Subjects
-
‘సింగిల్ స్పెషల్’ డిగ్రీ! ఒక సబ్జెక్టు ప్రధానంగా కొత్త కరిక్యులమ్
సాక్షి, అమరావతి: విద్యా ప్రమాణాలను పెంపొందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగంగా డిగ్రీ విద్యలో సింగిల్ సబ్జెక్టు మేజర్‌గా కొత్త కరిక్యులమ్‌ను ప్రవేశపెడుతోంది. ఇప్పటివరకు డిగ్రీలో మూడు సబ్జెక్టులు ప్రధాన కాంబినేషన్‌తో విద్యాబోధన సాగుతుండగా ఇకపై ఒక మేజర్ సబ్జెక్టు ప్రధానంగా డిగ్రీ విద్య కొనసాగనుంది. జూన్ నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు కరిక్యులమ్‌లో మార్పులు చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. బుధవారం మంగళగిరిలోని కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య హేమచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ రామ్మోహన్రావు మీడియాకు వివరాలను వెల్లడించారు. ‘సెట్స్’ స్పెషల్ ఆఫీసర్ సుధీర్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్ అహ్మద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైనా ఒక సబ్జెక్ట్‌లో విద్యార్థులు సంపూర్ణ నైపుణ్యాలను సాధించే దిశగా కరిక్యులమ్‌ను సిద్ధం చేసినట్లు చెప్పారు. గతంలో బీఎస్సీ–ఎంపీసీ (మూడు సబ్జెక్టుల కాంబినేషన్) ఉండగా ఆ స్థానంలో బీఎస్సీ మ్యాథ్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీలో ఒక సబ్జెక్టును మేజర్‌గా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రెండో సెమిస్టర్ నుంచి దాదాపు 100 కోర్సుల నుంచి విద్యార్థులు తమకు నచ్చిన విభాగంలో మైనర్ సబ్జెకున్టు ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. తద్వారా మేజర్, మైనర్ సబ్జెక్టుల్లో ఏదో ఒకదానితో పీజీ విద్యను అభ్యసించేలా మార్పులు చేసినట్లు చెప్పారు. బీఎస్సీ, బీఏ, బీకామ్‌లో అమలు డిగ్రీలో మేజర్ సబ్జెక్టుతో పాటు కచ్చితంగా ఒక మైనర్ సబ్జెక్టు చదవాలి. ఉదాహరణకు ఒక సైన్స్ విద్యార్థి మైనర్ సబ్జెక్టుగా ఆర్థిక శాస్త్రం, చరిత్ర, సంగీతం, యోగా, డేటాసైన్స్, మార్కెటింగ్.. ఇలా ఇతర సబ్జెక్టులను ఎంపిక చేసుకోవచ్చు. ఆర్ట్స్ విద్యార్థులు మైనర్లో (ఇంటర్మీడియట్ కోర్సుల ఆధారంగా) నచ్చిన సబ్జెక్టు తీసుకోవచ్చు. కొత్త విధానాన్ని బీఎస్సీతో పాటు బీఏ, బీకామ్ డిగ్రీలో అమలు చేయనున్నట్టు తెలిపారు. డిగ్రీ విద్యలో ఉద్యోగ అవకాశాలను పెంపొందించడంతో పాటు ఇంజనీరింగ్‌తో సమానంగా తీర్చిదిద్దేందుకు ఈ విద్యా సంస్కరణలు దోహదం చేస్తాయని వివరించారు. వచ్చే జూన్‌లో కొత్త కరిక్యులమ్ ప్రకారం ప్రవేశాలు ఉంటాయని, దీనిపై డిగ్రీలో చేరే విద్యార్థులకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తామన్నారు. నాలుగో ఏడాది డిగ్రీకి అనుమతి జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం దేశంలో తొలిసారి విద్యా సంస్కరణలను మన రాష్ట్రంలోనే అమలు చేసినట్లు హేమచంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటికే నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీని ప్రవేశపెట్టామని, ప్రస్తుతం మూడో ఏడాది డిగ్రీ విద్య పూర్తయిందన్నారు. యూజీసీ ఫ్రేమ్ వర్క్స్ ప్రకారం ఆనర్స్ డిగ్రీని రెండు విధాలుగా విభజించామన్నారు. మూడేళ్ల డిగ్రీలో 75 శాతం మార్కులు సాధించినవారు రీసెర్చ్ ఆనర్స్ డిగ్రీ కోర్సులో చేరవచ్చు. ఇది పూర్తి చేసిన వారు పీజీ లేకుండా పీహెచ్డీ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మూడేళ్ల కోర్సులో ఉత్తీర్ణులైతే జనరల్ ఆనర్స్ కోర్సును అభ్యసించవచ్చు. ఇది పూర్తిచేసిన వారు పోస్టు గ్రాడ్యుయేషన్ రెండో ఏడాదిలో చేరవచ్చన్నారు. ఆనర్స్ కోర్సులను అందించేందుకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో గత మూడేళ్లలో వరుసగా 30 శాతం అడ్మిషన్లతో పాటు సంబంధిత కోర్సుల్లో ఇద్దరు డాక్టరేట్ కలిగిన ప్రొఫెసర్లు ఉంటేనే అనుమతులు మంజూరు చేస్తామన్నారు. డిగ్రీ విద్యార్థులకు 10 నెలల ఇంటర్న్‌షిప్ నూతన విద్యావిధానంలో భాగంగా డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసిందన్నారు. ఇంజనీరింగ్ తదితర ప్రొఫెషనల్ కోర్సులకు ఇంటర్న్‌షిప్ ఉన్నట్టుగానే నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల విద్యార్థులకు కూడా 10 నెలల ఇంటర్న్‌షిప్ ప్రవేశపెట్టామన్నారు. మైక్రోసాఫ్ట్ ద్వారా ఏడాదిలో 1.20 లక్షల సర్టిఫికేషన్ కోర్సులను అందించడం దేశంలో ఓ మైలురాయిగా అభివర్ణించారు. విద్యార్థుల్లో గందరగోళం సృష్టించొద్దు ఉన్నత విద్యలో ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక మార్పులను చూసి ఓర్వలేక కొన్ని పత్రికలు గందరగోళం సృష్టించే కథనాలు రాస్తున్నాయని హేమచంద్రారెడ్డి పేర్కొన్నారు. 2019 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యలో పలు సంస్కరణలు తెచ్చిందని, ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కళాశాలలపై కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. 2009 నుంచి ద్రవిడ వర్సిటీలో అడ్డగోలుగా చేపట్టిన 6055 పీహెచ్డీ అడ్మిషన్లను రద్దు చేశామన్నారు. 2014–18లో గత ప్రభుత్వ హయాంలో ఏకంగా 980 పీహెచ్డీ అడ్మిషన్లు ఇచ్చారని, వాటిపై విచారించి చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. రాయలసీమ వర్సిటీలోనూ 2008–2011 మధ్యలో చేపట్టిన 2,490 అక్రమ పీహెచ్డీ అడ్మిషన్లను రద్దు చేశామన్నారు. టీడీపీ హయాంలో అక్కడ 518 పీహెచ్డీ అడ్మిషన్లు ఇవ్వగా 2019 నుంచి ఇప్పటి వరకు 28 అడ్మిషన్లు మాత్రమే ఇచ్చామన్నారు. ఆర్–సెట్‌ను తీసుకొచ్చి పీహెచ్డీ అడ్మిషన్లలో పారదర్శకతకు పెద్దపీట వేశామన్నారు. వాస్తవాలను కప్పిపుచ్చి ఓ మీడియా అసత్య ప్రచారం చేయడం దారుణమని ఆక్షేపించారు. -
టెన్త్ పరీక్ష ఫీజు 125 రూపాయలే
సాక్షి, కదిరి: పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం నెల క్రితమే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల10లోగా చెల్లించవచ్చు. అన్ని సబ్జెక్టులకు కలిపి కేవలం రూ.125 చెల్లిస్తే సరిపోతుంది. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా పరీక్ష ఫీజు పెంచలేదు. ఇదే మొత్తాన్ని వసూలు చేస్తోంది. అపరాధ రుసుంతో... రూ.50 అపరాధ రుసుంతో డిసెంబర్ 20 వరకూ పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. డిసెంబర్ 25 వరకూ అపరాధ రుసుం రూ.200తో , ఆ తర్వాత అంటే డిసెంబర్ 26 నుంచి డిసెంబర్ 30లోగా రూ.500 అపరాధ రుసుంతో పరీక్ష ఫీజు చెల్లించే వెసులుబాటు ఉంది. వృత్తి విద్యా కోర్సులు అభ్యసించే వారు రూ.125తో పాటు ప్రాక్టికల్స్ కోసం అదనంగా మరో రూ.60 చెల్లించాలి. గతంలో టెన్త్ ఫెయిలైన విద్యార్థులు మూడు లేదా అంతకన్నా తక్కువ సబ్జెక్టులకు రూ.110, అంతకన్నా ఎక్కువ సబ్జెక్టులుంటే రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా రూ.125 చెల్లిస్తే సరిపోతుంది. హెచ్‌ఎంలదే కీలక బాధ్యత.. 10వ తరగతి పరీక్షల ఫీజు విషయంలో ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులదే కీలక బాధ్యత ఉంటుంది. విద్యార్థుల పరీక్ష ఫీజుకు సంబంధించిన నామినల్ రోల్స్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే విద్యార్థులు నష్టపోతారు. పూర్తి చేసిన నామినల్ రోల్స్‌కు పాఠశాల లాగిన్‌లోని లింక్ ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. చలానా లేదా సీఎఫ్ఎంఎస్ ద్వారా ఫీజు చెల్లిస్తే ఉపయోగం ఉండదు. 10 పరీక్షలకు సంబంధించిన మ్యానివల్ నామినల్ రోల్స్ (ఎంఎన్ఆర్)ను డిసెంబర్ 21 నుండి 31 లోగా డీఈఓ కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. 23,758 మంది రెగ్యులర్ విద్యార్థులు.. జిల్లాలో 2022–23 విద్యా సంవత్సరంలో జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో 11,782 మంది, మున్సిపల్ స్కూల్స్‌లో 1,803, కస్తూర్బా స్కూల్స్‌లో 1,115 మంది, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 783 మంది, సోషల్ వేల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 540 మంది, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్‌లో 220 మంది ఉన్నారు. అలాగే ఏపీఆర్ఈఐ సొసైటీ స్కూల్స్‌లో 88 మంది, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్స్‌లో 35 మంది, మోడల్ స్కూల్స్‌లో 796 మంది, నవోదయ విద్యాలయాల్లో 83 మంది, ప్రైవేటు/కార్పొరేట్ స్కూల్స్‌లో 5,603 మంది, సీబీఎస్సీ వారు 178 మంది, బీసీ వెల్ఫేర్ స్కూల్స్‌లో 724 మందితో పాటు గవర్నమెంట్ స్కూల్స్‌లో మరో 8 మంది అంధ విద్యార్థులతో కలిపి బాలురు 12,450 మంది, బాలికలు 11,308 మంది మొత్తం 23,758 మంది రెగ్యులర్ విద్యార్థులు ఈసారి పది పరీక్షకు హాజరు కానున్నారు. ఈసారి ఆరు పేపర్లే.. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించి.. నాణ్యమైన విద్యా బోధనే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చింది. పది పబ్లిక్ పరీక్షల్లో 11 పేపర్లకు బదులు 6 పేపర్లు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించింది. కోవిడ్ కారణంగా గత ఏడాది పది పబ్లిక్ పరీక్షల్లో 7 పేపర్లు నిర్వహించారు. కరోనా తీవ్రత నేపథ్యంలో 2019–20 అలాగే 2020–21 విద్యాసంవత్సరాల్లో 10 పబ్లిక్ పరీక్షలు నిర్వహించలేదు. సమ్మేటివ్ పరీక్షల్లో వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకొని టెన్త్ పాస్ చేసిన విషయం తెలిసిందే. ఈసారి సీబీఎస్ఈ తరహాలోనే టెన్త్‌లో ఆరు పేపర్లే ఉంటాయి. ప్రైవేటు స్కూళ్లలో ఫీ‘జులుం’.. 10వ తరగతి పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు ముగుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తున్నాయి. స్కూల్ఫీజు, ట్యూషన్ ఫీజు, ట్రాన్స్‌పోర్టు ఫీజు ఇలా బకాయి ఉన్న ఫీజులన్నీ చెల్లిస్తే గానీ పరీక్ష ఫీజు తీసుకునేది లేదని మెలిక పెడుతున్నారు. ఇంకొన్ని చోట్ల కోవిడ్ సమయంలోని పెండింగ్‌లో ఉన్న ఫీజులు కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఫలానా తేదీకి ఫీజు మొత్తం క్లియర్ చేస్తామని విద్యార్థుల తల్లిదండ్రులతో హామీ పత్రాలు తీసుకుంటున్నారు. వాస్తవంగా పరీక్ష ఫీజు అన్ని సబ్జెక్టుకు కలిపి ప్రభుత్వం కేవలం 125 మాత్రమే నిర్దేశించింది. కానీ చాలా కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో రూ.500 నుంచి రూ.1500 దాకా వసూలు చేస్తున్నట్లు సమాచారం. అధిక ఫీజు వసూలు చేస్తే చర్యలు 10వ తరగతి పరీక్ష ఫీజు కన్నా అధిక మొత్తంలో వసూలు చేసిన పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తాం. అలాగే పరీక్ష ఫీజుకు పాఠశాల ఫీజులకు మెలిక పెడితే శాఖాపరమైన చర్యలు తప్పవు. నామినల్ రోల్స్ విషయంలో అజాగ్రత్త వహిస్తే సంబంధిత హెచ్ఎంలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. – మీనాక్షి, డీఈఓ -
NEET UG 2021: ర్యాంక్ సాధించే మార్గం!
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్–అండర్ గ్రాడ్యుయేట్.. సంక్షిప్తంగా.. నీట్–యూజీ! జాతీయ స్థాయిలో.. సెంట్రల్ యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీలు, ఇతర అన్ని మెడికల్ ఇన్స్టిట్యూట్స్లో.. ఎంబీబీఎస్, బీడీఎస్లతోపాటు ఆయుష్ కోర్సుల్లో చేరాలంటే.. నీట్–యూజీ ఎంట్రన్స్‌లో స్కోరే ప్రధానం! నీట్లో సాధించిన స్కోర్ ఆధారంగానే మెడికల్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. అందుకే.. ఇంటర్మీడియెట్ బైపీసీ అర్హతగా నిర్వహించే ఈ పరీక్షకు.. ఏటేటా పోటీ పెరుగుతోంది. నీట్–యూజీ–2021 తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారికంగా ప్రకటించింది. ఆగస్ట్ 1వ తేదీన ఈ పరీక్ష జరుగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో.. నీట్–యూజీ 2021 విధి విధానాలు.. పరీక్ష ప్యాట్రన్.. ఈ టెస్ట్‌లో మంచి స్కోర్ సాధించడానికి నిపుణుల సలహాలు.. ఎంబీబీఎస్, బీడీఎస్.. దేశంలో లక్షల మంది విద్యార్థుల కల. తమ డాక్టర్ కలను సాకారం చేసుకునే దిశగా.. నీట్ యూజీలో ర్యాంకు సాధిం చేందుకు ఇంటర్ తొలిరోజు నుంచే కృషి చేస్తుంటారు. ఇంతటి కీలకమైన నీట్–యూజీ –2021 తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఇటీవల వెల్లడించింది. దీంతో విద్యార్థులు ఈ పరీక్షలో స్కోర్ సాధించే దిశగా కసరత్తు ముమ్మరం చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పొచ్చు. మొత్తం పదకొండు భాషలు నీట్–యూజీని తెలుగు సహా మొత్తం పదకొండు భాషల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది. విద్యార్థులు దరఖాస్తు సమ యంలోనే తమకు ఆసక్తి ఉన్న భాషను ఎంచు కుంటే.. ఆ భాషలోనే పరీక్ష పేపర్‌ను అందిస్తారు. ఒక్కసారే.. ఆఫ్‌లైన్‌లోనే నీట్‌ను కూడా జేఈఈ మెయిన్ మాదిరిగానే ఒకటి కంటే ఎక్కువసార్లు నిర్వహించే అవకాశముందనే వార్తలు ఇటీవల వినిపించాయి. వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ.. గతేడాది మాదిరిగానే నీట్ ఈ ఏడాది ఒక్కసారి మాత్రమే జరుగుతుందని ఎన్టీఏ స్పష్టం చేసింది. అది కూడా ఆఫ్‌లైన్ విధా నంలో పెన్ పేపర్ పద్ధతిలో నిర్వహించనున్న ట్లు పేర్కొంది. దీంతో విద్యార్థులకు పరీక్ష నిర్వహణపై ఒక స్పష్టత వచ్చింది. కాబట్టి ఇప్పుడిక ఎలాంటి ఆందోళన లేకుండా.. పూర్తిగా ప్రిపరేషన్‌కు ఉప క్రమించాలని నిపుణులు సూచిస్తున్నారు. 180 ప్రశ్నలు.. 720 మార్కులు నీట్ యూజీకి అర్హత ఇంటర్మీడియెట్ బైపీసీ. ఈ పరీక్ష మొత్తం మూడు విభాగాల్లో 180 ప్రశ్నలకు ఆబ్జెక్టివ్ (బహుళైచ్ఛిక ప్రశ్నలు) విధానంలో జరుగుతుంది. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు చొప్పున 720 మార్కులకు నీట్ పరీక్ష ఉంటుంది. వివరాలు.. సిలబస్ కుదింపు కష్టమే కొవిడ్ కారణంగా ఇంటర్మీడియెట్, సీబీఎస్ఈ +2 స్థాయిలో సిలబస్‌ను తగ్గించిన సంగతి తెలిసిందే. దాంతో నీట్ సిలబస్‌ను కూడా కుదిస్తారా? అనే సందేహం విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది. కాని నీట్ సిలబస్ గతేడాది మాదిరిగానే యథాతథంగా ఉంటుందని, ఎలాంటి మార్పులు ఉండవని కొన్ని రోజుల క్రితం కేంద్ర విద్యా శాఖ మంత్రి ట్వీట్ ద్వారా తెలిపారు. జేఈఈ–మెయిన్ మాదిరిగానే నీట్‌లోనూ ఛాయిస్ విధానం ఉంటుందా అనే వాదన కూడా వినిపిస్తోంది. దీనిపైనా మరో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అవగాహన ముఖ్యం నీట్–యూజీ–2021కు తేదీ వెల్లడైంది. కాబట్టి ఇప్పటి నుంచి అందుబాటులో ఉన్న సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ఇంటర్ పరీక్షల ప్రిపరేషన్‌తో సమన్వయం చేసుకుంటూ.. నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు సాగాల్సి ఉంటుంది. తొలుత అభ్యర్థులు నీట్ సిలబస్‌పై పూర్తి స్థాయి అవగాహన తెచ్చుకోవాలి. ఆ తర్వాతే ప్రిపరేషన్‌కు ఉపక్రమించాలి. సిలబస్‌లో పేర్కొన్న దానికి అదనంగా ఇతర అంశాలను చదవాల్సిన అవసరం లేదు. నీట్, బోర్డ్ సిలబస్‌లో కొన్ని కామన్ టాపిక్స్ ఉంటాయి. ఆయా అంశాలను మొదట బోర్డు ఎగ్జామ్స్ కోణంలో ప్రిపేరవ్వాలి. దీనివల్ల ఎంతో విలువైన సమయం ఆదా అవుతుంది. టైమ్ ప్లాన్ కూడా ► నీట్ విద్యార్థులు ఆయా సబ్జెక్టుల ప్రిపరేషన్ కోసం ముందుగానే నిర్దిష్ట సమయ ప్రణాళికను రూపొందించుకోవాలి. దానికి కట్టుబడి ప్రిపరేషన్ సాగించాలి. ► ప్రిపరేషన్ టైమ్ టేబుల్‌ను తప్పనిసరిగా ఏరోజుకారోజు అనుసరించాలి. ► నీట్ సిలబస్‌కు అనుగుణంగా ఆయా సబ్జెక్ట్‌లకు కేటాయించాల్సిన సమయాన్ని నిర్దేశించుకోవాలి. ► నిర్దిష్ట సమయంలో సిలబస్‌ను పూర్తి చేసేలా ముందుకు కదలాలి. ► ఈ సమయంలో అభ్యర్థులంతా స్వీయ సామర్థ్యాలపై స్పష్టతతో వ్యవహరించాలి. ► ప్రతి సబ్జెక్టుకూ సమానంగా సమయం కేటాయించుకోవాలి. ► ప్రతి రోజు చదవాల్సిన టాపిక్స్‌ను ముందుగానే విభజించుకుని.. దానికి అనుగుణంగా అధ్యయనం చేయాలి. ► ప్రతి రోజు మాక్ టెస్టులకు హాజరవ్వాలి. ఫలితంగా స్వీయ సామర్థ్యాలపై అవగాహన వస్తుంది. ఇంకా ఏఏ సబ్జెక్ట్‌లలో పట్టు సాధించాలనే దానిపై స్పష్టత లభిస్తుంది. ► సబ్జెక్ట్ పరంగా బలహీనంగా ఉన్న అంశాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. ► పరీక్షకు రెండు నెలల ముందు కొత్త చాప్టర్లు, అంశాల జోలికి వెళ్లకూడదు. ఈ సమయాన్ని పూర్తిగా రివిజన్‌కే కేటాయించాలి. ► మోడల్ ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయాలి. ► డైరెక్ట్ కొశ్చన్స్ కంటే ఇన్ డైరెక్ట్ కొశ్చన్స్‌నే ఎక్కువ అడుగుతున్న విషయాన్ని గుర్తించాలి. దీనికి అనుగుణంగా మోడల్ టెస్ట్‌లను వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ► ఇంటర్ పరీక్షలకు నెల రోజుల ముందు వరకు నీట్ ప్రిపరేషన్‌ను సమాంతరంగా కొనసాగించొచ్చు. ► ఇంటర్మీడియెట్ పరీక్షలకు నెల రోజుల ముందు నుంచి పూర్తిగా బోర్డ్ పరీక్షలకే సమయం కేటాయించాలి. ► ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తయ్యాక.. తిరిగి నీట్‌కు పూర్తిస్థాయిలో ప్రిపరేషన్ సాగించాలి. ► ప్రిపరేషన్ సమయంలోనే షార్ట్ నోట్స్ రూపొందించుకోవాలి. ఇది రివిజన్‌కు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. సబ్జెక్టుల వారీగా నిపుణుల ప్రిపరేషన్ టిప్స్ ఫిజిక్స్.. ఈ టాపిక్స్ ప్రధానం నీట్ ఫిజిక్స్ విభాగంలో మంచి స్కోర్ సాధించాలంటే.. ఆప్టిక్స్, మెకానిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మోడరన్ ఫిజిక్స్ చాప్టర్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో అధ్యాయానికి చివర ఇచ్చిన ప్రశ్నలను సాధించాలి. అవకలనం, సమాకలనం అనువర్తనాలపై పట్టు సాధించాలి. ఇంటర్ రెండేళ్ల పాఠ్యాంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. పైన పేర్కొన్న చాప్టర్లతోపాటు మిగిలిన సిలబస్ అంశాలను అధ్యయనం చేయాలి. గత రెండేళ్ల ప్రశ్నల సరళిని పరిశీలిస్తే.. రొటేషనల్ డైనమిక్స్, సిగ్మా పార్టికల్స్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాలని అర్థం అవుతోంది. అదేవిధంగా ఎలక్ట్రోమ్యాగ్నటిజం, ఇండక్షన్, కరెంట్ ఎలక్ట్రిసిటీ వంటి చాప్టర్లు విద్యార్థులకు అంత త్వరగా ఎక్కవు. వీటిని చదవడంతోపాటు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని గుర్తించాలి. - ఎన్.నరసింహమూర్తి, సబ్జెక్ట్ నిపుణులు కెమిస్ట్రీ.. పునశ్చరణ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, మోల్ కాన్సెప్ట్, కెమికల్ బాండింగ్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కోఆర్డినేషన్ కాంపౌండ్, ఈక్విలిబ్రియమ్, పాలిమర్లు, బయో మాలిక్యూల్స్, పరమాణు నిర్మాణం, సాలిడ్ స్టేట్, ద్రావణాలు, సర్ఫేజ్ కెమిస్ట్రీ తదితరాలను కెమిస్ట్రీలో కీలక పాఠ్యాంశాలుగా పేర్కొవచ్చు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో.. ఐసోమెరిసమ్, సమ్మేళనాల తయారీ, ధర్మాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. కెమిస్ట్రీలో విద్యార్థులు చర్యలు, సమీకరణాలను మర్చిపోతుంటారు. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు పునఃశ్చరణ చేయాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో.. వివిధ మూలకాలు, వాటి సమ్మేళనాల ధర్మాలను అధ్యయనం చేయాలి. కెమిస్ట్రీలో.. ఫిజికల్, ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలను వాటి వాటి స్వభావాల ఆధారంగా ప్రిపేరవ్వాలి. ఫిజికల్ కెమిస్ట్రీ విషయానికొస్తే... ఇందులో ఫార్ములాలతో సొంత నోట్స్ రూపొందిం చుకోవాలి. ఫలితంగా ఫార్ములాను అన్వయించే నైపుణ్యాలు సొంతమవుతాయి. పీరియాడిక్ టేబుల్‌పై పట్టు సాధిస్తే.. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మంచి మార్కులు సాధించొచ్చు. పునశ్చరణ చేస్తూ, మాదిరి ప్రశ్నలు సాధించడం ద్వారా.. పరీక్షకు కావల్సిన సన్నద్ధత లభిస్తుంది. - విజయ్ కిశోర్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ నిపుణులు బయాలజీ.. కాన్సెప్ట్లపై పట్టు నీట్–యూజీ పరీక్షలో కీలకంగా భావించే విభాగంగా బయాలజీని పేర్కొనొచ్చు. ఇంటర్ బైపీసీ విద్యార్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ కంటే బయాలజీపై ఎక్కువ పట్టు కలిగి ఉంటారు. నీట్ బయాలజీలో రాణించాలంటే.. ఫిజియాలజీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, మార్ఫాలజీ, జెనిటిక్స్ అండ్ ఎవల్యూషన్, సెల్ బయాలజీ, బయోటెక్నాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్‌లను ముఖ్య చాప్టర్లుగా భావించి చదవాలి. అన్ని అంశాలకు సంబంధించి కాన్సెప్ట్ట్‌లపై పట్టు సాధించాలి. ఎకాలజీలో ఆర్గనైజేషన్స్ అండ్ పాపులేషన్, ఎకోసిస్టమ్‌పై ప్రశ్నలు వస్తున్నాయి. వీటితోపాటు బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ పాఠ్యాంశాలపై ఫోకస్ చేయడం లాభిస్తుంది. ప్లాంట్ ఫిజియాలజీలో.. ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, మొక్కల హార్మోనులు, ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్ చాప్టర్లను ప్రిపేరవ్వాలి. సెల్ స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్‌లో కణ విభజన(సమ విభజన, క్షయకరణ విభజన)లోని వివిధ దశల్లో జరిగే మార్పులు, కణచక్రం తదితరాలను అధ్యయనం చేయాలి. బయోమాలిక్యూల్స్ నుంచి కంటెంట్ సంబంధిత ప్రశ్నలు వస్తాయి. రీప్రొడక్షన్ నుంచి దాదాపు 10 ప్రశ్నల వరకు అడుగుతున్నారు. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థను బాగా అధ్యయనం చేయాలి. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్‌హెరిటన్స్‌లో రెప్లికేషన్, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్, రెగ్యులేషన్లపై దృష్టిపెట్టాలి. నీట్లో ఇంటర్ సిలబస్‌లో లేని అంశాలను గుర్తించి.. వాటికోసం ప్రత్యేక సమయం కేటాయించాలి. - బి.రాజేంద్ర, బోటనీ సబ్జెక్ట్ నిపుణులు జువాలజీలో ఇలా జువాలజీలో గత రెండేళ్ల ప్రశ్న పత్రాలను పరిగణనలోకి తీసుకుంటే.. మొత్తం 45 ప్రశ్నల్లో హ్యూమన్ ఫిజియాలజీ నుంచి 14, ఎకాలజీ నుంచి 10–12, జెనిటిక్స్, ఎవల్యూషన్ కలిపి 6 ప్రశ్నలు వరకు వస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు ఆయా పాఠ్యాంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్‌సీఈఆర్‌టీతోపాటు ఇంటర్ పుస్తకాల నుంచీ ప్రశ్నలు అడుగుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గత ప్రశ్న పత్రాలను, ఇంటర్లో ఆయా చాప్టర్స్ చివరలో అడిగే ప్రశ్నలను సాధన చేయాలి. ఎన్సీఈఆర్టీ, ఇంటర్ పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. ఇలా చేస్తే ఆశించిన ర్యాంకు సొంతమవడం ఖాయం. - కె.శ్రీనివాస్, జువాలజీ సబ్జెక్ట్ నిపుణులు అనలిటికల్ అప్రోచ్‌తో ఎంతో మేలు నీట్ ప్రిపరేషన్ క్రమంలో అనలిటికల్ అప్రోచ్‌తో సాగితే..ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. ప్రతి రోజు తాము చదివిన అంశాలతో షార్ట్ నోట్స్ రూపొందించుకోవడం, ఇన్స్టిట్యూట్లు నిర్వహించే వీక్లీ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు హాజరు కావడం కూడా ఎంతో మేలు చేస్తుంది. – అనంత పరాక్రమ్ భార్గవ్, నీట్–2020 11వ ర్యాంకు నీట్–యూజీ(2021) సమాచారం ► నీట్ పరీక్ష తేదీ: ఆగస్ట్ 1, 2021 ► పరీక్ష వ్యవధి: మూడు గంటలు(పెన్, పేపర్ విధానంలో) ► అర్హత: బైపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► నీట్‌కు బైపీసీతో ఉత్తీర్ణత అని పేర్కొన్నప్పటికీ.. ప్రవేశాల సమయంలో కొన్ని ఇన్స్టిట్యూట్లు బైపీసీ గ్రూప్ సబ్జెక్ట్‌లలో 50 శాతం మార్కులు పొంది ఉండాలనే నిబంధన విధిస్తున్నాయి. ► వయో పరిమితి: కనిష్ట వయోపరిమితి 17 ఏళ్లు, గరిష్ట వయో పరిమితి 25 ఏళ్లు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ► పూర్తి నోటిఫికేషన్ ఏప్రిల్ మొదటి వారంలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ► పూర్తి వివరాలకు వెబ్‌సైట్స్: https://ntaneet.nic.in, https://nta.ac.in -
JEE Advanced 2021: అడ్వాన్స్‌డ్‌లో విజయం ఇలా..!
దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే.. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో ఉత్తీర్ణులవ్వడం తప్పనిసరి. ఈ అడ్వాన్స్‌డ్‌లో విజయం సాధించడానికి ప్రత్యేక మ్యాజిక్ ఫార్ములాలు అంటూ ఏమీలేవు. పక్కా ప్రణాళిక, పట్టుదలతో కూడిన ప్రిపరేషన్ మాత్రమే అడ్వాన్స్‌డ్‌లో విజయానికి దారి చూపుతుంది. జేఈఈ అడ్వాన్స్ పరీక్ష జులై 3న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం సబ్జెక్ట్ వారీ ప్రిపరేషన్ టిప్స్.. ఐఐటీలు వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లలో ఇంజనీరింగ్ చదవాలని దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు కోరుకుంటారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో అర్హత సాధించిన వారు మాత్రమే ఐఐటీల్లో ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. అందుకే విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో విజయం సాధించేందుకు ఇంటర్లో చేరిన తొలిరోజు నుంచే ప్రిపరేషన్ సాగిస్తుంటారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరు కావాలంటే.. మొదట జేఈఈ మెయిన్ పరీక్షల్లో టాప్‌లో నిలవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం నాలుగుసార్లు నిర్వహించనున్న జేఈఈ మెయిన్ పరీక్షలు.. ఇప్పటికే రెండుసార్లు జరిగాయి. ఈ ఏడాది ఇలా ఈ ఏడాది జులై 3వ తేదీన అడ్వాన్స్డ్ పరీక్ష జరుగనుంది. కొవిడ్ కారణంగా గతేడాది రాయలేకపోయిన వారు, ప్రస్తుతం అడ్వాన్స్డ్ పరీక్షలకు హాజరుకాబోయే వారితో ఈసారి పోటీ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి విద్యార్థులు సరైన ప్రణాళికతో సబ్జెక్ట్ వారీ ప్రిపరేషన్‌తో ముందుకు వెళ్తేనే పరీక్షలో విజయం సాధించేందుకు వీలుంటుంది. సన్నద్ధత ఇలా ప్రస్తుత సంవత్సరం జరిగే పరీక్షా స్వరూపంలో ఎలాంటి మార్పులు లేవు. ఎప్పటిలాగానే ఆన్లైన్ విధానంలో మూడు గంటల కాలవ్యవధితో పరీక్షను నిర్వహించనున్నారు. సిలబస్ విషయానికివస్తే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి ప్రశ్నలుంటాయి. కాబట్టి అభ్యర్థులు సబ్జెక్ట్ వారీగా ఆయా సిలబ్ అంశాలపై దృష్టిపెట్టి ప్రిపరేషన్ కొనసా గించాలని నిపుణులు సూచిస్తున్నారు. సబ్జెక్ట్‌ల వారీగా ప్రిపరేషన్ మ్యాథమెటిక్స్ : జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో మ్యాథమెటిక్స్ విభాగంలో మంచి స్కోర్ సాధించాలంటే.. ప్రాక్టీస్ చాలా ముఖ్యం. ఇందులో సూత్రాలను ఎక్కువగా గుర్తుపెట్టుకోవ డానికి షార్ట్ కట్ మెథడ్స్‌ను తెలుసుకోవాలి. కోఆర్డినేట్ జామెట్రీ, డిఫరెన్షియల్ కాలిక్యులస్, ఇంటిగ్రల్ కాలిక్యులస్, మాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్తోపాటు 3డీ జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, వెక్టార్ అల్జీబ్రా, ఇంటిగ్రేషన్, కాంప్లెక్స్ నెంబర్స్, పారాబోలా, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్, బైనామియల్ థీరమ్, లోకస్ తదితర అంశాలపై బాగా పట్టు సాధించాలి. కెమిస్ట్రీ: కెమిస్ట్రీ సబ్జెక్టు కాంబినేషన్ అఫ్ థియరీగా ఉంటుంది. ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్ వంటి కలయికతో ఉంటుంది. కాబట్టి విద్యార్థులు కెమిస్ట్రీ కోసం ప్రత్యేకంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని నోట్‌బుక్‌లో రాసుకోవ డం ద్వారా ఆయా అంశాలను త్వరగా రివిజన్ చేసుకోవ డానికి వీలుంటుంది. ఇందులో కెమికల్ బాండింగ్, ఆల్కైల్ హలైడ్, ఆల్కహాల్స్ అండ్ ఈథర్, కార్బొనైల్ కాంపౌండ్స్, అటామిక్ స్ట్రక్చర్ అండ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్ అండ్ థర్మోకెమిస్ట్రీ అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. అంతేకాకుండా మోల్కాన్సెప్ట్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఫినాల్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్, అటామిక్ స్ట్రక్చర్, గ్యాసియస్ స్టేట్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, డీ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ఫిజిక్స్ : ఈ సబ్జెక్టుకు సంబంధించి బేసిక్ ఫిజిక్స్ కాన్సెప్ట్లపై అభ్యర్థులు పట్టు సాధించాలి. లాజికల్ థింకింగ్ సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. సమస్యలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఫండమెంటల్స్‌పై పట్టు సాధించడానికి ఎన్సీఈఆర్టీ ఫిజిక్స్ బుక్స్, హెచ్‌సీ వర్మ, డీసీ పాండే ఫిజిక్స్ బుక్స్‌ను చదవాలి. అలాగే ఒక టాపిక్ మొదలు పెట్టినప్పడు దానికి సంబంధించిన సమస్యలను అదేరోజు పూర్తిచేసుకునే విధంగా ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. ఇందులో ఎలక్ట్రో డైనమిక్స్, మెకానిక్స్ వంటివి కీలకమైన టాపిక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అలాగే హీట్ అండ్ థర్మోడైనమిక్స్, మోడ్రన్ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎస్హెచ్ఎం అండ్ వేవ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. అలాగే సెంటర్ ఆఫ్ మాస్, మూమెంటమ్ అండ్ కొలిజన్, సింపుల హార్మోనిక్ మోషన్, వేవ్ మోషన్ అండ్ స్ట్రింగ్ వేవ్స్‌లో లోతైన అవగాహన ఏర్పరచుకుంటే మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. రివిజన్‌కు ప్రాధాన్యం సబ్జెక్టుల వారిగా అన్ని టాపిక్స్‌ను పూర్తి చేసుకున్న తర్వాత రివిజన్‌కు ప్రాధాన్యం∙ఇవ్వాలి. ఆయా టాపిక్స్‌లోని ముఖ్యమైన అంశాలు తేలిగ్గా గుర్తుకు వచ్చేవిధంగా షార్ట్‌నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది పరీక్ష ముందు రివైజ్ చేసుకోవడానికి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. మాక్ టెస్టులతో స్పీడ్ విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలంటే.. ఎక్కువగా మాక్‌టెస్టులు, మోడల్ టెస్టులను రాయాలి. దీనివల్ల పరీక్షను వేగంగా నిర్దేశిత సమయంలోపు పూర్తిచేయడానికి వీలవుతుంది. అంతే కాకుండా మాక్ టెస్టులు విద్యార్థులు పరీక్షలో మంచి ప్రతిభ చూపేందుకు ఉపయోగపడతాయి. అలాగే ఆన్లైన్ పరీక్ష విధానంపైనా అవగాహన ఏర్పడుతుంది. సీఏ, సీఎస్, సీఎంఏలకు పీజీ హోదాతో ప్రయోజనాలెన్నో! -
మై జీనియస్ స్టార్‌లో నైపుణ్య శిక్షణ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అబాకస్, క్యూబ్స్, ప్రోగ్రామింగ్ వంటి సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవాలంటే? ప్రత్యేకంగా శిక్షణ కేంద్రానికెళ్లాలి లేదా హోమ్ ట్రెయినర్‌ను పెట్టుకోవాలి. కాకపోతే ఇలాంటివి మెట్రోల్లోనే దొరుకుతాయి. మరి, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని విద్యార్థులైతే? ఇదే సమస్య ఒక తల్లిగా నవ్యకూ ఎదురైంది. డ్రాయింగ్ టీచర్‌ను వెతికే పనిలో ఏకంగా సాఫ్ట్‌స్కిల్స్ యాప్స్‌ను అభివృద్ధి చేసే సాఫ్ట్వేర్ కంపెనీ ‘ఐ–యాప్స్ ట్రాక్ సాఫ్ట్వేర్’ను ప్రారంభించేసింది. మరిన్ని వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘మాది అనంతపురం. బిట్స్ పిలానీలో బీఈ పూర్తయ్యా క... అమెరికాలోని ఎస్‌హెచ్‌యూ వర్సిటీలో ఎంబీఏ ఫైనాన్స్ చేశా. పలు బహుళ జాతి కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలొచ్చాయి. సొంతూళ్లో ఏదైనా కంపెనీ పెట్టాలన్నది నా కోరిక. ‘‘ఐదేళ్ల వయసున్న మా అబ్బాయికి డ్రాయింగ్ అంటే మహా ఇష్టం. నాకేమో రాదు. పోనీ, దగ్గర్లో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా అంటే అదీ లేదు. డ్రాయింగ్ ట్రైనింగ్ యాప్స్, ప్రొడక్ట్స్ ఆన్లైన్లో చాలా కొన్నాం. కానీ లాభం లేకుండా పోయింది. అప్పుడే అనిపించింది సబ్జెక్ట్స్‌తో పాటూ నైపుణ్య శిక్షణ ఇచ్చే ప్రొడక్ట్స్ మార్కెట్లో లేవని! అందుకే 2015లో రూ.20 లక్షల పెట్టుబడితో అనంతపురం కేంద్రంగా ఐయాప్స్ ట్రాక్ సాఫ్ట్వేర్ ప్రై.లి.ను ప్రారంభించాం. 5 నుంచి 16 సంవత్సరాల పిల్లల్లో సృజనాత్మకత, విశ్లేషణాత్మక, జిజ్ఞాసలను పెంపొందించే విద్యా సంబ ంధమైన ఉత్పత్తులను అభివృద్ధి చేయడమే మా కంపెనీ ప్రత్యేకత. డ్రీమ్ వీఆర్ కళ్లద్దాలు.. ఐయాప్స్ ట్రాక్ సాఫ్ట్వేర్ నుంచి తొలి ఉత్పత్తి డ్రీమ్ వీర్ (వర్చువల్ రియాలిటీ). డ్రీమ్ వీఆర్ కళ్లద్దాలను 2016 నవంబర్‌లో మార్కెట్లోకి రిలీజ్ చేశాం. సుమారు 2 వేల యూనిట్లు విక్రయించాం. ఏ వీఆర్ వీడియోలనైనా సరే ఈ డ్రీమ్ వీఆర్ కళ్లద్దాల ద్వారా వీక్షించే వీలుండటమే వీటి ప్రత్యేకత. వీటి ధర రూ.2,999. ప్రస్తుతం మాకు 2–3 వేల మంది యూజర్లున్నారు. వచ్చే ఏడాది ముగిసేసరికి 50 వేల మంది యూజర్లకు, రూ.3 కోట్ల ఆదాయాన్ని చేరుకోవాలన్నది మా లక్ష్యం. అంతర్జాతీయ స్కూళ్లతో ఒప్పందం.. ప్రస్తుతం మై జీనియస్ స్టార్ అనే అగ్మెంటెడ్ రియాలిటీ యాప్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఫిబ్రవరిలో మార్కెట్లోకి తెస్తాం. దీన్లో రూబిక్స్ క్యూబ్, అబాకస్, డ్రాయింగ్, హ్యాండ్ రైటింగ్ వంటి ఉత్పత్తులుంటాయి. వీటిల్లో ఏ యాప్‌నైనా సరే డౌన్లోడ్ చేసుకుని మై జీనియస్ ద్వారా సులువుగా నేర్చుకునే వీలుంటుందన్నమాట. యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేంత వరకే ఇంటర్నెట్ అవసరం. తర్వాత నెట్ లేకున్నా యాప్ సేవలను అందుకోవచ్చు. ఫిబ్రవరిలో హైదరాబాద్, బెంగళూరులోని పలు అంతర్జాతీయ పాఠశాలల్లో మై జీనియస్ స్టార్‌ను ప్రారంభించనున్నాం. చిరెక్, జీ గ్రూప్ వంటి వందకు పైగా స్కూళ్లలో దీన్ని అందుబాటులోకి తెస్తాం. ఒక్క యాప్ ఇన్‌స్టలేషన్‌కు రూ.5 వేలు చార్జీ ఉంటుంది. రూ.4 కోట్ల నిధుల సమీకరణ.. ఇప్పటివరకు రూ.3 కోట్ల పెట్టుబడి పెట్టాం. 4 నెలల్లో ప్రోగ్రామింగ్, పజిల్, సుడోకో, మెమొరీ బూస్టర్ వంటి అగ్మెంటెడ్ రియాలిటీ ప్రొడక్ట్‌లను మార్కెట్లోకి తెస్తాం. ‘‘ప్రస్తుతం మా కంపెనీలో 10 మంది ఉద్యోగులున్నారు. త్వరలో 25 శాతం వాటా విక్రయంతో రూ.4 కోట్ల నిధులను సమీకరించనున్నాం’’ -
లెక్క సరిచేస్తారా ?!
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్ : విద్యార్థులకు కొన్ని సబ్జెక్టులపై ఉన్న భయమే ఫలితాలపై ప్రభావం చూపుతోంది.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానంగా గణితం, సైన్స్, ఆంగ్లం సబ్జెక్టుల విషయంలో విద్యార్థులు ఒక రకమైన ఆందోళనకు గురవుతున్నారు. ఆయా సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు సాధించేలా, ఫెయిల్ కాకుండా చదువుకునే విషయమై అవగాహన లేకపోవడం ఓ కారణమైతే.. బోధనలోని లోపాలను మరో కారణంగా చెప్పొచ్చు. ఇక ప్రత్యేక సబ్జెక్టు ఉపాధ్యాయులు లేక పలు ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఏటా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చదవమని ఒత్తిడి తెచ్చేవారే తప్ప.. ఎలా చదవాలో నేర్పించే వారు లేకపోవడం ఈ సమస్యకు కారణమవుతోంది. ఫలితంగా అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం గణితం, సైన్స్, ఆంగ్లం విషయానికొచ్చే సరికి వెనుకబడిపోతున్నారు. గతంలో తప్పిన గణాంకాలు.. గత విద్యాసంవత్సరం పదో తరగతిలో గణితంలో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. మిగతా వాటి కంటే గణితం, సైన్స్, ఇంగ్లిష్‌లో నే ఎక్కువ మంది వెను కబడినట్లు ఫలితాలు చెబుతున్నాయి. తెలుగు సబ్జెక్టులో 297 మంది, హిందీలో 85 మంది, ఇంగ్లిష్‌లో 455 మంది, గణితంలో అత్యధికంగా 3,833 మంది, సైన్స్‌లో 3,019 మంది ఫెయిల్ కాగా.. సోషల్‌లో 417 మంది విద్యార్థులు ఫెయిల్ అ య్యారు. గతంలో చాలా మంది విద్యార్థులు గణితంలోనే ఫెయిల్ కావడంతో విద్యాసంవత్సరం ప్రారంభం నుండి సమావేశాలు, ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినా ఆశించిన మేరకు ఫలితాలు రాలేదు. గత విద్యాసంవత్సరం కూడా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. వందేమాతరం ఫౌండేషన్ వంటి స్వచ్ఛంద సంస్థలు సైతం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాయి. కేజీబీవీలు, గురుకులాల్లో వేదిక్ మ్యాథ్స్, తో పాటు ప్రత్యేక విద్యాసామగ్రి, ప్రాక్టీస్ పేపర్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం ఆశించినంత మేరకు ఫలితాలు రాకపోవడంతో అందరూ నిరుత్సాహానికి గురయ్యారు. ఇక గత ఏడాది అన్ని యాజమాన్యాల పరిధిలో మొత్తం 20,092 మంది ఎస్సెస్సీ పరీక్షలకు హాజరైతే, 14,392 మంది పాస్ అయ్యారు. తద్వారా 71.77శాతం ఉత్తీర్ణతతో మహబూబ్‌నగర్ జిల్లా రాష్ట్రంలో 28వ స్థానంలో నిలించింది. కాగా, ఈ సారి జిల్లాలో మొత్తం 24,453 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. ఉపాధ్యాయుల కొరత.. బోధనలో లోపాలు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదవుతున్న విద్యార్థులను తీర్చిదిద్దడం ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధ్యాయులకు కత్తి మీద సాములా మారింది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతలు కొద్దిమేరకు మెరుగుపడుతున్నట్లు కనిపిస్తున్నాయి. అయినా ఫలితాల్లో ఇంకా ముందడుగు పడడం లేదు. పలు పాఠశాలల్లో ప్రధాన సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులు లేకపోవడం, ప్రభుత్వం ఉన్న ఉపాధ్యాయులతోనే బోధన చేయించడం, వారు అందుబాటులో లేనిచోట్ల విద్యావలంటీర్లకు బాధ్యతలు అప్పగించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. సబ్జెక్టు నిపుణులు లేని కారణంగానే ఎక్కువ మంది విద్యార్థులు గణితం, ఆంగ్లం, సైన్స్ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. ఇకనైనా కఠినమైన సబ్జెక్టుల విషయంలో విద్యాశాఖ అ«ధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ సబ్జెక్టుల్లో నిపుణులైన ఉపాధ్యాయులను నియమించడంతో పాటు సబ్జెక్టుల వారీగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిలో విషయ పరిజ్ఞానం పెంచేందుకు చర్యలు తీసుకుంటే ఉత్తమ ఫలితాలు వచ్చే అవకాశముంది. వీడని భయం విద్యార్థులు ఎక్కువగా ఫెయిల్ అవుతున్న సబ్జెక్టులను గుర్తించి ఆయా సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించేలా విద్యాశాఖ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు, విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. గత ఏడాది ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని 11 పాఠశాలల్లో 45 శాతం కంటే తక్కువ ఫలితాలు నమోదయ్యాయి. ఈ కారణంగా మండల, గ్రామీణ స్థాయి విద్యార్థులు సైతం సబ్జెక్టుల్లో ఉత్తీర్ణతపై ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుండి డీఎస్సీ ప్రకటించకపోవడంతో పాటు చాలా పోస్టులు ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాయి. ప్రధానంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ లేకపోవడం ఎస్సెసీవిద్యార్థుల ఉత్తీర్ణతపై ప్రభావం చూపేప్రమాదముంది. జిల్లా వ్యాప్తంగా వివిధ సబ్జెక్టుల్లో కలి దాదాపు 1,994 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. ప్రారంభమైన బిస్కెట్ల పంపిణీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థుల కోసం ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ తరగతులు గత ఆగస్టు నుండి ప్రారంభం కాగా.. గత మంగళవారం నుండి పూర్తి స్థాయిలో విద్యార్థులకు బిస్కెట్లు అందజేసేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అందుకు అనుగుణంగా జిల్లాలోని 212 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మల్టీగ్రేయిన్ బిస్కెట్లు అందజేస్తున్నారు. తద్వారా విద్యార్థులు అలిసిపోకుండా శ్రద్ధగా చదువుకుంటారనేది ప్రభుత్వ భావన 40 రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నాం.. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో మంచి ఫలితాలు వచ్చే విధంగా 40 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నాం. చదువులో వెనుకబడి ఉన్న వారిని గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకుంటుంన్నాం. ముఖ్యమైన ప్రశ్నాంశాలతో మెటీరియల్ రూపొందిస్తున్నాం, ఫలితాలు మెరుగుపడేలా అన్ని చర్యలు తీసుకుంటాం. దీనికి సంబంధించి ఇప్పటికే హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు అన్ని ఆదేశాలు జారీ చేశాం. ప్రస్తుతం ఎస్సెస్సీ విద్యార్థులకు బిస్కెట్ల కూడా పంపిణీ ప్రారంభమైంది. ఏ సబ్జెక్టులోనైతే ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అవుతారో, ఎక్కువ మందికి తక్కువ మార్కులు వస్తాయో ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. విద్యార్థులకు పూర్తి స్థాయిలో పరీక్షలకు సిద్ధం చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. – సోమిరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి -
ఆ సబ్జెక్టుల్లోనే ఎక్కువగా ఫెయిల్..
లెక్కలు, సైన్స్, ఇంగ్లిష్ ఈ మూడుసబ్జెక్టులంటే చాలామంది విద్యార్థులకు భయం. ఎలా చదవాలో, ఏ లెక్కనుఎలా సూత్రీకరించాలో అనే అయోమయం, సైన్స్ పాఠాలను తమకు తామే అవగతం చేసుకోవడం సాధ్యం కాక.. ఇంగ్లిష్ గ్రామర్ రహస్యాలను నిశితంగా వివరించే బోధనా సామర్థ్యం కలిగిన ప్రత్యేక సబ్జెక్టు ఉపాధ్యాయులు లేక పలు ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు అల్లాడుతున్నారు. చదవమని ఒత్తిడి తెచ్చేవారే తప్ప.. ఎలా చదవాలో చెప్పేవారు.. విషయపరిజ్ఞానాన్ని పెంచేవారు లేకుండా మార్కుల పోరాటంలో పిల్లలు సతమతమవుతున్నారు. చిత్తూరు, సాక్షి: పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. ఏటా లెక్కలు, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్లులో ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాలేకపోతున్నారు. జిల్లాలో 88 మంది టీచర్ల కొరత కొంత ఉన్నా అదొక్కటే కారణం కాదని నిపుణుల విశ్లేషణ. బోధనలో నైపుణ్యం కొరవడుతోందనే విమర్శ ఉంది. సబ్జెక్టు నీడ్ ఉపాధ్యాయులు అన్ని పాఠశాలల్లో ఉన్నా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించకపోవడానికి గల కారణాలపై సమీక్ష ఫలితాల సమయంలో తప్పితే తరువాత పట్టించుకోవడం లేదు. ఉపాధ్యాయులు స్థానికంగా ఉండేలా చర్యలు తీసుకోకపోవడం వంటి కారణాలు కూడా ప్రభావం చూపుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో అమలు కావడం లేదు. కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు కూడా ఏమంత మెరుగ్గా లేవు. పదో తరగతి ఫలితాల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో చతికిలపడటమే ఇందుకు సాక్ష్యం. కొన్ని స్కూళ్లు మాత్రం ఇందుకు భిన్నం. అనేక మంది విద్యార్థులు గణితం, ఇంగ్లిష్, సైన్స్లలోనే ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు దీనిపైనే చర్చ జరుగుతోంది. పలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధాన సబ్జెక్టులను బోధించే ఉపాధ్యాయులు లేకపోవడం, ఉన్న టీచర్లతోనే ఆయా సబ్జెక్టులను చెప్పించడం వారు సైతం అందుబాటులో లేక విద్యావాలంటీర్లతో అవకాశం ఉన్నంత వరకు పాఠాలు చెప్పించామనే భావన కల్పించడం వంటి కారణాలతో విద్యార్థులు ప్రధాన సబ్జెక్టుల్లో రాణించలేని స్థితి ఉంది. పదో తరగతి ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో సైతం ఈ సబ్జెక్టుల్లో అత్తెసరు మార్కులే వస్తుండటం గమనార్హం. చిత్తశుద్ధి లేదా? జిల్లాలో 573 ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రతి సంవత్సరం సుమారు 35 వేల మంది విద్యార్థులు సర్కారు బళ్లలో చదివి పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. మూడు సంవత్సరాల నుంచి ఉత్తీర్ణతలో అట్టడుగుస్థానంలో ఉన్నాం. ఉత్తీర్ణత పెంచేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం అని జిల్లా విద్యాశాఖ ప్రకటిస్తూనే ఉంటుంది. ఫలితం మాత్రం కనిపించడం లేదు. ప్రత్యేక తరగతులు నిర్వహించి.. విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నా రిజల్ట్ మాత్రం అంతంత మాత్రమే. చిత్తశుద్ధి లేకుండా పని చేస్తుండటం వల్లే దారుణమైన ఫలితాలు వస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఆ సబ్జెక్టుల్లోనే ఎక్కువగా ఫెయిల్.. గత ఏడాది మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో ఎక్కువ మంది ఫెయిలయ్యారు. పాసయిన వారిలో కూడా ఎక్కువ మందికి ఈ సబ్జెక్టుల్లో బొటాబొటీæ మార్కులు వచ్చాయి. మిగతా సబ్జెక్టులను అవలీలగా చదివేవారు ఈ సబ్జెక్టుల వద్దకు వచ్చేసరికి పట్టు సాధించలేకపోతున్నారు. గత ఏడాది ఫలితాల్లో తెలుగు, హిందీ, సోషియల్ వంటి సబ్జెక్టుల్లో తక్కువ మంది ఫెయిల్ కాగా, లెక్కలు, సైన్స్, ఇంగ్లిష్‌లలో ఎక్కువ మంది పాస్ మార్కుల కంటే తక్కువ మార్కులు తెచ్చుకున్నారు. గణితంలో 2133 మంది, సైన్స్ 1978 మంది, ఇంగ్లిష్ 2181 మంది ఉత్తీర్ణత సాధించలేకపోయారు. మిగతా సబ్జెక్టులతో పోలిస్తే వీటిలో ఫెయిల్ అయిన వారు ఎక్కువ మంది ఉన్నారు. ఈ మూడు కఠినమైన సబ్జెక్టులనే అభిప్రాయం విద్యార్థుల్లో ఉండటం, 9వ తరగతి వరకు ఈ సబ్జెక్టులను ఇటు విద్యార్థులు కానీ.. అటు ఉపాధ్యాయులు కానీ సీరియస్‌గా తీసుకోకపోవడం కారణం కావచ్చు. పదో తరగతికి రాగానే ఒక్కసారిగా విద్యార్థులను ఈ సబ్జెక్టులు గందరగోళానికి గురి చేస్తుంటాయి. లెక్కల్లో ఫార్ములాలు సరిగా అర్థం కాకపోవడం, ఇంగ్లిష్‌లో అప్పటికప్పుడు గ్రామర్ నేర్చుకోవాల్సి రావడం వంటి వాటితో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. సబ్జెక్టులపై వీడని భయం.. విద్యార్థులు ఎక్కువగా ఫెయిల్ అవుతున్న సబ్జెక్టులను గుర్తించి వాటిలో ఉత్తీర్ణత సాధించేందుకు జిల్లా విద్యాశాఖ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నా.. ఉపాధ్యాయుల నియామకం, సబ్జెక్ట్ నీడ్ టీచర్లతో బోధనకు అనేక చోట్ల ప్రాధాన్యం కొరవడటంతో విద్యార్థులు పూర్తిస్థాయిలో ప్రతిభ చాటలేకపోతున్నారు. -
తరగతి గదిలో ‘ఈ’ చదువులు!
స్కూలు బ్యాగులవసరం లేకుండా పాఠ్యాంశాలన్నీ ట్యాబ్లెట్స్లోనే.. - మన దేశంతో పాటు దుబాయ్, దక్షిణాఫ్రికాల్లో సేవలందిస్తున్న ఎడ్యుటర్ - మూడో విడతగా రూ.40 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తొమ్మిదో తరగతి చదివే శ్రీధర్‌కు ఎప్పుడూ లెక్కల్లో 20కి పది మార్కులే వస్తాయి. ప్రతిసారీ మిగతా పది మార్కులు ట్రిగ్నోమెట్రీలోనే పోతాయి. అమ్మానాన్నల దృష్టిలో శ్రీధర్ మ్యాథ్స్‌లో వీక్. కానీ, నిజానికి శ్రీధర్ లెక్కల్లో కాదు కేవలం ట్రిగ్నోమెట్రీలోనే వెనకబడిపోతున్నాడు. ఈ సంగతి వాళ్లకి తెలిసేదెలా? నిఖిత తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులే. పేరెంట్స్ మీటింగ్‌కు హాజరవటం ఇద్దరికీ కుదరదు. మరి కూతురి మార్కులు, హాజరుకు సంబంధించిన సమాచారం వాళ్లకు తెలిసేదెలా? ...ఇలా ఒకటి కాదు రెండు కాదు పిల్లల విషయంలో తల్లిదండ్రులకు ఎన్నో సందేహాలు. ఇదిగో... ఈ సందేహాలు తీర్చడానికే విద్యావ్యవస్థ అప్‌గ్రెడేషన్ అవసరమని భావించారు రామ్ గొల్లమూడి, రమేష్ కర్ర, ప్రసన్న బోని. అందుకే క్లాస్‌రూమ్‌లో మార్పుల కోసం ‘ఎడ్యుటర్ టెక్నాలజీస్’ను ఆరంభించి ట్యాబ్లెట్ పీసీలతో స్కూళ్లకు ఈ-చదువులను పరిచయం చేస్తోంది. నిజానికి స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ కార్లు, స్మార్ట్ సిటీలూ... అంటూ గత కొన్నేళ్లులో ప్రపంచంలో ఎన్నో మార్పులొచ్చినా క్లాస్ రూంలు, పరీక్షలు, ప్రోగ్రెస్ కార్డులతో నిండిన విద్యా వ్యవస్థలో మాత్రం చెప్పుకోదగ్గ మార్పులు రాలేదు. విద్యార్థి దశలోనే డిజిటలైజేషన్ అలవాటు చేయడానికే తాము ఈ సంస్థను ఆరంభించామంటున్న మిత్ర బృందం ఇంకా ఏం చెబుతోందో వారి మాటల్లోనే... రిటైల్ నుంచి క్లాస్ రూంలోకి... రూ.10 లక్షల పెట్టుబడితో 2010లో ఎడ్యుటర్ టెక్నాలజీస్‌ను ప్రారంభించాం. మొదట్లో కేవలం పాఠ్యపుస్తకాల్లోని సిలబస్‌లను ట్యాబ్లెట్ పీసీల్లో నిక్షిప్తం చేసి విక్రయించే వాళ్లం. మా ఆలోచన న చ్చి చాలా స్కూళ్ల ప్రిన్సిపల్స్... మీ ఆలోచన బాగుంది. ఎందుకు దీన్ని రిటైల్ మార్కెట్ నుంచి క్లాస్ రూమ్‌కు తీసుకురాకూడదని అడిగారు. దీంతో రెండేళ్లు సాఫ్ట్వేర్ అభివృద్ధికి శ్రమించి 2012లో ఇగ్నిటర్ కంటెంట్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశాం. దీంతో కేజీ నుంచి +2 (12వ తరగతి) వరకు అన్ని సబ్జెక్టుల పాఠ్యాంశాలు ట్యాబ్లెట్స్‌ల్లో నిక్షిప్తమై ఉంటాయి. దీంతో విద్యార్థులు బ్యాగులు మోసుకుంటూ పాఠశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆడియో, వీడియో రెండు రకాల సేవలూ ఉంటాయిందులో. కొన్ని కొన్ని సబ్జెక్ట్‌లకు వీడియో ఆధారంగా పాఠాలు చెబితేనే అర్థంమవుతుంది మరి. ఇలాంటి సేవలందించే సంస్థలు ప్రపంచవ్యాప్తంగా నాలుగైదు ఉన్నాయి. కానీ, వాటికి ఇగ్నిటర్కున్న ప్రధాన తేడా ఏంటంటే.. మా సాఫ్ట్వేర్ ఇంటర్నెట్ అవసరం లేకుండానే పనిచేస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ అన్ని సిస్టమ్స్నూ ఇగ్నిటర్ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తుంది. 60 వేల మంది విద్యార్థులు... మన దేశంతో పాటు దుబాయ్, దక్షిణాఫ్రికాల్లోని పాఠశాలల్లో కూడా ఎడ్యుటర్ సేవలందిస్తోంది. దాదాపు 60 వేల మంది విద్యార్థులు దీని సభ్యులే. పాఠశాలలే కాదు కాలేజీలు, విశ్వ విద్యాలయాలు, కోచింగ్ సెంటర్లూ దీని కస్టమర్లుగా ఉన్నారు. హైదరాబాద్‌లోని ఓక్రిడ్జ్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, చిరాక్, మెరిడియన్, విద్యానికేతన్, ఇండస్, జైన్ ఇంటర్నేషనల్, గీతాంజలి వంటి కార్పొరేట్ విద్యా సంస్థలున్నాయి. ఆకాశ్ ఇనిస్టిట్యూట్, ఏస్ క్రియేటివ్ లెర్నింగ్, లెర్న్పీడియా, ప్రైమ్స్ వంటి శిక్షణ సంస్థలూ ఉన్నాయి. ఎస్ఆర్ఎం, ఎన్టీటీఎఫ్, గేట్ఫోరం, దక్షిణాఫ్రికాలోని సీటీఐ-ఎంజీఐ గ్రూప్ వంటి విశ్వ విద్యాలయాలూ వినియోగిస్తున్నాయి. ఏడాదికి సాఫ్ట్వేర్, కంటెంట్ కలిపి రూ.3-4 వేల మధ్య చార్జీ ఉంటుంది. తల్లిదండ్రులకు రిపోర్ట్లు... వందల మంది విద్యార్థుల్లో ఏ పిల్లాడు ఏ సబ్జెక్ట్‌లో వెనకబడ్డాడో కనిపెట్టి సరిదిద్దడం కాసింత కష్టమైన పనే. కానీ, ఎడ్యుటర్ ఆ పనిని సులభంగా చేసిపెడుతుంది. రూ.40 కోట్ల నిధుల సమీకరణ.. ఎడ్యుటర్ టెక్నాలజీస్ మూడో విడ త నిధుల సమీకరణపై దృష్టిసారించింది. రెండేళ్ల క్రితం ఎడ్యుటర్ టెక్నాలజీస్‌లో హైదరాబాద్ ఏంజిల్స్ రూ.5 కోట్లు పెట్టుబడులు పెట్టింది. గతేడాది ఢిల్లీకి చెందిన సఫారి గ్రూప్ రూ.20 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ ఏడాది చివరినాటికి మరో రూ.40 కోట్లు పెట్టుబడులను సమీకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవలే అనంతపురంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పెలైట్ ప్రాజెక్ట్ కింద ఈ సేవల్ని ఆరంభించింది ఎడ్యుటర్. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...