‘సింగిల్‌ స్పెషల్‌’ డిగ్రీ! ఒక సబ్జెక్టు ప్రధానంగా కొత్త కరిక్యులమ్‌ | New Curriculum as Single Subject Major in Degree Education | Sakshi
Sakshi News home page

‘సింగిల్‌ స్పెషల్‌’ డిగ్రీ! ఒక సబ్జెక్టు ప్రధానంగా కొత్త కరిక్యులమ్‌

Published Thu, May 11 2023 5:00 AM | Last Updated on Thu, May 11 2023 10:41 AM

New Curriculum as Single Subject Major in Degree Education - Sakshi

సాక్షి, అమరావతి: విద్యా ప్రమాణాలను పెంపొందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగంగా డిగ్రీ విద్యలో సింగిల్‌ సబ్జెక్టు మేజర్‌గా కొత్త కరిక్యులమ్‌ను ప్రవేశపెడుతోంది. ఇప్పటివరకు డిగ్రీలో మూడు సబ్జెక్టులు ప్రధాన కాంబినేషన్‌తో విద్యాబోధన సాగుతుండగా ఇకపై ఒక మేజర్‌ సబ్జెక్టు ప్రధానంగా డిగ్రీ విద్య కొనసాగనుంది. జూన్‌ నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది.

ఈ మేరకు కరిక్యులమ్‌లో మార్పులు చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. బుధవారం మంగళగిరిలోని కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆచార్య హేమచంద్రారెడ్డి, వైస్‌ చైర్మన్‌ రామ్మోహన్‌రావు మీడియాకు వివరాలను వెల్లడించారు. ‘సెట్స్‌’ స్పెషల్‌ ఆఫీసర్‌ సుధీర్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్‌ అహ్మద్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైనా ఒక సబ్జెక్ట్‌లో విద్యార్థులు సంపూర్ణ నైపుణ్యాలను సాధించే దిశగా కరిక్యులమ్‌ను సిద్ధం చేసినట్లు చెప్పారు.

గతంలో బీఎస్సీ–ఎంపీసీ (మూడు సబ్జెక్టుల కాంబినేషన్‌) ఉండగా ఆ స్థానంలో బీఎస్సీ మ్యాథ్స్‌/ఫిజిక్స్‌/కెమిస్ట్రీలో ఒక సబ్జెక్టును మేజర్‌గా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రెండో సెమిస్టర్‌ నుంచి దాదాపు 100 కోర్సుల నుంచి విద్యార్థులు తమకు నచ్చిన విభాగంలో మైనర్‌ సబ్జెకున్టు ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. తద్వారా మేజర్, మైనర్‌ సబ్జెక్టుల్లో ఏదో ఒకదానితో పీజీ విద్యను అభ్యసించేలా మార్పులు చేసినట్లు చెప్పారు. 

బీఎస్సీ, బీఏ, బీకామ్‌లో అమలు 
డిగ్రీలో మేజర్‌ సబ్జెక్టుతో పాటు కచ్చితంగా ఒక మైనర్‌ సబ్జెక్టు చదవాలి. ఉదాహరణకు ఒక సైన్స్‌ విద్యార్థి మైనర్‌ సబ్జెక్టుగా ఆర్థిక శాస్త్రం, చరిత్ర, సంగీతం, యోగా, డేటాసైన్స్, మార్కెటింగ్‌.. ఇలా ఇతర సబ్జెక్టులను ఎంపిక చేసుకోవచ్చు. ఆర్ట్స్‌ విద్యార్థులు  మైనర్‌లో (ఇంటర్మీడియట్‌ కోర్సుల ఆధారంగా) నచ్చిన సబ్జెక్టు తీసుకోవచ్చు.

కొత్త విధానాన్ని బీఎస్సీతో పాటు బీఏ, బీకామ్‌ డిగ్రీలో అమలు చేయనున్నట్టు తెలిపారు. డిగ్రీ విద్యలో ఉద్యోగ అవకాశాలను పెంపొందించడంతో పాటు ఇంజనీరింగ్‌తో సమానంగా తీర్చిదిద్దేందుకు ఈ విద్యా సంస్కరణలు దోహదం చేస్తాయని వివరించారు. వచ్చే జూన్‌లో కొత్త కరిక్యులమ్‌ ప్రకారం ప్రవేశాలు ఉంటాయని, దీనిపై డిగ్రీలో చేరే విద్యార్థులకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తామన్నారు. 

