Inspired
-
డాటర్ ఆట చూసి అమ్మ అంపైరయింది
తల్లి నుంచి స్ఫూర్తి పోందే పిల్లలే కాదు పిల్లల నుంచి స్ఫూర్తి పోందే తల్లులు కూడా ఉంటారని చెప్పడానికి బలమైన ఉదాహరణ... సలీమా ఇంతియాజ్. కూతురి క్రీడానైపుణ్యాన్ని చూసి... ‘ఆడితే ఇలా ఆడాలి’ అనుకునేది. ఆటలో కూతురి కష్టాన్ని చూసి ‘కష్టపడితే ఇలా పడాలి’ అనుకునేది. క్రికెట్లో కూతురు పాకిస్థాన్ తరపున ప్రాతినిధ్యంవహించినప్పుడు... అంతర్జాతీయ స్థాయిలో తాను కూడా ప్రాతినిధ్యం వహించాలని కలలు కన్నది. నమ్మకమైన, గౌరవప్రదమైన అంపైర్‌గా పేరు తెచ్చుకున్న సలీమా ఇంతియాజ్ ‘ఐసీసీ ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆఫ్ డెవలప్మెంట్ అంపైర్స్’ కు నామినేట్ అయిన తొలి పాకిస్తానీ మహిళగా చరిత్ర సృష్టించింది.సలీమా కెరీర్‌కు సంబంధించి 2022 కీలక సంవత్సరం. బంగ్లాదేశ్‌లో జరిగిన మహిళల ఆసియా కప్ కోసం మహిళా అంపైర్ల ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) నిర్ణయించింది. బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సలీమా అరంగేట్రం చేసింది. ఈ మ్యాచ్‌తో తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించింది.2008లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్( పీసీబీ) మహిళా అంపైర్ల ప్యానెల్లో చేరిన సలీమా, కుమార్తె కైనత్ ఇంతియాజ్ తనకు స్ఫూర్తి అంటుంది. పాకిస్థాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన కైనత్ కామెంటేటర్‌గా కూడా పని చేసింది.‘చిన్నప్పుడు క్రికెట్ బాగా ఆడేదాన్ని. క్రికెట్లో పాకిస్థాన్కుప్రాతినిధ్యం వహించాలనేది నా కల. నా కూతురు కైనత్ వల్ల నా కల నెరవేరింది. ఆమె నా కూతురు మాత్రమే కాదు. నా స్నేహితురాలు. ఆమె నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఎంతో స్ఫూర్తి పోందాను’ అని కైనత్ గురించి మురిపెంగా చెబుతుంది సలీమా. 2010లో క్రికెట్లో అరంగేట్రం చేసింది కైనత్.‘అమ్మను చూస్తే గర్వంగా అనిపిస్తుంది. క్రికెట్ గ్రౌండ్లో కనిపించాలనేది అమ్మ కల. అంపైరింగ్ ద్వారా తన కలను నెరవేర్చుకుంది. క్రికెట్ పట్ల ఆమె అభిరుచి, అంకితభావం అంటే నాకు ఇష్టం. ఈ విషయంలో నేను అమ్మలా ఉండాలనుకుంటున్నాను’ అంటుంది కైనత్. సలీమా, ఆమె భర్త స్పోర్ట్స్ ఇన్స్ట్రక్టర్లు కావడంతో ఇంట్లో ఎప్పుడూ క్రికెట్ గురించి చర్చలు జరిగేవి.స్థానిక క్రికెట్ టోర్నమెంట్లలో తల్లి అంపైర్‌గా వ్యవహరించిన మ్యాచ్‌లలో కైనత్ ఆడింది.‘అంపైర్ అంటే ఇలా ఉండాలి’ అని ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రశంసలను ఎన్నోసార్లు విన్నది.తాజా రికార్డ్ నేపథ్యంలో... ‘ఇది నా విజయం మాత్రమే కాదు. పాకిస్థాన్‌లోని ప్రతి ఔత్సాహిక మహిళా క్రికెటర్, అంపైర్ల విజయం. నా విజయం క్రికెట్లో తమదైన ముద్ర వేయాలని కలలు కనే అసంఖ్యాక మహిళలకు స్ఫూర్తి ఇస్తుందని ఆశిస్తున్నాను. నా ప్రయాణంలో కష్టాలు ఉన్నాయి. వ్యక్తిగత త్యాగాలు ఉన్నాయి. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అవి ఎంతో విలువైనవి అనిపిస్తాయి’ అంటుంది సలీమ.‘తన రికార్డ్‌తో ఎన్నో అడ్డంకులను ఛేదించడమే కాకుండా తర్వాతి తరం మహిళా క్రికెట్ ప్రోఫెషనల్స్‌కు ఆమె స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తుంది’ అని సలీమా ఇంతియాజ్‌ను ప్రశంసించింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్. -
'ఒకే భూమి ఒకే కుటుంబం.. ఈ స్ఫూర్తి ఉపనిషత్తులదే..'
ఢిల్లీ: భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం డిమాండ్లు ఉన్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ కీలక వ్యాఖ్యలు చేశారు. భద్రతా మండలిలో నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమున్నాయని చెప్పారు. ప్రపంచం క్లిష్ట సమయంలో ఉందని పేర్కొన్న ఆయన.. వాతావరణం, సుస్థిర అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని జీ20 నాయకులకు పిలుపునిచ్చారు. జీ20కి హాజరవడానికి ఢిల్లీకి వచ్చిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. జీ20కి ఆహ్వానం పలికినందుకు కృతజ్ఞతలు తెలిపిన గుటెరస్.. భారత్ సారథ్యంలో ఈ సమావేశాలు నిర్వహించడం ప్రపంచ మార్పుకు సంకేతమని అన్నారు. గ్లోబల్ సౌత్‌కు ప్రయోజనం చేకూర్చేందుకు భారత్ కావాల్సినంత చేస్తోందని చెప్పారు. ఉపనిషత్తుల నుంచి వచ్చిన వసుధైక కుటుంబం అనే పదం నేటి ప్రపంచానికి చాలా అవసరమని చెప్పారు. #WATCH | G 20 in India | UN Secretary-General António Guterres says, "...One Family, One Earth, One Future - this phrase is inspired by the Maha Upanishad and finds profound resonance in today's world not just as a timeless ideal but as an indictment of our times. If we are… pic.twitter.com/cW6qwELreb — ANI (@ANI) September 8, 2023 'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు'పై దృష్టి పెట్టడాన్ని స్వాగతిస్తున్నాను. ఉపనిషత్తుల నుంచి ప్రేరణ పొందిన పదం నేటి ప్రపంచ సమస్యలకు సరైన పరిష్కారాలను సూచిస్తుంది. ప్రపంచంలో విభేదాలు, ఆందోళనలు చెలరేగుతున్న క్రమంలో ఈ స్ఫూర్తి అవసరం' అని గుటెరస్ అన్నారు. #WATCH | G 20 in India | UN Secretary-General António Guterres says, "...Let me begin by expressing my gratitude to India for the warm welcome and my hope that India's presidency at the G20 will help lead to the kind of transformative change our world so desperately needs in line… pic.twitter.com/7VFzfJWDA5 — ANI (@ANI) September 8, 2023 ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భాగం కావడానికి భారతదేశం బలమైన పోటీదారుగా భావిస్తున్నారా అనే ప్రశ్నకు గుటెర్రెస్ స్పందిస్తూ.. "భద్రతా మండలిలో ఎవరు ఉండాలనేది నేను నిర్ణయించలేను. ఆ పని సభ్య దేశాలది. భారతదేశం నేడు అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉంది. ప్రపంచంలో భారతదేశ పాత్ర గొప్పది. వాస్తవాలను ప్రతిబింబించేలా భద్రతా మండలి సంస్కరణ అవసరమని నేను నమ్ముతున్నాను.' అని గుటెరస్ అన్నారు. ఇదీ చదవండి: భారత్ అల్లునిగా.. జీ20 పర్యటన చాలా ప్రత్యేకం: రిషి సునాక్ -
89 ఏళ్ల పంచాయతీ ప్రెసిడెంట్!ఆమె ఫిట్నెస్కి ఫిదా అవ్వాల్సిందే!
కొందరూ వయసులో వృద్ధులుగా ఉన్నప్పటికీ పనులు మాత్రం యువకుల కంటే మిన్నగా ఉంటాయి. వృద్ధులమన్నా భావనే లేశమంత లేకుండా భలే చాకచక్యంగా అసాధ్యమైన పనులు చేసి ఔరా! అనిపించుకుంటారు. అలాంటి కోవకు చెందిన వారే తమిళనాడుకు చెందిన 89 ఏళ్ల బామ్మ. రెస్ట్ తీసుకునే వయసులో పంచాయతీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ..అధికారుల చేత శభాష్! అనిపించుకుంటున్నారు. వివరాల్లోకెళ్తే..తమిళనాడుకి చెందిన 89 ఏళ్ల వీరమ్మాళ్ స్ఫూర్తిదాయకమైన మహిళ. ఆమె స్థైర్యం, దృఢ సంకల్పం ప్రజలనే కాదు అధికారులను విస్మయానికి గురిచేసింది. అత్యంత వృద్ధురాలైన పంచాయతీ ప్రెసిడెంట్ తనదైన ముద్ర వేసింది. పెదాలపై చెరగని చిరునవ్వు, హద్దుల్లేని ఉత్సాహం అందర్ని మంత్రముగ్దుల్ని చేస్తాయి. ఏం చేయలేనంటూ వణుకుతూ మూలన కూర్చొనే వయసులో.. ఎంతో ఉత్సహాంగా అరిట్టపట్టి పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేసి ప్రెసిడెంట్‌గా గెలవడమే కాగా అందరూ మెచ్చుకునేలా బాధ్యతలను నిర్వర్తించి శభాష్ అనిపించుకుంటోంది. మిల్లెట్స్ వంటి సంప్రదాయ భోజనం, వ్యవసాయ క్షేత్రంలో రోజంతా పనిచేయడం అదే తన ఫిట్నెస్ రహస్యం అని చెబుతోంది వీరమ్మాళ్. వీరమ్మాళ్ నాయకత్వంలో అరిట్టపట్టి మధురై జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తింపు పొందడం విశేషం. ఈ విషయాన్ని ఇండియన్ అడ్మిన్‌స్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ సుప్రియా సాహు ఆన్లైన్ వేదికగా పంచుకుంటూ నెట్టింట ఆమె ఫోటోని, వీడియోని షేర్ చేసింది. దీంతో నెటిజన్లు 'సాధారణ జీవన విధానం ఎల్లప్పుడూ ఉత్తమమైందే'! అని ఒకరు, ఆ ఏజ్‌లో కూడా లీడర్‌గా ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నందుకు ఆమెకు అవార్డు ఇవ్వాలి అని మరోకరూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. Veerammal Amma, popularly known as "Arittapatti Paati' the 89 years old Panchayat President of Arittapatti Panchayat is truly an inspiring woman. Fit as a fiddle she is the oldest Panchayat President in TN. Her infectious smile & unbridled enthusiasm is so heatwarming. When I… pic.twitter.com/ol7M2tpqIr — Supriya Sahu IAS (@supriyasahuias) August 30, 2023 (చదవండి: ఇండియన్ బ్యాలెరినా! బ్యాలె డ్యాన్స్‌లో రాణిస్తున్న హైదరాబాదీ!) -
సీఎం జగన్ ను యువత ఆదర్శంగా తీసుకోవాలి : మంత్రి రోజా
-
మా ఇద్దరి పేర్లలో పవర్ ఉంది..
యాభై ఆరేళ్ల కమలా హ్యారిస్ ఎక్కడ?! 2009 బ్యాచ్ స్వయం భాటియా ఎక్కడ?! ‘బట్.. నేను, తను ఒక్కటే. మా ఇద్దరి పేర్లలో పవర్ ఉంది. మా ఇద్దరిలో కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడీ పన్నెండేళ్ల వయసులో ఒక ఇండియన్ గా యూఎస్ లో నేను ఎలా ఉన్నానో, తన టీన్స్ ఆరంభంలో కమల అలానే ఉన్నారు‘ అంటోంది ఈ ‘స్వయం’భువు! ఇంతకీ అమ్మగారు ఏం చేస్తుంటారు? ఏదైనా చేస్తుండే వయసా ఇది! చేసి పెడుతుంటే, తిని పెడుతుండే ఏజ్ కదా! కానీ స్వయం భాటియా అలా లేదు. షి ఈజ్ ఏన్ యాక్ట్రెస్. సింగర్, డాన్సర్, మోడల్, డ్రమ్మర్.. ఇంకా చాలా! వైస్–ప్రెసిడెంట్ అనే ఆ పోస్టును తీసి పక్కన పెడితే.. నిజమే, నేనూ తానూ అనేంత ఉంది ‘స్వే’కి. అకస్మాత్తుగా ఈ పిడుగు ఎక్కడ నుంచి పడింది?! ఈ చిన్నారిని చూశారుగా! పేరు స్వే భాటియా. వయసు పన్నెండేళ్లు. ఆ వయసుకు ఎంత పేరొచ్చినా స్వే భాటియా అనే పేరు తర్వాతనే. కానీ తను ‘మైటీ డక్స్ యాక్ట్రెస్’ అనే పేరుతో యూ ఎస్‌లో పాపులర్. న్యూయార్క్ సిటీలో ఉంటుంది. చదువు చదువే. టాలెంట్ టాలెంటే! నటనొక్కటే టాలెంట్ అనుకునేరు. సింగర్, డ్యాన్సర్, మోడల్, డ్రమ్మర్, ఇంకా.. కమెడియన్. అంత టైమ్ ఎక్కడ దొరుకుతుంది అనుకుంటాం. తను మాత్రం వేరేలా అంటుంది.. ‘బోర్ కొడుతోంది మమ్మీ.. టైమ్ గడవడం లేదు’ అని! టైమ్ కంటే వేగం అయి ఉండాలి. అంత వేగామా.. అని ఇప్పటికప్పుడు మీరు స్వేని చూడాలనుకుంటే హెచ్.బి.వో.లో ప్రస్తుతం ప్రసారం అవుతున్న బ్లాక్ కామెడీ సెటైరికల్ డ్రామా సీరీస్.. ‘సక్సెషన్’ కోసం టీవీ ఆన్ చేయొచ్చు. అందులో సోఫీ రాయ్‌గా మీకు కనిపించబోయేది స్వే భాటియానే! లేకుంటే మార్చి 26న ప్రారంభమయ్యే ‘డిస్నీ ప్లస్’ సీక్వెల్ సీరీస్ ‘ది మైటీ డక్స్ : గేమ్ ఛేంజర్’ కోసం ఎదురు చూడొచ్చు. మైటీ డక్స్ విడుదలకు ముందే స్వే.. మైటీ డక్స్ యాక్ట్రెస్ అయిందంటే చూడండి. సరే, ఇప్పటి వరకు ఇదంతా స్వే (అసలు పేరు ‘స్వయం’) గురించి మనం చెప్పుకున్నది. ఇక్కడి నుంచి స్వే తన గురించి తను చెప్పుకోబోతున్నది! అయితే స్వే ఊరికే తనేమిటో చెప్పుకోవడం లేదు. కమలా హ్యారిస్‌తో తనని కంపేర్ చేసుకుంటోంది. లేదంటే కమలా హ్యారిన్ని తనతో కంపేర్ చేస్తోంది! ఇలాగని తను తన బ్లాగ్‌లో రాసుకుంది. డ్రమ్మర్‌గా, నటిగా, మోడల్‌గా స్వే (స్వయం) ‘‘ఐ యామ్ స్వే. పుట్టినప్పుడు స్వయం రంజీత్ భాటియా నేను. ఈ మధ్యే నేను నా పేరులో ఉన్న పవర్‌ని గమనించాను. ‘స్వ’ అంటే ‘నా’ అని. ‘స్వయం’ అంటే ‘నేను’ అని. నేను పుట్టకముందే అమ్మానాన్న అబ్బాయి పుడితే పెట్టాలని ‘స్వీయ’ అనే అర్థంలో ‘స్వయం’ అనే సంస్కృత నామాన్ని ఎంపిక చేసి పెట్టుకున్నారు. నేను పుట్టాక అదే పేరు ఉంచేశారు’’ అని స్వే తన బ్లాగులో రాసుకుంది. అయితే ఇదేమీ విషయం కాదు. తన పేరులో ఉన్న పవరే అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పేరులోనూ ఉందని తను గమనించిందట. అంతే కాదు, తామిద్దరికీ పోలికలు ఉన్నాయని కూడా! కమలానికి భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉన్నట్లే కమలా హ్యారిస్ ప్రయాణానికీ ఉంటుందని అనిపించి ఆమె గురించి తెలుసుకున్నా. భారతీయ సంతతి అమెరికన్ టీనేజర్‌గా కమల అమెరికాలో ‘ఏకాకి’ అయిన సందర్భాలు.. నేను ఇప్పుడు ఏకాకి అవుతున్న సందర్భాలను గుర్తు చేస్తున్నాయి. ఆ వయసులో ఒక బ్లాక్ పర్సన్‌గా, ఒక ఇండియన్‌గా, ఒక మహిళగా తన గదిలో కమల ఒంటరిగా గడపడం.. ఇప్పుడు నా ఒంటరితనాన్ని గుర్తుకు తెస్తోంది. నేను టీన్స్‌లోకి వస్తున్నాను. పదమూడు రాబోతోంది. నాకూ నా గదిలో ఒంటరి ఇండియన్ని అనిపిస్తుంటుంది. బ్యాలే క్లాస్‌లో, హిప్ హాప్ డ్యాన్స్ కచ్చేరీల్లో, బ్రాడ్వే ఆడిషన్లలో నేనొక్కదాన్నే అన్నట్లు ఉంటుంది. గత ఏడాది కమల పోటీ చేస్తున్నట్లు ప్రకటించగానే ఆమెతో నన్ను పోల్చుకున్నాను. ఆమె అడుగు కదిలినప్పుడు నా అడుగు కదలినట్లు, క్యాపెయిన్ను ఆపినప్పుడు నా అడుగు ఆగినట్లు ఊహించుకున్నాను. ఒకవేళ ఆమె ఇక్కడే ఆగిపోతే.. నేనూ ఆగిపోతానా అనే ఆలోచన కూడా నాకు ఆనాడు వచ్చింది. కానీ ఆమె గెలిచారు. నాలో గెలుపు ఆలోచనలు కలిగించారు. ఒక ఇండియన్ అమెరికన్ ఇంత ఘన విజయం సాధించారు కనుక నేనూ సాధిస్తాను అనుకున్నాను’’ అని స్వే తన బ్లాగ్‌లో రాసింది. ఇదంతా స్వే మామూలుగా రాసుకున్నదే కానీ ఆమె ఇలా రాయడానికి ఇప్పుడు అనుకోని ప్రాధాన్యం లభిస్తోంది. ముఖ్యంగా కమలా హ్యారిస్‌తో ‘నేనూ తనూ’ అని పోల్చుకోవడం! యాక్టర్స్ ఈక్విటీ అసోసియేషన్, స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్–అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియో ఆర్టిస్ట్ సంస్థలతో స్వేకి కాంట్రాక్టులు ఉన్నాయి. అసలు మూడేళ్ల వయసు నుంచే స్వే సంగీత, సృజనాత్మక రంగాలలోకి వచ్చేసింది. కీబోర్డ్, క్లాసికల్ పియానో, బాస్ గిటార్, డ్రమ్.. ఆమె వేళ్లు చెప్పినట్లు రాగాలు పోతాయి. దరువులు వేస్తాయి. స్వే డ్యాన్స్ చేస్తే ఫ్లోర్ పరవశించిపోవలసిందే! అంత లయబద్ధంగా చేస్తుంది. ‘‘తను ప్రధానంగా నటి. డాన్స్, సంగీతం.. తనకు అనుబంధ ఆసక్తులు’’ అంటారు స్వే తల్లిదండ్రులు రంజీత్, ధర్మాంగి. చివరికి స్వే ఒక స్వతంత్ర భావాలున్న మహిళగా ఎదిగి, రాజకీయాల్లోకి వెళ్లినా ఆశ్చర్యం లేదు. కమలతో తనను కంపేర్ చేసుకుంటోందంటే.. కమల అడుగు జాడల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉందనేగా! -
చేతిరాత బాలేదన్న.. చెల్లిని చంపాడు..
♦ ‘సీఐడీ’ సీరియల్ స్పూర్తితోనే హత్య ♦ విచారణలో విస్తుపోయే సమాధానం లాహోర్: పాకిస్థాన్ లో దారుణం జరిగింది. ఓ 11 ఏళ్ల బాలుడు చేతిరాత బాలేదన్నతన 9 ఏళ్ల చెల్లిని చున్నితో గొంతు నులిమి చంపాడు. ఈ హృదయ విచారక ఘటన లాహోర్ లోని పంజాబ్ సరిహద్దున ఉన్న షాలిమర్ లో గత నెల 30న చోటుచేసుకుంది. పోలీసులు ఆ బాలుడైన అబ్దుల్ రెహమాన్ ను అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుపోయే సమాధానం చెప్పాడు. భారత్ కు చెందిన పాపులర్ టీవీ సీరియల్ సీఐడీ ప్రేరణతోనే తన చెల్లిని చంపినట్లు రెహమాన్ పోలీసులకు తెలిపాడు. రంజాన్ సెలవులతో వారి అమ్మమ్మ ఇంటికి వచ్చిన చిన్నారులు ఆమె లేని సమయంలో సరదాగా హ్యాండ్ రైటింగ్ పోటీ పెట్టుకున్నారు. ఈ పోటీలో అన్న రెహమాన్ పూర్ హ్యాండ్ రైటింగ్ ను చూపిస్తూ ఏడిపించింది. ఇది తట్టుకోలేని బాలుడు ఆ చిన్నారి చున్నితో గొంతు నులిమి చంపాడు. ఎవరికి అనుమానం రాకుండా తన చేతి వేలిని నరుక్కొని ఆ గది లోపలి నుంచి తాళం వేసాడు. ఇంటికి వచ్చిన వారి అమ్మమ్మ ఇరుగుపొరుగు వారి సహాయంతో డోర్ తీయగా ఆమెకు చనిపోయిన చిన్నారి పక్కనే గాయపడ్డ బాలుడు కనిపించారు. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. తొలుత అనుమానంతో సవితి తల్లి సబాను విచారించి ఆమెకు సంబంధం లేదని వదిలేశారు. ఇక బాలుడిని గట్టిగా విచారించగా సీఐడీ సీరియల్ ప్రేరణతో తనే చంపినట్లు అంగీకరించాడు. -
నేర వార్తల ప్రేరణతో
రెండేళ్లలో 115 చైన్ స్నాచింగ్‌లు రెండు కేజీల బంగారు నగల స్వాధీనం కేసు ఛేదించిన పోలీసులకు రివార్డులు రాజమహేంద్రవరం క్రైం (రాజమహేంద్రవరం సిటీ) : రెండేళ్ల కాలంలో 115 చైన్ స్నాచింగ్‌లు చేసి రెండు కేజీలకు పైబడిన బంగారు నగలు చోరీ చేసిన నిందితుడిని రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెంట్రల్ జోన్ డీఎస్పీ జె.కులశేఖర్ పర్యవేక్షణలో త్రీటౌన్ ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్రీరామకోటేశ్వరరావు, క్రైం పార్టీ ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు సిబ్బందితో కలసి నిందితుడిని క్వారీ మార్కెట్ సెంటర్లో మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేశామని అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు. అతని వద్ద నుంచి 2 కేజీల 069 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వాటి విలువ రూ.60 లక్షలు ఉంటుందని అన్నారు. వీఆర్వో సమక్షంలో బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. స్థానిక పోలీస్ గెస్ట్‌హౌస్‌లో బుధవారం విలేకరులకు ఆమె వెల్లడించిన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాలలో... నిందితుడు భాస్కరరావు చేసిన మొత్తం 115 చైన్ స్నాచింగ్ కేసులు స్టేషన్ల వారీగా ఇలా ఉన్నాయి. రాజమహేంద్రవరం వన్‌టౌన్ పరిధిలో 23, టూ టౌన్ పరిధిలో ఆరు, త్రీటౌన్ పరిధిలో 33, ప్రకాష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 37, కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు, సీతానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి చేశాడు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు స్టేషన్ పరిధిలో 10, సమిశ్రగూడెంలో ఒకటి, చాగల్లు స్టేషన్ పరిధిలో ఒకటి ఉన్నాయి. మోటారు సైకిల్ మీద తిరుగుతూ ఒంటరిగా నడిచి వెళ్తున్న మహిళల మెడలో బంగారు నగలు తెంపుకుని పరారయ్యేవాడు. వ్యవసాయ కుటుంబంలో పుట్టినా... వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నిందితుడు రెండు ఎకరాల పొలం అమ్ముకొని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలు రావడంతో రూ.30 లక్షల వరకూ అప్పులపాలయ్యాడు. మద్యం, జూదానికి బానిస అయ్యాడు. రాజమహేంద్రవరం రూరల్ తొర్రేడు గ్రామానికి చెందిన మల్లిన భాస్కరరావు (బాసి) రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలోనూ, పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో రోడ్లపై వెళ్లే మహిళల మెడలోంచి బంగారు నగలను చోరీలు చేసేవాడు. నేర వార్తల ప్రేరణతో టీవీలలో వచ్చే క్రైం న్యూస్‌పై వచ్చే కథనాల ప్రేరణతో చోరీలకు పాల్పడ్డాడు. రియల్ ఎస్టేట్‌లో నష్టం వచ్చి అప్పులపాలైన భాస్కరరావుకు ఇంట్లో చిల్లిగవ్వ కూడా ఇచ్చేవారు కాదు. దీంతో జల్సాలకు డబ్బులు సంపాదించేందుకు చైన్ స్నేచింగ్‌ను సులువైన మార్గంగా ఎన్నుకున్నాడు. 2015 నుంచి 2016 వరకూ, 2017 ఈ నెల 3న ఇతడు ఆఖరిసారిగా చైన్ స్నాచింగ్ చోరీ చేశాడు. చిక్కింది ఇలా... నగరంలో చైన్ స్నాచింగ్స్ జోరుగా సాగుతుండడంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. త్రీటౌన్ కానిస్టేబుల్ పి. వెంకటేశ్వరావుకు ఒక రోజు నిందితుడు ఆర్యాపురం సత్యనారాయణ స్వామి గుడి సమీపంలోని ఒక వీధిలో తిరుగుతూ కనిపించాడు. అనుమానంతో నిందితుడిని ప్రశ్నిస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పేర్కొంటూ కొన్ని డాక్యుమెంట్లు చూపించాడు. తెల్లటి దుస్తులతో దర్జాగా ఉండడంతో వదిలివేశారు. అయితే ఇతని స్వగ్రామంలో స్థితిగతులపై విచారణ చేస్తే పోలీసులకు కొన్ని అనుమానాలు వచ్చాయి. భర్తను వదిలి వేసిన ఒక మహిళతో ఇతడు వివాహేతర సంబంధం కొనసాగించడం, పేదరాలైన ఆమె తరచూ బంగారు నగలు ఎక్కువగా పెట్టుకొని తిరగ డంపై గ్రామస్తులకు అనుమానాలు వచ్చాయి. నిఘా పెట్టిన చైన్ స్నాచింగ్స్ ప్రాంతాలలో నిందితుడు మోటారుసైకిల్‌పై కనిపించడంతో అతడిపై పోలీసుల కన్ను పడింది. అతడి కాల్ డేటా ఆధారంగా నేరం జరిగిన ప్రదేశాలలో నిందితుడి సెల్‌ఫోన్ సిగ్నల్స్ టవర్ లోకేషన్‌కు సరిపోలడంతో నిందితుడిగా గుర్తించారు. నేరాలు ఎక్కువగా రాత్రి 7 గంటల నుంచి 9 గంటల లోపు మాత్రమే చేసి, 9 గంటల కల్లా ఇంటికి వెళ్లిపోయే ప్రణాళికతో నిందితుడు చోరీలకు పాల్పడేవాడు. పోలీసులకు రివార్డు ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన క్రైం పార్టీ ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్ పి.వెంకటేశ్వరరావు వి.శ్రీనివాస్, కేఎస్ శ్రీనివాస్, ఎ.రాంబాబులను ఎస్పీ అభినందించారు. వీరికి ప్రభుత్వం తరఫున రూ.10 వేల రివార్డును అర్బన్ ఎస్పీ రాజకుమారి అందజేశారు. ఇదిలా ఉండగా... ఈ కేసులో పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిందితుడి నుంచి పెద్ద మొత్తంలో బంగారు నగలు రికవరీ చేసినా కేవలం 2 కేజీలకు పైబడిన నగలనే పోలీసులు చూపించారన్న ఆరోపణలు వస్తున్నాయి. బంగారు నగలు కొనుగోలు చేసిన బంగారం షాపు వారిపై కేసులు నమోదు చేయలేదని, ఈ కేసులో కొంతమందిని తప్పించారని తెలుస్తోంది. -
ఆంధ్రుల దెబ్బకి బీజేపీ దిగొస్తుందా ?
-
హోదా కోసం ఎందాకైనా ?
-
కృష్ణ నుంచి నైనాగా...
ఢిల్లీ వాసంత్ వ్యాలీ స్కూలు విద్యార్థిని.. ట్రాన్స్ జెండర్.. ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. నైనా క్వీన్ బీ పేరిట ఆమె నిర్వహిస్తున్న ఛానల్ ను ఇంటర్నెట్ వినియోగదారులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ఏడువేలమందికి పైగా ఆ ఛానల్ ను వీక్షిస్తున్నారు. లింగమార్పిడి తో అతడు (కృష్ణ) నుంచీ ఆమె (నైనా) గా మారిన తను... తన కుటుంబాన్నే కాక, మొత్తం కమ్యూనిటీకి అండగా నిలిచేందుకు వినూత్న పద్ధతిలో వాయిస్ వినిపిస్తోంది. చిన్నతనంలోనే కృష్ణగా ఉండే వికృత రూపం నుంచి... నైనాగా మారిన తన జీవితంలోని ప్రస్తుత అంకం వరకూ ప్రతి సన్నివేశాన్ని ఆమె స్పష్టంగా ఆత్మ విశ్వాసంతో వివరించింది. ఒకప్పుడు అనుభవించిన మానసిక క్షోభను, ఆత్మహత్య చేసుకోవాలన్న తీవ్ర ఆవేదన నుంచి బయటపడి తన గళంతో బాధితులను ఆదుకునేందుకు కృషి చేయాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఉన్నది ఉన్నట్లు వివరించేందుకు వెనుకాడటం లేదు. చివరికి జననేంద్రియాల గురించి మాట్లాడేందుకు కూడా సంకోచించడం లేదు. సరదాగా సంతోషంగా విషయాలను ఆత్మ విశ్వాసంతో వెల్లడించడం ఆమె మొక్కవోని విశ్వాసానికి అద్దం పడుతోంది. ప్రపంచంలో తనవంటి బాధితులెవరైనా, ఎటువంటి సమస్యలనైనా ధైర్యంగా వినిపించేందుకు నైనా స్ఫూర్తిగా నిలుస్తోంది. ఓ సంప్రదాయ సౌదీ అరేబియన్ సైతం నైనాను ఆహ్వానించాడని, ఆమెకు చుట్టూ ఎంతోమంది అభిమానులు, ప్రోత్సాహకులు ఉన్నారని ఆమె తల్లి మిషీ సింగ్ చెప్తోంది. నైనాను ప్రతివారూ ఇష్టపడతారని, స్కూల్లో టీచర్లు సైతం నైనాకు అండగా నిలబడటం గర్వంగా అనిపిస్తుందని తెలిపింది. అయితే నైనా టాయిలెట్ విషయంలో మాత్రం కాస్త సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోందంటుంది. అమ్మాయిలు వెళ్ళే టాయిలెట్ కు తాను వెళ్ళనని, తాను బాలికనే అయినా ఎందుకు ఆ టాయిలెట్ వాడలేకపోతున్నానో అర్థం కాదని చెప్తుంది. అంతేకాదు.. టాయిలెట్ గురించి ఎవరైనా అడిగితే కొంత బాధకు గురైనట్లు కూడ ఆమెకు సంబంధించిన యూట్యూబ్ వీడియోల్లో కనిపిస్తుంది. అయితే తనవంటివారి సమస్యలపై స్వయంగా పోరాడేందుకు నైనా ఆత్మ విశ్వాసంతో ఉందని ఆమె తల్లి మిషి చెప్తోంది. తన అనుభవసారాన్ని ఉపన్యాసాలుగా వినిపించడంతోపాటు, ఠాగూర్ ఇంటర్నేషనల్ లోనూ ఆమె సమస్యలపై వ్యాఖ్యానిస్తోంది. త్వరలో ఢిల్లీ విశ్వవిద్యాలయానికి వెళ్ళేందుకు ఆమె సిద్ధమౌతోంది. -
ఆ విషయంలో...ఆయనే నాకు స్ఫూర్తి: దాసరి
బాలచందర్ గారి లాంటి ఒక మహాదర్శకుడు కన్నుమూయడంతో భారతదేశంలో ఒక గొప్ప క్రియేటివ్ మ్యాన్ తన శకం ముగించినట్లయింది. నాకు ఆనాటి మద్రాసులో మొట్టమొదటి దర్శక మిత్రుడు బాలచందర్ గారు. మేము ఎప్పుడు కలసి మాట్లాడుకున్నా మా కబుర్లు నాటకాలు, సినిమాల గురించే సాగేవి. నిజానికి, మా ఇద్దరి జీవితాలూ చాలా ప్యారలల్‌గా నడిచాయి. సినిమాల కోసం ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. నేనూ అలాగే సినిమా కోసం నా ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఇద్దరం నాటకాల నుంచి సినిమాల్లోకి వచ్చినవాళ్ళమే. రంగస్థలంపై నటుడిగా, దర్శకుడిగా కొన్ని వందల ప్రదర్శనలు చేశారాయన. నేనూ అలాగే చేశాను. సినిమాల్లో ఆయన మొదట మాటల రచయితగా ప్రారంభించి ఆ తరువాత దర్శకుడయ్యారు. నేనూ అంతే! అందుకే, నా కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథి అయితే, ఆయన కార్యక్రమాలకు నేను ముఖ్య అతిథిగా వెళ్ళేవాణ్ణి. ఆయనను చివరిసారిగా శిల్పకళావేదికలో మా కార్యక్రమానికి వచ్చినప్పుడు కలిశాను. ఆయన చాలాసార్లు ‘నారాయణరావు గారూ! మీరంటే నాకు చాలా ఇష్టం’ అనేవారు. కారణం ఏమిటని అడిగితే... ‘మీరూ స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇష్టపడరు. నేనూ స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇష్టపడను. ఇద్దరం కొత్తవాళ్ళ కోసం, చిన్నవాళ్ళ కోసం కథలు రాసుకొని సినిమాలు తీస్తుంటాం. అలాగే తీసుకుందాం’ అనేవారు. నిజం చెప్పాలంటే, అలా కొత్తవాళ్ళతో, చిన్నవాళ్ళతో కొత్త తరహా కథలు రాసుకొని సినిమాలు తీయడంలో నాకు స్ఫూర్తి ఆయనే! బాలచందర్ సినీ జీవితాన్ని గమనిస్తే, ఆయన తీసుకొచ్చిన నటీనటులు స్టార్స్ అయ్యేవారు. అలా తన స్కూల్ నుంచి వచ్చిన స్టార్స్‌తో ఆయన సినిమాలు తీశారే తప్ప, ఒక్క శివాజీ గణేశన్ మినహా పెద్ద స్టార్లతో ఎప్పుడూ తీయలేదు! గమనిస్తే - ఆయన తీసుకొచ్చిన నటులు రజనీకాంత్, కమలహాసన్లు భారతదేశానికే సూపర్‌స్టార్లయ్యారు. అలాగే, ప్రకాశ్‌రాజ్ కూడా! ఇలా ఎంతోమంది ఆర్టిస్టుల్ని స్టార్స్‌ను చేశారాయన. సమాజంలో జరుగుతున్న అంశాలనూ, కొన్ని చేదు నిజాలనూ మనం సినిమా ద్వారా చెప్పాలని బాలచందర్ గారు నాతో ఎప్పుడూ అంటూ ఉండేవారు. నా సినిమాల్లో నేనూ ఆ పని చేస్తుండేవాణ్ణి కాబట్టి, ఆయన సంతోషించేవారు. మనిద్దరి కోణాలూ ఒకేలా ఉన్నాయనేవారు. ఆయన నాటకాలు ‘మేజర్ చంద్రకాంత్’ లాంటివి ఆయనతో కలసి కూర్చొని, చూసేవాణ్ణి. నా ప్రతి సినిమా ఆయనకు చూపించేవాణ్ణి. నాకు బాగా గుర్తు. నా ‘మేఘసందేశం’ చిత్రం చూసిన ఆయన ‘నారాయణరావ్! నేను ఇన్‌సై్పర్ అయ్యాను’ అన్నారు. ఒక దర్శకుడి నుంచి మరో దర్శకుడికి దక్కే అరుదైన ప్రశంస అది. ఆ మాటతో ఆగకుండా ఆయన ఆ కథలోని ఆత్మ తీసుకొని, తమిళంలో ‘సింధుభైరవి’ చిత్రం తీశారు. ‘మేఘసందేశం’ మోడల్లో, దానికి బాగా దగ్గరగా ఉండేలా ఆ సినిమా తీయడమే కాక, ఆ మాట చెప్పే చేయడం దర్శకుడిగా ఆయన సంస్కారం, గొప్పదనం. ఇక, ఆయన సినిమాల్లో నాకు బాగా నచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా, ఆయన తొలి రోజుల్లో తమిళంలో తీసిన సంచలనాత్మక ‘అరంగేట్రం’ చిత్రం చాలా బాగుంటుంది. ఇక, ఆయన సినిమా చూసి, ఆ కథ తెలుగులో నేను చేయాలనుకున్న సందర్భాలూ ఒకటి రెండు లేకపోలేదు. ఆయన అద్భుతంగా తీసిన తమిళ చిత్రం ‘అపూర్వ రాగంగళ్’ను తెలుగులో నేను ‘తూర్పు - పడమర’గా తీశా. పోస్టర్ మీద దర్శకుడి పేరు ప్రత్యేకంగా కనిపించేలా వేయడమనే సంస్కృతిని ఆయన తమిళంలో, నేను తెలుగులో తెచ్చాం. ఆయన మాత్రం సెంటిమెంట్‌గా తన పేరును కిందే వేసుకొనేవారు. నేను మాత్రం ‘అందరి కన్నా డెరైక్టరే టాప్ కాబట్టి, నా పేరు పోస్టర్లో పైనే వేసుకుంటా’ అని ఆయనతో అంటుండేవాణ్ణి. ఆయననూ, నన్నూ, కన్నడ దిగ్దర్శకుడు పుట్టణ్ణ కణగల్నూ ‘డెరైక్టర్స్ ఆఫ్ ది సౌత్’ అంటూ అప్పట్లో అందరూ గొప్పగా ప్రస్తావించేవారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా... ఒక పెద్ద హీరోకు ఉండేంత క్రేజున్న దర్శకుడు - బాలచందర్ గారు. ఆయనను చూసి ఈ తరం ఏం నేర్చుకోవాలంటే... దర్శకుడనేవాడు ఎప్పుడూ ఏ హీరో మోకాళ్ళ దగ్గరా ఉండకూడదని నేర్చుకోవాలి. మొదటి నుంచి చివరి దాకా అలాగే సింహంలా జీవించిన అలాంటి ఒక మహా వ్యక్తి ఈ రోజున లేరన్న నిజాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ చిత్ర పరిశ్రమలు జీర్ణించుకోలేవు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. (సంభాషణ - రెంటాల జయదేవ) -
నాగ్, వెంకీలే నాకు ప్రేరణ
ఓ పక్క ఉన్నత విద్య చదువుతూనే, మరో పక్క నటునిగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు రోహిత్ మడుపు. ఆ మధ్య విడుదలైన ‘దిల్ దీవానా’తో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న రోహిత్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో అతని అంతరంగం. నేను నటన నేర్చుకుంది అక్కడే.. చిన్నప్పటి నుంచీ నటనంటే ఇష్టం. అందుకే... సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థలో షూటింగులు ఏమైనా జరుగుతుంటే వెళ్లి కూర్చునేవాణ్ణి. నేను నటన నేర్చుకుంది అక్కడే. ఎక్కడా యాక్టింగ్ నేర్చుకోలేదు. మా నాన్నగారు న్యాయవాది, వ్యాపారవేత్త. ఆయన నా అభిరుచి గమనించి, సినిమాలు చేయమని ప్రోత్సహిస్తున్నారు. వారే నాకు ప్రేరణ నేను నటుణ్ణి అవడం కూడా యాదృచ్ఛికంగానే జరిగింది. ‘దిల్ దీవానా’ దర్శక, నిర్మాతలు కొత్త హీరో కోసం అన్వేషిస్తున్నారని నా మిత్రుల ద్వారా తెలిసింది. వెంటనే నా ఫొటోలు పంపించాను. ఎంపికైపోయాను. నా నటనకు పరిశ్రమ నుంచి కూడా ప్రశంసలు లభించాయి. వ్యక్తిగా రామానాయుడుగారు, నటునిగా నాగార్జున, వెంకటేశ్‌లు నాకు ప్రేరణ. గొప్ప స్టార్‌గా ఎదగాలని నాకు లేదు. మంచి నటునిగా గుర్తింపు తెచ్చుకుంటే చాలు. త్వరలోనే నేను హీరోగా ఓ చిత్రం మొదలు కానుంది. ఆ వివరాలు త్వరలో చెబుతా. -
లక్ష్యం లేని జీవితం నిరర్థకం
ప్రేరణ విపరీతమైన బద్ధకం, పనులను వాయిదా వేయడం, చేపట్టిన పనిని మధ్యలోనే వదిలేసి పక్కకుతప్పుకోవడం వంటి అవలక్షణాలు మనుషుల జీవితాల్లో భాగంగా మారిపోయాయి. విశ్రాంతికి ఇచ్చిన ప్రాధాన్యతను శ్రమకు ఇవ్వడం లేదు. ఇలాంటి వాటిని త్వరగా వదిలించుకోకపోతే జీవితం నిరర్థకంగా మిగిలిపోతుంది. కేరళలోని ఓ దేవాలయంలో గజరాజు, దాని సంరక్షణకు మావటి ఉండేవారు. ప్రతిరోజూ సాయంత్రం మావటి ఆ ఏనుగును బయటకు తీసుకెళ్లేవాడు. వీధుల గుండా నడుస్తున్నప్పుడు ఏనుగు తన చేష్టలతో అందరినీ ఇబ్బంది పెట్టేది. దుకాణంలో అరటిపండ్లు కనిపిస్తే తొండంతో లాక్కొని నోట్లో వేసుకొని మింగేసేది. ఇక కొబ్బరికాయలు కనిపిస్తే చటుక్కున తొండంతో అందుకొని కరకరలాడించేది. మావటి ఎంత గట్టిగా ప్రయత్నించినా అది తన తీరు మార్చుకొనేది కాదు. ఏనుగు చేష్టల వల్ల పాపం దుకాణదారులు నష్టపోయేవారు. దేవుడికి చెందిన ఏనుగు కావడంతో ఏమీ చేయలేక లోలోపల బాధపడుతూ ఉండేవారు. ఒకరోజు మావటికి బ్రహ్మాండమైన ఆలోచన తట్టింది. తన చేతిలో ఉన్న కర్రను తొండంతో పట్టుకొని నడవాలని ఏనుగును ఆజ్ఞాపించాడు. వెంటనే అది కర్ర కిందపడిపోకుండా తొండంతో చుట్టి బిగించింది. ఆలయం నుంచి బయటకు నడవగానే దుకాణాల్లో అరటిపండ్లు, కొబ్బరికాయలు కనిపించాయి. ఏనుగు నోట్లో నీళ్లూరాయి. వాటిని అందుకొందామంటే వంపు తిరిగిన తొండంలో కర్ర ఉండడంతో సాధ్యం కాలేదు. తొండంను ముందుకు చాపితే కర్ర కిందపడిపోతుంది. మావటి శూలంతో పొడిచి శిక్షిస్తాడు. ఇక చేసేదిలేక గజరాజు బుద్ధిగా ముందుకు నడిచింది. అప్పటినుంచి దుకాణదారుల కష్టాలు తీరాయి. వారు ఆనందంతో అప్పుడప్పుడు ఏనుగుకు బహుమతులు ఇస్తూ ఉండేవారు. లక్ష్యం చేజారనీయొద్దు ఈ కథను నిశితంగా పరిశీలిస్తే మనం కూడా ఏనుగు లాంటివాళ్లమేనని తెలుస్తుంది. మన జీవితాలను పక్కదారి పట్టించే ఆకర్షణలు చుట్టుపక్కల చాలా ఉంటాయి. వాటి వలలో పడొద్దంటూ మన మావటీలు.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హెచ్చరిస్తూనే ఉంటారు. అయినా వారి మాటలను పట్టించుకోకుండా మొండిగా ముందుకెళ్లి నష్టపోతుంటాం. ఎక్కువగా టీవీ చూడడం, అతి నిద్ర, పనికిమాలిన కబుర్లతో సమయాన్ని వృథా చేస్తుంటాం. పరిస్థితిలో మార్పు రావాలంటే.. మావటి.. ఏనుగుకు ఇచ్చిన కర్ర లాంటిది కావాలి. జీవితానికి ఒక అర్థవంతమైన లక్ష్యం, ఉద్దేశం తప్పనిసరిగా ఉండాలి. ఆ లక్ష్యం చేతిలోంచి జారిపోకుండా ఉండాలంటే నిరంతరం శ్రమించాలి. ఏర్పరచుకున్న లక్ష్యం మనిషిని సరైన దారిలో నడిపిస్తుంది. ఏనుగు తొండంలాగే మన మనసు కూడా విచ్చలవిడిగా సంచరిస్తుంది. మనసును దారిలో పెట్టాలంటే లక్ష్యాన్ని నిర్దేశించుకొని, దాన్ని సాధించేందుకు కృషి ఆరంభించాలి. మంచి పనులు అప్పగించాలి చేయకూడని పనిచేస్తుంటే పెద్దలు వారిస్తుంటారు. అయినా పిల్లలు వినకుండా చేసేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో నష్టపోయే పనులు చేయకుండా ఆపాలంటే వారికి మంచి పనులు అప్పగించాలి. టీవీ చూస్తూ కాలం గడిపేస్తున్నారా? అయితే మంచి పుస్తకం చదవమని చెప్పండి. బంగాళాదుంప చిప్స్ అతిగా తింటున్నారా? అయితే ఏదైనా పండు తినమని చెప్పండి. శ్రమ చేయకుండా ఇంట్లో కూర్చొని ఒళ్లు పెంచుతున్నారా? అయితే రోజూ బయటికెళ్లి పరిగెత్తమని చెప్పండి. ఇవన్నీ ఇతరులకు చెప్పడమే కాదు. మనం కూడా కచ్చితంగా ఆచరించాలి. రోజూ ఏదో ఒక మంచి పని చేయాలి చేయడానికి అర్థవంతమైన పని లేకపోతేనే జీవితంలో సమస్యలు మొదలవుతాయి. లక్ష్యం లేకుంటే దాన్ని సాధించడానికి కృషి చేయాల్సిన అవసరం రాదు. ఫలితంగా బద్ధకం పెరిగిపోతుంది. విలువైన సమయం వృథాగా గడిచిపోతుంది. బద్ధకస్తుడి మనసు భూతాల నిలయం అనే పాత సామెత ముమ్మాటికీ నిజం. కాబట్టి లక్ష్యం లేకపోయినా కనీసం మంచి అలవాట్లను ఏర్పరచుకోవాలి. వాటిని క్రమబద్ధంగా ఆచరించాలి. ఇప్పటివరకు వ్యర్థంగా గడిచిపోయినా కాలాన్ని మర్చిపోండి. ఇకనైనా కార్యాచరణలోకి అడుగుపెట్టండి. మిమ్మల్ని ముందుకు నడిపించే ఒక లక్ష్యాన్ని, జీవితానికి ఒక ఉద్దేశాన్ని నిర్దేశించుకోండి. రోజూ ఏదో ఒక మంచి పనిచేయండి. కానీ, ఏ పనీ చేయకుండా ఖాళీగా మాత్రం కూర్చోవద్దు. నిజంగా ఏ పనీ లేకపోతే.. రోజూ మీకు ఇష్టమైన ఆట ఆడండి. దానివల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి. కథలోని ఏనుగులాగా.. అందరికీ మావటి లభించకపోవచ్చు. అయినా కర్రను సంపాదించుకోవాల్సిందే. మనం ఏర్పరచుకున్న లక్ష్యమే ఆ కర్ర. మీ లక్ష్యమేంటో ఈ రోజే గుర్తించండి. -‘కెరీర్‌స 360’ సౌజన్యంతో... -
దారి చూపిన ఊరు
స్ఫూర్తి కొత్తదారి ఎప్పుడు కనిపిస్తుంది? ఏ ఇబ్బందో, కష్టమో వచ్చినప్పుడో... ప్రత్యామ్నాయం కోసం వెదుకుతాం. కొత్త దారి ఒకటి కనుక్కుంటాం. కొందరు మాత్రం కష్టాలు, నష్టాలు దరి చేరక మునుపే ప్రత్యామ్నాయాలను వెదుకుతారు. ముందుచూపుతో వ్యవహరిస్తారు. కంబకాయ గ్రామం అలాంటి ముందు చూపుతోనే వ్యవహరించింది. ఇతర గ్రామాలకు ఆదర్శంగా మారింది. ‘గ్యాస్ ధరల కష్టాలు’ అనే మాట వినిపించక ముందే ఊళ్లోకి బయోగ్యాస్‌ను ఆహ్వానించింది. చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శం గా నిలవడమే కాదు తెలుగునాట అగ్రస్థానంలో నిలిచింది. ఇంట్లోకి వంటగ్యాస్ రాగానే పండగ కాదు. రోజురోజూకు పెరుగుతున్న ధరను తట్టుకునే శక్తి ఉండాలి. అలాంటి శక్తి ఎంతమందికి ఉంది? కంబకాయ గ్రామంలో చాలామందికి గ్యాస్ధరల పెరుగుదలతో సంబంధం లేదు. ‘గ్యాస్ ధర మళ్లీ పెరిగింది’లాంటి వార్తలు చదివి ఉలిక్కిపడాల్సిన అవసరం లేదు. రెండు దశాబ్దాల క్రితమే ఆ గ్రామానికి ‘బయో గ్యాస్’ రూపంలో ఒక వరం లభించింది. ఇక భయమెందుకు? శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలో ఉంది కంబకాయ గ్రామం. రెండు దశాబ్దాల క్రితం అప్పటి గ్రామ సర్పంచ్ పాగోటి రాజారావునాయుడు పశువుల పేడతో బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణం చేశారు. అప్పటికది ఊరికి కొత్త. దాని ప్రయోజనాల గురించి కూడా ఎక్కువమందికి తెలియదు. అయితే కాలక్రమంలో బయోగ్యాస్ విలువ తెలుసుకోవడం మొదలైంది. ఇప్పటి వరకు ఒక్క కంబకాయ గ్రామంలోనే 320కి పైగా బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణం జరిగింది. ఇది ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది. చుట్టుపక్కల 70 గ్రామాల వరకు ఈ ఊరిని స్ఫూర్తిగా తీసుకొని బయోగ్యాస్ ప్లాంట్లు నిర్మించాయి, నిర్మిస్తున్నాయి. ఎలా తయారుచేస్తారు? మొదట ట్యాంకు నిర్మిస్తారు. ఈ ట్యాంకు భూమి అడుగు భాగంలో ఉంటుంది. ట్యాంకుకు ప్రక్కన కానీ, ట్యాంకు పైన కానీ ఒక కుండీ నిర్మిస్తారు. ఆ కుండీ ద్వారా పేడ, నీరు కలిపి బాగా చిక్కటి ద్రవ పదార్థంలా తయారు చేసి ట్యాంకులోకి విడిచిపెడతారు. ట్యాంకులో ప్రవేశించిన పేడ మూడు రోజులకి (ప్రారంభంలో) గ్యాస్‌గా మారుతుంది. ఆ ట్యాంకుకు ఏర్పాటు చేసిన పైపులైన్ సహాయం తో గ్యాస్ పొయ్యి వరకు సరఫరా అవుతుంది. మరో వైపు ట్యాంకు లోపల వ్యర్థపదార్థం రెండవ వైపు ఏర్పాటు చేసిన ఔట్లెట్ ద్వారా బయటకు వెళుతుంది. దీన్ని ‘స్లర్రీ’ అంటారు. ప్రతిరోజూ పశువుల పేడను ద్రవపదార్థంగా మార్చి ట్యాంకులో వేస్తుండాలి. ప్రయోజనం ఏమిటి? ‘‘బయోగ్యాస్ వినియోగం ద్వారా చాలా సమయం ఆదా అవుతుంది’’ అంటున్నారు గ్రామ మాజీ సర్పంచ్ పి.కుసుమకుమారి. గ్యాస్ ధరల పెరుగుదలకు ప్రత్యామ్నాయమనే కాకుండా, బయోగ్యాస్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. వంట చేసే మహిళలకు కళ్ల జబ్బులు, ఇతర హానికరమైన సమస్యలు ఉండవు. బయోగ్యాస్ వినియోగం అనంతరం విడుదలయ్యే వ్యర్థ పదార్థం ‘స్లర్రీ’ని పంట పొలాలలో ఎరువుగా ఉపయోగించవచ్చు. ఈ సేంద్రియ ఎరువు వినియోగం వల్ల పంట దిగుబడి పెరుగుతుంది. గ్యాస్ వృథా అవుతుందనిగానీ, ప్రమాదాలు సంభవిస్తాయనే భయం కానీ గృహిణులకు ఉండదు. బయోగ్యాస్‌ద్వారా విద్యుద్దీపాలనూ వెలిగించుకోవచ్చు. ప్రభుత్వ చేయూత... ఒక ప్లాంట్ నిర్మాణానికి సుమారు ఇరవైవేల రూపాయల ఖర్చు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం సాంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ (నెడ్కాప్) ద్వారా ఒక్కో ప్లాంట్‌కు ఎనిమిదివేల రూపాయల సబ్సీడి ఇస్తోంది. సబ్సీడీలో భాగంగా పొయ్యి, ఇతర పరికరాలను కూడా సరఫరా చేస్తారు. పర్యావరణ మిత్ర... బయోగ్యాస్‌కు ముందు వంటచెరుకు కోసం చెట్లను నరికేసేవారు. దీని ప్రభావం పర్యావరణంపై పడేది. బయోగ్యాస్ పుణ్యమా అని చెట్లకు ముప్పు తప్పింది. దోమల బెడద తప్పింది. రసాయనిక ఎరువులు కొనే అవసరం తప్పింది. ఒక్కటా రెండా... బయోగ్యాస్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ గ్యాస్‌ను సమర్థంగా ఉపయోగించుకుంటూ తెలుగునాట అగ్రస్థానంలో నిలిచి, ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుకున్న కంబకాయ బాటలో ప్రయాణించడానికి ఎన్నో గ్రామాలు స్ఫూర్తి పొందుతున్నాయి. - సదాశివుని కృష్ణ, సాక్షి, నరసన్నపేట ఫొటోలు: చల్ల మల్లేశ్వరరావు 1. ట్యాంక్‌లో పేడ కలుపుతున్న దృశ్యం 2. స్లర్రీ వినియోగించిన పొలంలో వరినాట్లు వేస్తున్న దృశ్యం 3. బయోగ్యాస్ ద్వారా వంట చేస్తున్న గృహిణి ఎలాంటి సమస్యా లేదు... ఇరవై సంవత్సరాల నుంచి బయోగ్యాస్‌ని ఉపయోగిస్తున్నాం. ఇప్పటికి వరకు ఏ విధమైన సమస్య రాలేదు. ప్లాంట్ నిర్మాణానికి స్వామిబాబు వజ్రమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ (ఎస్వీసిటీ) స్వచ్ఛంద సంస్థ సహకరించింది. - పాగోటి లక్ష్మి, గృహిణి, కంబకాయ వంటతో పాటు వ్యవసాయోత్పత్తికీ... బయోగ్యాస్ ద్వారా ఉత్పత్తి అయ్యే స్లర్రీని సేంద్రియ ఎరువుగా వినియోగించడం వల్ల అధిక దిగుబడి, భూమి సారవంతంగా తయారవడం వంటి మంచి ఫలితాలు ఉన్నాయి. వంట ప్రయోజనం కంటే వ్యవసాయోత్పత్తికి ఇది మరీ ప్రోత్సాహంగా ఉంది. - గుజ్జిడి నాగేశ్వరరావు, రైతు -
గమ్యంపై గురి తప్పనీయకండి!
ప్రేరణ ఒక పనిని పూర్తి చేయడానికి మన ముందు రెండు దారులుంటే సులువైన దాన్నే మొదటగా ఎంచుకుంటాం. అవసరమైన దానికంటే అనువైన దాన్ని ఎంపిక చేసుకోవడానికే మనం మొగ్గు చూపుతాం. నదీ ప్రవాహంలో చిక్కుకున్నప్పుడు ఏ మాత్రం ప్రయత్నించకుండా, ఈదకుండా ఉంటే ప్రవాహ దిశలో కొట్టుకుపోతామే తప్ప తీరాన్ని చేరుకోలేం. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు ఎదురవుతాయి. గమ్యానికి దూరంగా తీసుకెళ్లడానికి ప్రేరేపిస్తాయి. అవి మనకు ఎంతో సౌకర్యవంతంగా కనిపిస్తాయి. వాటి బారిన పడితే లక్ష్యసాధన కష్టమవుతుంది. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా కార్య దీక్షతో కష్టపడి పనిచేస్తేనే లక్ష్యం చేరుకుంటాం. వేటకు వెళ్లిన ఇద్దరు స్నేహితుల సంఘటనను ఇప్పుడు గుర్తుచేసుకుందాం... ఇద్దరు స్పానిష్ స్నేహితులు జింకలను వేటాడడానికి ఓ చిన్న వాహనంలో అడవికి బయలుదేరారు. అరణ్యంలోకి ప్రవేశించిన తర్వాత ఓ పక్కన తమ వాహనాన్ని నిలిపారు. మైదానాలు, లోయలు దాటుకుని ముందుకు నడిచారు. కొంత దూరం వెళ్లి, ఓ పొద చాటున నిల్చుని జింకల రాక కోసం ఎదురుచూస్తున్నారు. అటుగా వచ్చిన ఓ జింక వీరి కంటపడింది. వెంటనే తుపాకీతో దాన్ని కాల్చారు. నేలకొరిగిన జింకను తమ వాహనం వద్దకు తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. ఇద్దరు స్నేహితులు దాని తోకను పట్టుకుని వాహనం వైపునకు లాగుతూ తీసుకెళ్తున్నారు. జింక బరువుగా ఉండడం వల్ల వేగంగా కదలలేకపోతున్నారు. వారి కష్టాన్ని చూసిన ఓ రైతు కొమ్ములు పట్టుకుని లాగితే సులువుగా ఉంటుందని సలహా ఇచ్చాడు. ఇద్దరు స్నేహితులు ఒకరి ముఖం మరొకరు చూసుకుని రైతు సలహా పాటించాలని నిర్ణయించుకున్నారు. జింక మరోవైపునకు వెళ్లి కొమ్ములు పట్టుకుని లాగడం ప్రారంభించారు. ఇప్పుడు ముందుకంటే వేగంగా, సులభంగా జింక దేహాన్ని తీసుకెళ్లగలుగుతున్నారు. వారికి అంతకుముందు ఉన్న కష్టం కూడా లేదు. పది నిమిషాల తర్వాత ఇద్దరిలో ఒకతను మరొకరితో ‘రైతు సరైన విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు చాలా సులభంగా ఉంది’ అన్నాడు. అప్పుడు రెండో అతను స్పందిస్తూ ‘అవును, నువ్వన్నది నిజమే... కానీ మనం వాహనానికి దూరంగా వెళ్తున్నాం. అదొక్కటే సమస్య!’ అన్నాడు. పై కథ గురించి ఒక్కసారి ఆలోచించండి. కొమ్ములు పట్టుకుని లాగితే సులువని ఆ స్నేహితులు సంతోషించారు కానీ... తాము గమ్యానికి (వాహనానికి) దూరంగా వెళ్తున్నారని తెలుసుకోలేకపోయారు. మనం కూడా ప్రతి పనిలోనూ కొమ్ముల్లాంటి సులువైన మార్గాలనే అన్వేషిస్తాం. ఎంచుకున్న మార్గం సులువైనంత మాత్రాన సరిపోదు. అది సరైన దిశలో ఉందా? అనే విషయాన్ని గుర్తించాలి. మరో ముఖ్యమైన విషయం... ఒక పనిని పూర్తిచేస్తున్నప్పుడు సౌలభ్యంగా ఉన్న మార్గాలు ఎంచుకునే సందర్భంలో మన నిజమైన గమ్యం, లక్ష్యాలపై దృష్టిని మరలనీయొద్దు. విద్యార్థులు.. తమ ఇంటికి దగ్గర్లో ఇన్స్టిట్యూట్ ఉందనో లేదా కాలేజీ టైమింగ్స ఆశించిన విధంగా ఉన్నాయనే కారణంగా కళాశాలను, తమ కోర్సును ఎంచుకుంటున్నారు. తమ అభిరుచి, ఆకాంక్షలకు అనుగుణంగా ఉందా? అని చూడకుండానే నిర్ణయం తీసుకుంటున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థుల నేపథ్యంలో నాలుగేళ్ల క్రితం తెరకెక్కిన బాలీవుడ్ సినిమా త్రీ ఇడియట్స్.. విద్యార్థుల ప్రవర్తనలను చక్కగా వివరించింది. ఇంజనీరింగ్ చదవాలనే ఆశయంతో కాకుండా గొప్ప విద్యాసంస్థలో సీటు లభించిందని కోర్సులో చేరే వారి భవిష్యత్తుకూ ఈ సినిమా అద్ధం పట్టింది. మీ జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల గురించి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. జింక కొమ్ములు పట్టి లాగినట్లు లక్ష్యానికి దూరంగా వెళ్లే సందర్భాలనూ గమనించొచ్చు. నగరంలో వాహనాన్ని నడుపుతున్నట్లుగా మన జీవితంలోనూ సరైన దారులు వెంటనే దొరక్కపోవచ్చు. కానీ వెళ్లే దారి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. వెళ్లేదారిలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎగుడు దిగుడు రోడ్డుపై స్వారీ చేయాల్సి ఉంటుంది. అడ్డంకులూ, కష్టాలను అధిగమించాల్సి ఉంటుంది. అయితే గమ్యాన్ని చేరుకోవాలంటే అదొక్కటే మార్గం! మధ్యలో ఆకర్షణీయమైన కొత్త దారులు కన్పించవచ్చు, మీ మనసును మళ్లించేలా పురికొల్పొచ్చు. వాటికి లొంగకుండా నిర్దేశించుకున్న దారిలో పయనించాలి. లక్ష్యాలపై నుంచి దృష్టిని మరల్చొద్దు. ఎల్లప్పుడూ గమ్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకోవాలి. సులువైన దారిలో పయనించేందుకు సిద్ధపడేముందు ఏ దిశలో వెళ్తున్నారో గుర్తించడం ప్రధానం. -‘కెరీర్స్ 360’ సౌజన్యంతో -
చెరువుల చెలికాడు..
చదువు పూర్తవుతుండగానేగూగుల్లో ఉద్యోగం సంపాదించాడు.అంతే తొందరగా ఉద్యోగానికి స్వస్తి చెప్పాడు. పర్యావరణవేత్తగా జీవితాన్ని మార్చుకున్నాడు. పాడైపోతున్న చెరువులను పరిశుభ్రం చేయసాగాడు. రోలెక్స్ యంగ్ లారియేట్ అవార్డు సాధించాడు. భారతదేశం నుంచి ఎన్నికైన యంగ్ అచీవర్‌గా నిలిచాడు. చెన్నైకి చెందిన పాతికేళ్ల అరుణ్ కృష్ణమూర్తి ప్రస్థానంలోని మైలురాళ్లివి... ‘‘ఉద్యోగంలో కూరుకుపోవడం వల్ల నాకు ఖాళీ సమయం దొరకదు. ఆ కారణంగా నేను అనుకున్నవేవీ సాధించలేకపోతాను. అందుకే 2010లో గూగుల్‌లో ఉద్యోగానికి స్వస్తి పలికి, సంఘసేవలోకి అడుగుపెట్టాను’’ అంటాడు అరుణ్ కృష్ణమూర్తి. ఆ ప్రయాణం ఆయన మాటల్లోనే... బ్రిటిష్ జంతుశాస్త్రవేత్త డా. జేన్ గుడ్ ప్రారంభించిన ‘రూట్స్ అండ్ షూట్స్’లో పనిచేసిన అనుభవంతో 2011లో సొంతంగా ‘ఎన్విరాన్మెంటల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ (ఈఎఫ్ఐ) అని ఒక ఎన్జీవోను ప్రారంభించాను. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశాలలో ‘లేక్ బయోడైవర్సిటీ రెస్టొరేషన్ ప్రాజెక్ట్’ ఒకటి. 2008 లో హైదరాబాద్‌లోని గురునాథం చెరువును, 2009 లో చెన్నైలోని లక్ష్మీపుష్కరాన్ని పరిశుభ్రం చేశాం. ఇందుకుగాను రోలెక్స్ అవార్డ్ అందుకున్నప్పుడు భారతదేశానికి పేరు తీసుకువచ్చానన్న ఆనందం కలిగింది. నా డైరీ... నాలుగో క్లాసు చదువుతున్నప్పటి నుంచీ నాకు డైరీ రాసే అలవాటు ఉంది. నన్ను తీర్చిదిద్దిన గురువు డా. జేన్ గుడ్ ఆల్ భారతదేశానికి వచ్చినప్పుడు నన్ను ప్రశంసిస్తూ నాలుగు మాటలు రాయడానికి ఈ డైరీనే ఉపయోగపడింది. ఆయన స్ఫూర్తితోనే నేను ఇన్ని సాధించగలుగుతున్నాను. మా కార్యక్రమాలు... నాకు పర్యావరణం మీద మక్కువ ఎక్కువ. అలాగే వన్యప్రాణి సంరక్షణ మీదా శ్రద్ధ ఎక్కువ. ప్రతి ఒక్కరూ పర్యావరణం గురించి, అందులోని సమస్యల గురించి ఆలోచిస్తుంటారే కాని, నివారణచర్యల గురించి అస్సలు ఆలోచించరు. నేను మాతృభూమి పరిరక్షణకు పూనుకున్నాను. ఈఎఫ్ఐ సంస్థను ప్రారంభించాను. ఇందులో 900 మంది వలంటీర్లు ఉన్నారు. వీరిలో చాలామంది 20 ఏళ్ల వయసు లోపువారే. వారందరికీ నేనే స్వయంగా శిక్షణనిచ్చాను. వీరంతా... పాఠశాలలకు వెళ్లి మా కార్యక్రమాల గురించి వివరిస్తారు. మేమంతా కలిసి సరస్సుల ప్రక్షాళన చేస్తాం. మా జట్టు చేసిన ప్రక్షాళన... మేం చేసిన పనులలో బాగా గుర్తుంచుకోదగినది చెన్నైకి దక్షిణంగా ఉన్న కీళ్కట్టలై ప్రక్షాళన. దీని వెడల్పు 1.5 కి.మీ. ఈ సరస్సు నుంచి పల్లికరణికి నీటి సరఫరా అవుతుంది. ఒకప్పుడు ఆ చుట్టుపక్కల వారికి దాహాన్ని తీర్చిన ఆ సరస్సు పూర్తిగా కాలుష్యంతో నిండిపోయింది. అనేక పక్షులకు, తాబేళ్లకు ఆలవాలంగా ఉన్న ఈ సరస్సు, వాటికి అనువుగా లేకుండా పోయింది. దీనిని ఇలాగే వదిలేసి ఉంటే, మరో 20 ఏళ్ల తర్వాత ఈ సరస్సు గత చరిత్రగా మారిపోయేది. ఎలాగైనా సరే, దీనికి పూర్వ వైభవం తీసుకురావాలనే పట్టుదలతో, ఈ సరస్సును నాలుగు అంచెలలో శుభ్రపరిచాం. ముందుగా చుట్టుపక్కల ఉండేవారిని గుర్తించాం. సంవత్సరాలుగా సరస్సులో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేశాం. మలినాలను తొలగించి నీటిని స్వచ్ఛంగా మార్చాం. అంతకుముందు ఆ సరస్సులో ఉండే జీవజాతుల్ని మళ్లీ అందులో వేయడంతో మా లక్ష్యం నెరవేరింది. లక్ష్యం దిశగా... నా రోజువారీ ఖర్చుల కోసం ఒక కమ్యూనికేషన్ కంపెనీని నడుపుతున్నాను. నేను రోజుకి 14 - 16 గంటలు పనిచేస్తాను. 2010 నుంచి నా జీవితాన్ని ఇలాగే గడుపుతున్నాను. సంపాదిస్తున్నదానిలో సగం నేను స్థాపించిన సంస్థ లక్ష్యాలసాధన కోసం ఖర్చు చేస్తాను. నేను ఆలోచించేది, చేసేది కూడా ఈఎఫ్ఐ కోసమే. మా ప్రాజెక్ట్ ద్వారా మార్పు సాధ్యమని నిరూపించాలనుకుంటున్నాం. మంచి ఆశయ సాధనకు అందరి సహాయసహకారాలు అందుతాయని నమ్ముతున్నాం. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న అరుణ్ కృష్ణమూర్తి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు. కానీ, తగినన్ని నిధులు లేకపోవడం వల్ల ఆ ఆలోచనలు కార్యరూపం దాల్చలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో అతడికి మరింతమంది చేయూతనిస్తే కాలుష్య రహిత భారతదేశాన్ని తయారుచేయగలడనడంలో ఎటువంటి సందేహమూ లేదు. - డా. వైజయంతి ప్రక్షాళన చేశాక ఆ సరస్సు మళ్లీ కలుషితం కాకుండా ఉండాలంటే, ఆ సరస్సు చుట్టుపక్కల ఉండేవారిని లేక్ గార్డియన్లుగా నియమిస్తే మంచిదనుకున్నాం. అలా చేయడం వలన సరస్సు పరిరక్షణ సక్రమంగా సాగుతుంది. కనుక సరస్సుకు చేరువగా నివసించేవారిని ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికే 600 కుటుంబాల వారు ఇందులో చేరారు. ముందు ముందు మరింతమంది వచ్చిచేరతారని భావిస్తున్నాం.