Handwriting
-
అందమైన రాతలో ఆంధ్రాదే పైచేయి
సాక్షి, అమరావతి: జాతీయ స్థాయి చేతిరాత దినోత్సవం సందర్భంగా జనవరి 29న నిర్వహించిన దేశవ్యాప్త చేతిరాత పోటీల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని ఆలిండియా గ్రాఫాలజీ, హ్యాండ్ రైటింగ్ అసోసియేషన్, ఇండియన్ హ్యాండ్ రైటింగ్ ట్రయినర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్కే ఎం.హుస్సేన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల విడుదలైన జాతీయ చేతిరాత పోటీల ఫలితాల్లో విజయవాడకు చెందిన 9వ తరగతి విద్యార్థి సేనాపతి జివితేష్ ‘నేషనల్ ఓవరాల్ చాంపియన్’గా నిలిచాడని పేర్కొన్నారు. ఏలూరుకు చెందిన ఆలపాటి ప్రహర్షిక ‘నేషనల్ ఎక్సలెన్సీ బెస్ట్ హ్యాండ్ రైటింగ్’ అవార్డు దక్కించుకున్నట్లు తెలిపారు. విజయవాడకే చెందిన అవ్యక్తా ప్రద్యుమ్న పూజారికి ‘మిస్ ఇండియా బెస్ట్ హ్యాండ్ రైటింగ్’ అవార్డు లభించినట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో జాతీయ స్థాయిలో మొత్తం ఎనిమిది రకాల ఉత్తమ అవార్డులందిస్తుంటారని, అందులో నేషనల్ ఓవరాల్ చాంపియన్‌షిప్‌తో పాటు మరో రెండు అవార్డులు ఏపీకి రావడం విశేషమని పేర్కొన్నారు. ఇంతకు ముందు 2019లో నిర్వహించిన జాతీయస్థాయి చేతిరాత పోటీల్లో ఏపీ 18వ స్థానంలో ఉండగా, ఈ సారి మొదటిస్థానంలో నిలిచిందని తెలిపారు. -
మై జీనియస్ స్టార్‌లో నైపుణ్య శిక్షణ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అబాకస్, క్యూబ్స్, ప్రోగ్రామింగ్ వంటి సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవాలంటే? ప్రత్యేకంగా శిక్షణ కేంద్రానికెళ్లాలి లేదా హోమ్ ట్రెయినర్‌ను పెట్టుకోవాలి. కాకపోతే ఇలాంటివి మెట్రోల్లోనే దొరుకుతాయి. మరి, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని విద్యార్థులైతే? ఇదే సమస్య ఒక తల్లిగా నవ్యకూ ఎదురైంది. డ్రాయింగ్ టీచర్‌ను వెతికే పనిలో ఏకంగా సాఫ్ట్‌స్కిల్స్ యాప్స్‌ను అభివృద్ధి చేసే సాఫ్ట్వేర్ కంపెనీ ‘ఐ–యాప్స్ ట్రాక్ సాఫ్ట్వేర్’ను ప్రారంభించేసింది. మరిన్ని వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘మాది అనంతపురం. బిట్స్ పిలానీలో బీఈ పూర్తయ్యా క... అమెరికాలోని ఎస్‌హెచ్‌యూ వర్సిటీలో ఎంబీఏ ఫైనాన్స్ చేశా. పలు బహుళ జాతి కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలొచ్చాయి. సొంతూళ్లో ఏదైనా కంపెనీ పెట్టాలన్నది నా కోరిక. ‘‘ఐదేళ్ల వయసున్న మా అబ్బాయికి డ్రాయింగ్ అంటే మహా ఇష్టం. నాకేమో రాదు. పోనీ, దగ్గర్లో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా అంటే అదీ లేదు. డ్రాయింగ్ ట్రైనింగ్ యాప్స్, ప్రొడక్ట్స్ ఆన్లైన్లో చాలా కొన్నాం. కానీ లాభం లేకుండా పోయింది. అప్పుడే అనిపించింది సబ్జెక్ట్స్‌తో పాటూ నైపుణ్య శిక్షణ ఇచ్చే ప్రొడక్ట్స్ మార్కెట్లో లేవని! అందుకే 2015లో రూ.20 లక్షల పెట్టుబడితో అనంతపురం కేంద్రంగా ఐయాప్స్ ట్రాక్ సాఫ్ట్వేర్ ప్రై.లి.ను ప్రారంభించాం. 5 నుంచి 16 సంవత్సరాల పిల్లల్లో సృజనాత్మకత, విశ్లేషణాత్మక, జిజ్ఞాసలను పెంపొందించే విద్యా సంబ ంధమైన ఉత్పత్తులను అభివృద్ధి చేయడమే మా కంపెనీ ప్రత్యేకత. డ్రీమ్ వీఆర్ కళ్లద్దాలు.. ఐయాప్స్ ట్రాక్ సాఫ్ట్వేర్ నుంచి తొలి ఉత్పత్తి డ్రీమ్ వీర్ (వర్చువల్ రియాలిటీ). డ్రీమ్ వీఆర్ కళ్లద్దాలను 2016 నవంబర్‌లో మార్కెట్లోకి రిలీజ్ చేశాం. సుమారు 2 వేల యూనిట్లు విక్రయించాం. ఏ వీఆర్ వీడియోలనైనా సరే ఈ డ్రీమ్ వీఆర్ కళ్లద్దాల ద్వారా వీక్షించే వీలుండటమే వీటి ప్రత్యేకత. వీటి ధర రూ.2,999. ప్రస్తుతం మాకు 2–3 వేల మంది యూజర్లున్నారు. వచ్చే ఏడాది ముగిసేసరికి 50 వేల మంది యూజర్లకు, రూ.3 కోట్ల ఆదాయాన్ని చేరుకోవాలన్నది మా లక్ష్యం. అంతర్జాతీయ స్కూళ్లతో ఒప్పందం.. ప్రస్తుతం మై జీనియస్ స్టార్ అనే అగ్మెంటెడ్ రియాలిటీ యాప్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఫిబ్రవరిలో మార్కెట్లోకి తెస్తాం. దీన్లో రూబిక్స్ క్యూబ్, అబాకస్, డ్రాయింగ్, హ్యాండ్ రైటింగ్ వంటి ఉత్పత్తులుంటాయి. వీటిల్లో ఏ యాప్‌నైనా సరే డౌన్లోడ్ చేసుకుని మై జీనియస్ ద్వారా సులువుగా నేర్చుకునే వీలుంటుందన్నమాట. యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేంత వరకే ఇంటర్నెట్ అవసరం. తర్వాత నెట్ లేకున్నా యాప్ సేవలను అందుకోవచ్చు. ఫిబ్రవరిలో హైదరాబాద్, బెంగళూరులోని పలు అంతర్జాతీయ పాఠశాలల్లో మై జీనియస్ స్టార్‌ను ప్రారంభించనున్నాం. చిరెక్, జీ గ్రూప్ వంటి వందకు పైగా స్కూళ్లలో దీన్ని అందుబాటులోకి తెస్తాం. ఒక్క యాప్ ఇన్‌స్టలేషన్‌కు రూ.5 వేలు చార్జీ ఉంటుంది. రూ.4 కోట్ల నిధుల సమీకరణ.. ఇప్పటివరకు రూ.3 కోట్ల పెట్టుబడి పెట్టాం. 4 నెలల్లో ప్రోగ్రామింగ్, పజిల్, సుడోకో, మెమొరీ బూస్టర్ వంటి అగ్మెంటెడ్ రియాలిటీ ప్రొడక్ట్‌లను మార్కెట్లోకి తెస్తాం. ‘‘ప్రస్తుతం మా కంపెనీలో 10 మంది ఉద్యోగులున్నారు. త్వరలో 25 శాతం వాటా విక్రయంతో రూ.4 కోట్ల నిధులను సమీకరించనున్నాం’’ -
బహుభాషా లేఖిని
చేతిరాతను బట్టి మనిషి గుణగణాలను అంచనా వెయ్యొచ్చని అంటారు. ఇప్పుడు కంప్యూటర్ యుగంలో చేతిరాతకు ప్రాధాన్యం తగ్గినప్పటికీరాత పరీక్షల్లో మాత్రం అందమైన చేతిరాతకు అదనపు విలువ తోడవుతుంది. అలాంటి చేతి రాత ఒకరి జీవిత గమనాన్ని మార్చింది. జెనెటిక్ ఇంజనీర్ అవుదామనే ఆలోచన నుంచి న్యూరో సైంటిస్ట్ కావాలనేలక్ష్యాన్ని నిర్దేశించింది. అలా చేతిరాతతో జీవితానికి చక్కటి బాటను దిద్దుకున్నారు సంగరాజు అశ్విని. తిరుపతిలోని ‘మేక్ మై బేబీ జీనియస్’(ఎంఎంబీజి) స్కూల్ యజమాని సంగరాజు భాస్కర రాజు కుమార్తె అశ్విని. తన లక్ష్యం మారడానికి వెనుక ఉన్న కారణాలను సాక్షితో పంచుకున్నారామె. సెలవుల్లో ఆలోచన మారింది ‘‘జెనెటిక్ ఇంజనీరింగ్ చేయాలని చిన్నప్పటి నుంచి నా కోరిక. అందుకు అనుగుణంగానే పదో తరగతి వరకు చదివాను. మంచి మార్కులు వచ్చాయి. ఇంటర్లో ఎంబైపీసీ గ్రూపులో చేరాను. నాన్న చేతిరాత నిపుణులు కావడంతో వేసవి సెలవుల్లో చేతిరాతపై పిల్లలకు శిక్షణ శిబిరం నిర్వహించేవారు. అందమైన చేతి రాత కోసం నాన్న దగ్గరే శిక్షణ తీసుకున్నా. అయితే అందరిలా కాకుండా భిన్నంగా గుర్తింపు పొందాలనుకున్నా. అందమైన చేతిరాత కోసం నాన్న చాలా పరిశోధనలు చేశారు. అందులో నుంచి రూపుదిద్దుకున్నవే ప్యాటర్న్స్ (పలక లాంటి 8 పరికరాలు). ప్యాటర్న్స్‌లో రెండు చేతులతో రాయడం సాధన చేశాను. అదనంగా మిర్రర్ రైటింగ్, అప్ సైడ్ డౌన్ సాధన చేశాను. కుడి చేతితోనే కాకుండా ఎడమ చేతితో రాయడం కూడా సులభంగా నేర్చుకున్నా. రెండు చేతులతో 21 భాషలు ‘‘సాధారణంగా ఒకటి, రెండు లేక మూడు భాషల్లో రాయగలం. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో రాయడాన్ని నేర్చుకున్నా. నాన్నకు చెప్పడంతో నాకు ప్రత్యేకంగా 18 భాషలకు సంబంధించిన పలకలు (ప్యాట్రెన్స్) చేయించారు. అందులో 18 భారతీయ భాషలు, మిగిలిన మూడు విదేశీ భాషలు. భారతీయ భాషల్లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కొంకణి, మరాఠీ, మైథిలి, మణిపురి, ఒరియా, పంజాబీ, సంస్కృతం, శాంథలి, సింధి, ఉర్దూలతోపాటు, విదేశీ భాషలు ఇంగ్లీషు, నేపాలి, అరబిక్‌లో రాయడం సాధన చేశాను. అలా మొత్తం 21 భాషల్లో కుడి, ఎడమ చేతులతో రాయగలను. మిర్రర్ రైటింగ్, అప్ సైడ్ డౌన్ రైటింగ్ కూడా వచ్చు. మిర్రర్ రైటింగ్ ఇండియాలో కొంతమంది రాయగలుగుతున్నప్పటికీ, అప్‌సైడ్ డౌన్ రైటింగ్ మాత్రం అసాధారణమే. డిజార్డర్ పిల్లలకు బోధన ‘‘చేతిరాతలో నిపుణులైన నాన్న మేక్ మై బేబీ జీనియస్ అనే పేరుతో పాఠశాలను నెలకొల్పారు. చదువులో వెనుకబడ్డ పిల్లలను, అటెన్షన్ డెఫిషిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ), అటెన్షన్ డెఫిషిట్ డిజార్డర్(ఏడీడీ), ఆటిజమ్ స్పెక్ట్రమ్ డిజార్డర్స్(ఏఎస్డీ) సమస్యలతో బాధ పడుతున్న పిల్లలకు బోధించడం ఈ స్కూల్ ప్రత్యేకత. సాధారణంగా ఇలాంటి పిల్లలను ఏ పాఠశాలలోనూ పెద్దగా పట్టించుకోరు. వారి సమస్యలు అర్థంకావు. వయసు పెరుగుతున్నా, తరగతులు మారుతున్నా చదువులో మాత్రం వెనుకంజలోనే ఉంటారు. ఇలాంటి పిల్లలకు మంచి చదువు అందించి సమాజంలో అందరిలా తీర్చిదిద్దాలన్నదే నాన్న కోరిక, నా లక్ష్యం కూడా అదే. దాని కోసం న్యూరో సైంటిస్టు కావాలనుకుంటున్నా. లక్ష్యం మార్చిన ఘటన ‘‘తిరుపతి భవానీనగర్‌లో నివాసముంటున్న మోహన్‌మురళి చంద్రగిరి పీహెచ్సీలో సూపర్వైజర్. ఆయన కుమారుడు దేవనాగ్కు అప్పుడు 16ఏళ్లు. పుట్టినప్పటి నుంచే దృష్టి, నత్తి. దీంతో చదువులో వెనుకబడ్డాడు. ఆ వయసుకు పదో తరగతి పూర్తయి ఉండాలి. కానీ అతను ఎనిమిదో తరగతి చదువుతున్నా కనీసం పదాలు, ఎక్కాలు, గుణింతాలు ఏవీ రావు. తల్లిదండ్రులు చివరి ప్రయత్నంగా మా పాఠశాలలో చేర్పించారు. వారి వేదన వర్ణనాతీతంగా ఉండేది. పిల్లవాడి సమస్యను గుర్తించి ఇక్కడ వివిధ రకాల శిక్షణ ఇచ్చాం. దీంతో అతను రెండేళ్లకే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి సాధించాడు. ఈ సంవత్సరం ఓపెన్ స్కూల్ ద్వారా పదోతరగతి పరీక్ష రాసి పాసయ్యాడు. ప్యారడీ పాటలు రాస్తున్నాడు. సొంతంగా కథలు రాస్తున్నాడు. ఆ తల్లిదండ్రుల సంతోషం మాటల్లో వర్ణించలేం. అది నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. మొదట్లో జెనెటిక్ ఇంజనీరింగ్ చేయాలనుకున్న నా లక్ష్యాన్ని మార్చుకోవడానికి కారణం ఈ ఘటనే. న్యూరో సైన్స్ చదివి న్యూరో సైంటిస్ట్ అవుదామని నిశ్చయించుకున్నా. నాన్నకు తోడుగా ఉంటూ సహకారం అందించాలనుకున్నాను. దీనికోసం ఇంటర్లో ఎంబైపీసీ తీసుకున్నా. డిగ్రీలో బయోటెక్నాలజీ తీసుకున్నా. డిగ్రీ మొదటి సెమిస్టర్ వరకు రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లాను. ఆ తరువాత పాఠశాలలోనే పిల్లలకు బ్రెయిన్ జిమ్‌లో శిక్షణ ఇస్తూ డిగ్రీ పూర్తి చేశాను. న్యూరో సైన్స్ కోర్సు ఇండియాలో లేదు. విదేశాలకు వెళ్లాలి. దీనికోసం ఇక్కడే సైన్స్‌కు అనుబంధంగా ఉన్న పీజీ కోర్సు చేసి, ఆ తరువాత న్యూరో సైన్స్ చేయాలనుకుంటున్నా’’ అని చెప్పారు అశ్విని. యంగ్ అచీవర్ అవార్డు చేతిరాతను సాధనం చెయ్యడం చదువులో రాణించడానికి తనకు చాలా దోహదపడిందని అంటారు అశ్విని. ‘‘రెండు చేతులతో విభిన్న భాషల్లో విభిన్నంగా రాయడంతో మల్టిపుల్ స్కిల్స్ పెరిగాయి. నాలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, సృజనాత్మకతతోపాటు ఆత్మస్థైర్యం పెంపొందింది. అప్పటి వరకు గంట సమయంలో చదివి గుర్తు పెట్టుకునే అంశాలను కేవలం 15 నిమిషాల్లో పూర్తి చేసేస్తున్నా. దీంతో చదువుకోవడానికి సమయం చాలా కలిసొచ్చింది’’ అన్నారు అశ్విని. విలక్షణమైన ఆమె చేతిరాతకు అనేక అవార్డులు కూడా వచ్చాయి. జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, రికార్డ్ హోల్డర్ రికార్డ్స్, అమేజింగ్ వరల్డ్ రికార్డ్స్.. ఇలా ఆయా సంస్థలు అవార్డులను ప్రదానం చేశాయి. ఇటీవల విజయవాడలో యంగ్ అచీవర్ అవార్డును అందుకున్నారు. – ఎస్.శశికుమార్, సాక్షి, తిరుపతి -
చేతిరాత బాలేదన్న.. చెల్లిని చంపాడు..
♦ ‘సీఐడీ’ సీరియల్ స్పూర్తితోనే హత్య ♦ విచారణలో విస్తుపోయే సమాధానం లాహోర్: పాకిస్థాన్ లో దారుణం జరిగింది. ఓ 11 ఏళ్ల బాలుడు చేతిరాత బాలేదన్నతన 9 ఏళ్ల చెల్లిని చున్నితో గొంతు నులిమి చంపాడు. ఈ హృదయ విచారక ఘటన లాహోర్ లోని పంజాబ్ సరిహద్దున ఉన్న షాలిమర్ లో గత నెల 30న చోటుచేసుకుంది. పోలీసులు ఆ బాలుడైన అబ్దుల్ రెహమాన్ ను అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుపోయే సమాధానం చెప్పాడు. భారత్ కు చెందిన పాపులర్ టీవీ సీరియల్ సీఐడీ ప్రేరణతోనే తన చెల్లిని చంపినట్లు రెహమాన్ పోలీసులకు తెలిపాడు. రంజాన్ సెలవులతో వారి అమ్మమ్మ ఇంటికి వచ్చిన చిన్నారులు ఆమె లేని సమయంలో సరదాగా హ్యాండ్ రైటింగ్ పోటీ పెట్టుకున్నారు. ఈ పోటీలో అన్న రెహమాన్ పూర్ హ్యాండ్ రైటింగ్ ను చూపిస్తూ ఏడిపించింది. ఇది తట్టుకోలేని బాలుడు ఆ చిన్నారి చున్నితో గొంతు నులిమి చంపాడు. ఎవరికి అనుమానం రాకుండా తన చేతి వేలిని నరుక్కొని ఆ గది లోపలి నుంచి తాళం వేసాడు. ఇంటికి వచ్చిన వారి అమ్మమ్మ ఇరుగుపొరుగు వారి సహాయంతో డోర్ తీయగా ఆమెకు చనిపోయిన చిన్నారి పక్కనే గాయపడ్డ బాలుడు కనిపించారు. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. తొలుత అనుమానంతో సవితి తల్లి సబాను విచారించి ఆమెకు సంబంధం లేదని వదిలేశారు. ఇక బాలుడిని గట్టిగా విచారించగా సీఐడీ సీరియల్ ప్రేరణతో తనే చంపినట్లు అంగీకరించాడు. -
రాత పోల్చుకో.. రంగం ఎంచుకో..
కెరీర్ ఎంపికలో హ్యాండ్ రైటింగ్ పాత్ర నప్పే కెరీర్ కోసం గ్రాఫాలజిస్ట్తో సంప్రదింపులు నగరంలో నవ్య ధోరణి టెక్నాలజీ పుణ్యమాని ఉత్తరాలు రాసే అవకాశం లేకపోయింది. కీబోర్డ్ రాకతో చేత్తో రాసే అవసరం తగ్గిపోతుంటే.. చేతిరాతను తరచి చూసే అవసరం మరోవైపు పెరిగిపోతోంది. ఉద్యోగాలు ఇచ్చేవారు మాత్రమే కాదు ఉద్యోగార్థులు సైతం తమ చేతి‘రాత’ను పరీక్షించుకుంటున్నారు. దాని ప్రకారం తల రాతను దిద్దుకుంటున్నారు. ఇప్పుడు సిటీలో ఈ ధోరణి బాగా పెరిగింది. వివిధ కోర్సుల్లో శిక్షణ తీసుకుంటున్నవారు తమ కెరీర్ కోసం గ్రాఫాలజిస్టులను సంప్రదించి చేతిరాతలో మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. ‘నేనెందుకు పనికొస్తాను?’.. ఈ ప్రశ్న నిరాశతో మాత్రమే కాదు అత్యంత ఆశావహ దృక్పథంతో కూడా వేసుకోవచ్చు. అలా ప్రశ్నించుకున్న తర్వాత, తన శక్తియుక్తులు తరచి చూసుకున్న తర్వాత ‘రంగం’లోకి దూకితే.. ఆ దూకుడుకు అడ్డుండదు. ఇది విజయవంతమైన వ్యక్తుల కథల సాక్షిగా నిరూపితమైన నిజం. కెరీర్ ఎంపికకు ముందుగా తమని తాము తరచి చూసుకుంటున్న వారికి అందుబాటులోకి వచ్చిన మరో మార్గం ‘హ్యాండ్ రైటింగ్ ఎనాలసిస్’. ‘అక్షరాలా’ మనమే.. పలకా బలపం నాటి రోజుల తర్వాత రకరకాల మార్పులకు లోనైంది. ఎంతగా అంటే.. సన్నిహితులు మనల్ని గుర్తు పట్టడానికి అదొక మార్గంగా మారిపోయింది. మనకు అంతగా అలవాటైపోయిన చేతిరాత.. అలవోకగా అమరిపోయిందనుకుంటే పొరపాటే అని గ్రాఫాలజీ చెబుతోంది. మన ఆలోచనలు, ప్రవర్తన, మనస్తత్వం.. వీటన్నింటి ప్రతిరూపంగానే రాసే శైలి కూడా ఉంటుందని గ్రాఫాలజిస్ట్‌లు చెబుతున్నారు. మనం ఏ రంగంలో రాణిస్తామో తెలుసుకోవాలంటే మన ఇష్టాఇష్టాలు, శక్తి యుక్తులు తరిచి చూసుకోవడం అవసరమని, అందులో భాగంగా చేతిరాతను సైతం ఎనలైజ్ చేసుకోవాలని వీరు సూచిస్తున్నారు. ఉదాహరణకు కొన్ని రకాల హ్యాండ్ రైటింగ్ స్టైల్స్‌ను చూస్తే.. లార్జ్ హ్యాండ్ రైటింగ్ అక్షరాలపై బార్స్ పెద్దగా ఉండడం స్ట్రోక్స్ అన్నీ కనెక్టింగ్‌గా ఉండడం.. ఈ శైలి సెల్ఫ్ ఎస్టీమ్, కాన్ఫిడెన్స్ ఎక్కువని చెబుతుంది. ఉద్యోగం కన్నా స్వేచ్ఛ, స్వతంత్రత ఎక్కువగా ఉండే వ్యాపకాలను ఎంచుకునే మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక పదానికి పదానికి మధ్య తక్కువ స్పేస్ ఉండడం కలుపుగోలు తనానికి చిహ్నం. ఈ ధోరణి సేల్స్ అండ్ మార్కెటింగ్ లేదా సంబంధిత రంగానికి అతికినట్టు సరిపోతుంది. స్మాల్ సైజ్ రైటింగ్ ఈ స్టైల్లో అక్షరం మీద చుక్కను రౌండ్ చుడుతుంటారు. అలాగే పదాల్లో స్పష్టత ఎక్కువగా ఉంది. ఇది పలు అంశాలపై ఉన్న క్లారిటీకి చిహ్నం. వీరిది చిన్న చిన్న డిటైల్స్ అన్నీ పర్ఫెక్ట్గా రాసే తరహా. ఈ ‘రాత’ గల వ్యక్తులకు ఫైనాన్షియల్ సంబంధిత రంగాల (అకౌంటెంట్, ఫైనాన్షియల్ అడ్వయిజర్)కు ఉపయుక్తం. యాంగ్యులర్ రైటింగ్ ఈ తరహా రైటింగ్ చివర్లన్నీ సూదిగా ఉంటాయి. ఇది ఇంటిలిజెన్స్‌కి చిహ్నం. అక్షరాలన్నీ ఒక్కోటి ఒక్కో యాంగిల్లా ఉంటాయి. అంటే వీరు లాజికల్‌గా ఆలోచిస్తారు. ప్రతి అక్షరానికి ముందు స్టార్టింగ్ స్ట్రోక్ ఉంటుంది. ఇది వాదనా పటిమకు, వేగంగా నేర్చుకునే తత్వానికి సూచిక. ప్రతి అక్షరానికీ ముందు తోక తగిలించడాన్ని చూశారా.. ఇది పరిశోధనాత్మక ఆలోచనా ధోరణిని సూచిస్తుంది. అడ్వకేట్స్, లీగల్, డిటెక్టివ్ తదితర రంగాల్లో రాణిస్తారు. రౌండ్ రైటింగ్ రైటింగ్ సైజ్ పెద్దగా ఉంది. మంచి శ్రోతలవుతారు. కొన్ని అక్షరాలు కలిపి, కొన్ని విడివిడిగా ఉంటాయి. అంటే ఎడాప్టబులిటీ, ఫ్లెక్సిబులిటీలని సూచిస్తుంది. పదాల మధ్య ఈక్వెల్ స్పేస్ ఇచ్చారు. అంటే, వీళ్లు వెల్ బ్యాలెన్స్డ్ థింకింగ్ గలవారు. టీచర్స్, కౌన్సిలర్స్, సోషల్ వర్క్, అడ్మినిస్ట్రేషన్ వంటి రంగాలు వీరికి నప్పుతాయి. షార్ప్ టాల్ హ్యాండ్ రైటింగ్ అడుగున ఉన్న అక్షరాలు పొడవుగా వెళతాయి. ప్రతి పదం చివర్లో, మొదటి అక్షరమో తోకలు కింద లైన్లోకి వెళ్లిపోయేంతగా పొడవుగా ఉంటాయి. వీరికి ఇన్నర్ స్టామినా, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎక్కువ. షార్ప్‌గా ఉంటారు. స్పోర్ట్స్‌కి, అవుట్ డోర్ యాక్టివిటీస్‌కి నప్పుతారు. ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తారు. సంతకం చెప్పే సంగతులు.. - చేతిరాత విశ్లేషణ ద్వారా మన శక్తియుక్తులు ఎలా తెలుస్తాయో.. సంతకం చేసే శైలిని బట్టి.. మన మనస్తత్వాన్ని విశ్లేషించుకోవచ్చని చెబుతున్నారు గ్రాఫాలజిస్ట్, డాక్టర్ రణధీర్ కుమార్. ఎడమ నుంచి కుడివైపునకు వెళుతున్నట్టుండేది, అలాగే పైనుంచి కిందకు, కింద నుంచి పైకి వెళ్తున్నన్నట్టుగా ఉండేలా అక్షరాలు రాసేవారు పైకి గంభీరంగా, రిజర్వ్డ్గా ఉన్నప్పటికీ చాలా సహృదయులై ఉంటారు. - సంతకంలో అక్షరాలు పెద్దగా ఉంటే ఆ వ్యక్తికి ఇగో ఎక్కువని, తాను చెప్పింది ఇతరులు అంగీకరించి తీరాల్సిందేనన్న తత్వం గలవారని అర్థం చేసుకోవచ్చు. చేతిరాత కంటే సంతకం చిన్నగా ఉంటే ఆ వ్యక్తి తనను తాను ప్రాధాన్యత లేనివాడిగా భావించే గుణం ఉందని. - సంతకం అర్థం కాకుండా, చదివే వీలు లేకుండా ఉంటే.. ఆ వ్యక్తులు తమ విషయం ప్రపంచం ఎక్కువగా తెలుసుకోకూడదని కోరుకుంటారు. తన గురించి చెప్పేందుకు ఇష్టం లేని దాపరికం ఉన్న వ్యక్తి కూడా అయి ఉంటారు. సంతకం మరీ కాంప్లికేటెడ్‌గా ఉంటే ఇతరులకు తనో రహస్యం కావాలనుకుంటున్నట్టు. - సంతకంలోని చివరి స్ట్రోక్ (అక్షరం) వెనుకడుగు వేసినట్టుగా అంటే.. ప్రారంభించిన చోటుకి తిరిగి వచ్చినట్టుగా ఉంటే అది తనను తాను పాడు చేసుకునే తత్వానికి నిదర్శనం. - పొడవైన కింద నుంచి పైకి వెళ్లే రైజింగ్ లైన్‌తో ఉన్న సంతకం... రగిలే ఆశలు, ఆశయాలతో ఉన్న మనస్తత్వానికి గుర్తు. - రెండు సార్ల కంటే ఎక్కువగా అండర్ స్కోర్ చేసిన సంతకం రాజీపడని, ధృఢమైన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. - సంతకం కింద వ త్తిపట్టి అండర్స్కోర్ చేస్తే అది స్వార్థ మనస్తత్వం, గుర్తింపు కోసం పడే ఆరాటానికి గుర్తు.