mavati
-
మావటీల జీవితాల్లో వెలుగు తెచ్చారు
‘నాకు అడివింటే చాలా భయం’ అంటుంది బెల్లి. ఆస్కార్ వచ్చిన ‘ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ లో మావటి బొమ్మన్ భార్య ఆమె. భర్తతో కలిసి రఘు అనే పిల్ల ఏనుగును ఆమె సాకుతుంది. దాంతోపాటు ‘అమ్ము’ అనే ఇంకో పిల్ల ఏనుగు బాగోగులను బెల్లి చూస్తుంది. బొమ్మన్ ప్రభుత్వ ఉద్యోగి. బెల్లి కాదు. అయినా సరే భర్త డ్యూటీలో ఆమె భాగం పంచుకుంది. భర్తతో పాటే పసి ఏనుగులను చూసుకుంది. ‘నా భర్తను పులి చంపింది. అప్పటి నుంచి అడివంటే భయం. బొమ్మన్‌ను చేసుకున్నాక కొంచెం భయం పోయింది. పిల్ల ఏనుగుల బాగోగుల్లో పడ్డాక, వాటి వెంట తిరుగుతుంటే అడివంటే భయం పోయింది’ అంటుంది బెల్లి. నీలగిరి (ఊటీ) అడవుల్లో ఉండే ఎలిఫెంట్ క్యాంపుల్లో ఏనుగుల సంరక్షణ మావటీలు చూస్తారు. వీళ్లంతా దాదాపు ఆ ప్రాంత గిరిజనులే. ఏనుగులను చూసుకోవడం మగవారి పనే. అయితే బొమ్మన్ చూసేది పిల్ల ఏనుగులను కనుక వాటి అమాయకత్వానికి ముగ్ధురాలై అమ్ము కూడా వాటితో అనుబంధం పెంచుకుంటుంది. ఆమెకు రఘు, అమ్ము ఎంత మాలిమి అంటే డాక్యుమెంటరీలో అమ్మును పిలిచి ‘ఏయ్... నా ఒడిలో కాదు. పక్కన పడుకో. లేకుంటే దెబ్బలు పడతాయి’ అనంటే ఆ ఏనుగు ఆమె పక్కన మెల్లగా ఒత్తిగిలి పడుకోవడం ముచ్చట గొలుపుతుంది. అమ్ముకు బెల్లి రెండు జడలు వేసి నవ్వుకుంటూ ఉన్నప్పుడు ఈ డాక్యుమెంటరీ ముగుస్తుంది. అయితే బొమ్మన్ వల్ల, అమ్ము వల్ల, ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన కార్తికి వల్ల దేశంలో ఇప్పుడు ఏనుగుల సంరక్షణ గురించి చర్చలు జరుగుతున్నాయి. తమిళనాడు సి.ఎం స్టాలిన్ వెంటనే స్పందించి బొమ్మన్, బెల్లిలను పిలిచి చెరొక లక్ష డబ్బు ఇచ్చి సన్మానం చేశారు. తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న 91 మంది మావటీలకు కూడా మనిషికో లక్ష ఇవ్వనున్నారు. వీరి నివాసాల కోసం 9 కోట్లు మంజూరయ్యాయి. అలాగే ఏనుగుల క్యాంపుల కోసం 13 కోట్లు మంజూరయ్యాయి. ప్రేమ, ఆదరణల వల్ల ఎప్పుడూ మంచే జరుగుతుంది. బొమ్మన్, బెల్లిలతో అది మరోసారి రుజువయ్యింది. -
గజరాజుకు పూజారిగా మారిన మావటి
పుట్టపర్తి అర్బన్: సత్యసాయిబాబాకు ఎంతో ఇష్టమైన ఓ ఏనుగు చనిపోవడంతో దానికి ఆలయాన్ని నిర్మించగా.. దానిని సాకిన మావటి పూజారిగా మారి నిత్యపూజలు చేస్తున్నారు. నేపథ్యంలోకి వెళితే.. సత్యసాయిబాబా 1962లో తమిళనాడులోని బండిపూర అడవి నుంచి ఓ గున్న ఏనుగును కొనుగోలు చేసి పుట్టపర్తికి తీసుకొచ్చారు. దానికి ‘సాయిగీత’ అని పేరు పెట్టి.. ప్రేమతో పెంచుకుంటుండేవారు. ప్రశాంతి నిలయంలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ, పండుగల్లోనూ, ఊరేగింపుల్లోనూ బాబా ముందర సాయిగీత నడుస్తూ ఉండేది. దాని ఆలన కోసం ప్రత్యేకంగా మావటిలను ఏర్పాటు చేసి షెడ్డులో ఉంచి సంరక్షిస్తుండేవారు. ప్రతిరోజూ మావటిలు ఏనుగును వాకింగ్‌కు తీసుకెళ్లేవారు. వయసు మీద పడటంతో 2007లో ‘సాయిగీత’ చనిపోయింది. ఆత్మ బంధువుల అంత్యక్రియలకు సైతం వెళ్లని సత్యసాయి ఆరోజు సాయిగీత అంతిమ యాత్రలో పాల్గొని కన్నీటి పర్యంతమయ్యారు. స్థానిక నక్షత్రశాల పక్కనే దాని భౌతిక కాయాన్ని సమాధి చేశారు. అక్కడే ఓ ఆలయాన్ని నిర్మించారు. అనంతరం మరో గున్న ఏనుగును అప్పటి టీటీడీ చైర్మన్ ఆదికేశవుల నాయుడు సత్యసాయికి బహూకరించారు. అది అనారోగ్యంతో 2013లో మృతి చెందింది. దాన్ని సైతం సాయిగీత సమాధి పక్కనే ఖననం చేశారు. నిత్య పూజలు చేస్తున్న మావటి కాగా, సాయిగీతకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి మావటిగా దాదాపు 23 ఏళ్లపాటు సేవలందించారు. ఆయన ఇప్పటికీ పుట్టపర్తిలో ఉంటూ సాయిగీత ఆలయంలో నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సత్యసాయి బాబా ఎంతో ప్రేమగా చూసుకున్న సాయిగీతకు రెండు దశాబ్దాలకు పైగా సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. నేను చెప్పిన మాటను బాగా వినేది. చుట్టూ ఎంతమంది భక్తులున్నా బెదరకుండా నడిచేది. సాయిగీత లేకున్నా బాబా ఆశీస్సులతో ఆశ్రమంలోనే ఉంటున్నా. జీవితాంతం బాబా, సాయిగీత సేవలోనే ఉండిపోతా’ అని చెప్పారు. -
శ్రీవారి ఏనుగుకు కోపం వచ్చింది
తిరుమలలో శ్రీవారి వాహన సేవలో అపసృతి దొర్లింది. శ్రీవారి ఏనుగు తొండంతో మావటిని కొట్టడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. 12.40 గంటలకు గరుడ వాహన సేవ ముగిసిన వెంటనే.. భక్తుల రద్దీతో అసహనానికి గురైన ఓ ఏనుగు ఆగ్రహానికి గురైంది. ఊరేగింపు మాడ వీధిలో తిరిగి వెళుతున్న సమయంలో తన ముందున్న మావటి సుబ్రహ్మణ్యరెడ్డిని తొండంతో కొట్టింది. దాంతో అతడు గాయపడ్డాడు. మావటిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. -
మనసులు గెలిచిన మావటి
ఏనుగుల ముందు నడుస్తూ, వాటిని నడిపిస్తూ, వాటి అల్లరిని నియంత్రిస్తూ సాగుతుండే మావటి మనకు కొత్తేమీ కాదు. అయితే మావటి అనగానే మనకు పురుషులే కళ్లముందు కనిపిస్తారు. ఎందుకంటే మహిళలెవరూ మావటులుగా ఉండరు కాబట్టి. కానీ ఈ సంప్రదాయాన్ని మార్చి పారేసింది పర్బతీ బరువా. మగాళ్లు చేయగలిగిన ఈ పనిని నేను మాత్రం ఎందుకు చేయలేను అంటూ మావటి అవతారమెత్తింది. ప్రపంచపు మొట్టమొదటి మహిళా మావటిగా ఖ్యాతి గడించింది! అస్సాం, మేఘాలయ, నాగాలాండ్ తదితర రాష్ట్రాల్లో ఉన్న దట్టమైన అడవుల్లో అప్పుడప్పుడూ ఒక అద్భుతమైన దృశ్యం కనిపిస్తూ ఉంటుంది. మదమెక్కిన ఏనుగులు రభస చేస్తుంటే, వాటిని ఓ ఆడమనిషి అదుపు చేస్తూ ఉంటుంది. అదిలించో బెదిరించో, లాలించో మచ్చిక చేసుకునో... ఎలాగైతేనేం, వాటి ని దారిలోకి తెస్తుంది. మగాళ్లకే ఎంతో కష్టమైన ఈ పనిని ఆమె చాలా తేలికగా, నేర్పుగా చేసేస్తూ ఉంటుంది. ఆమె పేరు పర్బతీ బరువా. ప్రపంచంలోనే ఏకైక మహిళా మావటి! నాన్నతోనే మొదలు... పర్బతీ తండ్రి అస్సాంలో ఓ పెద్ద జమిందారు. ఆయనకు కొత్త కొత్త ప్రదేశాలు చూడటం ఎంతో ఇష్టం. అందుకే సంవత్సరంలో పది నెలలకు పైగా ప్రయాణాల్లోనే గడిపేవాడు. పైగా నలుగురు భార్యలు, పిల్లలు, డెబ్భైమంది పనివాళ్లు, ఓ వైద్యుడు, క్షురకుడు, దర్జీ, పిల్లలకు చదువు చెప్పడానికి ఓ మాస్టార్ని తీసుకుని మరీ విహారం సాగించే వారాయన. ఆయనకు ఏనుగులంటే విపరీతమైన ఇష్టం. అవి నివసించే ప్రదేశాలకు వెళ్తుండేవాడు. వాటిని స్వయంగా శుభ్రం చేస్తూ, తిండి తినిపిస్తూ సంబర పడేవాడు. వాటిని మచ్చిక చేసుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. చిన్ననాటి నుంచీ తండ్రిని నిశితంగా పరిశీలించిన పర్బతిలో కూడా ఏనుగుల పట్ల ఆసక్తి మొదలైంది. వాటి మీద ప్రేమ కలిగింది. దాంతో తనూ వాటికి చేరువయ్యింది. వాటిని మచ్చిక చేసుకోవడం, మదపుటేనుగుల మదాన్ని అణచడం పద్నాలుగేళ్లకే నేర్చుకుంది. వయసు పెరిగేకొద్దీ ఏనుగులే తన ప్రపంచం అనిపించడంతో తన జీవితాన్ని వాటికే అంకితం చేసింది పర్బతి. అలా అని పర్బతికి అడవులు, ఏనుగులు తప్ప మరేవీ తెలియవనుకుంటే పొరపాటు. గౌహతి యూనివర్శిటీ నుంచి పాలిటిక్స్‌లో డిగ్రీ తీసుకుంది. ఆమె అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములంతా వేర్వేరు వృత్తులను ఎంచుకుంటే... పర్బతి మాత్రం ఎలిఫెంట్ ట్రెయినర్‌గా మారింది. ఏనుగులకు ఎలాంటి విద్యనైనా తేలికగా నేర్పించేయగలదామె. ఊరి మీద, పొలాల మీద పడి అల్లరి చేసే తుంటరి ఏనుగుల ఆట కట్టించడంలో నేర్పరి. అందుకే అస్సాం, ఆ చుట్టుపక్కల రాష్ట్రాల అధికారులు ఏనుగులకు ట్రెయినింగ్ ఇవ్వాలన్నా, వాటి వల్ల ఏదయినా ఇబ్బంది ఎదురైనా పర్బతికే కబురు చేస్తారు. అస్సాం అటవీ శాఖ అయితే, ఆమెను చీఫ్ ఎలిఫెంట్ వార్డెన్‌గా నియమించుకుంది. అంతగా వారి మనసుల్ని గెల్చుకుందామె! పర్బతి కుటుంబంలో చాలామంది ఇప్పటికీ జమీందారులుగా వెలుగుతున్నారు. కోట్లకు పడగలెత్తారు. అలనాటి హిందీ ‘దేవదాసు’లో నటించిన ప్రమతేష్ బారువా పర్బతికి చిన్నాన్న అవుతారు. అయితే పర్బతి మాత్రం పాపులారిటీ, రిచ్ లైఫ్‌ని ఇష్టపడరు. మావటి అన్న మాటలో ఉన్న ఆనందం జమీందారిణి అన్న మాటలో లేదంటా రామె. ఎప్పటికీ మావటిగానే ఉంటాను, మావటిగానే మరణిస్తాను అని ఒక్కమాటలో తేల్చి చెప్పేస్తారు! మన దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు, అటవీ శాఖ వారికి కూడా పర్బతి పేరు బాగా తెలుసు. విదేశీయుల మనసుల్ని సైతం గెల్చుకుందామె. బీబీసీవారు ‘క్వీన్ ఆఫ్ ఎలిఫెంట్స్’ అనే డాక్యుమెంటరీ తీయడంతో పర్బతి పేరు ప్రపంచమంతా మారుమోగింది. ఎన్నో సన్మానాలు, సత్కారాలు, అవార్డులు ఆమెను వరించాయి. -
లక్ష్యం లేని జీవితం నిరర్థకం
ప్రేరణ విపరీతమైన బద్ధకం, పనులను వాయిదా వేయడం, చేపట్టిన పనిని మధ్యలోనే వదిలేసి పక్కకుతప్పుకోవడం వంటి అవలక్షణాలు మనుషుల జీవితాల్లో భాగంగా మారిపోయాయి. విశ్రాంతికి ఇచ్చిన ప్రాధాన్యతను శ్రమకు ఇవ్వడం లేదు. ఇలాంటి వాటిని త్వరగా వదిలించుకోకపోతే జీవితం నిరర్థకంగా మిగిలిపోతుంది. కేరళలోని ఓ దేవాలయంలో గజరాజు, దాని సంరక్షణకు మావటి ఉండేవారు. ప్రతిరోజూ సాయంత్రం మావటి ఆ ఏనుగును బయటకు తీసుకెళ్లేవాడు. వీధుల గుండా నడుస్తున్నప్పుడు ఏనుగు తన చేష్టలతో అందరినీ ఇబ్బంది పెట్టేది. దుకాణంలో అరటిపండ్లు కనిపిస్తే తొండంతో లాక్కొని నోట్లో వేసుకొని మింగేసేది. ఇక కొబ్బరికాయలు కనిపిస్తే చటుక్కున తొండంతో అందుకొని కరకరలాడించేది. మావటి ఎంత గట్టిగా ప్రయత్నించినా అది తన తీరు మార్చుకొనేది కాదు. ఏనుగు చేష్టల వల్ల పాపం దుకాణదారులు నష్టపోయేవారు. దేవుడికి చెందిన ఏనుగు కావడంతో ఏమీ చేయలేక లోలోపల బాధపడుతూ ఉండేవారు. ఒకరోజు మావటికి బ్రహ్మాండమైన ఆలోచన తట్టింది. తన చేతిలో ఉన్న కర్రను తొండంతో పట్టుకొని నడవాలని ఏనుగును ఆజ్ఞాపించాడు. వెంటనే అది కర్ర కిందపడిపోకుండా తొండంతో చుట్టి బిగించింది. ఆలయం నుంచి బయటకు నడవగానే దుకాణాల్లో అరటిపండ్లు, కొబ్బరికాయలు కనిపించాయి. ఏనుగు నోట్లో నీళ్లూరాయి. వాటిని అందుకొందామంటే వంపు తిరిగిన తొండంలో కర్ర ఉండడంతో సాధ్యం కాలేదు. తొండంను ముందుకు చాపితే కర్ర కిందపడిపోతుంది. మావటి శూలంతో పొడిచి శిక్షిస్తాడు. ఇక చేసేదిలేక గజరాజు బుద్ధిగా ముందుకు నడిచింది. అప్పటినుంచి దుకాణదారుల కష్టాలు తీరాయి. వారు ఆనందంతో అప్పుడప్పుడు ఏనుగుకు బహుమతులు ఇస్తూ ఉండేవారు. లక్ష్యం చేజారనీయొద్దు ఈ కథను నిశితంగా పరిశీలిస్తే మనం కూడా ఏనుగు లాంటివాళ్లమేనని తెలుస్తుంది. మన జీవితాలను పక్కదారి పట్టించే ఆకర్షణలు చుట్టుపక్కల చాలా ఉంటాయి. వాటి వలలో పడొద్దంటూ మన మావటీలు.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హెచ్చరిస్తూనే ఉంటారు. అయినా వారి మాటలను పట్టించుకోకుండా మొండిగా ముందుకెళ్లి నష్టపోతుంటాం. ఎక్కువగా టీవీ చూడడం, అతి నిద్ర, పనికిమాలిన కబుర్లతో సమయాన్ని వృథా చేస్తుంటాం. పరిస్థితిలో మార్పు రావాలంటే.. మావటి.. ఏనుగుకు ఇచ్చిన కర్ర లాంటిది కావాలి. జీవితానికి ఒక అర్థవంతమైన లక్ష్యం, ఉద్దేశం తప్పనిసరిగా ఉండాలి. ఆ లక్ష్యం చేతిలోంచి జారిపోకుండా ఉండాలంటే నిరంతరం శ్రమించాలి. ఏర్పరచుకున్న లక్ష్యం మనిషిని సరైన దారిలో నడిపిస్తుంది. ఏనుగు తొండంలాగే మన మనసు కూడా విచ్చలవిడిగా సంచరిస్తుంది. మనసును దారిలో పెట్టాలంటే లక్ష్యాన్ని నిర్దేశించుకొని, దాన్ని సాధించేందుకు కృషి ఆరంభించాలి. మంచి పనులు అప్పగించాలి చేయకూడని పనిచేస్తుంటే పెద్దలు వారిస్తుంటారు. అయినా పిల్లలు వినకుండా చేసేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో నష్టపోయే పనులు చేయకుండా ఆపాలంటే వారికి మంచి పనులు అప్పగించాలి. టీవీ చూస్తూ కాలం గడిపేస్తున్నారా? అయితే మంచి పుస్తకం చదవమని చెప్పండి. బంగాళాదుంప చిప్స్ అతిగా తింటున్నారా? అయితే ఏదైనా పండు తినమని చెప్పండి. శ్రమ చేయకుండా ఇంట్లో కూర్చొని ఒళ్లు పెంచుతున్నారా? అయితే రోజూ బయటికెళ్లి పరిగెత్తమని చెప్పండి. ఇవన్నీ ఇతరులకు చెప్పడమే కాదు. మనం కూడా కచ్చితంగా ఆచరించాలి. రోజూ ఏదో ఒక మంచి పని చేయాలి చేయడానికి అర్థవంతమైన పని లేకపోతేనే జీవితంలో సమస్యలు మొదలవుతాయి. లక్ష్యం లేకుంటే దాన్ని సాధించడానికి కృషి చేయాల్సిన అవసరం రాదు. ఫలితంగా బద్ధకం పెరిగిపోతుంది. విలువైన సమయం వృథాగా గడిచిపోతుంది. బద్ధకస్తుడి మనసు భూతాల నిలయం అనే పాత సామెత ముమ్మాటికీ నిజం. కాబట్టి లక్ష్యం లేకపోయినా కనీసం మంచి అలవాట్లను ఏర్పరచుకోవాలి. వాటిని క్రమబద్ధంగా ఆచరించాలి. ఇప్పటివరకు వ్యర్థంగా గడిచిపోయినా కాలాన్ని మర్చిపోండి. ఇకనైనా కార్యాచరణలోకి అడుగుపెట్టండి. మిమ్మల్ని ముందుకు నడిపించే ఒక లక్ష్యాన్ని, జీవితానికి ఒక ఉద్దేశాన్ని నిర్దేశించుకోండి. రోజూ ఏదో ఒక మంచి పనిచేయండి. కానీ, ఏ పనీ చేయకుండా ఖాళీగా మాత్రం కూర్చోవద్దు. నిజంగా ఏ పనీ లేకపోతే.. రోజూ మీకు ఇష్టమైన ఆట ఆడండి. దానివల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి. కథలోని ఏనుగులాగా.. అందరికీ మావటి లభించకపోవచ్చు. అయినా కర్రను సంపాదించుకోవాల్సిందే. మనం ఏర్పరచుకున్న లక్ష్యమే ఆ కర్ర. మీ లక్ష్యమేంటో ఈ రోజే గుర్తించండి. -‘కెరీర్‌స 360’ సౌజన్యంతో...