సాంకేతిక విద్యాబోధనలో పాతికేళ్ల అనుభవం.. అటు పరిపాలన, ఇటు అకడమిక్ అంశాలలో కీలక నిర్ణయాలకు దోహదపడిన మేధావి డాక్టర్ కోనిరెడ్డి హేమచంద్రారెడ్డి. ఈయన గతంలో జేఎన్‌టీయూ (ఏ) రిజిస్ట్రార్‌గా సేవలందించారు. వర్సిటీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేశారు. ప్రస్తుతం మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గాను, ఇందులోనే మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్‌గానూ ఉన్నారు. ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్‌గా రెండు దఫాలు ఎంపికయ్యారు. నిఖార్సయిన నిర్ణయాలు తీసుకోవడంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచిన హేమచంద్రారెడ్డి ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల(అనంతపురం)ను సందర్శించారు. కళాశాలలో కలియదిరిగి దీర్ఘకాలికంగా తిష్టవేసిన సమస్యలను, విద్యార్థులు, సిబ్బంది సాదకబాధకాలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి ప్రభుత్వం మరింత చేయూత
అందించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ముందు గా వీఐపీ రిపోర్టర్ హేమచంద్రారెడ్డిని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఆషప్ ్రఆలీ సాదరంగా ఆహ్వానించారు.
హేమచంద్రారెడ్డి : బాగున్నారా!
ఆషప్ ్రఅలీ(పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్) : బాగున్నాం సార్..
హేమచంద్రారెడ్డి : మీకు ఈ మధ్యనే ప్రిన్సిపాల్‌గా పదోన్నతి వచ్చింది కదా! ఎలాంటి అనుభూతి కలుగుతోంది?
ఆషప్ ్రఅలీ: 67 ఏళ్ల చరిత్ర కల్గిన కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేసే అవకాశం రావడం గర్వకారణంగా భావిస్తున్నా. క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఆసక్తి ఉన్న విద్యార్థులలో 99 శాతం మందికి ఉద్యోగ కల్పనకు కృషి చేస్తున్నాం.
హేమచంద్రారెడ్డి : బోధన తీరు ఎలా ఉంది?
ఆషప్ ్రఅలీ: ఏపీపీఎస్సీ ద్వారా ఎంపికైన అధ్యాపకులే అత్యధికంగా ఉన్నారు. పైగా అనేకమంది పీహెచ్‌డీ లాంటి ఉన్నత విద్యను అభ్యసించిన వారే. దీంతో నాణ్యమైన బోధన అందించగలుగుతున్నాం.
హేమచంద్రారెడ్డి : మీరు ఎంతకాలం నుంచి పని చేస్తున్నారు? ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి?
ఫణీశ్వర్ (లెక్చరర్): 15 ఏళ్లుగా పని చేస్తున్నా. ఇప్పటికి 28 బ్యాచ్‌లు బయటకు వెళ్లాయి. మా కళాశాల ప్రథమస్థానంలో ఉందని చెప్పడానికి గర్వపడుతున్నా.
హేమచంద్రారెడ్డి : ఎలక్ట్రికల్‌కు సంబంధించి అన్ని సౌకర్యాలూ ఉన్నాయా?
ఫణీశ్వర్ : గతంలో జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాల ల్యాబ్‌ను వాడుకొనేవాళ్లం. పదేళ్ల నుంచి ఏఐసీటీఈ నిధులు పరిపుష్టిగా వస్తుండడంతో ల్యాబ్‌ను పూర్తిగా ఆధునికీకరించాం. అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త పరికరాలను సమకూర్చుకుంటున్నాం.
హేమచంద్రారెడ్డి : విద్యార్థులకు నైపుణ్యాన్ని (హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్) ఎలా పెంపొందిస్తున్నారు?
రామకృష్ణారెడ్డి (లెక్చరర్): ప్రాక్టికల్ నాలెడ్జ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. థియరిటికల్‌గా కూడా ఈ -లెర్నర్ కోర్సుల ద్వారా నాలెడ్జ్‌ను పెంపొందిస్తున్నాం.
హేమచంద్రారెడ్డి : స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు నిధులు బాగా వస్తున్నాయా?
రామకృష్ణారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతియేటా రూ.31 లక్షలు వస్తున్నాయి.
హేమచంద్రారెడ్డి : కళాశాలలో ఎన్ని షిఫ్ట్‌లు ఉన్నాయి?
రామకృష్ణారెడ్డి: రెండు షిఫ్టులు ఉన్నాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు షిఫ్ట్‌లు నడుస్తున్నాయి.
విద్యార్థులనుద్దేశించి...
హేమచంద్రారెడ్డి : ఇక్కడ చదువుతున్నందుకు ఎలా ఫీలవుతున్నారు?
విద్యార్థులందరూ : ఘన చరిత్ర కల్గిన కళాశాలలో చదవడం చాలా సంతోషంగా ఉంది.
హేమచంద్రారెడ్డి : పాలిటెక్నిక్‌ను ఎందుకు ఎంచుకున్నారు?
రాజశేఖర్ (విద్యార్థి) : ప్రస్తుత పరిస్థితులలో టెక్నాలజీ అవసరం ఎంతో ఉంది. డిప్లొమో చేస్తే నేరుగా బీటెక్ రెండో సంవత్సరంలో ప్రవేశం పొందవచ్చు. అందుకే చదువుతున్నా.
హేమచంద్రారెడ్డి : డిప్లొమో చదివిన వారు పారిశ్రామిక అవసరాలకు ఏవిధంగా దోహదపడుతున్నారని అనుకుంటున్నారు?
స్రవంతి (విద్యార్థిని): పాలిటెక్నిక్ ద్వారా సులువుగా ఉద్యోగం పొందవచ్చు. ఇక్కడ మూడేళ్ల పాటు థియరీ నాలెడ్జ్ కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్‌నే ఎక్కువగా నేర్పిస్తున్నారు. హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ వల్ల పరిశ్రమలలో పనిచేయడం తేలికవుతుంది.
హేమచంద్రారెడ్డి : ల్యాబ్‌ను ఎంత సేపు ఉపయోగించుకుంటున్నారు?
నవీన్: (విద్యార్థి) వారానికి రెండు సార్లు ఉపయోగించుకుంటున్నాం. కళాశాలలోనే కాకుండా ఆరు నెలలు బయట ఇండస్ట్రియల్ ట్రైనింగ్‌కు వెళతాం సార్.
హేమచంద్రారెడ్డి : ఉద్యోగావకాశాలు, నూతన ఆవిష్కరణల విషయంలో అధ్యాపకుల ప్రోత్సాహముందా?
లావణ్య : అవును సార్. క్యాంపస్ ఇంటర్వ్యూల కోసం ముందస్తు శిక్షణ ఇస్తున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు.
హేమచంద్రారెడ్డి : చాక్ అండ్ టాక్ (ఉపన్యాస) పద్ధతిలోనే చెబుతున్నారా? లేక వినూత్న విధానాలలో బోధిస్తున్నారా?
రవీంద్ర (విద్యార్థి): ప్రొజెక్టర్ల ద్వారా, త్రీ డైమన్షన్స్ ద్వారా పాఠాలు చెబుతున్నారు. ప్రతి రోజు మూడు గంటల సేపు ఎలక్ట్రికల్ ల్యాబ్‌లో గడుపుతున్నాం.
హేమచంద్రారెడ్డి : మీ లక్ష్యమేమిటి?
అనిల్ (విద్యార్థి): లెక్చరర్ కావాలనుకుంటున్నా. డిప్లొమా తరువాత బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ చేయాలన్నది నా లక్ష్యం.
హేమచంద్రారెడ్డి : చదువుకున్న యువత సమాజంలోకి వెళుతున్నప్పటికీ సమాజ స్థితిగతులు మారడం లేదు. ఎందుకని?
స్వప్న( విద్యార్థిని): జాతి సర్వతోముఖాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి. సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించాలి. దురదృష్టవశాత్తు ఆ విధమైన అంశాలు ఎవరూ చెప్పడం లేదు. తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలను పిల్లలపై రుద్దుతున్నారు. విద్యార్థుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదు. దీనివల్ల ప్రతిభావంతులు మరుగునపడిపోతున్నారు.
హేమచంద్రారెడ్డి : హాస్టళ్లు ఎలా ఉన్నాయి?
స్వప్న : బాగానే ఉన్నాయి. అయితే.. తాగునీటిని మేమే కొంటున్నాం. ఇక్కడ ఉప్పునీళ్లే గతి. మంచినీరు ఇవ్వాలని ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు.
హేమచంద్రారెడ్డి : మెస్ బిల్లు ప్రతి నెలా ఎంత వస్తోంది?
గోవిందమ్మ (విద్యార్థిని): రూ.1,300
హేమచంద్రారెడ్డి : మెస్ బిల్లు అధికమని భావిస్తున్నారా?
రంగనాయకులు (విద్యార్థి): అవును సార్. మెస్ బిల్లు ఏడాదికి రూ.13 వేల దాకా వస్తోంది. అదే స్కాలర్‌షిప్ రూ.5 వేలు మాత్రమే మంజూరవుతోంది. మిగిలిన రూ.8 వేలు మేమే భరించాలి. మా అమ్మానాన్న కూలి పనులు చేస్తుంటారు. ఇంత మొత్తం కట్టాలంటే ఇబ్బందిగా ఉంది. అలాగే ప్రతినెలా ఒక్కొక్కరం సగటున రూ.70 తాగునీటికి వెచ్చిస్తున్నాం. రాత్రిపూట హాస్టళ్లలో అన్నం వడ్డించే వాళ్లు ఉండడం లేదు. సిబ్బంది కొరత అధికంగా ఉంది.
ప్రాంగణ నియామకాలకు హాజరైన విద్యార్థులనుద్దేశించి..
హేమచంద్రారెడ్డి : ఎల్‌అండ్‌టీ లాంటి గొప్ప కంపెనీలో ఉద్యోగం కోసం తుది రౌండు ఇంటర్వ్యూకు చేరకోవడంపై ఎలా ఫీలవుతున్నారు?
రవళి: చాలా గొప్పగా ఫీలవుతున్నాం సార్. ఇంటర్వ్యూలలో ఎంపిక కావడానికి ఇక్కడ ప్రత్యేక తర్ఫీదు ఇస్తుండడం ఇప్పుడు ఉపయోగపడుతోంది. స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్‌లో కమ్యూనికేషన్స స్కిల్స్, డొమైన్ స్కిల్స్ వంటివి నేర్పారు.
నీటిని కొని తాగడం దురదృష్టకరం
సింహభాగం పాలిటెక్నిక్ విద్యార్థులు ఇంజనీరింగ్ విద్య వైపు వెళుతుండడం ఆందోళన కలిగించే అంశం. వీరి అవసరం పరిశ్రమలకు ఎంతో ఉంది. పాలిటెక్నిక్ ప్రవేశపెట్టడానికి గల మౌలిక సూత్రాలను ప్రతి ఒక్కరూ మరిచారు. వీటిపై కళాశాలలు, పరిశ్రమలు అవగాహన కల్పించాలి. ఈ కళాశాల ఎలక్ట్రికల్స్ విభాగంలో ఆధునిక పరికరాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. విద్యార్థులు తాగునీటిని కొనుక్కోవాల్సి రావడం దురదృష్టకరంగా భావిస్తున్నా. దీనిపై కళాశాల యాజమాన్యం తక్షణమే స్పందించాలి. పేద విద్యార్థులు మెస్ బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇందుకోసం ప్రభుత్వం మరింత సాయం అందించాలి.
- ఆచార్య కే.హేమచంద్రారెడ్డి, జేఎన్‌టీయూ, అనంతపురం.
రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం
మెస్ బిల్లులు తగ్గించేలా తగిన సాయం చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరతాం. స్కాలర్‌షిప్‌లు పెంచితేనే వీటికి సత్వర పరిష్కారం దొరుకుతుంది. మంచినీటి సరఫరాకు తగిన కృషి చేస్తాం.
-ఆషప్ ్రఆలీ, ప్రభుత్వ పాలిటెక్నిక్
కళాశాల ప్రిన్సిపాల్, అనంతపురం.
చేయూత కావాలి
Published Sat, Feb 28 2015 2:11 AM | Last Updated on Tue, Oct 2 2018 7:58 PM
Advertisement
Advertisement