ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదల | AP ESET Results Released | Sakshi
Sakshi News home page

ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదల

Published Fri, May 31 2024 5:17 AM | Last Updated on Fri, May 31 2024 5:17 AM

AP ESET Results Released

ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదల చేస్తున్న ఉన్నత విద్యామండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి

36,369 మందికి గాను 32,881 మందికి అర్హత

అబ్బాయిలు 23,849 మంది.. అమ్మాయిలు 9,032 మంది అర్హత

ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి వెల్లడి

వలంటీర్‌కు బయో టెక్నాలజీలో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌

అనంతపురం: ఇంజినీరింగ్, బీ–ఫార్మసీ రెండో సంవత్సరంలో లేటరల్‌ ఎంట్రీ ద్వారా అడ్మిషన్లు పొందడానికి నిర్వహించిన ఏపీ ఈసెట్‌–2024 ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రా రెడ్డి గురువారం విడుదల చేశారు. ఏపీ ఈసెట్‌ నిర్వహించిన జేఎన్‌టీయూ(అనంతపురం)లో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. 8 దఫాలుగా ఏపీ ఈసెట్‌ను విజయవంతంగా నిర్వహించిన జేఎన్‌టీయూ(ఏ) ఈసెట్‌ నిర్వహణ కమిటీని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి అభినందించారు.

ఏపీ ఈసెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా 37,767 మంది దరఖాస్తు చేసుకోగా.. 36,369 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 32,881 మంది(90.41 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అబ్బాయిలు 27,787 మంది దరఖాస్తు చేసుకోగా 26,693 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 23,849(91.68 శాతం) మంది అర్హత సాధించారు. అమ్మాయిలు 9,980 మంది దరఖాస్తు చేసుకోగా, 9,676 మంది హాజరయ్యారు. వీరిలో 9,032(93.34 శాతం) మంది ఉత్తీర్ణలుయ్యారు. ఈసెట్‌ ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 1,071 మంది పరీక్ష రాయగా 1,002 (93.56 శాతం) మంది అర్హత సాధించారు. ఉదయం సెషన్‌లో మొత్తం 145 ప్రశ్నలకు గాను 272 అభ్యంతరాలు రాగా.. నాలుగు ఆమోదం పొందాయి.

మధ్యాహ్నం సెషన్‌లో మొత్తం 171 ప్రశ్నలకు గాను 444 అభ్యంతరాలు రాగా 19 ఆమోదం పొందాయి. ఈ ప్రశ్నలకు జవాబు రాసిన వారికి మార్కులు లభించాయి. ఫలితాల విడుదల కార్యక్రమంలో ఏపీ సెట్స్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ ఎం.సుధీర్‌రెడ్డి, ఏపీ ఈసెట్‌ చైర్మన్‌ జీవీఆర్‌ శ్రీనివాసరావు, కన్వీనర్‌ పీఆర్‌ భానుమూర్తి, జేఎన్‌టీయూ(ఏ) రెక్టార్‌ ఎం.విజయకుమార్, రిజిస్ట్రార్‌ సి.శశిధర్, పాలకమండలి సభ్యులు బి.దుర్గాప్రసాద్, డాక్టర్‌ ఎం.రామశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

వలంటీర్‌ శిల్ప స్టేట్‌ ఫస్ట్‌
రణస్థలం: సీఎం జగన్‌ ఏర్పాటు చేసిన వలంటీర్‌ వ్యవస్థలో చేరి ప్రజలకు సేవ చేస్తున్న ఓ యువతి ఏపీ ఈసెట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచి స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడలో వలంటీర్‌గా సేవలందిస్తున్న మైలపల్లి శిల్ప రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది. శిల్ప ప్రస్తుతం శ్రీకాకుళం మహిళా పాలిటెక్నిక్‌ ప్రభుత్వ కళాశాలలో డీ–ఫార్మసీ రెండో సంవత్సరం చదువుతోంది.

ఇంజనీరింగ్‌ చదవాలనే ఆశయంతో ఆమె ఈసెట్‌ రాయగా.. బయో టెక్నాలజీ విభాగంలో ఫస్ట్‌ ర్యాంకు వచ్చిందని ఆమె తెలిపింది. ఆమె తండ్రి పేరు పోలీసు.. టైలర్‌గా పనిచేస్తుండగా.. తల్లి లక్ష్మి గృహిణి. కుమార్తెకు స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు రావడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. గ్రామస్తులు శిల్పను అభినందించారు. శిల్ప మాట్లాడుతూ.. బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్‌ చేసి అత్యుత్తమంగా రాణించాలని అనుకుంటున్నట్లు ఆమె తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement