లక్ష్యం లేని జీవితం నిరర్థకం
ప్రేరణ
విపరీతమైన బద్ధకం, పనులను వాయిదా వేయడం, చేపట్టిన పనిని మధ్యలోనే వదిలేసి పక్కకుతప్పుకోవడం వంటి అవలక్షణాలు మనుషుల జీవితాల్లో భాగంగా మారిపోయాయి. విశ్రాంతికి ఇచ్చిన ప్రాధాన్యతను శ్రమకు ఇవ్వడం లేదు. ఇలాంటి వాటిని త్వరగా వదిలించుకోకపోతే జీవితం నిరర్థకంగా మిగిలిపోతుంది.
కేరళలోని ఓ దేవాలయంలో గజరాజు, దాని సంరక్షణకు మావటి ఉండేవారు. ప్రతిరోజూ సాయంత్రం మావటి ఆ ఏనుగును బయటకు తీసుకెళ్లేవాడు. వీధుల గుండా నడుస్తున్నప్పుడు ఏనుగు తన చేష్టలతో అందరినీ ఇబ్బంది పెట్టేది. దుకాణంలో అరటిపండ్లు కనిపిస్తే తొండంతో లాక్కొని నోట్లో వేసుకొని మింగేసేది. ఇక కొబ్బరికాయలు కనిపిస్తే చటుక్కున తొండంతో అందుకొని కరకరలాడించేది. మావటి ఎంత గట్టిగా ప్రయత్నించినా అది తన తీరు మార్చుకొనేది కాదు.
ఏనుగు చేష్టల వల్ల పాపం దుకాణదారులు నష్టపోయేవారు. దేవుడికి చెందిన ఏనుగు కావడంతో ఏమీ చేయలేక లోలోపల బాధపడుతూ ఉండేవారు. ఒకరోజు మావటికి బ్రహ్మాండమైన ఆలోచన తట్టింది. తన చేతిలో ఉన్న కర్రను తొండంతో పట్టుకొని నడవాలని ఏనుగును ఆజ్ఞాపించాడు. వెంటనే అది కర్ర కిందపడిపోకుండా తొండంతో చుట్టి బిగించింది. ఆలయం నుంచి బయటకు నడవగానే దుకాణాల్లో అరటిపండ్లు, కొబ్బరికాయలు కనిపించాయి.
ఏనుగు నోట్లో నీళ్లూరాయి. వాటిని అందుకొందామంటే వంపు తిరిగిన తొండంలో కర్ర ఉండడంతో సాధ్యం కాలేదు. తొండంను ముందుకు చాపితే కర్ర కిందపడిపోతుంది. మావటి శూలంతో పొడిచి శిక్షిస్తాడు. ఇక చేసేదిలేక గజరాజు బుద్ధిగా ముందుకు నడిచింది. అప్పటినుంచి దుకాణదారుల కష్టాలు తీరాయి. వారు ఆనందంతో అప్పుడప్పుడు ఏనుగుకు బహుమతులు ఇస్తూ ఉండేవారు.
లక్ష్యం చేజారనీయొద్దు
ఈ కథను నిశితంగా పరిశీలిస్తే మనం కూడా ఏనుగు లాంటివాళ్లమేనని తెలుస్తుంది. మన జీవితాలను పక్కదారి పట్టించే ఆకర్షణలు చుట్టుపక్కల చాలా ఉంటాయి. వాటి వలలో పడొద్దంటూ మన మావటీలు.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హెచ్చరిస్తూనే ఉంటారు. అయినా వారి మాటలను పట్టించుకోకుండా మొండిగా ముందుకెళ్లి నష్టపోతుంటాం. ఎక్కువగా టీవీ చూడడం, అతి నిద్ర, పనికిమాలిన కబుర్లతో సమయాన్ని వృథా చేస్తుంటాం.
పరిస్థితిలో మార్పు రావాలంటే.. మావటి.. ఏనుగుకు ఇచ్చిన కర్ర లాంటిది కావాలి. జీవితానికి ఒక అర్థవంతమైన లక్ష్యం, ఉద్దేశం తప్పనిసరిగా ఉండాలి. ఆ లక్ష్యం చేతిలోంచి జారిపోకుండా ఉండాలంటే నిరంతరం శ్రమించాలి. ఏర్పరచుకున్న లక్ష్యం మనిషిని సరైన దారిలో నడిపిస్తుంది. ఏనుగు తొండంలాగే మన మనసు కూడా విచ్చలవిడిగా సంచరిస్తుంది. మనసును దారిలో పెట్టాలంటే లక్ష్యాన్ని నిర్దేశించుకొని, దాన్ని సాధించేందుకు కృషి ఆరంభించాలి.
మంచి పనులు అప్పగించాలి
చేయకూడని పనిచేస్తుంటే పెద్దలు వారిస్తుంటారు. అయినా పిల్లలు వినకుండా చేసేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో నష్టపోయే పనులు చేయకుండా ఆపాలంటే వారికి మంచి పనులు అప్పగించాలి. టీవీ చూస్తూ కాలం గడిపేస్తున్నారా? అయితే మంచి పుస్తకం చదవమని చెప్పండి. బంగాళాదుంప చిప్స్ అతిగా తింటున్నారా? అయితే ఏదైనా పండు తినమని చెప్పండి. శ్రమ చేయకుండా ఇంట్లో కూర్చొని ఒళ్లు పెంచుతున్నారా? అయితే రోజూ బయటికెళ్లి పరిగెత్తమని చెప్పండి. ఇవన్నీ ఇతరులకు చెప్పడమే కాదు. మనం కూడా కచ్చితంగా ఆచరించాలి.
రోజూ ఏదో ఒక మంచి పని చేయాలి
చేయడానికి అర్థవంతమైన పని లేకపోతేనే జీవితంలో సమస్యలు మొదలవుతాయి. లక్ష్యం లేకుంటే దాన్ని సాధించడానికి కృషి చేయాల్సిన అవసరం రాదు. ఫలితంగా బద్ధకం పెరిగిపోతుంది. విలువైన సమయం వృథాగా గడిచిపోతుంది. బద్ధకస్తుడి మనసు భూతాల నిలయం అనే పాత సామెత ముమ్మాటికీ నిజం. కాబట్టి లక్ష్యం లేకపోయినా కనీసం మంచి అలవాట్లను ఏర్పరచుకోవాలి. వాటిని క్రమబద్ధంగా ఆచరించాలి. ఇప్పటివరకు వ్యర్థంగా గడిచిపోయినా కాలాన్ని మర్చిపోండి.
ఇకనైనా కార్యాచరణలోకి అడుగుపెట్టండి. మిమ్మల్ని ముందుకు నడిపించే ఒక లక్ష్యాన్ని, జీవితానికి ఒక ఉద్దేశాన్ని నిర్దేశించుకోండి. రోజూ ఏదో ఒక మంచి పనిచేయండి. కానీ, ఏ పనీ చేయకుండా ఖాళీగా మాత్రం కూర్చోవద్దు. నిజంగా ఏ పనీ లేకపోతే.. రోజూ మీకు ఇష్టమైన ఆట ఆడండి. దానివల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి. కథలోని ఏనుగులాగా.. అందరికీ మావటి లభించకపోవచ్చు. అయినా కర్రను సంపాదించుకోవాల్సిందే. మనం ఏర్పరచుకున్న లక్ష్యమే ఆ కర్ర. మీ లక్ష్యమేంటో ఈ రోజే గుర్తించండి.
-‘కెరీర్‌స 360’ సౌజన్యంతో...