భారత్‌ మొదలుపెట్టింది, అప్పటి నుంచి మాకు ఈ గతి పట్టింది: పాక్‌ మాజీ కెప్టెన్‌ | Ramiz Raja Comments On India After Pakistan Lost To Bangladesh In First Test Match | Sakshi
Sakshi News home page

భారత్‌ మొదలుపెట్టింది, అప్పటి నుంచి మాకు ఈ గతి పట్టింది: పాక్‌ మాజీ కెప్టెన్‌

Published Mon, Aug 26 2024 12:05 PM | Last Updated on Mon, Aug 26 2024 12:56 PM

Ramiz Raja Comments On India After Pakistan Lost To Bangladesh In First Test Match

సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 10 వికెట్ల తేడాతో ఘెర పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో పాక్‌ దారుణంగా విఫలమై 146 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ (448/6) చేసిన పాక్‌.. ఓవరాక్షన్‌ చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి తగిన మూల్యం చెల్లించుకుంది. 

పైగా ఈ మ్యాచ్‌లో పాక్‌ ఒ‍క్క స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌  కూడా లేకుండా బరిలోకి దిగింది. పిచ్‌ను అంచనా వేయడంలో దారుణంగా విఫలమైన పాక్‌ మేనేజ్‌మెంట్‌ ఏకంగా నలుగురు స్పెషలిస్ట్‌ పేసర్లను బరిలోకి దించి చేతులు కాల్చుకుంది. పై పేర్కొన్న  కారణాలన్నింటినీ తమకు అనుకూలంగా మార్చుకున్న బంగ్లాదేశ్‌ పాక్‌ను వారి సొంతగడ్డపై చావుదెబ్బకొట్టింది. టెస్ట్‌ల్లో పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్‌కు ఇది తొలి విజయం. పాక్‌ను వారి సొంతగడ్డపై 10 వికెట్ల తేడాతో ఓడించిన తొలి జట్టు బంగ్లాదేశే కావడం మరో విశేషం.

బంగ్లా చేతిలో ఘోర పరాజయం నేపథ్యంలో ఆ దేశ మాజీలు పాక్‌ జట్టును తూర్పారబెడుతున్నారు. షాహిద్‌ అఫ్రిది, రమీజ్‌ రజా.. ఇలా ప్రతి ఒక్కరు పాక్‌ జట్టుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. చాలామంది పాక్‌ వ్యూహాలను తప్పుబడుతున్నారు. రమీజ్‌ రజా లాంటి వారైతే పాక్‌ జట్టు ఎంపికనే ఘోర తప్పిదమని మండిపడుతున్నాడు. 

రావల్పిండి లాంటి స్పిన్‌ ఫ్రెండ్లీ పిచ్‌పై నలుగురు ఫాస్ట్‌ బౌలర్లను ఎంపిక చేయడంలో అంతర్యమేమిటని ప్రశ్నించాడు. జట్టులో ఒక్క స్పిన్నర్‌ను కూడా ఎంపిక చేయనప్పుడే పాక్‌ ఓడిందని అన్నాడు. పాక్‌ కోల్పోయిన 16 వికెట్లలో బంగ్లా స్పిన్నర్లు తొమ్మిదింటిని పడగొట్టారని గుర్తు చేశాడు.

పాక్‌ దారుణ ఓటమి అంశాన్ని రమీజ్‌ రజా టీమిండియాతో ముడిపెట్టాడు. భారత్‌ వల్లే సుదీర్ఘ ఖ్యాతి కలిగిన పాక్‌ పేస్‌ బౌలింగ్‌ అటాక్‌ లయ తప్పిందని అన్నాడు. గతేడాది ఆసియా కప్‌లో టీమిండియా బ్యాటర్లు పాక్‌ బౌలర్లపై పైచేయి సాధించారు. అప్పటి నుంచి ఆ జట్టు పేస్‌ బౌలింగ్‌ విభాగం​ సర్వ సాధారణంగా మారిపోయిందని అన్నాడు. 

అప్పడే పాక్‌ పేస్‌ బౌలింగ్‌ పతనం ప్రారంభమైందని తెలిపాడు. నాటి నుంచి పాక్‌ పేసర్ల రహస్యాలు బహిర్గతమై మిగతా బ్యాటర్లు సులువుగా ఎదుర్కొంటున్నారని అన్నాడు. పాక్‌ ఓటమికి రమీజ్‌ టీమిండియాను కారణంగా చూపించడంపై భారత క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. మరికొందరేమో భారత్‌ దెబ్బ పడితే ఇలాగే ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.

కాగా, బంగ్లాతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన బంగ్లాదేశ్‌ 565 పరుగులు చేసి ఆలౌటైంది.

సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్లు చెలరేగడంతో పాక్‌ 146 పరుగులకే ఆలౌటైంది. 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌.. వికెట్‌ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో బంగ్లాదేశ్‌ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్‌ ఆగస్ట్‌ 30న ఇదే వేదికగా జరుగనుంది.

స్కోర్‌ వివరాలు..

పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌ 448/6 (సౌద్‌ షకీల్‌ 141, మొహమ్మద్‌ రిజ్వాన్‌ 171 నాటౌట్‌, హసన్‌ మహమూద్‌ 2/70)

బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ 565 (ముష్ఫికర్‌ అహ్మద్‌ 191, షడ్మాన్‌ ఇస్లాం 93, నసీం షా 3/93)

పాకిస్తాన్‌ రెండో ఇన్నింగ్స్‌ 146 (మొహమ్మద్‌ రిజ్వాన్‌ 51, మెహిది హసన్‌ 4/21)

బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌ 30/0 (జకీర్‌ హసన్‌ 15 నాటౌట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement