83 బంతుల్లో అజేయంగా 108 పరుగులు, 80 బంతుల్లో 140 నాటౌట్, 47 బంతుల్లో అజేయంగా 80 పరుగులు, 31 బంతుల్లో 55, 28 బంతుల్లో 44, 139 బంతుల్లో 195 నాటౌట్, 46 బంతుల్లో 73.. ఇటీవల కీలక మ్యాచ్‌లలో చమరి అటపట్టు సాధించిన స్కోర్లు ఇవి. న్యూజీలండ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా లాంటి పటిష్ఠ జట్లపై శ్రీలంక సాధించిన అరుదైన, చారిత్రక విజయాలన్నిట్లో అటపట్టుదే కీలక పాత్ర. లంక జట్టుకు వెన్నుదన్నుగానే కాదు సంచలన బ్యాటింగ్‌తో రికార్డు స్కోర్లు సాధిస్తూ వరల్డ్ నంబర్‌వన్‌గానూ కొనసాగుతోంది. ఈ ఆటకు ఆమె నాయకత్వ ప్రతిభా తోడై శ్రీలంకకు మహిళా ఆసియా కప్ టోర్నీని అందించింది. ఇందులో అప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడని, ఏడుసార్లు విజేతైన భారత్‌కు ఫైనల్లో షాక్ ఇస్తూ లంక టైటిల్‌ను అందుకుంది. ఈ టోర్నీలో చమరి ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు సహా 304 పరుగులు అదీ 147 స్ట్రైక్ రేట్‌తో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది.
ప్రతి క్రీడలో ఆ దేశపు జాతీయ పతాకాన్ని అగ్రభాగాన నిలిపేందుకు ఒక ప్లేయర్ అవసరమవుతారు. విజయాలు, పరాజయాలతో సంబంధం లేకుండా సదరు క్రీడపై అందరి దృష్టి పడేలా చేయడం, ఆపై తన వ్యక్తిగత ఆటతో జట్టు స్థాయిని కూడా పెంచడం ఆ ‘ట్రయల్ బ్లేజర్’కే సాధ్యం. శ్రీలంక క్రికెట్‌కు సంబంధించి చమరి అటపట్టు పాత్ర కూడా సరిగ్గా అలాంటిదే. అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో శ్రీలంక జట్టువి అరకొర విజయాలే తప్ప అసాధారణ ప్రదర్శన కాదు. కానీ చమరి తన ఆటతో ఇతర జట్ల దృష్టి తమ టీమ్‌పై పడేలా చేసింది. తన19వ ఏట, 2009 టి20 వరల్డ్ కప్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. 2011 వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 67 బంతుల్లోనే 60 పరుగులు సాధించడంతో వెలుగులోకి వచ్చింది. తర్వాతి ఏడాదే శ్రీలంక అత్యుత్తమ మహిళా క్రికెటర్ అవార్డు గెలుచుకోవడంతో చమరి శకం మొదలైంది.
రికార్డులే రికార్డులు..
వన్డే క్రికెట్‌లోకి చమరి అడుగుపెట్టిన ఏడాదిలోనే ఐర్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 111 పరుగులతో చెలరేగింది. ఫలితంగా శ్రీలంక తరఫున వన్డేల్లో సెంచరీ సాధించిన తొలి మహిళగా గుర్తింపు పొందింది. విశేషం ఏమిటంటే ఇప్పటి వరకు వన్డేల్లో ఆమె మొత్తం తొమ్మిది శతకాలు బాదగా.. మరే శ్రీలంక ప్లేయర్ ఒక్క సెంచరీ కూడా చేయలేకపోవడం! అంతర్జాతీయ టి20ల్లో కూడా మూడు సెంచరీలతో ఆమె ఏకైక స్టార్‌గా నిలిచింది. 2017 వన్డే వరల్డ్ కప్‌లో నంబర్‌వన్ టీమ్ ఆస్ట్రేలియాపై ఆమె ఆడిన 178 పరుగుల ఇన్నింగ్స్ మహిళల వన్డే చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఒకటిగా మిగిలింది.
34 ఏళ్ల 88 రోజుల వయసులో స్కాట్లండ్‌పై శతకం బాదిన చమరి.. అతి పెద్ద వయసులో ఈ ఘనత సాధించిన మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీలంక క్రికెట్‌కు సంబంధించి అన్ని వన్డే, టి20 బ్యాటింగ్ రికార్డులు చమరి పేరిటే ఉన్నాయి. నాయకత్వ లక్షణాలూ పుష్కలంగా ఉన్న చమరి మూడు టి20 వరల్డ్ కప్(2018, 2020, 2023)లలో శ్రీలంక టీమ్ సారథిగా వ్యవహరించింది. ఆమె కెప్టెన్సీలోనే దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లపై టి20ల్లో, న్యూజీలండ్‌పై వన్డేల్లో తొలిసారి శ్రీలంక సిరీస్‌ను గెలుపొందింది. అయితే కెప్టెన్‌గా ఆమె కెరీర్‌లో అత్యుత్తమ విజయం ఇటీవల ఆసియా కప్‌ను అందుకోవడమే. అసలు భారత జట్టును ఎదురునిలవడమే అసాధ్యం, భారత్ మినహా ఇతర బలహీన టీమ్‌లతో టోర్నీని నిర్వహించడమే అనవసరం అనే విమర్శల నేపథ్యంలో.. చమరి తన టీమ్‌ను ఆసియా విజేతగా నిలపడంతో ఆమె కెరీర్ శిఖరానికి చేరింది.
ఫ్రాంచైజీ క్రికెట్‌లో..
వరల్డ్ క్రికెట్‌లో దూకుడైన బ్యాటర్‌గా, భారీ హిట్టర్‌గా చమరికి వచ్చిన గుర్తింపు ఫ్రాంచైజీ క్రికెట్‌లో వరుస అవకాశాలనిచ్చింది. లంక తరఫున ఫ్రాంచైజీ క్రికెట్ ఆడిన తొలి మహిళా క్రికెటర్ ఆమె. ప్రతిజట్టూ తమ టీమ్‌లో ఆమెను ఎంచుకునేందుకు ఆసక్తి చూపించింది. ఆస్ట్రేలియాలోని పెర్త్ స్కార్చర్స్, సిడ్నీ థండర్, మెల్‌బోర్న్ రెనగెడ్స్ జట్ల తరఫున, ఇంగ్లండ్ టీమ్‌లు ఓవల్ ఇన్‌విన్సిబుల్స్, యార్క్‌షైర్ డైమండ్స్, దక్షిణాఫ్రికా నార్తర్న్ డిస్ట్రిక్ట్స్, వెస్టిండీస్ జట్టు గయానా అమెజాన్ వారియర్స్‌తో పాటు బీసీసీఐ నిర్వహించిన లీగ్ టోర్నీల్లో సూపర్ నోవాస్, యూపీ వారియర్స్‌కి చమరి ప్రాతినిధ్యం వహించింది.
2023–24 ఆస్ట్రేలియా క్రికెట్ విమెన్ బిగ్‌బాష్ లీగ్‌లో 130 స్ట్రైక్‌రేట్‌తో 511 పరుగులు సాధించి ఆమె ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచింది. బిగ్‌బాష్ లీగ్‌లో అటపట్టు ప్రభావం ఎంతగా ఉందంటే లీగ్‌లో ‘చమరి బే’ పేరుతో ప్రత్యేక సీటింగ్ జోన్ ఏర్పాటు చేసేంతగా! ఆమె కెరీర్‌లో మరో అత్యుత్తమ క్షణమూ ఇటీవలే వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో దక్షిణాఫ్రికాతో వారి సొంతగడ్డ పోష్‌స్ట్రూమ్‌లో జరిగిన వన్డేలో చమరి 139 బంతుల్లో 26 ఫోర్లు, 5 సిక్సర్లతో 195 పరుగులు తీసి అజేయంగా నిలిచి, తన అత్యధిక స్కోరును నమోదు చేసింది. ఆమె బ్యాటింగ్‌తో శ్రీలంక.. మహిళల వన్డేల్లో అత్యధిక పరుగులు (302) ఛేదించిన జట్టుగా రికార్డుకెక్కింది. ప్రస్తుతం 34 ఏళ్ల వయసులోనూ సూపర్ ఫామ్‌తో చెలరేగిపోతున్న చమరి అటపట్టు రాబోయే కొన్నేళ్లలో మరిన్ని ఘనతలు అందుకోవడం, రికార్డులు సృష్టించడం ఖాయం. – మొహమ్మద్ అబ్దుల్ హాది
Comments
Please login to add a commentAdd a comment