర్లు అక్కడ సేవకులు. వంగి నిలుచున్నారు. సేవకులు కూడా అంత ఒద్దికగా ఉండరు. అంతటా భక్తీ– ఏ ప్రతిఫలా పేక్ష లేని సేవా తత్పరత– వీటన్నిటికీ మూల ధాతువు– స్వామి! అద్భుతం. బయటికి వస్తూ నేనూ ఏడ్చాను. ఇప్పుడు మరో దేవాలయం. అపోలో ఆసు పత్రి. దీని వెనుక స్వాములు లేరు. పరమార్థం లేదు. పాపపుణ్యాల ప్రసక్తి లేదు. మరేం ఉంది? ఇక్కడ నాలుగు గోడల మధ్య వందలాది వర్కర్లున్నారు. డాక్టర్లున్నారు. పువ్వులాంటి దేవతలున్నారు (నర్సులు). ప్రపంచంలో అన్ని మూలల నుంచీ వచ్చిన అనూహ్యమైన యంత్రాలున్నాయి. వాటిని అలవోకగా నడిపే నిపుణులున్నారు. వీటన్నిటి సామూహిక దృక్పథం. ఆరోగ్యంమీద నమ్మకం, బతుకుతామన్న ధైర్యం, బతకడానికి చేయూత, వెరసి– ప్రాణ ధాతువు. లోపలికి రాగానే ఓ నర్సు నీ జాతకాన్ని ఇస్తుంది– క్షణాల్లో. నీ జ్వరం దగ్గర్నుంచి– నీ రుచుల దాకా– నీ ఊపిరి వివరాల దాకా కాగితం మీదకి వచ్చేసింది. వెంటనే రెండో విడత. సమస్య, ప్రారంభం, కష్టం, ఇక్కడికి రావడానికి కారణం. ఈలోగా రక్తనాళంలోకి సూది దిగుతూంటుంది. మరో రెండు నిమిషాల్లో మొదటి విడత చికిత్స ప్రారంభం. నువ్వు వచ్చి ఇంకా 5 నిమిషాలే అయింది. ఆ టీమ్ నీ హితుడో, నీ కోసం నియ మించిన ప్రాణ స్నేహితుడో అయి ఉండాలి. ఎందు కంటే సరిగ్గా 10 నిమిషాల్లో నువ్వు అక్కడికి వచ్చిన మొదటి ఫలితం దక్కిపోతుంది. ఇటు తర్వాత డాక్టర్లు, వర్కర్లు, నిపుణులు– కేవలం నీ కోసం పుట్టినట్టు కృషి చేస్తారు. నీ నమ్మకం దేదీప్యమానమవుతుంది, విశ్వాసం వీర విహారం చేస్తుంది. ఇది శక్తి, నైపుణ్యం, ఏ కల్మషమూ లేని ‘సేవ’ నీకిచ్చే వరం. ఒకపక్క ఈ కృషి ప్రతీ క్షణం పుస్తకంలోకి ఎక్కుతుంది. అది త్వరలో ఫైలుగా మారి రేపటికి గ్రంథమవుతుంది. ప్రజల దేవుళ్లకి నాలుగు స్థానాలు– నీ మనస్సు, గుడి, నీ తాదాత్మ్యం– అన్నింటికీ మించి నీ నమ్మకం. ఇది సీతా సాధ్వా? అవును. ఇది తాదాత్మ్యం. అబ్బే రాయి.. అంతే ఓ గొప్పillusion is dead. Faith dies when the logic starts.. ఈ తెరని ఈ దేవాలయం నీకు తెలియకుండానే చెరిపేస్తుంది. ఈ నిజాన్ని ప్రపంచంలో 120 దేశాలు నమ్ముతున్నాయి. ఒక తీర్థయాత్రగా వస్తున్నారు. నీ విశ్వాసాన్ని ఉద్భుద్ధం చేసేది తీర్థం. కేవలం అవసరానికి పిలిచి, తీర్చి, నీకు తెలియకుండానే మరొక ప్లేస్‌కి నిన్ను బదిలీ చేసే విచిత్రమైన దేవా లయం పేరు– అపోలో. నేను కొండంత అనారోగ్యంతో– క్రిటికల్ కేర్‌లో మూడు రోజులుగా ఉంటూ డాక్టర్ల అనుమతితో ఈ ‘వ్యక్తిగత’ స్పందనని మీకు పంచుతున్నాను. ఇది ప్రకటన కాదు. కితాబు కాదు. వాటికి నేను ఆమళ్ల దూరం. మొదటి దేవాలయానికి– మహాస్వామి మూల హేతువు. రెండో దేవాలయానికి ‘విశ్వాసం’ మూల ధాతువు. గొల్లపూడి మారుతీరావు -
రేపు సత్యసాయి ఆరాధనోత్సవం
పుట్టపర్తి అర్బన్ : పుట్టపర్తి ప్రశాంతి నిలయం కేంద్రంగా ఈనెల 24న భగవాన్ సత్యసాయిబాబా ఆరాధనోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించడానికి సత్యసాయి సెంట్రల్‌ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోన్న పుట్టపర్తిలో ఈశ్వరాంబ, పెద వెంకమరాజు దంపతులకు 1926 నవంబర్ 23న సత్యనారాయణరాజుగా పిలువబడే సత్యసాయిబాబా జన్మించారు. చిన్న నాటి నుంచి ఆధ్యాత్మిక చింతనతో గడిపిన ఆయన 1940లో తన 14వ యేట సత్యసాయిబాబాగా అవతార ప్రకటన చేశారు. నాటి నుంచి ఏకరూప వస్త్రధారి అయిన ఆయన దేశ,విదేశాలు సంచరిస్తూ మానవతా విలువలు, ఆధ్యాత్మికతను బోధిస్తూ తన ప్రేమ సామ్రాజ్యాన్ని సుమారు 180 దేశాల్లో నెలకొల్పారు. తక్కువ కాలంలోనే పుట్టపర్తికి అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు తీసుకొచ్చారు. దీంతో నిత్యం విదేశీయులు వేలాదిగా పుట్టపర్తికి విచ్చేస్తుంటారు. అపర భగీరథుడు సత్యసాయిబాబా : భక్తులకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా విద్య వైద్యం, తాగునీళ్లు,ఉచిత భోజన వసతి అందిస్తున్నారు. వరుస కరువులతో గుక్కెడు నీళ్లు దొరకని వందలాది గ్రామాల్లో తాగునీరు అందించి అపర భగీరథుడయ్యారు. 2011 ఏప్రిల్ 24న సత్యసాయి శివైక్యం పొందారు. ఆ తర్వాత నుంచి సత్యసాయి సెంట్రల్ ట్రస్టు అన్ని కార్యక్రమాలను కొనసాగిస్తూ భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు చెన్నై నగరానికి కూడా తాగునీళ్లు అందించారు. రెండేళ్ల క్రితం సుమారు రూ.100 కోట్లతో పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాలకు తాగునీటి వసతి కల్పించారు. ఇక పేదలను నయాపైసా ఖర్చు లేకుండా వైద్యం అందించడానికి కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించారు. పుట్టపర్తిలో డీమ్డ్ యూనివర్సిటీ నెలకొల్పి విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే సత్యసాయి సేవలు అనితర సాధ్యమైనవని భక్తులు చెప్పుకుంటున్నారు. యేటా ఏప్రిల్ 24న పుట్టపర్తిలో వైభవంగా ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నారు. -
బాబా సేవా స్ఫూర్తి కొనసాగింపే లక్ష్యం
► మాజీ డీజీపీ హెచ్‌జే దొర పుట్టపర్తి : సత్యసాయి సేవా స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించే దిశగా ప్రతి సాయిభక్తుడు అడుగులు వేయాలని సత్యసాయి సేవా సంస్థల సమ్మేళనంలో మాజీ డీజీపీ హెచ్‌జే దొర పేర్కొన్నారు. ప్రశాంతి నిలయంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సత్యసాయి సేవా సమితులు, భజన మండళ్లు, జిల్లా పదాధికారుల విస్తృత స్థాయి సమావేశం ఆదివారం ఘనంగా ముగిసింది. హెచ్‌జే దొర మాట్లాడుతూ సత్యసాయి ఆధ్యాత్మిక బోధనలను వారసత్వంగా భావించి కాపాడుకోవాలన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు చలం మాట్లాడుతూ ప్రతి సత్యసాయి భక్తుడు ధృడ సంకల్పం, చిత్తశుద్ధి,అంకితం భావంతో సత్యసాయి సేవా సంస్థలు నిరే్ధశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. రాబోవు రోజులలో సత్యసాయి సేవలను విస్తృతం చేసేందుకు కృషి చేయాలన్నారు. ముగింపు సందర్భంగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్.జె.రత్నాకర్రాజు సమ్మేళనానికి హాజరైన ప్రతినిధులకు నూతన వస్త్రాలను, సత్యసాయి ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కార్యదర్శి ప్రసాద్‌రావు, సత్యసాయి భజన మండళ్లు,సేవా సమితుల ప్రతినిధులు పాల్గొన్నారు.