లెక్క సరిచేస్తారా ?!  | Government School Students Fearing Of Subjects | Sakshi
Sakshi News home page

లెక్క సరిచేస్తారా ?! 

Published Sat, Dec 22 2018 10:36 AM | Last Updated on Sat, Dec 22 2018 10:36 AM

Government School Students Fearing Of Subjects - Sakshi

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌ : విద్యార్థులకు కొన్ని సబ్జెక్టులపై ఉన్న భయమే ఫలితాలపై ప్రభావం చూపుతోంది.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానంగా గణితం, సైన్స్, ఆంగ్లం సబ్జెక్టుల విషయంలో విద్యార్థులు ఒక రకమైన ఆందోళనకు గురవుతున్నారు. ఆయా సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు సాధించేలా, ఫెయిల్‌ కాకుండా చదువుకునే విషయమై అవగాహన లేకపోవడం ఓ కారణమైతే.. బోధనలోని లోపాలను మరో కారణంగా చెప్పొచ్చు. ఇక ప్రత్యేక సబ్జెక్టు ఉపాధ్యాయులు లేక పలు ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఏటా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చదవమని ఒత్తిడి తెచ్చేవారే తప్ప.. ఎలా చదవాలో నేర్పించే వారు లేకపోవడం ఈ సమస్యకు కారణమవుతోంది. ఫలితంగా అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం గణితం, సైన్స్, ఆంగ్లం విషయానికొచ్చే సరికి వెనుకబడిపోతున్నారు. 

గతంలో తప్పిన గణాంకాలు.. 
గత విద్యాసంవత్సరం పదో తరగతిలో గణితంలో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు. మిగతా వాటి కంటే గణితం, సైన్స్, ఇంగ్లిష్‌లో నే ఎక్కువ మంది వెను కబడినట్లు ఫలితాలు చెబుతున్నాయి. తెలుగు సబ్జెక్టులో 297 మంది, హిందీలో 85 మంది, ఇంగ్లిష్‌లో 455 మంది, గణితంలో అత్యధికంగా 3,833 మంది, సైన్స్‌లో 3,019 మంది ఫెయిల్‌ కాగా.. సోషల్‌లో 417 మంది విద్యార్థులు ఫెయిల్‌ అ య్యారు. గతంలో చాలా మంది విద్యార్థులు గణితంలోనే ఫెయిల్‌ కావడంతో విద్యాసంవత్సరం ప్రారంభం నుండి సమావేశాలు, ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినా ఆశించిన మేరకు ఫలితాలు రాలేదు. గత విద్యాసంవత్సరం కూడా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. వందేమాతరం ఫౌండేషన్‌ వంటి స్వచ్ఛంద సంస్థలు సైతం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాయి. కేజీబీవీలు, గురుకులాల్లో వేదిక్‌ మ్యాథ్స్, తో పాటు ప్రత్యేక విద్యాసామగ్రి, ప్రాక్టీస్‌ పేపర్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం ఆశించినంత మేరకు ఫలితాలు రాకపోవడంతో అందరూ నిరుత్సాహానికి గురయ్యారు. ఇక గత ఏడాది అన్ని యాజమాన్యాల పరిధిలో మొత్తం 20,092 మంది ఎస్సెస్సీ పరీక్షలకు హాజరైతే, 14,392 మంది పాస్‌ అయ్యారు. తద్వారా 71.77శాతం ఉత్తీర్ణతతో మహబూబ్‌నగర్‌ జిల్లా రాష్ట్రంలో 28వ స్థానంలో నిలించింది. కాగా, ఈ సారి జిల్లాలో మొత్తం 24,453 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. 

ఉపాధ్యాయుల కొరత.. బోధనలో లోపాలు 
ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదవుతున్న విద్యార్థులను తీర్చిదిద్దడం ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధ్యాయులకు కత్తి మీద సాములా మారింది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతలు కొద్దిమేరకు మెరుగుపడుతున్నట్లు కనిపిస్తున్నాయి. అయినా ఫలితాల్లో ఇంకా ముందడుగు పడడం లేదు. పలు పాఠశాలల్లో ప్రధాన సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులు లేకపోవడం, ప్రభుత్వం ఉన్న ఉపాధ్యాయులతోనే బోధన చేయించడం, వారు అందుబాటులో లేనిచోట్ల విద్యావలంటీర్లకు బాధ్యతలు అప్పగించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. సబ్జెక్టు నిపుణులు లేని కారణంగానే ఎక్కువ మంది విద్యార్థులు గణితం, ఆంగ్లం, సైన్స్‌ సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయినట్లు తెలుస్తోంది. ఇకనైనా కఠినమైన సబ్జెక్టుల విషయంలో విద్యాశాఖ అ«ధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ సబ్జెక్టుల్లో నిపుణులైన ఉపాధ్యాయులను నియమించడంతో పాటు సబ్జెక్టుల వారీగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిలో విషయ పరిజ్ఞానం పెంచేందుకు చర్యలు తీసుకుంటే ఉత్తమ ఫలితాలు వచ్చే అవకాశముంది. 

వీడని భయం 
విద్యార్థులు ఎక్కువగా ఫెయిల్‌ అవుతున్న సబ్జెక్టులను గుర్తించి ఆయా సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించేలా విద్యాశాఖ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు, విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. గత ఏడాది ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని 11 పాఠశాలల్లో 45 శాతం కంటే తక్కువ ఫలితాలు నమోదయ్యాయి. ఈ కారణంగా మండల, గ్రామీణ స్థాయి విద్యార్థులు సైతం సబ్జెక్టుల్లో ఉత్తీర్ణతపై ఆందోళన చెందుతున్నారు.  ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుండి డీఎస్సీ ప్రకటించకపోవడంతో పాటు చాలా పోస్టులు ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాయి. ప్రధానంగా స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీ లేకపోవడం ఎస్సెసీవిద్యార్థుల ఉత్తీర్ణతపై ప్రభావం చూపేప్రమాదముంది. జిల్లా వ్యాప్తంగా వివిధ సబ్జెక్టుల్లో కలి దాదాపు 1,994 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. 

ప్రారంభమైన బిస్కెట్ల పంపిణీ 
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థుల కోసం ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ తరగతులు గత ఆగస్టు నుండి ప్రారంభం కాగా.. గత మంగళవారం నుండి పూర్తి స్థాయిలో విద్యార్థులకు బిస్కెట్లు అందజేసేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అందుకు అనుగుణంగా జిల్లాలోని 212 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మల్టీగ్రేయిన్‌ బిస్కెట్లు అందజేస్తున్నారు. తద్వారా విద్యార్థులు అలిసిపోకుండా శ్రద్ధగా చదువుకుంటారనేది ప్రభుత్వ భావన 

40 రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నాం..
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో మంచి ఫలితాలు వచ్చే విధంగా 40 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేస్తున్నాం. చదువులో వెనుకబడి ఉన్న వారిని గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకుంటుంన్నాం. ముఖ్యమైన ప్రశ్నాంశాలతో మెటీరియల్‌ రూపొందిస్తున్నాం, ఫలితాలు మెరుగుపడేలా అన్ని చర్యలు తీసుకుంటాం. దీనికి సంబంధించి ఇప్పటికే హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు అన్ని ఆదేశాలు జారీ చేశాం. ప్రస్తుతం ఎస్సెస్సీ విద్యార్థులకు బిస్కెట్ల కూడా పంపిణీ ప్రారంభమైంది. ఏ సబ్జెక్టులోనైతే ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్‌ అవుతారో, ఎక్కువ మందికి తక్కువ మార్కులు వస్తాయో ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. విద్యార్థులకు పూర్తి స్థాయిలో పరీక్షలకు సిద్ధం చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది.      – సోమిరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

విద్యార్థులకు మల్టీగ్రెయిన్‌ బిస్కెట్లు అందజేస్తున్న ఉపాధ్యాయుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement