అలుపెరుగని షటిల్‌... అశ్విని! | Ashwini Ponnappa Life And Success Story At Indian Badminton Academy | Sakshi
Sakshi News home page

అలుపెరుగని షటిల్‌... అశ్విని!

Published Sun, Jun 30 2024 12:41 AM | Last Updated on Sun, Jun 30 2024 12:41 AM

Ashwini Ponnappa Life And Success Story At Indian Badminton Academy

హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ.. భవిష్యత్తులో అత్యుత్తమ ఆటగాళ్లుగా ఎదిగే లక్ష్యంతో ఎంతోమంది వర్ధమాన షట్లర్లు అక్కడ సాధన చేస్తున్నారు.. అదే అకాడమీలోని ఒక కోర్టులో 35 ఏళ్ల యంగ్‌ అమ్మాయి కూడా ప్రాక్టీస్‌ను కొనసాగిస్తోంది.

ఏదో ఫిట్‌నెస్‌ కోసం ఆడుకోవడమో  లేక చిన్న చిన్న చాలెంజర్‌ టోర్నీల కోసమో ఆమె శ్రమించడం లేదు. మరికొద్ది రోజుల్లో జరగబోయే ప్రతిష్ఠాత్మక పారిస్‌ ఒలింపిక్స్‌ కోసం ఆమె సన్నద్ధమవుతోంది. డబుల్స్‌ విభాగంలో ఆమె వరుసగా మూడో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించబోతోంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆమె పతకం గెలుచుకొని కూడా పుష్కరకాలం దాటింది. అటువైపు భాగస్వాములూ మారారు. కానీ తాను మాత్రం ఇంకా బ్యాడ్మింటన్‌ కోర్టుపై తన సత్తాను ప్రదర్శిస్తూనే ఉంది.

ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ ప్లేయర్‌లో అదే పట్టుదల, అదే పోరాటతత్వం కనిపిస్తోంది. వరల్డ్, ఆసియా, కామన్వెల్త్‌ క్రీడల పతకాలు ఇప్పటికే తన ఖాతాలో ఉన్నా, మిగిలిన ఆ ఒక్క ఒలింపిక్‌ పతకాన్ని కూడా ఒడిసిపట్టుకోవాలనే లక్ష్యంతో సుదీర్ఘ సమయం పాటు సాధన కొనసాగిస్తోంది. ఆ ప్లేయర్‌ పేరే అశ్విని పొన్నప్ప.

భారత బ్యాడ్మింటన్‌ మహిళల డబుల్స్‌లో ఆమెకంటూ ఒక ప్రత్యేక అధ్యాయం ఉంది. పెద్ద సంఖ్యలో పతకాలు, ట్రోఫీలు ఆమె ఖాతాలో ఉన్నాయి.  గత రికార్డులు, ఘనతలే కాదు.. ఈ వయసులోనూ ఇంకా ఏదైనా సాధించాలనే తపన, కసి అశ్వినిని ఇంకా ఆడేలా ప్రోత్సహిస్తున్నాయి.

అశ్విని పొన్నప్ప స్వస్థలం బెంగళూరే అయినా ఆమె కెరీర్‌ ఆసాంతం హైదరాబాద్‌తోనే ముడిపడి ఉంది. జూనియర్‌ స్థాయిలో విజయాల తర్వాత హైదరాబాద్‌ కేంద్రంగానే శిక్షణ కొనసాగించిన ఆమె ఆపై అగ్రశ్రేణి షట్లర్‌గా ఎదిగింది. ఆమె తండ్రి ఎంఏ పొన్నప్ప హాకీలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు యూరోపియన్‌ లీగ్‌లలో కూడా ఆడాడు. అయితే అశ్వినికి బ్యాడ్మింటన్‌పై ఆసక్తి ఏర్పడటానికి మాత్రం తల్లే కారణం.

2010, కామన్వెల్త్‌ గేమ్స్‌ విమెన్‌ డబుల్స్‌ స్వర్ణంతో.., 2018, కామన్వెల్త్‌  గేమ్స్‌ విమెన్‌ డబుల్స్‌ కాంస్య పతకంతో..

అసలు ఆటలంటే ఏమీ తెలియని రెండున్నరేళ్ల వయసులోనే తల్లి తనకు బ్యాడ్మింటన్‌ను పరిచయం చేసిందని అశ్విని చెప్పుకుంది. ఆ తర్వాత ఎనిమిదేళ్ల వయసులో పూర్తిస్థాయిలో ప్రొఫెషనల్‌ ప్లేయర్‌గా మార్చాలనే లక్ష్యంతో ఆమెను వారు కోచింగ్‌లో నేర్పించారు. బేసిక్స్‌ తర్వాత వివిధ వయో విభాగాల్లో విజయాలు సాధిస్తూ అశ్విని ఒక్కో మెట్టే ఎక్కుతూ వచ్చింది. 2001లో తొలిసారి జాతీయ సబ్‌ జూనియర్‌ టైటిల్‌ గెలుచుకున్న ఆమె, మూడేళ్ల తర్వాత సబ్‌ జూనియర్‌లో సింగిల్స్, డబుల్స్‌ రెండింటిలోనూ విజేతగా నిలిచింది. ఆపై వరుసగా రెండేళ్ల జాతీయ జూనియర్‌ చాంపియన్‌షిప్‌ను కూడా గెలుచుకుంది.

అందరిలాగే అశ్విని కూడా ముందుగా సింగిల్స్‌పైనే దృష్టి పెట్టింది. జాతీయ స్థాయిలో ఫలితాలు సాధించిన తర్వాత 2008లో బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలో ఆమె రన్నరప్‌గా నిలిచింది. అయితే దురదృష్టవశాత్తు గాయాలు, ఫిట్‌నెస్‌ సమస్యలు అశ్విని ఆటను కట్టిపడేశాయి. దాంతో తన ఆటపై ఒత్తిడిని తగ్గించుకోవాల్సి వచ్చింది. ఎంతో ఇష్టపడే బ్యాడ్మింటన్‌ నుంచి తప్పుకునే పరిస్థితి లేదు. దాంతో సన్నిహితులు, కోచ్‌ల సూచనల ప్రకారం డబుల్స్‌ వైపు మళ్లింది.

అది ఆమె జీవితంలో తీసుకున్న అతి కీలకమైన, సరైన నిర్ణయం. ఇది అశ్విని కెరీర్‌ను సుదీర్ఘ కాలం కొనసాగేలా చేసింది. 2010లో పీసీ తులసితో కలసి ఆమె దక్షిణాసియా (శాఫ్‌) క్రీడల్లో రజత పతకాన్ని గెలుచుకుంది. అయితే ఏదో తెలియని లోటు తన ఆటకు తగిన ఫలితం ఇవ్వలేదన్నట్లుగా, తనను కట్టి పడేసినట్లుగా అనిపించింది. ఆ తర్వాత జరిగిన పరిణామం భారత డబుల్స్‌ బ్యాడ్మింటన్‌లో అత్యంత విజయవంతమైన జోడీకి అంకురార్పణ జరిగింది.

2014, కామన్వెల్త్‌ గేమ్స్‌ విమెన్‌ డబుల్స్‌ సిల్వర్‌ మెడల్‌తో.., 2011 వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ కాంస్యంతో  అశ్విని– జ్వాల ద్వయం..

జ్వాలతో జత కట్టి..
2010లో న్యూఢిల్లీ నగరం కామన్వెల్త్‌ క్రీడలకు ముస్తాబైంది. సొంతగడ్డపై ఇంత పెద్ద ఈవెంట్‌లో పతకాలు గెలవడం అశ్విని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో కోచ్‌ల మార్గనిర్దేశనంలో ఆమె ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గుత్తా జ్వాలను కొత్త డబుల్స్‌ పార్ట్‌నర్‌గా ఎంచుకుంది. అశ్విని కంటే ఐదేళ్లు పెద్దదయిన జ్వాల అప్పటికే డబుల్స్‌లో ఎన్నో విజయాలు అందుకుంది. అప్పటి వరకు సక్సెస్‌ఫుల్‌ జంటగా ఉన్న జ్వాల – శ్రుతి కురియన్‌ విడిపోయారు.

దాంతో జ్వాలకు కూడా సరైన పార్ట్‌నర్‌ అవసరమైంది. అప్పుడు జ్వాల – అశ్విని ద్వయం సమయం మొదలైంది. చక్కటి సమన్వయంతో ఆడిన వీరిద్దరూ కామన్వెల్త్‌ గేమ్స్‌లో తొలి ప్రయత్నంలోనే స్వర్ణపతకాన్ని గెలుచుకున్నారు. ఆ తర్వాత మూడేళ్ల పాటు ఈ జోడీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో హవా చూపించింది.

వీటిలో 2011 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సాధించిన కాంస్య పతకం అన్నింటికంటే బెస్ట్‌. లండన్‌లో జరిగిన ఈ పోటీల్లో మూడో స్థానంలో నిలిచిన జ్వాల–అశ్విని జంట వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన తొలి భారత జంటగా ఘనతకెక్కింది. అయితే 2013లో భాగస్వామిని మార్చి కొత్తగా ప్రయత్నిద్దామని చేసిన ప్రయోగం కొద్ది రోజులకే విఫలమైంది.

జ్వాల వ్యక్తిగత కారణాలతో ఆటకు కొంతకాలం దూరంగా ఉండటంతో అశ్విని మరో భాగస్వామితో బరిలోకి దిగింది. అయితే సరైన ఫలితాలు రాకపోవడంతో కొన్ని నెలలకే వీరిద్దరు మళ్లీ జత కట్టారు. ఆ తర్వాత మరో మూడేళ్ల పాటు సర్క్యూట్‌లో మంచి విజయాలు సాధించిన అనంతరం 2016లో జ్వాల–అశ్విని పూర్తిగా విడిపోయారు.

భర్త కరణ్‌ మేడప్పతో..

భాగస్వాములు మారినా..
‘క్రీడా భాగస్వామ్యాల్లో వేర్వేరు దశలు ఉంటాయి. కొన్నిసార్లు అద్భుత విజయాలు లభిస్తాయి. కొన్నిసార్లు పరాజయాలు పలకరిస్తాయి. డబుల్స్‌లో నేను ఫలానావారితో ఆడతాను అంటే కుదరదు. మార్పు సహజం. తప్పేమీ లేదు. దానిని అంగీకరించాలి. కొత్త భాగస్వామితో ఆరంభంలో సమన్వయం చేసుకునేందుకు కొంత ఇబ్బంది ఎదురు కావచ్చు. కానీ తర్వాతి రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయి. అందుకే నేను ఒక్క చోట ఆగిపోకుండా ఇంకా కొనసాగిపోతున్నాను’ అని తన గురించి తాను అశ్విని చెప్పుకుంది.

2016లో జ్వాలతో విడిపోయిన తర్వాత హైదరాబాద్‌కే చెందిన సిక్కి రెడ్డితో ఆమె జత కట్టింది. అశ్విని–సిక్కి ద్వయం కూడా పలు టోర్నీల్లో చెప్పుకోదగ్గ విజయాలు సాధించింది. వీటిలో 2018 గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో సాధించిన కాంస్య పతకం కూడా ఉంది. అయితే ఆ తర్వాత సిక్కి రెడ్డితో కూడా అశ్విని విడిపోయింది.

