తరగతి గదిలో ‘ఈ’ చదువులు! | Study through make electronically | Sakshi
Sakshi News home page

తరగతి గదిలో ‘ఈ’ చదువులు!

Published Sat, Sep 5 2015 2:15 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

తరగతి గదిలో ‘ఈ’ చదువులు! - Sakshi

తరగతి గదిలో ‘ఈ’ చదువులు!

స్కూలు బ్యాగులవసరం లేకుండా పాఠ్యాంశాలన్నీ ట్యాబ్లెట్స్‌లోనే..
- మన దేశంతో పాటు దుబాయ్, దక్షిణాఫ్రికాల్లో సేవలందిస్తున్న ఎడ్యుటర్
- మూడో విడతగా రూ.40 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
తొమ్మిదో తరగతి చదివే శ్రీధర్‌కు ఎప్పుడూ లెక్కల్లో 20కి పది మార్కులే వస్తాయి. ప్రతిసారీ మిగతా పది మార్కులు ట్రిగ్నోమెట్రీలోనే పోతాయి. అమ్మానాన్నల దృష్టిలో శ్రీధర్ మ్యాథ్స్‌లో వీక్. కానీ, నిజానికి శ్రీధర్ లెక్కల్లో కాదు కేవలం ట్రిగ్నోమెట్రీలోనే వెనకబడిపోతున్నాడు. ఈ సంగతి వాళ్లకి తెలిసేదెలా?
నిఖిత తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులే. పేరెంట్స్ మీటింగ్‌కు హాజరవటం ఇద్దరికీ కుదరదు. మరి కూతురి మార్కులు, హాజరుకు సంబంధించిన సమాచారం వాళ్లకు తెలిసేదెలా?
...ఇలా ఒకటి కాదు రెండు కాదు పిల్లల విషయంలో తల్లిదండ్రులకు ఎన్నో సందేహాలు. ఇదిగో... ఈ సందేహాలు తీర్చడానికే విద్యావ్యవస్థ అప్‌గ్రెడేషన్ అవసరమని భావించారు రామ్ గొల్లమూడి, రమేష్ కర్ర, ప్రసన్న బోని. అందుకే క్లాస్‌రూమ్‌లో మార్పుల కోసం ‘ఎడ్యుటర్ టెక్నాలజీస్’ను ఆరంభించి ట్యాబ్లెట్ పీసీలతో స్కూళ్లకు ఈ-చదువులను పరిచయం చేస్తోంది. నిజానికి స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ కార్లు, స్మార్ట్ సిటీలూ... అంటూ గత కొన్నేళ్లులో ప్రపంచంలో ఎన్నో మార్పులొచ్చినా క్లాస్ రూంలు, పరీక్షలు, ప్రోగ్రెస్ కార్డులతో నిండిన విద్యా వ్యవస్థలో మాత్రం చెప్పుకోదగ్గ మార్పులు రాలేదు. విద్యార్థి దశలోనే డిజిటలైజేషన్ అలవాటు చేయడానికే తాము ఈ సంస్థను ఆరంభించామంటున్న మిత్ర బృందం ఇంకా ఏం చెబుతోందో వారి మాటల్లోనే...
 
రిటైల్ నుంచి క్లాస్ రూంలోకి...

రూ.10 లక్షల పెట్టుబడితో 2010లో ఎడ్యుటర్ టెక్నాలజీస్‌ను ప్రారంభించాం. మొదట్లో కేవలం పాఠ్యపుస్తకాల్లోని సిలబస్‌లను ట్యాబ్లెట్ పీసీల్లో నిక్షిప్తం చేసి విక్రయించే వాళ్లం. మా ఆలోచన న చ్చి చాలా స్కూళ్ల ప్రిన్సిపల్స్... మీ ఆలోచన బాగుంది. ఎందుకు దీన్ని రిటైల్ మార్కెట్ నుంచి క్లాస్ రూమ్‌కు తీసుకురాకూడదని అడిగారు. దీంతో రెండేళ్లు సాఫ్ట్‌వేర్ అభివృద్ధికి శ్రమించి 2012లో ఇగ్నిటర్ కంటెంట్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశాం. దీంతో కేజీ నుంచి +2 (12వ తరగతి) వరకు అన్ని సబ్జెక్టుల పాఠ్యాంశాలు ట్యాబ్లెట్స్‌ల్లో నిక్షిప్తమై ఉంటాయి. దీంతో విద్యార్థులు బ్యాగులు మోసుకుంటూ పాఠశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.

ఆడియో, వీడియో రెండు రకాల సేవలూ ఉంటాయిందులో. కొన్ని కొన్ని సబ్జెక్ట్‌లకు వీడియో ఆధారంగా పాఠాలు చెబితేనే అర్థంమవుతుంది మరి. ఇలాంటి సేవలందించే సంస్థలు ప్రపంచవ్యాప్తంగా నాలుగైదు ఉన్నాయి. కానీ, వాటికి ఇగ్నిటర్‌కున్న ప్రధాన తేడా ఏంటంటే.. మా సాఫ్ట్‌వేర్ ఇంటర్నెట్ అవసరం లేకుండానే పనిచేస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ అన్ని సిస్టమ్స్‌నూ ఇగ్నిటర్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ చేస్తుంది.
 
60 వేల మంది విద్యార్థులు...
మన దేశంతో పాటు దుబాయ్, దక్షిణాఫ్రికాల్లోని పాఠశాలల్లో కూడా ఎడ్యుటర్  సేవలందిస్తోంది. దాదాపు 60 వేల మంది విద్యార్థులు దీని సభ్యులే. పాఠశాలలే కాదు కాలేజీలు, విశ్వ విద్యాలయాలు, కోచింగ్ సెంటర్లూ దీని కస్టమర్లుగా ఉన్నారు. హైదరాబాద్‌లోని ఓక్రిడ్జ్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, చిరాక్, మెరిడియన్, విద్యానికేతన్, ఇండస్, జైన్ ఇంటర్నేషనల్, గీతాంజలి వంటి కార్పొరేట్ విద్యా సంస్థలున్నాయి. ఆకాశ్ ఇనిస్టిట్యూట్, ఏస్ క్రియేటివ్ లెర్నింగ్, లెర్న్‌పీడియా, ప్రైమ్స్ వంటి శిక్షణ  సంస్థలూ ఉన్నాయి. ఎస్‌ఆర్‌ఎం, ఎన్‌టీటీఎఫ్, గేట్‌ఫోరం, దక్షిణాఫ్రికాలోని సీటీఐ-ఎంజీఐ గ్రూప్ వంటి విశ్వ విద్యాలయాలూ వినియోగిస్తున్నాయి. ఏడాదికి సాఫ్ట్‌వేర్, కంటెంట్ కలిపి రూ.3-4 వేల మధ్య చార్జీ ఉంటుంది.
 
తల్లిదండ్రులకు రిపోర్ట్‌లు...
వందల మంది విద్యార్థుల్లో ఏ పిల్లాడు ఏ సబ్జెక్ట్‌లో వెనకబడ్డాడో కనిపెట్టి సరిదిద్దడం కాసింత కష్టమైన పనే. కానీ, ఎడ్యుటర్ ఆ పనిని సులభంగా చేసిపెడుతుంది.
 
రూ.40 కోట్ల నిధుల సమీకరణ..
ఎడ్యుటర్ టెక్నాలజీస్ మూడో విడ త నిధుల సమీకరణపై దృష్టిసారించింది. రెండేళ్ల క్రితం ఎడ్యుటర్ టెక్నాలజీస్‌లో హైదరాబాద్ ఏంజిల్స్ రూ.5 కోట్లు పెట్టుబడులు పెట్టింది. గతేడాది ఢిల్లీకి చెందిన సఫారి గ్రూప్ రూ.20 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ ఏడాది చివరినాటికి మరో రూ.40 కోట్లు పెట్టుబడులను సమీకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవలే అనంతపురంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పెలైట్ ప్రాజెక్ట్ కింద ఈ సేవల్ని ఆరంభించింది ఎడ్యుటర్.
 
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement