చేతిరాత బాలేదన్న.. చెల్లిని చంపాడు..
♦ ‘సీఐడీ’ సీరియల్ స్పూర్తితోనే హత్య
♦ విచారణలో విస్తుపోయే సమాధానం
లాహోర్: పాకిస్థాన్ లో దారుణం జరిగింది. ఓ 11 ఏళ్ల బాలుడు చేతిరాత బాలేదన్నతన 9 ఏళ్ల చెల్లిని చున్నితో గొంతు నులిమి చంపాడు. ఈ హృదయ విచారక ఘటన లాహోర్ లోని పంజాబ్ సరిహద్దున ఉన్న షాలిమర్ లో గత నెల 30న చోటుచేసుకుంది. పోలీసులు ఆ బాలుడైన అబ్దుల్ రెహమాన్ ను అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుపోయే సమాధానం చెప్పాడు. భారత్ కు చెందిన పాపులర్ టీవీ సీరియల్ సీఐడీ ప్రేరణతోనే తన చెల్లిని చంపినట్లు రెహమాన్ పోలీసులకు తెలిపాడు.
రంజాన్ సెలవులతో వారి అమ్మమ్మ ఇంటికి వచ్చిన చిన్నారులు ఆమె లేని సమయంలో సరదాగా హ్యాండ్ రైటింగ్ పోటీ పెట్టుకున్నారు. ఈ పోటీలో అన్న రెహమాన్ పూర్ హ్యాండ్ రైటింగ్ ను చూపిస్తూ ఏడిపించింది. ఇది తట్టుకోలేని బాలుడు ఆ చిన్నారి చున్నితో గొంతు నులిమి చంపాడు. ఎవరికి అనుమానం రాకుండా తన చేతి వేలిని నరుక్కొని ఆ గది లోపలి నుంచి తాళం వేసాడు. ఇంటికి వచ్చిన వారి అమ్మమ్మ ఇరుగుపొరుగు వారి సహాయంతో డోర్ తీయగా ఆమెకు చనిపోయిన చిన్నారి పక్కనే గాయపడ్డ బాలుడు కనిపించారు. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. తొలుత అనుమానంతో సవితి తల్లి సబాను విచారించి ఆమెకు సంబంధం లేదని వదిలేశారు. ఇక బాలుడిని గట్టిగా విచారించగా సీఐడీ సీరియల్ ప్రేరణతో తనే చంపినట్లు అంగీకరించాడు.