రెండేళ్ల క్రితం భారత జట్టుకు స్పెషలిస్ట్‌ డబుల్స్‌ కోచ్‌లు రావడంతో కొత్త జోడీ సాధ్యమైంది. ఒకవైపు తన అనుభవం, మరోవైపు యువ రక్తం కలగలసి మంచి ఫలితాలు వస్తాయని కోచ్‌లు అంచనా వేశారు. ఇప్పుడు సీనియర్‌గా ఉన్న తాను మరో యువ ప్లేయర్‌తో జత కట్టడం సరైందిగా అందరికీ అనిపించింది. దాంతో తనీషా క్రాస్టోను కొత్తగా అశ్వినికి భాగస్వామిగా ఎంపిక చేశారు. అశ్వినికి, తనీషాకు మధ్య వయసులో 14 ఏళ్ల తేడా ఉంది. కానీ కోర్టులోకి వచ్చేసరికి సరైన జుగల్‌బందీ కొనసాగింది.

దాంతో ఏడాది వ్యవధిలోనే అద్భుత ఫలితాలు వచ్చాయి. ఈ జంట 3 టోర్నమెంట్‌లలో విజేతగా నిలిచి మరో రెండు టోర్నీల్లో రన్నరప్‌ స్థానాన్ని అందుకుంది. ఇదే క్రమంలో వరుస విజయాల కారణంగా పాయింట్లు సంపాదించి పారిస్‌ ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించింది.

ఒకే ఒక లక్ష్యంతో..
అశ్విని సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో ఎన్నో విజయాలు ఉన్నాయి. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో సాధించిన కాంస్యం వీటిలో అగ్రభాగాన నిలుస్తుంది. ఇది కాకుండా టీమ్, వ్యక్తిగత విభాగాలు అన్నీ కలసి ఆసియా క్రీడల్లో కాంస్యం.. కామన్వెల్త్‌ క్రీడల్లో 2 స్వర్ణాలు, 3 రజతాలు, ఒక కాంస్యం.. ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, కాంస్యం ఆమె గెలుచుకుంది.

ఇక శాఫ్‌ క్రీడల్లో 4 స్వర్ణాలు, 2 రజతాలు గెలిచిన ఆమె ఉబెర్‌ కప్‌లో రెండు కాంస్యాలు సాధించిన భారత జట్టులో సభ్యురాలిగా కూడా ఉంది. వీటికి తోడు పెద్ద సంఖ్యలో బీడబ్ల్యూఎఫ్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీల్లో కూడా ఆమె విజేతగా నిలిచింది. అయితే ఇప్పుడు అన్నింటినీ మించి ఒలింపిక్స్‌ పతకం కోసమే ఆమె శ్రమిస్తోంది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో జ్వాల–అశ్విని మంచి ఫామ్‌లో ఉంది.

గ్రూప్‌ దశలో రెండు మ్యాచ్‌లు గెలిచినా దురదృష్టవశాత్తు ఒక పాయింట్‌ తేడాతో వీరు ముందంజ వేసే అవకాశం కోల్పోయారు. 2016 రియో ఒలింపిక్స్‌కు కొద్ది రోజుల ముందే డెంగీ బారిన పడిన తర్వాత అతి కష్టమ్మీద కోలుకొని బరిలోకి దిగినా గ్రూప్‌ రౌండ్‌లోనే ఓటమి తప్పలేదు. 2019లో మరోసారి అనారోగ్యానికి గురి కావడంతో టోర్నీల్లో పాల్గొనలేక 2021 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయింది.

మరెవరైనా అయితే ఈ స్థితిలో ఆటకు గుడ్‌బై చెప్పేవారేమో! కానీ అశ్విని కొత్త స్ఫూర్తితో, పట్టుదలతో మళ్లీ పైకెగసింది. నాలుగేళ్లుగా సాధన కొనసాగిస్తూ ఇప్పుడు మూడో ఒలింపిక్స్‌లో పాల్గొనబోతోంది. ఈసారైనా ఆమె ఒలింపిక్స్‌ నెరవేరుతుందేమో చూడాలి. భారత ప్రభుత్వ క్రీడా పురస్కారం ‘అర్జున’ కూడా దక్కించుకున్న అశ్విని 2017లో తన చిరకాల మిత్రుడు, వ్యాపారవేత్త కరణ్‌ మేడప్పను పెళ్లి చేసుకుంది. - మొహమ్మద్‌ అబ్దుల్‌ హాది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement