తల్లి నుంచి స్ఫూర్తి పోందే పిల్లలే కాదు పిల్లల నుంచి స్ఫూర్తి పోందే తల్లులు కూడా ఉంటారని చెప్పడానికి బలమైన ఉదాహరణ... సలీమా ఇంతియాజ్. కూతురి క్రీడానైపుణ్యాన్ని చూసి... ‘ఆడితే ఇలా ఆడాలి’ అనుకునేది. ఆటలో కూతురి కష్టాన్ని చూసి ‘కష్టపడితే ఇలా పడాలి’ అనుకునేది. క్రికెట్‌లో కూతురు పాకిస్థాన్ తరపున ప్రాతినిధ్యంవహించినప్పుడు... అంతర్జాతీయ స్థాయిలో తాను కూడా ప్రాతినిధ్యం వహించాలని కలలు కన్నది. నమ్మకమైన, గౌరవప్రదమైన అంపైర్‌గా పేరు తెచ్చుకున్న సలీమా ఇంతియాజ్ ‘ఐసీసీ ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆఫ్ డెవలప్‌మెంట్ అంపైర్స్’ కు నామినేట్ అయిన తొలి పాకిస్తానీ మహిళగా చరిత్ర సృష్టించింది.
సలీమా కెరీర్‌కు సంబంధించి 2022 కీలక సంవత్సరం. బంగ్లాదేశ్‌లో జరిగిన మహిళల ఆసియా కప్ కోసం మహిళా అంపైర్ల ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) నిర్ణయించింది. బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సలీమా అరంగేట్రం చేసింది. ఈ మ్యాచ్‌తో తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించింది.
2008లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్( పీసీబీ) మహిళా అంపైర్ల ప్యానెల్లో చేరిన సలీమా, కుమార్తె కైనత్ ఇంతియాజ్ తనకు స్ఫూర్తి అంటుంది. పాకిస్థాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన కైనత్ కామెంటేటర్‌గా కూడా పని చేసింది.‘చిన్నప్పుడు క్రికెట్ బాగా ఆడేదాన్ని. క్రికెట్‌లో పాకిస్థాన్‌కుప్రాతినిధ్యం వహించాలనేది నా కల. నా కూతురు కైనత్ వల్ల నా కల నెరవేరింది. ఆమె నా కూతురు మాత్రమే కాదు. నా స్నేహితురాలు. ఆమె నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఎంతో స్ఫూర్తి పోందాను’ అని కైనత్ గురించి మురిపెంగా చెబుతుంది సలీమా. 2010లో క్రికెట్‌లో అరంగేట్రం చేసింది కైనత్.‘అమ్మను చూస్తే గర్వంగా అనిపిస్తుంది.
క్రికెట్ గ్రౌండ్‌లో కనిపించాలనేది అమ్మ కల. అంపైరింగ్ ద్వారా తన కలను నెరవేర్చుకుంది. క్రికెట్ పట్ల ఆమె అభిరుచి, అంకితభావం అంటే నాకు ఇష్టం. ఈ విషయంలో నేను అమ్మలా ఉండాలనుకుంటున్నాను’ అంటుంది కైనత్. సలీమా, ఆమె భర్త స్పోర్ట్స్ ఇన్‌స్ట్రక్టర్‌లు కావడంతో ఇంట్లో ఎప్పుడూ క్రికెట్ గురించి చర్చలు జరిగేవి.స్థానిక క్రికెట్ టోర్నమెంట్‌లలో తల్లి అంపైర్‌గా వ్యవహరించిన మ్యాచ్‌లలో కైనత్ ఆడింది.‘అంపైర్ అంటే ఇలా ఉండాలి’ అని ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రశంసలను ఎన్నోసార్లు విన్నది.తాజా రికార్డ్ నేపథ్యంలో... ‘ఇది నా విజయం మాత్రమే కాదు.
పాకిస్థాన్‌లోని ప్రతి ఔత్సాహిక మహిళా క్రికెటర్, అంపైర్‌ల విజయం. నా విజయం క్రికెట్‌లో తమదైన ముద్ర వేయాలని కలలు కనే అసంఖ్యాక మహిళలకు స్ఫూర్తి ఇస్తుందని ఆశిస్తున్నాను. నా ప్రయాణంలో కష్టాలు ఉన్నాయి. వ్యక్తిగత త్యాగాలు ఉన్నాయి. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అవి ఎంతో విలువైనవి అనిపిస్తాయి’ అంటుంది సలీమ.‘తన రికార్డ్‌తో ఎన్నో అడ్డంకులను ఛేదించడమే కాకుండా తర్వాతి తరం మహిళా క్రికెట్ ప్రోఫెషనల్స్‌కు ఆమె స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తుంది’ అని సలీమా ఇంతియాజ్‌ను ప్రశంసించింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్.
Comments
Please login to add a commentAdd a comment