పుట్టపర్తి అర్బన్: సత్యసాయిబాబాకు ఎంతో ఇష్టమైన ఓ ఏనుగు చనిపోవడంతో దానికి ఆలయాన్ని నిర్మించగా.. దానిని సాకిన మావటి పూజారిగా మారి నిత్యపూజలు చేస్తున్నారు. నేపథ్యంలోకి వెళితే.. సత్యసాయిబాబా 1962లో తమిళనాడులోని బండిపూర అడవి నుంచి ఓ గున్న ఏనుగును కొనుగోలు చేసి పుట్టపర్తికి తీసుకొచ్చారు. దానికి ‘సాయిగీత’ అని పేరు పెట్టి.. ప్రేమతో పెంచుకుంటుండేవారు. ప్రశాంతి నిలయంలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ, పండుగల్లోనూ, ఊరేగింపుల్లోనూ బాబా ముందర సాయిగీత నడుస్తూ ఉండేది.
దాని ఆలన కోసం ప్రత్యేకంగా మావటిలను ఏర్పాటు చేసి షెడ్డులో ఉంచి సంరక్షిస్తుండేవారు. ప్రతిరోజూ మావటిలు ఏనుగును వాకింగ్‌కు తీసుకెళ్లేవారు. వయసు మీద పడటంతో 2007లో ‘సాయిగీత’ చనిపోయింది. ఆత్మ బంధువుల అంత్యక్రియలకు సైతం వెళ్లని సత్యసాయి ఆరోజు సాయిగీత అంతిమ యాత్రలో పాల్గొని కన్నీటి పర్యంతమయ్యారు. స్థానిక నక్షత్రశాల పక్కనే దాని భౌతిక కాయాన్ని సమాధి చేశారు. అక్కడే ఓ ఆలయాన్ని నిర్మించారు. అనంతరం మరో గున్న ఏనుగును అప్పటి టీటీడీ చైర్మన్ ఆదికేశవుల నాయుడు సత్యసాయికి బహూకరించారు. అది అనారోగ్యంతో 2013లో మృతి చెందింది. దాన్ని సైతం సాయిగీత సమాధి పక్కనే ఖననం చేశారు.
నిత్య పూజలు చేస్తున్న మావటి
కాగా, సాయిగీతకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి మావటిగా దాదాపు 23 ఏళ్లపాటు సేవలందించారు. ఆయన ఇప్పటికీ పుట్టపర్తిలో ఉంటూ సాయిగీత ఆలయంలో నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సత్యసాయి బాబా ఎంతో ప్రేమగా చూసుకున్న సాయిగీతకు రెండు దశాబ్దాలకు పైగా సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. నేను చెప్పిన మాటను బాగా వినేది. చుట్టూ ఎంతమంది భక్తులున్నా బెదరకుండా నడిచేది. సాయిగీత లేకున్నా బాబా ఆశీస్సులతో ఆశ్రమంలోనే ఉంటున్నా. జీవితాంతం బాబా, సాయిగీత సేవలోనే ఉండిపోతా’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment