India Won ACC Men's Emerging Teams Asia Cup 2013 Under Surya Kumar Yadav Captaincy - Sakshi
Sakshi News home page

ఆసియా కప్‌ ఫైనల్లో భారత్‌, పాక్‌.. నాడు సూర్యకుమార్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌..!

Published Sat, Jul 22 2023 6:43 PM | Last Updated on Sat, Jul 22 2023 6:51 PM

India Won ACC Men's Emerging Teams Asia Cup 2013 Under Surya Kumar Yadav Captaincy - Sakshi

కొలొంబో వేదికగా రేపు (జులై 23) జరుగబోయే 2023 ఏసీసీ మెన్స్‌ ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌ ఫైనల్లో భారత్‌-ఏ, పాకిస్తాన్‌-ఏ జట్లు తలపడనున్న​ విషయం తెలిసిందే. జులై 21న జరిగిన సెమీఫైనల్లో భారత్‌.. బంగ్లాదేశ్‌ను, పాకిస్తాన్‌.. శ్రీలంకను ఓడించి ఫైనల్‌కు చేరాయి. ఫైనల్‌ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. 

కాగా, ఇదే ఏసీసీ మెన్స్‌ ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌ టోర్నీలో భారత్‌-పాక్‌లు గతంలో కూడా ఓసారి ఫైనల్లో తలపడ్డాయి. సరిగ్గా 10 ఏళ్ల క్రితం​, 2013లో సింగపూర్‌ వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో భారత అండర్‌-23 జట్టును.. పాక్‌ అండర్‌-23 టీమ్‌ ఢీకొట్టింది. నాటి సమరంలో భారత్‌.. పాక్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి,  ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది.

నాడు పాక్‌ను మట్టికరిపించిన భారత జట్టుకు ప్రస్తుత టీమిండియా సభ్యుడు సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యం వహించగా.. ప్రస్తుత భారత ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ నాటి ఫైనల్లో అజేయమైన 93 పరుగులు చేసి, పాక్‌ను ఓడించడంలో ప్రధానపాత్ర పోషించాడు. సూర్య, కేఎల్‌ రాహుల్‌తో పాటు నాటి యంగ్‌ ఇండియాలో ప్రస్తుత భారత జట్టు సభ్యుడు అక్షర్‌ పటేల్‌, ప్రస్తుత యూఎస్‌ఏ ఆటగాడు స్మిత్‌ పటేల్‌ ఉన్నారు. అలాగే నాటి పాక్‌ జట్టులో ప్రస్తుత పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌, వికెట్‌కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ ఉన్నారు. 

నాటి మ్యాచ్‌ విషయానికొస్తే.. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌.. 47 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. బాబర్‌ ఆజమ్‌ (7) విఫలం కాగా.. మహ్మద్‌ రిజ్వాన్‌ (21), ఉమర్‌ వహీద్‌ (41), 10, 11వ నంబర్‌ ఆటగాళ్లు ఉస్మాన్‌ ఖాదిర్‌ (33), ఎహసాన్‌ ఆదిల్‌ (20 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో బాబా అపరాజిత్‌ 3, సందీప్‌ శర్మ, కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ చెరో 2 వికెట్లు, సందీప్‌ వారియర్‌, అంకిత్‌ బావ్నే తలో వికెట్‌ పడగొట్టారు.

160 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌.. కేఎల్‌ రాహుల్‌ (107 బంతుల్లో 93 నాటౌట్‌; 11 ఫోర్లు, సిక్స్‌), మన్ప్రీత్‌ జునేజా (51 నాటౌట్‌) రాణించడంతో 33.4 ఓవర్లలో కేవలం వికెట్‌ మాత్రమే కోల్పోయి సునాయాసంగా విజయం సాధించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement