గమ్యంపై గురి తప్పనీయకండి! | Tappaniyakandi to the destination! | Sakshi
Sakshi News home page

గమ్యంపై గురి తప్పనీయకండి!

Published Sun, May 4 2014 11:18 PM | Last Updated on Tue, Aug 21 2018 3:16 PM

గమ్యంపై గురి తప్పనీయకండి! - Sakshi

గమ్యంపై గురి తప్పనీయకండి!

ప్రేరణ
 
ఒక పనిని పూర్తి చేయడానికి మన ముందు రెండు దారులుంటే సులువైన దాన్నే మొదటగా ఎంచుకుంటాం. అవసరమైన దానికంటే అనువైన దాన్ని ఎంపిక చేసుకోవడానికే మనం మొగ్గు చూపుతాం. నదీ ప్రవాహంలో చిక్కుకున్నప్పుడు ఏ మాత్రం ప్రయత్నించకుండా, ఈదకుండా ఉంటే ప్రవాహ దిశలో కొట్టుకుపోతామే తప్ప తీరాన్ని చేరుకోలేం.
 
లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు ఎదురవుతాయి. గమ్యానికి దూరంగా తీసుకెళ్లడానికి ప్రేరేపిస్తాయి. అవి మనకు ఎంతో సౌకర్యవంతంగా కనిపిస్తాయి. వాటి బారిన పడితే లక్ష్యసాధన కష్టమవుతుంది. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా కార్య దీక్షతో కష్టపడి పనిచేస్తేనే లక్ష్యం చేరుకుంటాం. వేటకు వెళ్లిన ఇద్దరు స్నేహితుల సంఘటనను ఇప్పుడు గుర్తుచేసుకుందాం...
 
ఇద్దరు స్పానిష్ స్నేహితులు జింకలను వేటాడడానికి ఓ చిన్న వాహనంలో అడవికి బయలుదేరారు. అరణ్యంలోకి ప్రవేశించిన తర్వాత ఓ పక్కన తమ వాహనాన్ని నిలిపారు. మైదానాలు, లోయలు దాటుకుని ముందుకు నడిచారు. కొంత దూరం వెళ్లి, ఓ పొద చాటున నిల్చుని జింకల రాక కోసం ఎదురుచూస్తున్నారు. అటుగా వచ్చిన ఓ జింక వీరి కంటపడింది. వెంటనే తుపాకీతో దాన్ని కాల్చారు. నేలకొరిగిన జింకను తమ వాహనం వద్దకు తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. ఇద్దరు స్నేహితులు దాని తోకను పట్టుకుని వాహనం వైపునకు లాగుతూ తీసుకెళ్తున్నారు.

జింక బరువుగా ఉండడం వల్ల వేగంగా కదలలేకపోతున్నారు. వారి కష్టాన్ని చూసిన ఓ రైతు కొమ్ములు పట్టుకుని లాగితే సులువుగా ఉంటుందని సలహా ఇచ్చాడు. ఇద్దరు స్నేహితులు ఒకరి ముఖం మరొకరు చూసుకుని రైతు సలహా పాటించాలని నిర్ణయించుకున్నారు. జింక మరోవైపునకు వెళ్లి కొమ్ములు పట్టుకుని లాగడం ప్రారంభించారు. ఇప్పుడు ముందుకంటే వేగంగా, సులభంగా జింక దేహాన్ని తీసుకెళ్లగలుగుతున్నారు. వారికి అంతకుముందు ఉన్న కష్టం కూడా లేదు.

పది నిమిషాల తర్వాత ఇద్దరిలో ఒకతను మరొకరితో ‘రైతు సరైన విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు చాలా సులభంగా ఉంది’ అన్నాడు. అప్పుడు రెండో అతను స్పందిస్తూ ‘అవును, నువ్వన్నది నిజమే... కానీ మనం వాహనానికి దూరంగా వెళ్తున్నాం. అదొక్కటే సమస్య!’ అన్నాడు.
 
పై కథ గురించి ఒక్కసారి ఆలోచించండి. కొమ్ములు పట్టుకుని లాగితే సులువని ఆ స్నేహితులు సంతోషించారు కానీ... తాము గమ్యానికి (వాహనానికి) దూరంగా వెళ్తున్నారని తెలుసుకోలేకపోయారు. మనం కూడా ప్రతి పనిలోనూ కొమ్ముల్లాంటి సులువైన మార్గాలనే అన్వేషిస్తాం. ఎంచుకున్న మార్గం సులువైనంత మాత్రాన సరిపోదు. అది సరైన దిశలో ఉందా? అనే విషయాన్ని గుర్తించాలి. మరో ముఖ్యమైన విషయం... ఒక పనిని పూర్తిచేస్తున్నప్పుడు సౌలభ్యంగా ఉన్న మార్గాలు ఎంచుకునే సందర్భంలో మన నిజమైన గమ్యం, లక్ష్యాలపై దృష్టిని మరలనీయొద్దు. విద్యార్థులు.. తమ ఇంటికి దగ్గర్లో ఇన్‌స్టిట్యూట్ ఉందనో లేదా కాలేజీ టైమింగ్‌‌స ఆశించిన విధంగా ఉన్నాయనే కారణంగా కళాశాలను, తమ కోర్సును ఎంచుకుంటున్నారు. తమ అభిరుచి, ఆకాంక్షలకు అనుగుణంగా ఉందా? అని చూడకుండానే నిర్ణయం తీసుకుంటున్నారు.
 
ఇంజనీరింగ్ విద్యార్థుల నేపథ్యంలో నాలుగేళ్ల క్రితం తెరకెక్కిన బాలీవుడ్ సినిమా త్రీ ఇడియట్స్.. విద్యార్థుల ప్రవర్తనలను చక్కగా వివరించింది. ఇంజనీరింగ్ చదవాలనే ఆశయంతో కాకుండా గొప్ప విద్యాసంస్థలో సీటు లభించిందని కోర్సులో చేరే వారి భవిష్యత్తుకూ ఈ సినిమా అద్ధం పట్టింది.
 
మీ జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల గురించి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. జింక కొమ్ములు పట్టి లాగినట్లు లక్ష్యానికి దూరంగా వెళ్లే సందర్భాలనూ గమనించొచ్చు. నగరంలో వాహనాన్ని నడుపుతున్నట్లుగా మన జీవితంలోనూ సరైన దారులు వెంటనే దొరక్కపోవచ్చు. కానీ వెళ్లే దారి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. వెళ్లేదారిలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎగుడు దిగుడు రోడ్డుపై స్వారీ చేయాల్సి ఉంటుంది. అడ్డంకులూ, కష్టాలను అధిగమించాల్సి ఉంటుంది. అయితే గమ్యాన్ని చేరుకోవాలంటే అదొక్కటే మార్గం! మధ్యలో ఆకర్షణీయమైన కొత్త దారులు కన్పించవచ్చు, మీ మనసును మళ్లించేలా పురికొల్పొచ్చు. వాటికి లొంగకుండా నిర్దేశించుకున్న దారిలో పయనించాలి.
 
లక్ష్యాలపై నుంచి దృష్టిని మరల్చొద్దు. ఎల్లప్పుడూ గమ్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకోవాలి. సులువైన దారిలో పయనించేందుకు సిద్ధపడేముందు ఏ దిశలో వెళ్తున్నారో గుర్తించడం ప్రధానం.

 -‘కెరీర్స్ 360’ సౌజన్యంతో
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement