hemachandra reddy
-
ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల
అనంతపురం: ఇంజినీరింగ్, బీ–ఫార్మసీ రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ ద్వారా అడ్మిషన్లు పొందడానికి నిర్వహించిన ఏపీ ఈసెట్–2024 ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రా రెడ్డి గురువారం విడుదల చేశారు. ఏపీ ఈసెట్ నిర్వహించిన జేఎన్టీయూ(అనంతపురం)లో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. 8 దఫాలుగా ఏపీ ఈసెట్‌ను విజయవంతంగా నిర్వహించిన జేఎన్టీయూ(ఏ) ఈసెట్ నిర్వహణ కమిటీని ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి అభినందించారు.ఏపీ ఈసెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా 37,767 మంది దరఖాస్తు చేసుకోగా.. 36,369 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 32,881 మంది(90.41 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అబ్బాయిలు 27,787 మంది దరఖాస్తు చేసుకోగా 26,693 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 23,849(91.68 శాతం) మంది అర్హత సాధించారు. అమ్మాయిలు 9,980 మంది దరఖాస్తు చేసుకోగా, 9,676 మంది హాజరయ్యారు. వీరిలో 9,032(93.34 శాతం) మంది ఉత్తీర్ణలుయ్యారు. ఈసెట్ ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 1,071 మంది పరీక్ష రాయగా 1,002 (93.56 శాతం) మంది అర్హత సాధించారు. ఉదయం సెషన్లో మొత్తం 145 ప్రశ్నలకు గాను 272 అభ్యంతరాలు రాగా.. నాలుగు ఆమోదం పొందాయి.మధ్యాహ్నం సెషన్లో మొత్తం 171 ప్రశ్నలకు గాను 444 అభ్యంతరాలు రాగా 19 ఆమోదం పొందాయి. ఈ ప్రశ్నలకు జవాబు రాసిన వారికి మార్కులు లభించాయి. ఫలితాల విడుదల కార్యక్రమంలో ఏపీ సెట్స్ స్పెషల్ ఆఫీసర్ ఎం.సుధీర్‌రెడ్డి, ఏపీ ఈసెట్ చైర్మన్ జీవీఆర్ శ్రీనివాసరావు, కన్వీనర్ పీఆర్ భానుమూర్తి, జేఎన్టీయూ(ఏ) రెక్టార్ ఎం.విజయకుమార్, రిజిస్ట్రార్ సి.శశిధర్, పాలకమండలి సభ్యులు బి.దుర్గాప్రసాద్, డాక్టర్ ఎం.రామశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.వలంటీర్ శిల్ప స్టేట్ ఫస్ట్రణస్థలం: సీఎం జగన్ ఏర్పాటు చేసిన వలంటీర్ వ్యవస్థలో చేరి ప్రజలకు సేవ చేస్తున్న ఓ యువతి ఏపీ ఈసెట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడలో వలంటీర్‌గా సేవలందిస్తున్న మైలపల్లి శిల్ప రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది. శిల్ప ప్రస్తుతం శ్రీకాకుళం మహిళా పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాలలో డీ–ఫార్మసీ రెండో సంవత్సరం చదువుతోంది.ఇంజనీరింగ్ చదవాలనే ఆశయంతో ఆమె ఈసెట్ రాయగా.. బయో టెక్నాలజీ విభాగంలో ఫస్ట్ ర్యాంకు వచ్చిందని ఆమె తెలిపింది. ఆమె తండ్రి పేరు పోలీసు.. టైలర్‌గా పనిచేస్తుండగా.. తల్లి లక్ష్మి గృహిణి. కుమార్తెకు స్టేట్ ఫస్ట్ ర్యాంకు రావడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. గ్రామస్తులు శిల్పను అభినందించారు. శిల్ప మాట్లాడుతూ.. బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్ చేసి అత్యుత్తమంగా రాణించాలని అనుకుంటున్నట్లు ఆమె తెలిపారు. -
ఇద్దరికీ కొత్తే
కె.హేమచంద్రా రెడ్డి హీరోగా ‘ఇద్దరికీ కొత్తేగా’ సినిమా ప్రారంభమైంది. కృష్ణ క్రియేషన్స్‌పై కుల్లపరెడ్డి సురేశ్‌బాబు స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి నిర్మాతలు సి.కల్యాణ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, చదలవాడ శ్రీనివాసరావు క్లాప్ కొట్టారు. నిర్మాత కె.ఎల్. దామోదర ప్రసాద్ దర్శకత్వం వహించారు. హైకోర్టు న్యాయమూర్తి శ్వేత, ప్రసన్న కుమార్, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, మాజీ జడ్జి మాల్యాద్రి, మేక మేనక స్క్రిప్ట్‌ను సురేశ్‌బాబుకు అందించారు. ‘‘గతంలో నేను ‘వకాలత్ నామా’ సినిమాలో హీరోగా చేశాను. ఇప్పుడు ‘ఇద్దరికీ కొత్తేగా’ కి తీస్తున్నాను. నిర్మాత కేయస్ రామారావుగారు మాకు అండగా నిలిచారు’’అన్నారు కుల్లపరెడ్డి సురేశ్‌బాబు. ఈ చిత్రానికి కెమెరా: కోట తిరుపతిరెడ్డి, సంగీతం: ఎం.ఎం.ఎస్. -
పట్టాతో పాటు ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): విద్యార్థులకు పట్టాతో పాటు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషిచేస్తున్నారని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు. కాకినాడలోని జేఎన్టీయూకే వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మైక్రోసాఫ్ట్ ద్వారా 24 వేల మందికి ఇంటర్న్‌షిప్ నిర్వహించి సర్టిఫికెట్లు అందించినట్టు తెలిపారు. ఉన్నత విద్యలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, వర్సిటీల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటుచేసి నైపుణ్యాలు పెంచుతున్నట్టు తెలిపారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు అడ్డంకులు తొలగిన నేపథ్యంలో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉన్నత విద్యలో పరీక్ష విధానం, మెథడాలజీ, బోధన పద్ధతులు, పాఠ్య ప్రణాళికలో తేవాల్సిన మార్పులపై దృష్టి సారించామన్నారు. ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వస్తున్న మార్పులను కరిక్యులమ్‌లో భాగం చేయాలని హేమచంద్రారెడ్డి సూచించారు. అనంతరం వర్సిటీ వ్యవస్థాపక లోగోను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వీసీ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు, మాజీ వీసీ రామలింగరాజు తదితరులు పాల్గొన్నారు. -
డిగ్రీలో కొత్త పాఠ్యప్రణాళిక
-
‘సింగిల్ స్పెషల్’ డిగ్రీ! ఒక సబ్జెక్టు ప్రధానంగా కొత్త కరిక్యులమ్
సాక్షి, అమరావతి: విద్యా ప్రమాణాలను పెంపొందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగంగా డిగ్రీ విద్యలో సింగిల్ సబ్జెక్టు మేజర్‌గా కొత్త కరిక్యులమ్‌ను ప్రవేశపెడుతోంది. ఇప్పటివరకు డిగ్రీలో మూడు సబ్జెక్టులు ప్రధాన కాంబినేషన్‌తో విద్యాబోధన సాగుతుండగా ఇకపై ఒక మేజర్ సబ్జెక్టు ప్రధానంగా డిగ్రీ విద్య కొనసాగనుంది. జూన్ నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు కరిక్యులమ్‌లో మార్పులు చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. బుధవారం మంగళగిరిలోని కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య హేమచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ రామ్మోహన్రావు మీడియాకు వివరాలను వెల్లడించారు. ‘సెట్స్’ స్పెషల్ ఆఫీసర్ సుధీర్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్ అహ్మద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైనా ఒక సబ్జెక్ట్‌లో విద్యార్థులు సంపూర్ణ నైపుణ్యాలను సాధించే దిశగా కరిక్యులమ్‌ను సిద్ధం చేసినట్లు చెప్పారు. గతంలో బీఎస్సీ–ఎంపీసీ (మూడు సబ్జెక్టుల కాంబినేషన్) ఉండగా ఆ స్థానంలో బీఎస్సీ మ్యాథ్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీలో ఒక సబ్జెక్టును మేజర్‌గా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రెండో సెమిస్టర్ నుంచి దాదాపు 100 కోర్సుల నుంచి విద్యార్థులు తమకు నచ్చిన విభాగంలో మైనర్ సబ్జెకున్టు ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. తద్వారా మేజర్, మైనర్ సబ్జెక్టుల్లో ఏదో ఒకదానితో పీజీ విద్యను అభ్యసించేలా మార్పులు చేసినట్లు చెప్పారు. బీఎస్సీ, బీఏ, బీకామ్‌లో అమలు డిగ్రీలో మేజర్ సబ్జెక్టుతో పాటు కచ్చితంగా ఒక మైనర్ సబ్జెక్టు చదవాలి. ఉదాహరణకు ఒక సైన్స్ విద్యార్థి మైనర్ సబ్జెక్టుగా ఆర్థిక శాస్త్రం, చరిత్ర, సంగీతం, యోగా, డేటాసైన్స్, మార్కెటింగ్.. ఇలా ఇతర సబ్జెక్టులను ఎంపిక చేసుకోవచ్చు. ఆర్ట్స్ విద్యార్థులు మైనర్లో (ఇంటర్మీడియట్ కోర్సుల ఆధారంగా) నచ్చిన సబ్జెక్టు తీసుకోవచ్చు. కొత్త విధానాన్ని బీఎస్సీతో పాటు బీఏ, బీకామ్ డిగ్రీలో అమలు చేయనున్నట్టు తెలిపారు. డిగ్రీ విద్యలో ఉద్యోగ అవకాశాలను పెంపొందించడంతో పాటు ఇంజనీరింగ్‌తో సమానంగా తీర్చిదిద్దేందుకు ఈ విద్యా సంస్కరణలు దోహదం చేస్తాయని వివరించారు. వచ్చే జూన్‌లో కొత్త కరిక్యులమ్ ప్రకారం ప్రవేశాలు ఉంటాయని, దీనిపై డిగ్రీలో చేరే విద్యార్థులకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తామన్నారు. నాలుగో ఏడాది డిగ్రీకి అనుమతి జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం దేశంలో తొలిసారి విద్యా సంస్కరణలను మన రాష్ట్రంలోనే అమలు చేసినట్లు హేమచంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటికే నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీని ప్రవేశపెట్టామని, ప్రస్తుతం మూడో ఏడాది డిగ్రీ విద్య పూర్తయిందన్నారు. యూజీసీ ఫ్రేమ్ వర్క్స్ ప్రకారం ఆనర్స్ డిగ్రీని రెండు విధాలుగా విభజించామన్నారు. మూడేళ్ల డిగ్రీలో 75 శాతం మార్కులు సాధించినవారు రీసెర్చ్ ఆనర్స్ డిగ్రీ కోర్సులో చేరవచ్చు. ఇది పూర్తి చేసిన వారు పీజీ లేకుండా పీహెచ్డీ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మూడేళ్ల కోర్సులో ఉత్తీర్ణులైతే జనరల్ ఆనర్స్ కోర్సును అభ్యసించవచ్చు. ఇది పూర్తిచేసిన వారు పోస్టు గ్రాడ్యుయేషన్ రెండో ఏడాదిలో చేరవచ్చన్నారు. ఆనర్స్ కోర్సులను అందించేందుకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో గత మూడేళ్లలో వరుసగా 30 శాతం అడ్మిషన్లతో పాటు సంబంధిత కోర్సుల్లో ఇద్దరు డాక్టరేట్ కలిగిన ప్రొఫెసర్లు ఉంటేనే అనుమతులు మంజూరు చేస్తామన్నారు. డిగ్రీ విద్యార్థులకు 10 నెలల ఇంటర్న్‌షిప్ నూతన విద్యావిధానంలో భాగంగా డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసిందన్నారు. ఇంజనీరింగ్ తదితర ప్రొఫెషనల్ కోర్సులకు ఇంటర్న్‌షిప్ ఉన్నట్టుగానే నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల విద్యార్థులకు కూడా 10 నెలల ఇంటర్న్‌షిప్ ప్రవేశపెట్టామన్నారు. మైక్రోసాఫ్ట్ ద్వారా ఏడాదిలో 1.20 లక్షల సర్టిఫికేషన్ కోర్సులను అందించడం దేశంలో ఓ మైలురాయిగా అభివర్ణించారు. విద్యార్థుల్లో గందరగోళం సృష్టించొద్దు ఉన్నత విద్యలో ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక మార్పులను చూసి ఓర్వలేక కొన్ని పత్రికలు గందరగోళం సృష్టించే కథనాలు రాస్తున్నాయని హేమచంద్రారెడ్డి పేర్కొన్నారు. 2019 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యలో పలు సంస్కరణలు తెచ్చిందని, ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కళాశాలలపై కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. 2009 నుంచి ద్రవిడ వర్సిటీలో అడ్డగోలుగా చేపట్టిన 6055 పీహెచ్డీ అడ్మిషన్లను రద్దు చేశామన్నారు. 2014–18లో గత ప్రభుత్వ హయాంలో ఏకంగా 980 పీహెచ్డీ అడ్మిషన్లు ఇచ్చారని, వాటిపై విచారించి చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. రాయలసీమ వర్సిటీలోనూ 2008–2011 మధ్యలో చేపట్టిన 2,490 అక్రమ పీహెచ్డీ అడ్మిషన్లను రద్దు చేశామన్నారు. టీడీపీ హయాంలో అక్కడ 518 పీహెచ్డీ అడ్మిషన్లు ఇవ్వగా 2019 నుంచి ఇప్పటి వరకు 28 అడ్మిషన్లు మాత్రమే ఇచ్చామన్నారు. ఆర్–సెట్‌ను తీసుకొచ్చి పీహెచ్డీ అడ్మిషన్లలో పారదర్శకతకు పెద్దపీట వేశామన్నారు. వాస్తవాలను కప్పిపుచ్చి ఓ మీడియా అసత్య ప్రచారం చేయడం దారుణమని ఆక్షేపించారు. -
ఉన్నత విద్యలో ఏపీ ఆదర్శం
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో అమలు చేస్తున్న విద్యా విధానం పొరుగు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని విద్యా రంగ నిపుణులు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో తీసుకొస్తున్న సంస్కరణలు ప్రశంసనీయమని చెప్పారు. నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ప్రభుత్వం ముందుందని తెలిపారు. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లో రెండో రోజు శనివారం ఉన్నత విద్యపై ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏపీఎస్సీహెచ్ఈ) చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి అధ్యక్షతన ప్యానల్ చర్చ జరిగింది. ‘ఇంపాక్ట్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్’ అనే అంశంపై విద్యా రంగ నిపుణులు చర్చించారు. హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ వృత్తి నైపుణ్య కేంద్రంగా మారిందని చెప్పారు. నాస్కాం, మైక్రోసాఫ్ట్, స్కిల్ ఫోర్స్, టీం లీడ్స్, టీసీఎస్ వంటి కంపెనీలతో ఏపీఎస్సీహెచ్ఈ ఒప్పందాలు కుదుర్చుకుంటోందన్నారు. ఇంజినీరింగ్, ప్రొఫెషనల్, డిగ్రీ, ఫార్మసీ విద్యార్థులకు ఆన్లైన్లో అడ్వాన్స్డ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ కోర్సులను అందిస్తూ ఉద్యోగ కల్పనలో ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోందని వివరించారు. ఏపీలో విద్యా విధానం భేష్ విట్ ఫౌండర్, చాన్సలర్ జి.విశ్వనాథన్ మాట్లాడుతూ ఏపీలో ఉన్నత విద్యా బోధన, విధానం చాలా బాగున్నాయని, ప్రభుత్వం దీనిపై అధిక శ్రద్ధ పెట్టిందని చెప్పారు. ఏఐసీటీఈ సీవోవో బుద్దా చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉన్నత విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయాన్ని కల్పించడం వల్ల చాలా కుటుంబాల్లో ఇంజినీర్లు తయారవుతున్నారని చెప్పారు. చర్చలో ఐఐఎస్సీ (బెంగళూరు) ప్రొఫెసర్ ఎన్.బాలకృష్ణన్, ఐఐటీ హైదరాబాద్ ఫౌండర్ ఉదయ్ దేశాయ్, ఐఐఎం విశాఖ డైరెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
ఉన్నత విద్యపైనా విషమే..
సాక్షి, అమరావతి: విద్యారంగంపై ఈనాడు మరోసారి విషం చిమ్మింది. ఉన్నత విద్యారంగంలో ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ దేశంలోనే అగ్రగామిగా ఉండేలా తీర్చిదిద్దుతుంటే ఆ పత్రిక మాత్రం ప్రజలను తప్పుదోవపట్టించేలా అసత్య కథనాలు వండుతోంది. పాఠశాల విద్యపై ఇప్పటికే విషం కక్కిన ఆ పత్రిక తాజాగా ఉన్నత విద్యపైనా అదే తీరుతో రోత రాతలు రాసింది. గత ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చి వాటిని ప్రస్తుత ప్రభుత్వానికి ఆపాదించేందుకు అక్షరం అక్షరంలోనూ ప్రయత్నించింది. యూనివర్సిటీల్లో నియామకాలు, ట్రిపుల్ ఐటీలకు భవనాల నిర్మాణం, ఫీజు రీయింబర్స్‌మెంటు, అక్రిడిటేషన్ సహా పలు అంశాలపై ‘మాటల్లోనే మహర్దశ’ అంటూ అవాస్తవాలు ప్రచారం చేసింది. వీటన్నింటిపై ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. కె.హేమచంద్రారెడ్డి, వైస్‌చైర్మన్ ప్రొ.రామ్మోహనరావు, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఒక్కో అంశాన్ని వివరిస్తూ వాటివెనకున్న నిజాలను వెల్లడించారు. ఆయన ఏమన్నారంటే.. కోర్టు కేసులవల్లే రిక్రూట్మెంట్ జాప్యం గత మూడున్నరేళ్లుగా వర్సిటీల్లో రెగ్యులర్ ఫ్యాకల్టీని నియమించడంలేదని ఈనాడు కథనం రాసింది. నిజానికి.. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రిక్రూట్మెంట్ కోసం హడావుడిగా నిబంధనలు ఉల్లంఘిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో హైకోర్టులో 70కి పైగా కేసులు దాఖలయ్యాయి. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ కేసుల్లోని వాస్తవాలను తెలియజేసి ప్రభుత్వ అభిప్రాయాలను గట్టిగా వినిపించడానికి కమిటీని ఏర్పాటుచేసింది. ఫలితంగా జారీచేసిన నోటిఫికేషన్లన్నింటినీ రద్దుచేస్తూ కోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ఆ తీర్పు ఫలితంగా ఫిబ్రవరి 2022లో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో వర్సిటీ ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంటును కూడా చేర్చింది. అయితే, సింగిల్ జడ్జి తీర్పుపై అనేక రిట్ అప్పీళ్లు దాఖలయ్యాయి. వీటిపైనా ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసింది. కేసు విచారణలో ఉన్నందున పోస్టుల భర్తీకి ముందుకెళ్లలేకపోతోంది తప్ప ఇందులో ప్రభుత్వ వైఫల్యం ఏమీలేదు. ఇప్పటికే ప్రభుత్వం రెండువేల అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 1000 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను గుర్తించింది. ఆర్జీయూకేటీ వీసీ నియామకంపై.. ఇక ఆర్జీయూకేటీ వీసీ నియామకానికి 2020 జనవరిలో నోటిఫికేషన్ ఇవ్వగా 20 దరఖాస్తులొచ్చాయి. వీటిలో సరైన వారులేరు. వాస్తవానికి ఆర్జీయూకేటీ చట్టం ప్రకారం చాన్సలర్‌కు సహాయంగా ఉండడానికే వీసీ పరిమితం. ఎలాంటి అధికారం లేనందుకే సరైన వారు దరఖాస్తుచేయడంలేదు. చట్టాన్ని సవరించేందుకు వర్సిటీ చర్యలు చేపట్టింది. మళ్లీ 2022 జూన్ 6న నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దాదాపు 60 దరఖాస్తులొచ్చాయి. సెర్చ్ కమిటీ సమావేశం ఈనెల 18న జరుగుతుంది. కమిటీ సిఫార్సుల ప్రకారం వీసీని నియమిస్తారు. అక్రిడిటేషన్పైనా తప్పుడు వార్తలే.. ఆర్జీయూకేటీని 2008లో పెడితే 2020వరకు యూజీసీ 12బీ గుర్తింపు కూడా రాలేదు. గత ప్రభుత్వం దీనిపై కనీస చర్యలూ తీసుకోలేదు. ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుని 12బీ గుర్తింపు సాధించింది. న్యాక్ అక్రిడిటేషన్ రావాలంటే ఇది అవసరం. ఇప్పుడు న్యాక్ అక్రిడిటేషన్ కోసం చర్యలు చేపట్టింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని కాలేజీలన్నింటికీ న్యాక్ గుర్తింపు ఉండాలని జీఓ కూడా ఇచ్చారు. గతంలో 213 కాలేజీలకు మాత్రమే న్యాక్ అక్రిడిటేషన్ ఉండగా ఇప్పుడు 275 కాలేజీలు పొందాయి. ఇక రాష్ట్ర వర్సిటీల్లో గత ప్రభుత్వ హయాంలో ఆరింటికి అసలు న్యాక్ అక్రిడిటేషనే లేదు. ఇప్పుడు అన్నింటికీ ఆ గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. వర్సిటీల నిధులపైనా అసత్యాలు వర్సిటీల నిధులను ప్రభుత్వం లాగేసుకుంటోందని ఈనాడు కథనం అల్లడం హాస్యాస్పదం. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో తమ మిగులు నిధులను జమచేయాలని ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను కోరింది. దీనికోసం వారికి నెలవారీ 6.20 శాతం వడ్డీ కూడా ఇస్తోంది. నిజానికి.. గత ప్రభుత్వం ఆర్జీయూకేటీ నుంచి రూ.180 కోట్లు, ఆంధ్రా వర్సిటీ నుంచి రూ.150 కోట్లు ‘పసుపు కుంకుమ’ కోసం దారిమళ్లించింది. దీన్ని ప్రభుత్వం యూనివర్సిటీల నిధులను స్వాహా చేయడం అంటారు. అలాగే, బడెŠజ్ట్ తగ్గించామన్నదీ అవాస్తవం. గతంలో ఏ మేరకు బడ్జెట్ ఉందో అంతే మొత్తాన్ని ఇప్పుడూ ప్రభుత్వం ఇస్తోంది. అయితే, సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సులకు ప్రభుత్వం ఇవ్వదు. పీజీ కోర్సుల్లో అక్రమాలకు తెరదించేలా చర్యలు పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంటు ఇవ్వడంలేదన్న అంశంలోనూ తప్పుదోవ పట్టించేలా వార్త రాశారు. గతంలో ప్రైవేట్ కాలేజీలు ఫీజు రీయింబర్స్‌మెంటు కోసం దొంగ చేరికలతో అక్రమాలకు పాల్పడేవి. ఇలా రూ.450 కోట్లు స్వాహా చేసేవి. దీనిపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. వర్సిటీలు కూడా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. విచారణ నివేదికలు రాగానే ఫీజు రీయింబర్స్‌మెంటుపై చర్యలుంటాయి. మీడియా రాజకీయాలు దురదృష్టకరం : ఆలూరు ప్రభుత్వ విద్యాసలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కొన్ని మీడియా సంస్థలు రాజకీయాలు చేస్తున్నాయని, ఇది దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఏపీలోని పరిస్థితిని ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉందన్నారు. మంచిని కూడా చెడుగా చూపుతున్నారని.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడితే ప్రతిపక్షం, ఈ మీడియా స్పందించిన విధానాన్ని ఆయన గుర్తుచేశారు. ఇలా వ్యతిరేకించినందుకు ఆ పార్టీలకు, వారికి వంతపాడుతున్న మీడియాకు ప్రజలు ఇప్పటికే తగిన రీతిలో గుణపాఠం చెప్పారన్నారు. గత ప్రభుత్వ లోపాల వల్లే ఆ ట్రిపుల్ ఐటీల్లో సమస్య శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లను గత టీడీపీ ప్రభుత్వం 2016లో ప్రారంభించి ఒక్క పోస్టూ ఇవ్వలేదు. భవన నిర్మాణమూ చేపట్టలేదు. పైగా 2018లో ఎన్నికలకు ముందు అనుమతుల్లేకుండా రూ.450 కోట్లతో ఒంగోలు భవనాల పనులకు టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి శంకుస్థాపన చేసింది. ఆ తరువాత వాటిని నిలిపివేశారు. ఈ ప్రాంతంపై కోర్టు కేసులు ఉండడంతో వెనుకబడిన ప్రాంతం అయిన కనిగిరి మండలం బల్లిపల్లిలో నిర్మాణానికి అనుమతులిచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చాక శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీని ట్వంటీయత్ సెంచరీ గురుకులంతో పాటు మరో సంస్థ భవనాలను కేటాయించి విద్యా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం. వచ్చే ఏడాదికి పూర్తిగా శ్రీకాకుళానికి కొత్త క్యాంపస్ సిద్ధమవుతుంది. శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్‌లకు 420 టీచింగ్, 178 నాన్‌టీచింగ్ పోస్టులను 2020లో ప్రభుత్వం మంజూరుచేసినా న్యాయపరమైన సమస్యల కారణంగా అవీ ముందుకు సాగలేదు. ఫీజు రీయింబర్స్మెంటుపైనా రోత రాతలు 2020–21 నాల్గో త్రైమాసికం ఫీజు రీయింబర్స్‌మెంటు కోత పెట్టారని అసత్యాలు రాశారు. అప్పట్లో కోవిడ్‌తో కాలేజీలు మూడు నెలలకు మించి జరగలేదు. కాలేజీలకు నిర్వహణ వ్యయం చాలా తగ్గింది. పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి ఉంటే ప్రభుత్వం ఫీజులను 70 శాతమే వసూలు చేసుకోవాలని జీవో ఇచ్చింది. అతదే రీతిలో 2020–21కి నాలుగో త్రైమాసిక ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కోరవద్దని విద్యార్థుల నుండి వసూలుచేయవద్దని విద్యామంత్రి అన్ని ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలకూ లేఖ రాశారు. కాలేజీలు కూడా ఇందుకు అంగీకారాన్ని తెలిపాయి. అసలు గత ప్రభుత్వం మూడేళ్లపాటు ఫీజు రీయింబర్స్ ఇవ్వకపోవడం ఈనాడుకు కనిపించలేదు. అప్పటి బకాయిలనూ ప్రస్తుత ప్రభుత్వం దాదాపు రూ.1,800 కోట్లు విడుదలచేసింది. టీడీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.35 వేలే ఇచ్చేది. కానీ, జగన్ సర్కార్ పూర్తి ఫీజుతోపాటు వసతి భోజనాలకు, వసతి దీవెన కింద ఏటా రూ.20వేలు అందిస్తోంది. -
‘సెట్’ అడ్మిషన్లన్నీ ఈ నెలలోనే
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీ ఈఏపీ సెట్–2022 రెండో విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి ప్రకటించారు. ఈనెల 25వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. వివిధ కోర్సులకు సంబంధించిన అడ్మిషన్ల కౌన్సెలింగ్ తేదీలను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సోమవారం ఆయన విడుదల చేశారు. ఈసెట్, ఐసెట్, పీజీఈ సెట్, జీప్యాట్, బీఆర్క్‌లకు సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్ తేదీలను ఖరారు చేసినట్లు వివరించారు. అలాగే పీఈ సెట్, పీజీ సెట్ మొదటి విడత కౌన్సెలింగ్‌లను త్వరలో చేపట్టనున్నట్టు చెప్పారు. ఆర్ సెట్ పరీక్ష నిర్వహణ తేదీలను కూడా ఖరారు చేశామన్నారు. ఏపీ ఈఏపీ సెట్‌కు సంబంధించి కేటగిరీ–బి (యాజమాన్య కోటా) సీట్లలో ఎన్ఆర్ఐ కోటా సీట్ల భర్తీకి సెప్టెంబర్ 3నుంచి 15వరకు అవకాశం ఇచ్చామన్నారు. నాన్ ఎన్ఆర్ఐ కోటా సీట్లను సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభించామని, అక్టోబర్ 17వ తేదీతో ఈ అడ్మిషన్ల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు. కొన్ని సెట్ల తొలివిడత అడ్మిషన్ల కౌన్సెలింగ్ ముగియగా.. కొన్ని సెట్ల తొలివిడత ప్రక్రియ కొనసాగుతోందన్నారు. వాటినీ పూర్తిచేసి రెండో విడత కౌన్సెలింగ్‌ను చేపట్టేందుకు వీలుగా షెడ్యూళ్లను ఖరారు చేశామని వివరించారు. డిగ్రీ కోర్సుల సీట్ల కేటాయింపు కాగా, రాష్ట్రంలోని ఉన్నత విద్యాకోర్సులన్నిటికీ అడ్మిషన్లను ఆన్లైన్లోనే కల్పిస్తున్నామని హేమచంద్రారెడ్డి వివరించారు. జూలై 22న డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ ఇచ్చామని, సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించామని చెప్పారు. ఈ నెల 14న డిగ్రీ అభ్యర్థులకు తొలివిడత సీట్ల కేటాయింపు చేస్తామని చెప్పారు. వారంతా 15వ తేదీన కాలేజీల్లో రిపోర్టు చేయాలని, అదే రోజు నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. డిగ్రీ కోర్సులన్నీ నాలుగేళ్ల హానర్ కోర్సులుగా చేశామని, డిగ్రీలో చేరిన విద్యార్థులు ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. మూడేళ్లకే ఎగ్జిట్ అయ్యే విద్యార్థులకు 10 నెలల ఇంటర్న్‌షిప్ ఉంటుందన్నారు. ఇప్పటికే డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. ఇంటర్న్‌షిప్‌తోపాటు అదనంగా మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్ వంటి వివిధ ఆధునిక కంప్యూటర్ సర్టిఫికెట్ కోర్సులను కూడా ఉచితంగా అందిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కె.రామమోహనరావు, కార్యదర్శి ప్రొఫెసర్ నజీర్ అహమ్మద్, సెట్స్ ప్రత్యేకాధికారి డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. -
విద్యార్థుల్లో పరిశోధనా నైపుణ్యం పెరగాలి
లబ్బీపేట(విజయవాడ తూర్పు): విద్యార్థుల్లో పరిశోధనా నైపుణ్యం పెరగాలి అని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి అన్నారు. ఆ దిశగా జాతీయ విద్యా విధానం ద్వారా కేంద్రం భారీ మార్పులు తీసుకువచ్చిందని చెప్పారు. శనివారం విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో ‘నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ–ఒక అంచనా’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. విద్యారంగంలో మొత్తం 27 అంశాల్లో మార్పులు చేశారని చెప్పారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేయడంలో ఏపీ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందన్నారు. ప్రాక్టికల్స్‌తో కూడిన విద్యను ప్రతి ఒక్కరూ అభ్యసించేందుకు.. ఇంటర్న్‌షిప్స్‌ని తప్పనిసరి చేసినట్లు చెప్పారు. విద్యార్థుల్లో పరిశోధనా నైపుణ్యాలను పెంపొందించేందుకు.. రాష్ట్రంలో పలుచోట్ల రీసెర్చ్ బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నైపుణ్యంతో కూడిన విద్యను విద్యార్థులకు అందించడమే కొత్త విద్యా పాలసీ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. సదస్సులో కృష్ణా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ వి.వెంకయ్య, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ విభాగ ప్రొఫెసర్ అరబింద్ కుమార్, జానియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.కల్పన, డైరెక్టర్ విజయలక్ష్మి, సిద్ధార్థ అకాడమీ జాయింట్ సెక్రటరీ ఎన్.లలిత్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
రూ. 50 కోట్లతో వైఎస్సార్–ఐటీ ఏజెన్సీ
కర్నూలు (ఓల్డ్‌సిటీ): వైఎస్సార్–ఐటీ ఏజెన్సీని రూ. 50 కోట్ల వ్యయంతో స్థాపించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు. కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కళాశాల ప్రాంగణంలో స్థాపించిన క్లస్టర్ యూనివర్సిటీలో మైక్రోసాఫ్ట్ అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్ (ఎంఎస్‌యూపీ)లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఆదివారం ధ్రువపత్రాలు బహూకరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉద్యోగ సాధనలో విద్యార్థులను ముందు వరుసలో నిలిపే ఈ కార్యక్రమాన్ని కేవలం ఈ వర్సిటీలో మాత్రమే డిజైన్ చేశారు. కార్యక్రమానికి ఉన్నత విద్యా శాఖ రాష్ట్ర ఛైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలులోని మూడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 460 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారని, ఇందులో 252 మంది ఉత్తీర్ణత సాధించడం ఒక గొప్ప విషయమన్నారు. భవిష్యత్తులో గూగుల్‌తో కూడా ఒప్పందం కుదుర్చుకునే ఉద్దేశం ఉందని తెలిపారు. క్లస్టర్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ డీవీఆర్ సాయిగోపాల్, వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శ్రీనివాసులు, రాయలసీమ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఆనందరావు మాట్లాడారు. కార్యక్రమంలో మూడు ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లు డాక్టర్ వీవీఎస్ కుమార్, డాక్టర్ కళావతి, డాక్టర్ ఇందిరా శాంతి పాల్గొన్నారు. (క్లిక్: తరగతుల విలీనంపై తప్పుడు వార్తలు) -
వధూవరులకు సీఎం జగన్ దంపతుల ఆశీర్వాదం
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కే.హేమచంద్రారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు హాజరయ్యారు. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో గురువారం జరిగిన ఈ రిసెప్షన్లో వరుడు హసిత్, వధువు శ్రీజలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ భారతీరెడ్డి ఆశీర్వదించారు. చదవండి: (ఇంటింటికి అమృతధార) -
‘ఫీజు’పై దుష్ప్రచారం దారుణం
సాక్షి, అమరావతి: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కొన్ని పత్రికలు తప్పుడు కథనాలతో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ గందరగోళం రేపాలని ప్రయత్నిస్తున్నాయని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో చిత్తశుద్ధితో తల్లిదండ్రులు, విద్యార్థులపై నయాపైసా భారం పడకుండా నాణ్యమైన ఉన్నత విద్యను అందించేలా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తూ అందరినీ ఆదుకుంటున్నారని చెప్పారు. దీన్ని చూసి ఓర్వలేని ఆ పత్రికలు తప్పుడు కథనాలు అల్లుతున్నాయని విమర్శించారు. బుధవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏడాదికోసారి ఫీజు రీయింబర్స్మెంట్.. అదీ అరకొరగా ఇస్తూ కాలేజీలను ఇబ్బంది పెట్టేవారన్నారు. అప్పట్లో కాలేజీల యాజమాన్యాలు అనేకసార్లు ధర్నాలు చేసినా, ఈ పత్రికల్లో అందుకు సంబంధించిన వార్తలు కనిపించలేదని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తి ఫీజు ఇవ్వకుండా కేవలం రూ.35 వేలతోనే సరిపెట్టిన విషయం ఎవరికి తెలియదని నిలదీశారు. ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏమన్నారంటే.. ఎవరిలో ఎలాంటి ఆందోళన లేదు ► ప్రస్తుత ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందిస్తోంది. తల్లిదండ్రులు, విద్యార్థులు, కాలేజీల యాజమాన్యాల్లో ఎలాంటి ఆందోళన లేదు. ► గత ప్రభుత్వం 2016–17లో రూ.2,391 కోట్లు, 2017–18లో రూ.2,828 కోట్లు, 2018–19లో రూ.1,687 కోట్లు ఇచ్చింది. ఇందులో ఇంటర్ ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్, 2012–13కు సంబంధించిన బకాయిలు కూడా ఉన్నాయి. ► ఈ ప్రభుత్వం వచ్చాక కేవలం ఉన్నత విద్యకు సంబంధించి 2019–20లో రూ.2,559 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇచ్చింది. 2017–18, 2018–19 విద్యా సంవత్సరాలకు గత టీడీపీ ప్రభుత్వం చెల్లించకుండా బకాయి ఉంచిన రూ.1,800 కోట్లు ప్రస్తుత ప్రభుత్వమే చెల్లించింది. ► 2019–20లో కరోనా కష్టాల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.3,900 కోట్లు (ఇంటర్ విద్యార్థులకు అందించిన అమ్మ ఒడి నిధులు కలుపుకుని) ఇచ్చింది. గత ప్రభుత్వంలో కన్నా ఇది ఒకటిన్నర రెట్లు అధికం. ► 2020–21కి వచ్చేసరికి కరోనా వల్ల ఆర్థికంగా ఇబ్బందులున్నా, ఏప్రిల్‌లో రూ.671.03 కోట్లు, జూలైలో రూ.693.27 కోట్లు, నవంబర్‌లో రూ.683.13 కోట్లు విడుదల చేశారు. నాలుగో త్రైమాసికానికి సంబంధించి.. కరోనా వల్ల గత నెలలో ఇవ్వాల్సింది ఈ నెలలో విడుదల చేయనున్నారు. ఇది కాకుండా అమ్మ ఒడి కింద రూ.1500 కోట్లు ఇవ్వనున్నారు. ఇవన్నీ కలుపుకుంటే ఈ విద్యా సంవత్సరంలో రూ.3,600 కోట్లు ప్రభుత్వం అందిస్తోంది. ► గత ప్రభుత్వ హయాంలో సకాలంలో ఫీజులు ఇవ్వక పోవడం వల్ల కాలేజీల యాజమాన్యాలపై రూ.1,000 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల వరకు వడ్డీల భారం పడింది. ప్రస్తుతం ప్రతి మూడు నెలలకోసారి ఇవ్వడం వల్ల యాజమాన్యాలకు ఏ ఇబ్బందీ లేదు. మంచి నిర్ణయాలు కనిపించవా? ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నతాశయంతో విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించి, రాష్ట్రాన్ని నాలెడ్జి హబ్‌గా మార్చేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఇలాంటి వాటి గురించి ఆ పత్రికలు కథనాలు రాయవు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను నెలకొల్పింది. ఏ కాలేజీ అయినా విద్యార్థుల నుంచి అదనంగా, అధికంగా డబ్బులు వసూలు చేసినా, డిమాండ్ చేసినా ఈ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటుంది. ► రెండేళ్లలో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల గ్రాస్ ఎన్రోల్మెంటు రేషియో (జీఈఆర్) రేట్లో మన రాష్ట్రం దేశంలో చాలా ముందుంది. 2018–19, 2019–20లో పరిశీలిస్తే జీఈఆర్ జాతీయ స్థాయిలో 26.3 నుంచి 27.1కు పెరిగింది. అదే ఏపీలో 32.4 నుంచి 35.2కు పెరిగింది. ► ఎస్సీల చేరికల పెరుగుదల జాతీయ స్థాయిలో 1.7% అయితే రాష్ట్రంలో 7.5 శాతంగా ఉంది. ఎస్టీలలో జాతీయ స్థాయిలో 4.5% పెరుగుదల ఉంటే రాష్ట్రంలో 9.5 శాతంగా నమోదైంది. చేరికలతో సరిపెట్టకుండా వారికి నాణ్యమైన విద్య అందించేలా ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలను చేపట్టించారు. ► 10 నెలల ఇంటర్న్‌షిప్, స్కిల్ కోర్సులు ఏర్పాటు చేశాం. ప్రైవేటు వర్సిటీల్లో పేద మెరిట్ విద్యార్థులకు కోటా కల్పించాం. రూ.5 లక్షల వరకు చెల్లించాల్సి వచ్చే ఆ వర్సిటీల్లో 35 శాతం సీట్లు పేద మెరిట్ విద్యార్థులకు దక్కేలా చేశాం. ఈ ఏడాది 2,118 మందికి అక్కడ సీట్లు అందించాం. -
AP: ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుల్లో ఆలస్యం లేదు: హేమ చంద్రారెడ్డి
సాక్షి, విజయవాడ: నాణ్యమైన విద్యను అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని ఏపీ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమ చంద్రారెడ్డి అన్నారు. విద్యారంగంలో కీలకమైన మార్పులు తీసుకొచ్చామన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుల్లో ఆలస్యం లేదని.. 87 శాతం విద్యార్థులకు పూర్తిగా చెల్లింపులు చేశామని స్పష్టం చేశారు. 2019 నుంచి ఇప్పటివరకు 4వేల కోట్లు చెల్లించామని తెలిపారు. రూ.1880 కోట్ల గత ప్రభుత్వ బకాయిలు చెల్లించామని పేర్కొన్నారు. కొన్ని పత్రికలు అవాస్తవ కథనాలను ప్రచురిస్తున్నాయని తెలిపారు. అక్రమాలను నిరోధించేందుకు పలు చర్యలు చేపట్టామన్నారు. వివిధ అంశాలపై విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోందన్నారు. చదవండి: ‘కట్టుకథలు.. చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య’ -
సెప్టెంబర్‌లో పీజీ, యూజీ పరీక్షలు: హేమచంద్రారెడ్డి
సాక్షి, విజయవాడ: యూజీసీ ఆదేశాలతో రాష్ట్రంలోని 20 యూనివర్సిటీల పరిధిలో పీజీ, యూజీ పరీక్షలు సెప్టెంబర్‌లోపు నిర్వహించనున్నట్లు ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆన్లైన్ ఎడ్యుకేషన్‌తో పాటు రెగ్యూలర్ ఎడ్యుకేషన్ రెండు అవసరమేనని గవర్నర్ సూచించినట్టు చెప్పారు. కోవిడ్ కారణంగా అకడమిక్ కరిక్యులమ్ రీ డిజైన్ చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది నుంచి డిగ్రీ మూడేళ్లలో 10 నెలల పాటు ఇంటర్న్ షిప్‌ను తప్పనిసరి చేస్తున్నామని వెల్లడించారు. సెప్టెంబర్ 13 నుంచి 27 మధ్యలో ఎంసెట్ పరీక్షతో పాటు ఇతర పరీక్షలు కూడా నిర్వహిస్తామన్నారు. డిగ్రీ, పీజీ పరీక్షలకు కోవిడ్ కారణంగా హాజరు కానీ వారికి తిరిగి పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్లేస్‌మెంట్స్ వచ్చిన వారికి, అబ్రాడ్ వెళ్లిన వారికి ముందస్తుగా డిగ్రీ, పీజీ పరీక్షలు ప్రత్యేకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. -
'ప్రభుత్వ విద్యా సంస్థలను మరింత బలోపేతం చేయాలి'
సాక్షి, గుంటూరు : జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం గుంటూరులో నిర్వహించిన కార్పొరేట్ విద్య ప్రక్షాళన సదస్సుకు ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం ర్యాంకుల కోసమే ఇప్పటి పేరెంట్స్ కార్పొరేట్ విద్యపై దృష్టి పెడుతున్నారని, ఇది మంచి నిర్ణయం కాదని పేర్కొన్నారు. ఏపీలో ఈ ఏడాది ఏడు లక్షల మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారని తెలిపారు. వారిలో కేవలం 1.2 లక్షల మంది మాత్రమే ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్నారని, మిగతా 5.8లక్షల మంది ప్రైవేటు సంస్థల్లోనే తమ చదువును కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. పిల్లల భవిష్యత్తును కార్పొరేట్ సంస్థల చేతిలో పెట్టవద్దని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ సంస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని హేమచంద్రారెడ్డి వెల్లడించారు. -
హేమచంద్రరెడ్డికి భారత్ గౌరవ్ అవార్డు
-
చేయూత కావాలి
సాంకేతిక విద్యాబోధనలో పాతికేళ్ల అనుభవం.. అటు పరిపాలన, ఇటు అకడమిక్ అంశాలలో కీలక నిర్ణయాలకు దోహదపడిన మేధావి డాక్టర్ కోనిరెడ్డి హేమచంద్రారెడ్డి. ఈయన గతంలో జేఎన్టీయూ (ఏ) రిజిస్ట్రార్‌గా సేవలందించారు. వర్సిటీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేశారు. ప్రస్తుతం మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గాను, ఇందులోనే మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్‌గానూ ఉన్నారు. ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్‌గా రెండు దఫాలు ఎంపికయ్యారు. నిఖార్సయిన నిర్ణయాలు తీసుకోవడంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచిన హేమచంద్రారెడ్డి ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల(అనంతపురం)ను సందర్శించారు. కళాశాలలో కలియదిరిగి దీర్ఘకాలికంగా తిష్టవేసిన సమస్యలను, విద్యార్థులు, సిబ్బంది సాదకబాధకాలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి ప్రభుత్వం మరింత చేయూత అందించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ముందు గా వీఐపీ రిపోర్టర్ హేమచంద్రారెడ్డిని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఆషప్ ్రఆలీ సాదరంగా ఆహ్వానించారు. హేమచంద్రారెడ్డి : బాగున్నారా! ఆషప్ ్రఅలీ(పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్) : బాగున్నాం సార్.. హేమచంద్రారెడ్డి : మీకు ఈ మధ్యనే ప్రిన్సిపాల్‌గా పదోన్నతి వచ్చింది కదా! ఎలాంటి అనుభూతి కలుగుతోంది? ఆషప్ ్రఅలీ: 67 ఏళ్ల చరిత్ర కల్గిన కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేసే అవకాశం రావడం గర్వకారణంగా భావిస్తున్నా. క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఆసక్తి ఉన్న విద్యార్థులలో 99 శాతం మందికి ఉద్యోగ కల్పనకు కృషి చేస్తున్నాం. హేమచంద్రారెడ్డి : బోధన తీరు ఎలా ఉంది? ఆషప్ ్రఅలీ: ఏపీపీఎస్సీ ద్వారా ఎంపికైన అధ్యాపకులే అత్యధికంగా ఉన్నారు. పైగా అనేకమంది పీహెచ్డీ లాంటి ఉన్నత విద్యను అభ్యసించిన వారే. దీంతో నాణ్యమైన బోధన అందించగలుగుతున్నాం. హేమచంద్రారెడ్డి : మీరు ఎంతకాలం నుంచి పని చేస్తున్నారు? ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ఫణీశ్వర్ (లెక్చరర్): 15 ఏళ్లుగా పని చేస్తున్నా. ఇప్పటికి 28 బ్యాచ్‌లు బయటకు వెళ్లాయి. మా కళాశాల ప్రథమస్థానంలో ఉందని చెప్పడానికి గర్వపడుతున్నా. హేమచంద్రారెడ్డి : ఎలక్ట్రికల్‌కు సంబంధించి అన్ని సౌకర్యాలూ ఉన్నాయా? ఫణీశ్వర్ : గతంలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ల్యాబ్‌ను వాడుకొనేవాళ్లం. పదేళ్ల నుంచి ఏఐసీటీఈ నిధులు పరిపుష్టిగా వస్తుండడంతో ల్యాబ్‌ను పూర్తిగా ఆధునికీకరించాం. అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త పరికరాలను సమకూర్చుకుంటున్నాం. హేమచంద్రారెడ్డి : విద్యార్థులకు నైపుణ్యాన్ని (హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్) ఎలా పెంపొందిస్తున్నారు? రామకృష్ణారెడ్డి (లెక్చరర్): ప్రాక్టికల్ నాలెడ్జ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. థియరిటికల్‌గా కూడా ఈ -లెర్నర్ కోర్సుల ద్వారా నాలెడ్జ్‌ను పెంపొందిస్తున్నాం. హేమచంద్రారెడ్డి : స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌కు నిధులు బాగా వస్తున్నాయా? రామకృష్ణారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతియేటా రూ.31 లక్షలు వస్తున్నాయి. హేమచంద్రారెడ్డి : కళాశాలలో ఎన్ని షిఫ్ట్‌లు ఉన్నాయి? రామకృష్ణారెడ్డి: రెండు షిఫ్టులు ఉన్నాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు షిఫ్ట్‌లు నడుస్తున్నాయి. విద్యార్థులనుద్దేశించి... హేమచంద్రారెడ్డి : ఇక్కడ చదువుతున్నందుకు ఎలా ఫీలవుతున్నారు? విద్యార్థులందరూ : ఘన చరిత్ర కల్గిన కళాశాలలో చదవడం చాలా సంతోషంగా ఉంది. హేమచంద్రారెడ్డి : పాలిటెక్నిక్‌ను ఎందుకు ఎంచుకున్నారు? రాజశేఖర్ (విద్యార్థి) : ప్రస్తుత పరిస్థితులలో టెక్నాలజీ అవసరం ఎంతో ఉంది. డిప్లొమో చేస్తే నేరుగా బీటెక్ రెండో సంవత్సరంలో ప్రవేశం పొందవచ్చు. అందుకే చదువుతున్నా. హేమచంద్రారెడ్డి : డిప్లొమో చదివిన వారు పారిశ్రామిక అవసరాలకు ఏవిధంగా దోహదపడుతున్నారని అనుకుంటున్నారు? స్రవంతి (విద్యార్థిని): పాలిటెక్నిక్ ద్వారా సులువుగా ఉద్యోగం పొందవచ్చు. ఇక్కడ మూడేళ్ల పాటు థియరీ నాలెడ్జ్ కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్‌నే ఎక్కువగా నేర్పిస్తున్నారు. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వల్ల పరిశ్రమలలో పనిచేయడం తేలికవుతుంది. హేమచంద్రారెడ్డి : ల్యాబ్‌ను ఎంత సేపు ఉపయోగించుకుంటున్నారు? నవీన్: (విద్యార్థి) వారానికి రెండు సార్లు ఉపయోగించుకుంటున్నాం. కళాశాలలోనే కాకుండా ఆరు నెలలు బయట ఇండస్ట్రియల్ ట్రైనింగ్‌కు వెళతాం సార్. హేమచంద్రారెడ్డి : ఉద్యోగావకాశాలు, నూతన ఆవిష్కరణల విషయంలో అధ్యాపకుల ప్రోత్సాహముందా? లావణ్య : అవును సార్. క్యాంపస్ ఇంటర్వ్యూల కోసం ముందస్తు శిక్షణ ఇస్తున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. హేమచంద్రారెడ్డి : చాక్ అండ్ టాక్ (ఉపన్యాస) పద్ధతిలోనే చెబుతున్నారా? లేక వినూత్న విధానాలలో బోధిస్తున్నారా? రవీంద్ర (విద్యార్థి): ప్రొజెక్టర్ల ద్వారా, త్రీ డైమన్షన్స్ ద్వారా పాఠాలు చెబుతున్నారు. ప్రతి రోజు మూడు గంటల సేపు ఎలక్ట్రికల్ ల్యాబ్‌లో గడుపుతున్నాం. హేమచంద్రారెడ్డి : మీ లక్ష్యమేమిటి? అనిల్ (విద్యార్థి): లెక్చరర్ కావాలనుకుంటున్నా. డిప్లొమా తరువాత బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ చేయాలన్నది నా లక్ష్యం. హేమచంద్రారెడ్డి : చదువుకున్న యువత సమాజంలోకి వెళుతున్నప్పటికీ సమాజ స్థితిగతులు మారడం లేదు. ఎందుకని? స్వప్న( విద్యార్థిని): జాతి సర్వతోముఖాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి. సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించాలి. దురదృష్టవశాత్తు ఆ విధమైన అంశాలు ఎవరూ చెప్పడం లేదు. తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలను పిల్లలపై రుద్దుతున్నారు. విద్యార్థుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదు. దీనివల్ల ప్రతిభావంతులు మరుగునపడిపోతున్నారు. హేమచంద్రారెడ్డి : హాస్టళ్లు ఎలా ఉన్నాయి? స్వప్న : బాగానే ఉన్నాయి. అయితే.. తాగునీటిని మేమే కొంటున్నాం. ఇక్కడ ఉప్పునీళ్లే గతి. మంచినీరు ఇవ్వాలని ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు. హేమచంద్రారెడ్డి : మెస్ బిల్లు ప్రతి నెలా ఎంత వస్తోంది? గోవిందమ్మ (విద్యార్థిని): రూ.1,300 హేమచంద్రారెడ్డి : మెస్ బిల్లు అధికమని భావిస్తున్నారా? రంగనాయకులు (విద్యార్థి): అవును సార్. మెస్ బిల్లు ఏడాదికి రూ.13 వేల దాకా వస్తోంది. అదే స్కాలర్షిప్ రూ.5 వేలు మాత్రమే మంజూరవుతోంది. మిగిలిన రూ.8 వేలు మేమే భరించాలి. మా అమ్మానాన్న కూలి పనులు చేస్తుంటారు. ఇంత మొత్తం కట్టాలంటే ఇబ్బందిగా ఉంది. అలాగే ప్రతినెలా ఒక్కొక్కరం సగటున రూ.70 తాగునీటికి వెచ్చిస్తున్నాం. రాత్రిపూట హాస్టళ్లలో అన్నం వడ్డించే వాళ్లు ఉండడం లేదు. సిబ్బంది కొరత అధికంగా ఉంది. ప్రాంగణ నియామకాలకు హాజరైన విద్యార్థులనుద్దేశించి.. హేమచంద్రారెడ్డి : ఎల్అండ్టీ లాంటి గొప్ప కంపెనీలో ఉద్యోగం కోసం తుది రౌండు ఇంటర్వ్యూకు చేరకోవడంపై ఎలా ఫీలవుతున్నారు? రవళి: చాలా గొప్పగా ఫీలవుతున్నాం సార్. ఇంటర్వ్యూలలో ఎంపిక కావడానికి ఇక్కడ ప్రత్యేక తర్ఫీదు ఇస్తుండడం ఇప్పుడు ఉపయోగపడుతోంది. స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్లో కమ్యూనికేషన్స స్కిల్స్, డొమైన్ స్కిల్స్ వంటివి నేర్పారు. నీటిని కొని తాగడం దురదృష్టకరం సింహభాగం పాలిటెక్నిక్ విద్యార్థులు ఇంజనీరింగ్ విద్య వైపు వెళుతుండడం ఆందోళన కలిగించే అంశం. వీరి అవసరం పరిశ్రమలకు ఎంతో ఉంది. పాలిటెక్నిక్ ప్రవేశపెట్టడానికి గల మౌలిక సూత్రాలను ప్రతి ఒక్కరూ మరిచారు. వీటిపై కళాశాలలు, పరిశ్రమలు అవగాహన కల్పించాలి. ఈ కళాశాల ఎలక్ట్రికల్స్ విభాగంలో ఆధునిక పరికరాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. విద్యార్థులు తాగునీటిని కొనుక్కోవాల్సి రావడం దురదృష్టకరంగా భావిస్తున్నా. దీనిపై కళాశాల యాజమాన్యం తక్షణమే స్పందించాలి. పేద విద్యార్థులు మెస్ బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇందుకోసం ప్రభుత్వం మరింత సాయం అందించాలి. - ఆచార్య కే.హేమచంద్రారెడ్డి, జేఎన్టీయూ, అనంతపురం. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం మెస్ బిల్లులు తగ్గించేలా తగిన సాయం చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరతాం. స్కాలర్షిప్లు పెంచితేనే వీటికి సత్వర పరిష్కారం దొరుకుతుంది. మంచినీటి సరఫరాకు తగిన కృషి చేస్తాం. -ఆషప్ ్రఆలీ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, అనంతపురం.