‘సెట్‌’ అడ్మిషన్లన్నీ ఈ నెలలోనే  | AP EAPCET Second Phase Counseling from 17th October | Sakshi
Sakshi News home page

‘సెట్‌’ అడ్మిషన్లన్నీ ఈ నెలలోనే 

Published Tue, Oct 11 2022 3:31 AM | Last Updated on Tue, Oct 11 2022 11:33 AM

AP EAPCET Second Phase Counseling from 17th October - Sakshi

సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీ ఈఏపీ సెట్‌–2022 రెండో విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానుందని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి ప్రకటించారు. ఈనెల 25వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. వివిధ కోర్సులకు సంబంధించిన అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ తేదీలను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సోమవారం ఆయన విడుదల చేశారు.

ఈసెట్, ఐసెట్, పీజీఈ సెట్, జీప్యాట్, బీఆర్క్‌లకు సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్‌ తేదీలను ఖరారు చేసినట్లు వివరించారు. అలాగే పీఈ సెట్, పీజీ సెట్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌లను త్వరలో చేపట్టనున్నట్టు చెప్పారు. ఆర్‌ సెట్‌ పరీక్ష నిర్వహణ తేదీలను కూడా ఖరారు చేశామన్నారు. ఏపీ ఈఏపీ సెట్‌కు సంబంధించి కేటగిరీ–బి (యాజమాన్య కోటా) సీట్లలో ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్ల భర్తీకి సెప్టెంబర్‌ 3నుంచి 15వరకు అవకాశం ఇచ్చామన్నారు.

నాన్‌ ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లను సెప్టెంబర్‌ 27 నుంచి ప్రారంభించామని, అక్టోబర్‌ 17వ తేదీతో ఈ అడ్మిషన్ల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు. కొన్ని సెట్ల తొలివిడత అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ ముగియగా.. కొన్ని సెట్ల తొలివిడత ప్రక్రియ కొనసాగుతోందన్నారు. వాటినీ పూర్తిచేసి రెండో విడత కౌన్సెలింగ్‌ను చేపట్టేందుకు వీలుగా షెడ్యూళ్లను ఖరారు చేశామని వివరించారు.  


డిగ్రీ కోర్సుల సీట్ల కేటాయింపు 
కాగా, రాష్ట్రంలోని ఉన్నత విద్యాకోర్సులన్నిటికీ అడ్మిషన్లను ఆన్‌లైన్‌లోనే కల్పిస్తున్నామని హేమచంద్రారెడ్డి వివరించారు. జూలై 22న డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ ఇచ్చామని, సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 10 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించామని చెప్పారు. ఈ నెల 14న డిగ్రీ అభ్యర్థులకు తొలివిడత సీట్ల కేటాయింపు చేస్తామని చెప్పారు. వారంతా 15వ తేదీన కాలేజీల్లో రిపోర్టు చేయాలని, అదే రోజు నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.

డిగ్రీ కోర్సులన్నీ నాలుగేళ్ల హానర్‌ కోర్సులుగా చేశామని, డిగ్రీలో చేరిన విద్యార్థులు ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుందని చెప్పారు. మూడేళ్లకే ఎగ్జిట్‌ అయ్యే విద్యార్థులకు 10 నెలల ఇంటర్న్‌షిప్‌ ఉంటుందన్నారు. ఇప్పటికే డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు.

ఇంటర్న్‌షిప్‌తోపాటు అదనంగా మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్‌ వంటి వివిధ ఆధునిక కంప్యూటర్‌ సర్టిఫికెట్‌ కోర్సులను కూడా ఉచితంగా అందిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.రామమోహనరావు, కార్యదర్శి ప్రొఫెసర్‌ నజీర్‌ అహమ్మద్, సెట్స్‌ ప్రత్యేకాధికారి డాక్టర్‌ ఎం.సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement