నాలుగు కోట్ల బిడ్డల భావోద్వేగానికి నిండైన రూపమిది
శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన
వజ్ర వైఢూర్యాలు, భుజకీర్తులు, కిరీటాలతో దేవతలా ఉండాలా? లేదా మన అమ్మలా ఉండాలా? అని చర్చించాం
అమ్మలాగే ఉండాలని కవులు, కళాకారులు, మేధావులు సూచించారు
సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక నేపథ్యాల ఆధారంగా విగ్రహాన్ని తీర్చిదిద్దాం... విగ్రహావిష్కరణ కొందరికి నచ్చడం లేదు
కేవలం ఒక వ్యక్తి, కుటుంబం, పార్టీ ఆలోచనే..
మొత్తం 4 కోట్ల మంది ప్రజల ఆలోచన కాదు
2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు ప్రకటన వచ్చింది... తెలంగాణ ఇచ్చిన సోనియా జన్మదినం కూడా డిసెంబర్ 9నే..
ఆమెకు శుభాకాంక్షలు తెలిపి కృతజ్ఞతలు చూపాల్సిన అవసరముంది
ఇకపై ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ ప్రతీక, భావన, అస్తిత్వం ఉట్టిపడేలా తెలంగాణ తల్లి రూపం ఉండాలని కవులు, కళాకారులతోపాటు తెలంగాణ సంస్కృతి పట్ల అంకితభావం కలిగిన వారందరితో చర్చించాం. తెలంగాణ మూర్తి దేవతలా వజ్ర వైఢూర్యాలు, భుజకీర్తులు, కిరీటాలతో ఉండాలా? మన అమ్మలా ఉండాలా? అనే ప్రస్తావన వచ్చింది. దేవత గుడిలో ఉంటుంది. తల్లి ఇంట్లో ఉంటుంది.
తల్లి ప్రతిరూపమే ఉండాలని మేధావులు సూచించారు. తెలంగాణ తల్లిని చూస్తే సొంత మాతృమూర్తిని చూసిన భావన కలుగుతుంది’’అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై సోమవారం ఉదయం శాసనసభలో ఆయన ప్రకటన చేశారు. రేవంత్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..
‘‘తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ దురదృష్టవశాత్తూ కొందరికి నచ్చలేదు. ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక పార్టీ ఆలోచనే 4 కోట్ల ప్రజల ఆలోచన అనుకోవడం సమంజసం కాదు. మధ్యయుగాల నాటి చక్రవర్తుల ఆలోచనతో ప్రజాప్రభుత్వం నడవదు. రాష్ట్రానికి గుండెకాయ లాంటి సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నాం. ఎలాంటి రాజకీయ వివాదాలకు తావులేకుండా 4 కోట్ల ప్రజలు ఏకమై జరుపుకొంటే బాగుంటుంది.
బిడ్డల భావోద్వేగానికి నిండైన రూపం..
నాలుగు కోట్ల మంది బిడ్డల భావోద్వేగానికి నిండైన రూపం తెలంగాణ తల్లి. మన సాంప్రదాయాలు, సంస్కృతులు, చారిత్రక నేపథ్యాలను పరిగణనలోకి తీసుకుని ఒక నిండైన రూపాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ప్రశాంత వదనం, సాంప్రదాయ కట్టూ»ొట్టు, మెడకు కంఠె, గుండు పూసల హారం, చెవులకు బుట్ట కమ్మలు, ముక్కు పుడకతో బంగారు అంచు కలిగిన ఆకుపచ్చ చీరలో, చేతికి గాజులు, కాళ్లకు కడియాలు, మెట్టెలతో, చాకలి ఐలమ్మ, సమ్మక్క – సారలమ్మ పోరాట స్ఫూర్తితో, హుందాతనంతో కూడిన ఆహార్యంతో మన తెలంగాణ తల్లి రూపుదిద్దుకుంది.
కుడిచేతితో జాతికి అభయమిస్తూ, ఎడమ చేతిలో తెలంగాణ మాగాణంలో పండే వరి, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్నతో... మన సంస్కృతి, సాంప్రదాయానికి నిలువెత్తు రూపంగా తెలంగాణ తల్లి రూపాన్ని తీర్చిదిద్దడం జరిగింది. తెలంగాణ తల్లి నిలబడిన పీఠం మన చరిత్రకు దర్పణంగా రూపొందించాం. ఉద్యమాలు, పోరాటాలు, అమరుల ఆత్మ బలిదానాలకు సంకేతంగా బిగించిన పిడికిళ్లను పీఠంలో పొందుపరిచాం. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని ప్రపంచంలోనే సమున్నతంగా నిలబెట్టాలన్న లక్ష్యాన్ని గుర్తు చేస్తూ.. చేతులన్నీ కలిపి పీఠాన్ని మోస్తున్న తీరు తెలంగాణ పునర్నిర్మాణ రీతిని తెలియజేస్తుంది.
ఆ వర్ణాలకు గొప్ప తాత్వికత ఉంది..
తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో వాడిన వర్ణాలకు గొప్ప తాత్వికత ఉంది. ‘గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిను తడుపంగ’అనే అందెశ్రీ గీతంలోని తెలంగాణ జలదృశ్యానికి పీఠంలోని నీలం వర్ణం ప్రతీకగా నిలుస్తుంది. ‘పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగ’అనే తెలంగాణ సస్యశ్యామల వ్యవసాయ కీర్తికి సంకేతంగా ఆకుపచ్చ వర్ణం కనిపిస్తుంది.
మార్పుకు, ప్రగతికి, చైతన్యానికి ప్రతీకగా ఎరుపు వర్ణం నిలుస్తుంది. శుభానికి, ఐశ్వర్యానికి, సమృద్ధికి నిదర్శనంగా బంగారు వర్ణం నిలబడుతుంది. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగంగా ఉద్యమకాలం నాటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ సంక్షిప్త నామంగా ‘టీజీ’ని.. రాష్ట్ర అధికారిక గీతంగా ‘జయ జయహే తెలంగాణ..’ను ఇప్పటికే ప్రకటించాం.
సోనియా పుట్టినరోజు కావడంతో..
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని 2009 డిసెంబర్ 9న నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరడానికి పునాది పడిన రోజు అది. సోనియా గాంధీ జన్మదినం ఇదే రోజు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపి తెలంగాణ ప్రజలు కృతజ్ఞత చూపాల్సిన అవసరం ఉంది.
తెలంగాణ కోసం శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య, ఇషాన్‌రెడ్డి ఆత్మబలిదానాలు చేశారు. కళ్ల ముందే ఇందిరా గాందీ, రాజీవ్ గాంధీ నేలకొరగడంతో.. బలిదానాల బాధ ఆమెకు తెలుసు. అందుకే ఎన్ని అడ్డంకులొచ్చినా తెలంగాణ ఇచ్చారు.
ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు
స్వరాష్ట్ర పోరాటంలో సకల జనులు, సబ్బండ వర్గాలను ఐక్యం చేసి లక్ష్యసాధన వైపు నడిపించిన శక్తి స్వరూపిణి తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లికి సంబంధించి పలు రూపాలు జనబాహుళ్యంలో ఉన్నా దేనికీ అధికారిక గుర్తింపు లేదు. మాతృమూర్తిని గౌరవించుకునేందుకు ప్రజాప్రభుత్వం ‘తెలంగాణ తల్లి’కి రూపకల్పన చేసింది.
తెలంగాణ ఏర్పడ్డాక 10 ఏళ్లు రాష్ట్ర అధికారిక గీతం, అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహం లేకపోవడం ఒక లోటు. ఇక ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించాం.
Comments
Please login to add a commentAdd a comment