పాలమూరులోనే 272 పాఠశాలలు మూతబడ్డాయి
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠాశాల పరిస్థితి దయనీయంగా ఉందని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల దుస్థితిపై చర్చ జరిగిన సందర్భంగా అరుణ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా టీచర్లు లేరని ఆమె తెలిపారు.
కొన్ని ప్రాంతంలో 200 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో ఒకే ఒక్క టీచర్ ఉంటున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా నెలకొందని తెలిపారు. దీంతో గ్రామాలలో ఎంతో మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని అరుణ పేర్కొన్నారు. పాలమూరు జిల్లాలో టీచర్లు లేక 272 పాఠశాలలు మూతబడ్డాయని ఆమె చెప్పారు.