ఒకప్పుడు ఆ తండాకు ప్రపంచంతో సంబంధం లేదు. కనీస సౌకర్యాలు కరువు. రోడ్డు కూడా ఉండేది కాదు. తండా పెద్దలంతా నిరక్షరాస్యులు. అడవికి వెళ్లి కట్టెలు కొట్టడం...10 కి.మీ మేర మోసుకువచ్చి వాటిని విక్రయించగా వచ్చిన దాంతో పొట్టనింపుకోవడం. వారి పిల్లలూ వారిలాగే అడవిబాట పట్టారు. తల్లిదండ్రుల కష్టంలో పాలుపంచుకుంటూనే తలరాత మార్చుకునేందుకు అక్షరాలు దిద్దారు. బిడ్డలను ఉన్నత స్థానంలో చూడాలని తల్లిదండ్రులూ అహోరాత్రులు శ్రమించారు. ఫలితంగా ఒక్కొక్కరుగా ప్రభుత్వ కొలువులు సాధించారు. ఒకరిని చూసి మరొకరు ఉన్నతంగా ఉండేందుకు పోటీ పడ్డారు. గ్రామాన్ని ఉద్యోగుల ఖిల్లాగా మార్చేశారు.
సాక్షి, పుట్టపర్తి/సోమందేపల్లి: కృషి ఉంటే మనుషులు రుషులవుతారు. మహా పురుషులవుతారు...అనేందుకు సోమందేపల్లి మండలం నాగినాయని చెరువు పంచాయతీలోని నాగినాయని చెరువు తండా నిదర్శనం. నాగినాయని చెరువు తండా..ఒకప్పుడు పేదరికానికి, వెనుకబాటు తనానికి, నిరక్షరాస్యతకు నిలయంగా ఉండేది. కానీ గిరిజనబిడ్డలు అక్షరాలను నమ్ముకున్నారు. ఒక్కోమెట్టు ఎక్కుతూ పేదరికంపై పోరు సాగించారు. ఎదిగిన వారు తరువాతి తరం కోసం సాయం చేశారు. ఫలితంగా ఇపుడు నాగినాయని చెరువు తండా సరస్వతీ పుత్రుల నిలయంగా మారింది. అందువల్లే గతంలో ఊరు పేరు చెప్పుకునేందుకు ఇబ్బంది పడే తండా వాసులు ఇప్పుడు...మాది నాగినాయని చెరువు తండా అని గర్వంగా చెప్పుకుంటున్నారు.
రెక్కలు ముక్కలు చేసి
తండాలోని గిరిపుత్రులందరిదీ రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. అటవీ ప్రాంతాల్లో కట్టెలు కొట్టి పట్టణానికి వెళ్లి వాటిని అమ్మితే వచ్చే రూ.2 లేదా రూ.5 సంపాదనతో అతి పేదరికంతో జీవనం సాగించారు. 70 ఏళ్ల క్రితం ఆ తండాకు రోడ్డు, పాఠశాల, విద్యుత్.. ఇలాంటి సౌకర్యాలేవీ లేవు. కానీ పేదరికం నుంచి బయట పడాలన్న లక్ష్యంతో తల్లిదండ్రులు కూలి పనులు చేసి తమ పిల్లలను చదివించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పిల్లలూ శ్రద్ధతో చదువుకుని అంచెలంచెలుగా ఎదిగారు.
లక్ష్మానాయక్ స్ఫూర్తితో..
తండాకు చెందిన లక్ష్మా నాయక్ తొట్ట తొలి ఉద్యోగి. ఆయన తపాలా శాఖలో ఉద్యోగం సాధించారు. తరువాత మిగతా వారినీ చదువుకునేలా ప్రోత్సహించారు. అలా ఆ తండా అక్షరాస్యత వైపు అడుగులు వేసింది. తండాలో 150 గృహాలుంటే 100 మంది దాక ప్రభుత్వ శాఖల్లో కొలువులు సాధించారు. వీరిలో మోతిలాల్ నాయక్ (హైకోర్టు విశ్రాంత జడ్జి), రాంశంకర్ నాయక్ (విశ్రాంత ఐఏఎస్), రవీంద్ర నాయక్ (విశ్రాంత ఐపీఎస్), మరిలాల్ నాయక్(ఐఆర్‌ఎస్ ), రామాంజి నాయక్ (డీఎస్పీ) ఉన్నారు. తండాలోని ప్రతి ఇంట్లోనూ ఇద్దరు గ్రాడ్యుయేట్లు ఉండడం విశేషం.
ఒకే ఇంట్లో నలుగురు ఉద్యోగులు
తండాలో పాల నారాయణ నాయక్ ఇంట్లో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. పశుపోషణపై ఆధారపడిన నారాయణ నాయక్... పాల వ్యాపారం చేస్తూ తన కుమారులను చదివించారు. మొదటి కుమారుడు కృష్ణా నాయక్ మన జిల్లాలోనే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. మూడో కుమారుడు రామాంజినేయులు నాయక్ నంద్యాలలో డీఎస్పీగా పనిచేస్తున్నారు. నాలుగో కుమారుడు విజయ నాయక్ బ్రాహ్మణపల్లి ప్రధానోపాధ్యాయులుగా, ఐదో కుమారుడు రవినాయక్ బుక్కపట్నం డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. రెండో కుమారుడు శివ నాయక్ తండ్రికి ఆసరాగా ఉంటూ గ్రామంలో వ్యవసాయం చేస్తూ తన సోదరుల ఎదుగుదలకు కృషి చేశారు.
ఐదేళ్లకోసారి అందరూ కలుస్తారు
నాగినాయని చెరువు తండాకు సమీపంలోనే అక్కమ్మ కొండ ఉంది. అక్కమ్మ దేవతల ఆశీర్వాదంతోనే ఇంటింటా ఉన్నత విద్యావంతులు అవుతున్నారని ఇక్కడి వారు బలంగా విశ్వసిస్తున్నారు. తండాలో ఐదేళ్లకు ఓసారి మారెమ్మ జాతరను వైభవంగా నిర్వహిస్తారు. తండా వాసులు ఎక్కడున్నా తప్పకుండా ఈ జాతరకు వచ్చి తమ వాళ్లను కలుసుకుని మంచీచెడ్డలు మాట్లాడుకుంటారు.
సీనియర్ల స్ఫూర్తితో..
మా తండాలో మా సీనియర్లు బాగా చదువుకుని ఉన్నత ఉద్యోగాలు సాధించారు. వారి స్ఫూర్తితో కష్టపడి చదువుకున్నా. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. మా తల్లిదండ్రులు మాపై ఎంతో నమ్మకంతో కష్టపడి చదివించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యుత్ శాఖలో ఉద్యోగం సాధించాను. మా పిల్లలూ ఉన్నత స్థానాల్లోకి రావాలనుకుంటున్నా.
– శివశంకర్ నాయక్, విద్యుత్ ఉద్యోగి
ప్రతి ఇంట్లో ఇద్దరు పట్టభద్రులు
మా తండాలో 150 గృహాలుంటే ఇంటికి ఇద్దరు పట్టభద్రులున్నారు. తండా నుంచి వెళ్లి ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని స్ఫూర్తిగా తీసుకొని చాలా మంది చదువులో రాణిస్తున్నారు. నేను కూడా చాలా పేద కుటుంబం నుంచే వచ్చాను. చదువుతోనే బతుకులు బాగుపడాయని నమ్మి కష్టపడి చదువుకున్నాం. రాబోయే తరాల వారు ఇలాగే రాణించాలనుకుంటున్నా.
– అంజనేయులు నాయక్, రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్
కట్టెలు అమ్మి చదివించారు
తండాలో చాలా మంది పేదలే. అందరూ కొండకు వెళ్లి కట్టెలు తెచ్చి వాటిని అమ్మి జీవనం సాగించారు. అరకొర సంపాదనతోనే తమ పిల్లల పుస్తకాలు, దుస్తులు, భోజన ఖర్చులకు డబ్బులు ఇచ్చారు. మా పిల్లలను ఉద్యోగులుగా చూడాలన్న బలమైన కోరితోనే ఎంత కష్టమైనా భరించారు. పిల్లలూ ఆ కష్టానికి తగ్గట్టే చదువుకున్నారు.
– విజయ్ నాయక్, హెచ్‌ఎం, బ్రాహ్మణపల్లి
మా ఊరికి ప్రత్యేక గుర్తింపు
నాగినాయని చెరువు తండాకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. తండాలో ఎక్కువ మంది ఉద్యోగస్తులున్నారు కదా... అని గుర్తు చేస్తుంటారు. సీఎం వైఎస్ జగన్‌విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తేవడంతో పేద పిల్లలు ఉన్నత చదువులు చదవగలుగుతున్నారు. దీంతో మా లాంటి తండాలు ఎన్నో అభివృద్ధి చెందుతున్నాయి.
– అంజినాయక్, సర్పంచ్
చదువు ఒక్కటే మార్గం
మా తండ్రి పాల నారాయణ నాయక్... కష్టపడి పాలు అమ్మి మా కుటుంబాన్ని పోషించారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము చదువుకున్నాం. ఈ రోజు ఓ స్థాయిలో నిలబడ్డా. ఎంతో మంది యువకుల చదువుకు సహకరించాం. అక్షరాస్యతతోనే అభివృద్ధి సాధ్యం. భవిష్యత్తులో మా తండా పిల్లలు మాకన్నా ఉన్నత ఉద్యోగాలు సాధించాలి.
– రామాంజినాయక్, డీఎస్పీ, నంద్యాల
Comments
Please login to add a commentAdd a comment