ఆసియా కప్‌లో భారత్ శుభారంభం
7 వికెట్లతో పాకిస్తాన్‌పై ఘన విజయం
రాణించిన బౌలర్లు, స్మృతి, షఫాలీ
ఆదివారం యూఏఈతో మ్యాచ్
దంబుల్లా: డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆసియా కప్ టి20 క్రికెట్ టోరీ్నలో శుభారంభం చేసింది. పాకిస్తాన్‌పై తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ మరో విజయాన్ని అందుకుంది. శుక్రవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి పోరులో భారత్ 7 వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 19.2 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. సిద్రా అమీన్ (35 బంతుల్లో 25; 3 ఫోర్లు) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టగా... రేణుక, శ్రేయాంక పాటిల్, పూజ వస్త్రకర్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 14.1 ఓవర్లలో 3 వికెట్లకు 109 పరుగులు చేసింది. స్మృతి మంధాన (31 బంతుల్లో 45; 9 ఫోర్లు), షఫాలీ వర్మ (29 బంతుల్లో 40; 6 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 57 బంతుల్లోనే 85 పరుగులు జోడించారు.
టపటపా...
భారత మహిళల పదునైన బౌలింగ్ ముందు పాక్ ఏమాత్రం నిలవలేకపోయింది. పూజ తన తొలి రెండు ఓవర్లలో 2 వికెట్లు తీసి ప్రత్యరి్థని నిలువరించగా, పవర్‌ప్లే ముగిసేసరికి పాక్ 37 పరుగులు చేసింది. కెప్టెన్ నిదా దార్ (8) ప్రభావం చూపలేకపోగా, రేణుక వరుస బంతుల్లో రెండు వికెట్లతో పాక్‌ను దెబ్బ కొట్టింది. ఈ దశలో తుబా, ఫాతిమా పోరాడి 25 బంతుల్లో 35 పరుగులు జత చేశారు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో 3 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్...రాధ ఓవర్లో ఫాతిమా రెండు సిక్స్‌లు బాదడంతో 100 పరుగులు దాటింది. 47 పరుగుల వ్యవధిలో పాక్ చివరి 6 వికెట్లు చేజార్చుకుంది.
ఒకే ఓవర్లో 21 పరుగులు...
ఛేదనలో భారత ఓపెనర్లు షఫాలీ, స్మృతి దూకుడుగా ఆడారు. వరుసగా మూడు ఓవర్లలో రెండేసి ఫోర్లు రాగా...తుబా ఓవర్లో స్మృతి రెండు ఫోర్లు, షఫాలీ ఒక సిక్స్ బాదారు. ఫలితంగా 6 ఓవర్లలోనే స్కోరు 57 పరుగులకు చేరింది. ఆ తర్వాత తుబా వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్లో స్మృతి చెలరేగింది. ఏకంగా ఐదు ఫోర్లు (4, 0, 4, 1 వైడ్, 4, 4, 4) బాదడంతో 21 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత 17 పరుగుల వ్యవధిలో స్మృతి, షఫాలీతో పాటు హేమలత (14) కూడా వెనుదిరిగినా...హర్మన్ (5 నాటౌట్), జెమీమా (3 నాటౌట్) కలిసి లాంఛనం పూర్తి చేశారు. గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో నేపాల్ ఆరు వికెట్ల తేడాతో యూఏఈ జట్టుపై విజయం సాధించింది.
స్కోరు వివరాలు
పాకిస్తాన్ ఇన్నింగ్స్: ఫేరోజా (సి) హర్మన్ (బి) పూజ 5; మునీబా (సి) రోడ్రిగ్స్ (బి) పూజ 11; సిద్రా (సి) రాధ (బి) రేణుక 25; ఆలియా (సి) రోడ్రిగ్స్ (బి) శ్రేయాంక 6; నిదా (సి) హేమలత (బి) దీప్తి 8; తుబా (సి) రాధ (బి) దీప్తి 22; ఇరమ్ (ఎల్బీ) (బి) రేణుక 0; ఫాతిమా (నాటౌట్) 22; అరూబ్ (రనౌట్) 2; నష్రా (సి) రిచా (బి) దీప్తి 0; సాదియా (బి) శ్రేయాంక 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.2 ఓవర్లలో ఆలౌట్) 108. వికెట్ల పతనం: 1–9, 2–26, 3–41, 4–59, 5–61, 6–61, 7–92, 8–94, 9–94, 10–108. బౌలింగ్: రేణుక 4–0–14–2, పూజ 4–0–31–2, దీప్తి శర్మ 4–0–20–3, రాధ 4–0–26–0, శ్రేయాంక పాటిల్ 3.2–0–14–2. భారత్ ఇన్నింగ్స్: షఫాలీ (బి) అరూబ్ 40; స్మృతి (సి) ఆలియా (బి) అరూబ్ 45; హేమలత (సి) తుబా (బి) నష్రా 14; హర్మన్ (నాటౌట్) 5; జెమీమా (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (14.1 ఓవర్లలో 3 వికెట్లకు) 109. వికెట్ల పతనం: 1–85, 2–100, 3–102. బౌలింగ్: సాదియా 2.1–0–18–0, ఫాతిమా 2–0–15–0, నిదా 1–0–10–0, తుబా 2–0–36–0, నష్రా 4–0–20–1, అరూబ్ 3–0–9–2.
Comments
Please login to add a commentAdd a comment