సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్(ఎన్‌బీఏ) గుర్తింపు సాధనలో దూసుకెళ్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యనందిస్తూ గణనీయమైన ప్లేస్‌మెంట్లు నమోదు చేస్తున్నాయి. తాజాగా మరో 12 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలకు ఎన్‌బీఏ సర్టిఫికేషన్ దక్కింది. అనంతపురం, శ్రీశైలం, తిరుపతి, పిల్లరిపట్టు, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, జమ్మలమడుగు, కదిరి, నందిగామ, పలమనేరు, కడప మహిళా పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు మదనపల్లె మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీకి కూడా ఎన్‌బీఏ సర్టిఫికేషన్ దక్కింది.
పక్కా ప్రణాళికతో ముందుకు..
రాష్ట్రంలో మొత్తం 87 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలుండగా.. తొలి దశలో 41 కాలేజీలకు ఎన్‌బీఏ సర్టిఫికేషన్ సాధించేలా సాంకేతిక విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే మొత్తం 31 పాలిటెక్నిక్ కాలేజీల్లోని 60 విభాగాల్లో ఎన్‌బీఏ సర్టిఫికేషన్‌ను సాధించింది. ఈ విద్యా సంవత్సరం ముగిసేలోగా ఎన్‌బీఏ బృందం మరిన్ని కాలేజీలను కూడా పరిశీలించనుంది.
పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్న సాంకేతిక విద్యా శాఖ పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించడంతో పాటు ల్యాబ్‌లు, వర్క్‌షాప్‌లు, సొంత భవనాల నిర్మాణాలను చేపడుతోంది. వచ్చే ఏడాదికి వీలైనన్ని కాలేజీల్లో హాస్టల్ సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చేలా ప్రత్యేక దృష్టి సారించింది. పాలిటెక్నిక్ విద్య ద్వారా లభించే ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల చేరికలను ప్రోత్సహిస్తోంది. పాలిసెట్ కోసం ఉచితంగా కోచింగ్‌ను కూడా అందుబాటులోకి తెస్తోంది.
ఇది సరికొత్త చరిత్ర
సీఎం జగన్ ఆదేశాలకు అనుగుణంగా విద్యా ప్రమాణాలను పెంపొందిస్తున్నాం. అందువల్లే ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలకు అత్యంత ప్రతిష్టాత్మక ఎన్‌బీఏ సర్టిఫికేషన్ దక్కుతోంది. భవిష్యత్‌లో ప్రతి కాలేజ్‌నూ ఎన్‌బీఏ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కరిక్యులమ్‌లో మార్పులు తెచ్చాం. ఉద్యోగ అవకాశాలు పెంచేలా 674 పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకున్నాం. గత విద్యా సంవత్సరంలో 7 వేల మంది చదువులు పూర్తి చేసుకుంటే 4 వేల మందికి పైగా ప్లేస్‌మెంట్లు సాధించారు. పది శాతంగా ఉన్న ప్లేస్‌మెంట్లను 60 శాతానికి తీసుకువచ్చాం. ఇది సరికొత్త చరిత్ర. – చదలవాడ నాగరాణి కమిషనర్, సాంకేతిక విద్యాశాఖ
Comments
Please login to add a commentAdd a comment