నాలుగో ఏడాది డిగ్రీకి అనుమతి
జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం దేశంలో తొలిసారి విద్యా సంస్కరణలను మన రాష్ట్రంలోనే అమలు చేసినట్లు హేమచంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటికే నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీని ప్రవేశపెట్టామని, ప్రస్తుతం మూడో ఏడాది డిగ్రీ విద్య పూర్తయిందన్నారు. యూజీసీ ఫ్రేమ్‌ వర్క్స్‌ ప్రకారం ఆనర్స్‌ డిగ్రీని రెండు విధాలుగా విభజించామన్నారు. మూడేళ్ల డిగ్రీలో 75 శాతం మార్కులు సాధించినవారు రీసెర్చ్‌ ఆనర్స్‌ డిగ్రీ కోర్సులో చేరవచ్చు.

ఇది పూర్తి చేసిన వారు పీజీ లేకుండా పీహెచ్‌డీ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మూడేళ్ల కోర్సులో ఉత్తీర్ణులైతే జనరల్‌ ఆనర్స్‌ కోర్సును అభ్యసించవచ్చు. ఇది పూర్తిచేసిన వారు పోస్టు గ్రాడ్యుయేషన్‌ రెండో ఏడాదిలో చేరవచ్చన్నారు. ఆనర్స్‌ కోర్సులను అందించేందుకు ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో గత మూడేళ్లలో వరుసగా 30 శాతం అడ్మిషన్లతో పాటు సంబంధిత కోర్సుల్లో ఇద్దరు డాక్టరేట్‌ కలిగిన ప్రొఫెసర్లు ఉంటేనే అనుమతులు మంజూరు చేస్తామన్నారు.  

డిగ్రీ విద్యార్థులకు 10 నెలల ఇంటర్న్‌షిప్‌
నూతన విద్యావిధానంలో భాగంగా డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసిందన్నారు. ఇంజనీరింగ్‌ తదితర ప్రొఫెషనల్‌ కోర్సులకు ఇంటర్న్‌షిప్‌ ఉన్నట్టుగానే నాన్‌ ప్రొఫెషనల్‌ డిగ్రీ కోర్సుల విద్యార్థులకు కూడా 10 నెలల ఇంటర్న్‌షిప్‌ ప్రవేశపెట్టామన్నారు. మైక్రోసాఫ్ట్‌ ద్వారా ఏడాదిలో 1.20 లక్షల సర్టిఫికేషన్‌ కోర్సులను అందించడం దేశంలో ఓ మైలురాయిగా అభివర్ణించారు. 

విద్యార్థుల్లో గందరగోళం సృష్టించొద్దు
ఉన్నత విద్యలో ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక మార్పులను చూసి ఓర్వలేక కొన్ని పత్రికలు గందరగోళం సృష్టించే కథనాలు రాస్తున్నాయని హేమచంద్రారెడ్డి పేర్కొన్నారు. 2019 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యలో పలు సంస్కరణలు తెచ్చిందని, ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కళాశాలలపై కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. 2009 నుంచి ద్రవిడ వర్సిటీలో అడ్డగోలుగా చేపట్టిన 6055 పీహెచ్‌డీ అడ్మిషన్లను రద్దు చేశామన్నారు.

2014–18లో గత ప్రభుత్వ హయాంలో ఏకంగా 980 పీహెచ్‌డీ అడ్మిషన్లు ఇచ్చారని, వాటిపై విచారించి చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. రాయలసీమ వర్సిటీలోనూ 2008–2011 మధ్యలో చేపట్టిన 2,490 అక్రమ పీహెచ్‌డీ అడ్మిషన్లను రద్దు చేశామన్నారు. టీడీపీ హయాంలో అక్కడ 518 పీహెచ్‌డీ అడ్మిషన్లు ఇవ్వగా 2019 నుంచి  ఇప్పటి వరకు 28 అడ్మిషన్లు మాత్రమే ఇచ్చామన్నారు.  ఆర్‌–సెట్‌ను తీసుకొచ్చి పీహెచ్‌డీ అడ్మిషన్లలో పారదర్శకతకు పెద్దపీట వేశామన్నారు. వాస్తవాలను కప్పిపుచ్చి ఓ మీడియా అసత్య ప్రచారం చేయడం దారుణమని  ఆక్షేపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement