
ఐదోసారి ఆసియా కప్ టైటిల్ నెగ్గిన టీమిండియా
ఫైనల్లో పాకిస్తాన్‌పై 5–3తో విజయం
మస్కట్: ఒకే విజయంతో యువ భారత జట్టు రెండు లక్ష్యాలను సాధించింది. పురుషుల అండర్–21 ఆసియా కప్ హాకీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత జట్టు టోర్నీని అజేయంగా ముగించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుతో బుధవారం జరిగిన ఫైనల్లో శర్దానంద్ తివారి సారథ్యంలోని టీమిండియా 5–3 గోల్స్ తేడాతో గెలుపొందింది. తద్వారా ఈ టోర్నీ టైటిల్‌ను ఐదోసారి సొంతం చేసుకుంది.
గతంలో భారత జట్టు 2004, 2008, 2015, 2023లలో ఈ టైటిల్‌ను సాధించింది. తాజా విజయంతో భారత జట్టు వచ్చే ఏడాది జరిగే జూనియర్ ప్రపంచకప్ టోర్నీకి కూడా అర్హత సాధించింది. ఇదే టోర్నీలో గతంలో రెండుసార్లు ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించిన భారత జట్టు మూడోసారీ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. భారత్ తరఫున అరిజిత్ సింగ్ హుండల్ ఏకంగా నాలుగు గోల్స్ (4వ, 18వ, 47వ, 54వ నిమిషాల్లో) సాధించగా... దిల్‌రాజ్ సింగ్ (19వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు.
పాకిస్తాన్ జట్టు తరఫున సూఫియాన్ ఖాన్ (30వ, 39వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... హన్నాన్ షాహిద్ (3వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో జపాన్ 2–1తో మలేసియాను ఓడించింది. పాకిస్తాన్, జపాన్, మలేసియా జట్లు కూడా వచ్చే ఏడాది జరిగే జూనియర్ ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందాయి.
పాక్‌తో జరిగిన తుది పోరులో భారత జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. మూడో నిమిషంలో హన్నాన్ చేసిన గోల్‌తో పాకిస్తాన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే వెంటనే తేరుకున్న భారత జట్టు మరుసటి నిమిషంలోనే గోల్ చేసి స్కోరును 1–1తో సమం చేసింది. 14 నిమిషాల తర్వాత భారత్ రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి 3–1తో ఆధిక్యంలోకి వెళ్లింది.
అనంతరం పాక్ పోరాడి మూడో క్వార్టర్ ముగిసేసరికి మరో రెండు గోల్స్ చేసి భారత ఆధిక్యాన్ని 3–4కి తగ్గించింది. చివరి క్వార్టర్‌లో భారత్ జోరు కొనసాగించి ఏడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి 5–3తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న టీమిండియా ఆసియా కప్ టైటిల్‌ను హస్తగతం చేసుకుంది.

మ్యాచ్ మొత్తంలో భారత జట్టుకు ఆరు పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. ఇందులో టీమిండియా నాలుగింటిని సది్వనియోగం చేసుకొని, రెండింటిని వృథా చేసింది. మరోవైపు పాక్ జట్టు సంపాదించిన రెండు పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలిచింది.
Comments
Please login to add a commentAdd a comment