
చెరువుల చెలికాడు..
చదువు పూర్తవుతుండగానేగూగుల్‌లో ఉద్యోగం సంపాదించాడు.అంతే తొందరగా ఉద్యోగానికి స్వస్తి చెప్పాడు. పర్యావరణవేత్తగా జీవితాన్ని మార్చుకున్నాడు. పాడైపోతున్న చెరువులను పరిశుభ్రం చేయసాగాడు. రోలెక్స్ యంగ్ లారియేట్ అవార్డు సాధించాడు. భారతదేశం నుంచి ఎన్నికైన యంగ్ అచీవర్‌గా నిలిచాడు. చెన్నైకి చెందిన పాతికేళ్ల అరుణ్ కృష్ణమూర్తి ప్రస్థానంలోని మైలురాళ్లివి...
‘‘ఉద్యోగంలో కూరుకుపోవడం వల్ల నాకు ఖాళీ సమయం దొరకదు. ఆ కారణంగా నేను అనుకున్నవేవీ సాధించలేకపోతాను. అందుకే 2010లో గూగుల్‌లో ఉద్యోగానికి స్వస్తి పలికి, సంఘసేవలోకి అడుగుపెట్టాను’’ అంటాడు అరుణ్ కృష్ణమూర్తి. ఆ ప్రయాణం ఆయన మాటల్లోనే...
బ్రిటిష్ జంతుశాస్త్రవేత్త డా. జేన్ గుడ్ ప్రారంభించిన ‘రూట్స్ అండ్ షూట్స్’లో పనిచేసిన అనుభవంతో 2011లో సొంతంగా ‘ఎన్విరాన్‌మెంటల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ (ఈఎఫ్‌ఐ) అని ఒక ఎన్‌జీవోను ప్రారంభించాను. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశాలలో ‘లేక్ బయోడైవర్సిటీ రెస్టొరేషన్ ప్రాజెక్ట్’ ఒకటి. 2008 లో హైదరాబాద్‌లోని గురునాథం చెరువును, 2009 లో చెన్నైలోని లక్ష్మీపుష్కరాన్ని పరిశుభ్రం చేశాం. ఇందుకుగాను రోలెక్స్ అవార్డ్ అందుకున్నప్పుడు భారతదేశానికి పేరు తీసుకువచ్చానన్న ఆనందం కలిగింది.
నా డైరీ...
నాలుగో క్లాసు చదువుతున్నప్పటి నుంచీ నాకు డైరీ రాసే అలవాటు ఉంది. నన్ను తీర్చిదిద్దిన గురువు డా. జేన్ గుడ్ ఆల్ భారతదేశానికి వచ్చినప్పుడు నన్ను ప్రశంసిస్తూ నాలుగు మాటలు రాయడానికి ఈ డైరీనే ఉపయోగపడింది. ఆయన స్ఫూర్తితోనే నేను ఇన్ని సాధించగలుగుతున్నాను.
మా కార్యక్రమాలు...
నాకు పర్యావరణం మీద మక్కువ ఎక్కువ. అలాగే వన్యప్రాణి సంరక్షణ మీదా శ్రద్ధ ఎక్కువ. ప్రతి ఒక్కరూ పర్యావరణం గురించి, అందులోని సమస్యల గురించి ఆలోచిస్తుంటారే కాని, నివారణచర్యల గురించి అస్సలు ఆలోచించరు. నేను మాతృభూమి పరిరక్షణకు పూనుకున్నాను. ఈఎఫ్‌ఐ సంస్థను ప్రారంభించాను. ఇందులో 900 మంది వలంటీర్లు ఉన్నారు. వీరిలో చాలామంది 20 ఏళ్ల వయసు లోపువారే. వారందరికీ నేనే స్వయంగా శిక్షణనిచ్చాను. వీరంతా... పాఠశాలలకు వెళ్లి మా కార్యక్రమాల గురించి వివరిస్తారు. మేమంతా కలిసి సరస్సుల ప్రక్షాళన చేస్తాం.
మా జట్టు చేసిన ప్రక్షాళన...
మేం చేసిన పనులలో బాగా గుర్తుంచుకోదగినది చెన్నైకి దక్షిణంగా ఉన్న కీళ్‌కట్టలై ప్రక్షాళన. దీని వెడల్పు 1.5 కి.మీ. ఈ సరస్సు నుంచి పల్లికరణికి నీటి సరఫరా అవుతుంది. ఒకప్పుడు ఆ చుట్టుపక్కల వారికి దాహాన్ని తీర్చిన ఆ సరస్సు పూర్తిగా కాలుష్యంతో నిండిపోయింది. అనేక పక్షులకు, తాబేళ్లకు ఆలవాలంగా ఉన్న ఈ సరస్సు, వాటికి అనువుగా లేకుండా పోయింది. దీనిని ఇలాగే వదిలేసి ఉంటే, మరో 20 ఏళ్ల తర్వాత ఈ సరస్సు గత చరిత్రగా మారిపోయేది. ఎలాగైనా సరే, దీనికి పూర్వ వైభవం తీసుకురావాలనే పట్టుదలతో, ఈ సరస్సును నాలుగు అంచెలలో శుభ్రపరిచాం. ముందుగా చుట్టుపక్కల ఉండేవారిని గుర్తించాం. సంవత్సరాలుగా సరస్సులో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేశాం. మలినాలను తొలగించి నీటిని స్వచ్ఛంగా మార్చాం. అంతకుముందు ఆ సరస్సులో ఉండే జీవజాతుల్ని మళ్లీ అందులో వేయడంతో మా లక్ష్యం నెరవేరింది.
లక్ష్యం దిశగా...
నా రోజువారీ ఖర్చుల కోసం ఒక కమ్యూనికేషన్ కంపెనీని నడుపుతున్నాను. నేను రోజుకి 14 - 16 గంటలు పనిచేస్తాను. 2010 నుంచి నా జీవితాన్ని ఇలాగే గడుపుతున్నాను. సంపాదిస్తున్నదానిలో సగం నేను స్థాపించిన సంస్థ లక్ష్యాలసాధన కోసం ఖర్చు చేస్తాను. నేను ఆలోచించేది, చేసేది కూడా ఈఎఫ్‌ఐ కోసమే. మా ప్రాజెక్ట్ ద్వారా మార్పు సాధ్యమని నిరూపించాలనుకుంటున్నాం. మంచి ఆశయ సాధనకు అందరి సహాయసహకారాలు అందుతాయని నమ్ముతున్నాం.
పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న అరుణ్ కృష్ణమూర్తి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు. కానీ, తగినన్ని నిధులు లేకపోవడం వల్ల ఆ ఆలోచనలు కార్యరూపం దాల్చలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో అతడికి మరింతమంది చేయూతనిస్తే కాలుష్య రహిత భారతదేశాన్ని తయారుచేయగలడనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
- డా. వైజయంతి
ప్రక్షాళన చేశాక ఆ సరస్సు మళ్లీ కలుషితం కాకుండా ఉండాలంటే, ఆ సరస్సు చుట్టుపక్కల ఉండేవారిని లేక్ గార్డియన్లుగా నియమిస్తే మంచిదనుకున్నాం. అలా చేయడం వలన సరస్సు పరిరక్షణ సక్రమంగా సాగుతుంది. కనుక సరస్సుకు చేరువగా నివసించేవారిని ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికే 600 కుటుంబాల వారు ఇందులో చేరారు. ముందు ముందు మరింతమంది వచ్చిచేరతారని భావిస్తున్నాం.