మై జీనియస్‌ స్టార్‌లో నైపుణ్య శిక్షణ! | My Genius Star Skill training | Sakshi
Sakshi News home page

మై జీనియస్‌ స్టార్‌లో నైపుణ్య శిక్షణ!

Published Sat, Jan 26 2019 1:47 AM | Last Updated on Sat, Jan 26 2019 1:47 AM

My Genius Star Skill training - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అబాకస్, క్యూబ్స్, ప్రోగ్రామింగ్‌ వంటి సాఫ్ట్‌ స్కిల్స్‌ నేర్చుకోవాలంటే? ప్రత్యేకంగా శిక్షణ కేంద్రానికెళ్లాలి లేదా హోమ్‌ ట్రెయినర్‌ను పెట్టుకోవాలి. కాకపోతే ఇలాంటివి మెట్రోల్లోనే దొరుకుతాయి. మరి, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని విద్యార్థులైతే? ఇదే సమస్య ఒక తల్లిగా నవ్యకూ ఎదురైంది. డ్రాయింగ్‌ టీచర్‌ను వెతికే పనిలో ఏకంగా సాఫ్ట్‌స్కిల్స్‌ యాప్స్‌ను అభివృద్ధి చేసే సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ‘ఐ–యాప్స్‌ ట్రాక్‌ సాఫ్ట్‌వేర్‌’ను ప్రారంభించేసింది. మరిన్ని వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘మాది అనంతపురం.

బిట్స్‌ పిలానీలో బీఈ పూర్తయ్యా క... అమెరికాలోని ఎస్‌హెచ్‌యూ వర్సిటీలో ఎంబీఏ ఫైనాన్స్‌ చేశా. పలు బహుళ జాతి కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలొచ్చాయి. సొంతూళ్లో ఏదైనా కంపెనీ పెట్టాలన్నది నా కోరిక. ‘‘ఐదేళ్ల వయసున్న మా అబ్బాయికి డ్రాయింగ్‌ అంటే మహా ఇష్టం. నాకేమో రాదు. పోనీ, దగ్గర్లో ఇన్‌స్టిట్యూట్స్‌ ఉన్నాయా అంటే అదీ లేదు. డ్రాయింగ్‌ ట్రైనింగ్‌ యాప్స్, ప్రొడక్ట్స్‌ ఆన్‌లైన్‌లో చాలా కొన్నాం.

కానీ లాభం లేకుండా పోయింది. అప్పుడే అనిపించింది సబ్జెక్ట్స్‌తో పాటూ నైపుణ్య శిక్షణ ఇచ్చే ప్రొడక్ట్స్‌ మార్కెట్లో లేవని! అందుకే 2015లో రూ.20 లక్షల పెట్టుబడితో అనంతపురం కేంద్రంగా ఐయాప్స్‌ ట్రాక్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రై.లి.ను ప్రారంభించాం. 5 నుంచి 16 సంవత్సరాల పిల్లల్లో సృజనాత్మకత, విశ్లేషణాత్మక, జిజ్ఞాసలను పెంపొందించే విద్యా సంబ ంధమైన ఉత్పత్తులను అభివృద్ధి చేయడమే మా కంపెనీ ప్రత్యేకత. 

డ్రీమ్‌ వీఆర్‌ కళ్లద్దాలు.. 
ఐయాప్స్‌ ట్రాక్‌ సాఫ్ట్‌వేర్‌ నుంచి తొలి ఉత్పత్తి డ్రీమ్‌ వీర్‌ (వర్చువల్‌ రియాలిటీ). డ్రీమ్‌ వీఆర్‌ కళ్లద్దాలను 2016 నవంబర్‌లో మార్కెట్లోకి రిలీజ్‌ చేశాం. సుమారు 2 వేల యూనిట్లు విక్రయించాం. ఏ వీఆర్‌ వీడియోలనైనా సరే ఈ డ్రీమ్‌ వీఆర్‌ కళ్లద్దాల ద్వారా వీక్షించే వీలుండటమే వీటి ప్రత్యేకత. వీటి ధర రూ.2,999. ప్రస్తుతం మాకు 2–3 వేల మంది యూజర్లున్నారు. వచ్చే ఏడాది ముగిసేసరికి 50 వేల మంది యూజర్లకు, రూ.3 కోట్ల ఆదాయాన్ని చేరుకోవాలన్నది మా లక్ష్యం. 

అంతర్జాతీయ స్కూళ్లతో ఒప్పందం.. 
ప్రస్తుతం మై జీనియస్‌ స్టార్‌ అనే అగ్‌మెంటెడ్‌ రియాలిటీ యాప్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఫిబ్రవరిలో మార్కెట్లోకి తెస్తాం. దీన్లో రూబిక్స్‌ క్యూబ్, అబాకస్, డ్రాయింగ్, హ్యాండ్‌ రైటింగ్‌ వంటి ఉత్పత్తులుంటాయి. వీటిల్లో ఏ యాప్‌నైనా సరే డౌన్‌లోడ్‌ చేసుకుని మై జీనియస్‌ ద్వారా సులువుగా నేర్చుకునే వీలుంటుందన్నమాట. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేంత వరకే ఇంటర్నెట్‌ అవసరం. తర్వాత నెట్‌ లేకున్నా యాప్‌ సేవలను అందుకోవచ్చు. ఫిబ్రవరిలో హైదరాబాద్, బెంగళూరులోని పలు అంతర్జాతీయ పాఠశాలల్లో మై జీనియస్‌ స్టార్‌ను ప్రారంభించనున్నాం. చిరెక్, జీ గ్రూప్‌ వంటి వందకు పైగా స్కూళ్లలో దీన్ని అందుబాటులోకి తెస్తాం. ఒక్క యాప్‌ ఇన్‌స్టలేషన్‌కు రూ.5 వేలు చార్జీ ఉంటుంది. 

రూ.4 కోట్ల నిధుల సమీకరణ.. 
ఇప్పటివరకు రూ.3 కోట్ల పెట్టుబడి పెట్టాం. 4 నెలల్లో ప్రోగ్రామింగ్, పజిల్, సుడోకో, మెమొరీ బూస్టర్‌ వంటి అగ్‌మెంటెడ్‌ రియాలిటీ ప్రొడక్ట్‌లను మార్కెట్లోకి తెస్తాం. ‘‘ప్రస్తుతం మా కంపెనీలో    10 మంది ఉద్యోగులున్నారు. త్వరలో 25 శాతం వాటా విక్రయంతో రూ.4 కోట్ల నిధులను         సమీకరించనున్నాం’’ 


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement