ఉన్నత విద్యపైనా విషమే..  | Hemachandra Reddy fires on Eenadu Yellow Media Fake News | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్యపైనా విషమే.. 

Published Tue, Nov 8 2022 3:43 AM | Last Updated on Tue, Nov 8 2022 8:18 AM

Hemachandra Reddy fires on Eenadu Yellow Media Fake News - Sakshi

సాక్షి, అమరావతి: విద్యారంగంపై ఈనాడు మరోసారి విషం చిమ్మింది. ఉన్నత విద్యారంగంలో ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ దేశంలోనే అగ్రగామిగా ఉండేలా తీర్చిదిద్దుతుంటే ఆ పత్రిక మాత్రం ప్రజలను తప్పుదోవపట్టించేలా అసత్య కథనాలు వండుతోంది. పాఠశాల విద్యపై ఇప్పటికే విషం కక్కిన ఆ పత్రిక తాజాగా ఉన్నత విద్యపైనా అదే తీరుతో రోత రాతలు రాసింది. గత ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చి వాటిని ప్రస్తుత ప్రభుత్వానికి ఆపాదించేందుకు అక్షరం అక్షరంలోనూ ప్రయత్నించింది.

యూనివర్సిటీల్లో నియామకాలు, ట్రిపుల్‌ ఐటీలకు భవనాల నిర్మాణం, ఫీజు రీయింబర్స్‌మెంటు, అక్రిడిటేషన్‌ సహా పలు అంశాలపై ‘మాటల్లోనే మహర్దశ’ అంటూ అవాస్తవాలు ప్రచారం చేసింది. వీటన్నింటిపై ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొ. కె.హేమచంద్రారెడ్డి, వైస్‌చైర్మన్‌ ప్రొ.రామ్మోహనరావు, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఒక్కో అంశాన్ని వివరిస్తూ వాటివెనకున్న నిజాలను వెల్లడించారు. ఆయన ఏమన్నారంటే..  

కోర్టు కేసులవల్లే రిక్రూట్‌మెంట్‌ జాప్యం 
గత మూడున్నరేళ్లుగా వర్సిటీల్లో రెగ్యులర్‌ ఫ్యాకల్టీని నియమించడంలేదని ఈనాడు కథనం రాసింది. నిజానికి.. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రిక్రూట్‌మెంట్‌ కోసం హడావుడిగా నిబంధనలు ఉల్లంఘిస్తూ నోటిఫికేషన్‌ జారీచేసింది. దీంతో హైకోర్టులో 70కి పైగా కేసులు దాఖలయ్యాయి. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ కేసుల్లోని వాస్తవాలను తెలియజేసి ప్రభుత్వ అభిప్రాయాలను గట్టిగా వినిపించడానికి కమిటీని ఏర్పాటుచేసింది.

ఫలితంగా జారీచేసిన నోటిఫికేషన్‌లన్నింటినీ రద్దుచేస్తూ కోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ఆ తీర్పు ఫలితంగా ఫిబ్రవరి 2022లో ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌లో వర్సిటీ ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంటును కూడా చేర్చింది. అయితే, సింగిల్‌ జడ్జి తీర్పుపై అనేక రిట్‌ అప్పీళ్లు దాఖలయ్యాయి. వీటిపైనా ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్‌ చేసింది. కేసు విచారణలో ఉన్నందున పోస్టుల భర్తీకి ముందుకెళ్లలేకపోతోంది తప్ప ఇందులో ప్రభుత్వ వైఫల్యం ఏమీలేదు. ఇప్పటికే ప్రభుత్వం రెండువేల అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, 1000 అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను గుర్తించింది.   

ఆర్జీయూకేటీ వీసీ నియామకంపై.. 
ఇక ఆర్జీయూకేటీ వీసీ నియామకానికి 2020 జనవరిలో నోటిఫికేషన్‌ ఇవ్వగా 20 దరఖాస్తులొచ్చాయి. వీటిలో సరైన వారులేరు. వాస్తవానికి ఆర్జీయూకేటీ చట్టం ప్రకారం చాన్సలర్‌కు సహాయంగా ఉండడానికే వీసీ పరిమితం. ఎలాంటి అధికారం లేనందుకే సరైన వారు దరఖాస్తుచేయడంలేదు. చట్టాన్ని సవరించేందుకు వర్సిటీ చర్యలు చేపట్టింది. మళ్లీ 2022 జూన్‌ 6న నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దాదాపు 60 దరఖాస్తులొచ్చాయి. సెర్చ్‌ కమిటీ సమావేశం ఈనెల 18న జరుగుతుంది. కమిటీ సిఫార్సుల ప్రకారం వీసీని నియమిస్తారు. 

అక్రిడిటేషన్‌పైనా తప్పుడు వార్తలే.. 
ఆర్జీయూకేటీని 2008లో పెడితే 2020వరకు యూజీసీ 12బీ గుర్తింపు కూడా రాలేదు. గత ప్రభుత్వం దీనిపై కనీస చర్యలూ తీసుకోలేదు. ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుని 12బీ గుర్తింపు సాధించింది. న్యాక్‌ అక్రిడిటేషన్‌ రావాలంటే ఇది అవసరం. ఇప్పుడు న్యాక్‌ అక్రిడిటేషన్‌ కోసం చర్యలు చేపట్టింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని కాలేజీలన్నింటికీ న్యాక్‌ గుర్తింపు ఉండాలని జీఓ కూడా ఇచ్చారు. గతంలో 213 కాలేజీలకు మాత్రమే న్యాక్‌ అక్రిడిటేషన్‌ ఉండగా ఇప్పుడు 275 కాలేజీలు పొందాయి. ఇక రాష్ట్ర వర్సిటీల్లో గత ప్రభుత్వ హయాంలో ఆరింటికి అసలు న్యాక్‌ అక్రిడిటేషనే లేదు. ఇప్పుడు అన్నింటికీ ఆ గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం.  

వర్సిటీల నిధులపైనా అసత్యాలు 
వర్సిటీల నిధులను ప్రభుత్వం లాగేసుకుంటోందని ఈనాడు కథనం అల్లడం హాస్యాస్పదం. ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో తమ మిగులు నిధులను జమచేయాలని ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను కోరింది. దీనికోసం వారికి నెలవారీ 6.20 శాతం వడ్డీ కూడా ఇస్తోంది. నిజానికి.. గత ప్రభుత్వం ఆర్జీయూకేటీ నుంచి రూ.180 కోట్లు, ఆంధ్రా వర్సిటీ నుంచి రూ.150 కోట్లు ‘పసుపు కుంకుమ’ కోసం దారిమళ్లించింది. దీన్ని ప్రభుత్వం యూనివర్సిటీల నిధులను స్వాహా చేయడం అంటారు. అలాగే, బడెŠజ్‌ట్‌ తగ్గించామన్నదీ అవాస్తవం. గతంలో ఏ మేరకు బడ్జెట్‌ ఉందో అంతే మొత్తాన్ని ఇప్పుడూ ప్రభుత్వం ఇస్తోంది. అయితే, సెల్ఫ్‌ఫైనాన్స్‌ కోర్సులకు ప్రభుత్వం ఇవ్వదు.  

పీజీ కోర్సుల్లో అక్రమాలకు తెరదించేలా చర్యలు 
పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంటు ఇవ్వడంలేదన్న అంశంలోనూ తప్పుదోవ పట్టించేలా వార్త రాశారు. గతంలో ప్రైవేట్‌ కాలేజీలు ఫీజు రీయింబర్స్‌మెంటు కోసం దొంగ చేరికలతో అక్రమాలకు పాల్పడేవి. ఇలా రూ.450 కోట్లు స్వాహా చేసేవి. దీనిపై ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. వర్సిటీలు కూడా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. విచారణ నివేదికలు రాగానే ఫీజు రీయింబర్స్‌మెంటుపై చర్యలుంటాయి. 

మీడియా రాజకీయాలు దురదృష్టకరం : ఆలూరు 
ప్రభుత్వ విద్యాసలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కొన్ని మీడియా సంస్థలు రాజకీయాలు చేస్తున్నాయని, ఇది దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఏపీలోని పరిస్థితిని ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉందన్నారు. మంచిని కూడా చెడుగా చూపుతున్నారని.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రవేశపెడితే ప్రతిపక్షం, ఈ మీడియా స్పందించిన విధానాన్ని ఆయన గుర్తుచేశారు. ఇలా వ్యతిరేకించినందుకు ఆ పార్టీలకు, వారికి వంతపాడుతున్న మీడియాకు ప్రజలు ఇప్పటికే తగిన రీతిలో గుణపాఠం చెప్పారన్నారు.   

గత ప్రభుత్వ లోపాల వల్లే ఆ ట్రిపుల్‌ ఐటీల్లో సమస్య 
శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లను గత టీడీపీ ప్రభుత్వం 2016లో ప్రారంభించి ఒక్క పోస్టూ ఇవ్వలేదు. భవన నిర్మాణమూ చేపట్టలేదు. పైగా 2018లో ఎన్నికలకు ముందు అనుమతుల్లేకుండా రూ.450 కోట్లతో ఒంగోలు భవనాల పనులకు టెండర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి శంకుస్థాపన చేసింది. ఆ తరువాత వాటిని నిలిపివేశారు. ఈ ప్రాంతంపై కోర్టు కేసులు ఉండడంతో వెనుకబడిన ప్రాంతం అయిన కనిగిరి మండలం బల్లిపల్లిలో నిర్మాణానికి అనుమతులిచ్చారు.

ఈ ప్రభుత్వం వచ్చాక శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీని ట్వంటీయత్‌ సెంచరీ గురుకులంతో పాటు మరో సంస్థ భవనాలను కేటాయించి విద్యా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం. వచ్చే ఏడాదికి పూర్తిగా శ్రీకాకుళానికి కొత్త క్యాంపస్‌ సిద్ధమవుతుంది. శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్‌లకు 420 టీచింగ్, 178 నాన్‌టీచింగ్‌ పోస్టులను 2020లో ప్రభుత్వం మంజూరుచేసినా న్యాయపరమైన సమస్యల కారణంగా అవీ ముందుకు సాగలేదు.    

ఫీజు రీయింబర్స్‌మెంటుపైనా రోత రాతలు 
2020–21 నాల్గో త్రైమాసికం ఫీజు రీయింబర్స్‌మెంటు కోత పెట్టారని అసత్యాలు రాశారు. అప్పట్లో కోవిడ్‌తో కాలేజీలు మూడు నెలలకు మించి జరగలేదు. కాలేజీలకు నిర్వహణ వ్యయం చాలా తగ్గింది. పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి ఉంటే ప్రభుత్వం ఫీజులను 70 శాతమే వసూలు చేసుకోవాలని జీవో ఇచ్చింది. అతదే రీతిలో 2020–21కి నాలుగో త్రైమాసిక ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కోరవద్దని విద్యార్థుల నుండి వసూలుచేయవద్దని విద్యామంత్రి అన్ని ప్రైవేట్‌ కాలేజీ యాజమాన్యాలకూ లేఖ రాశారు.

కాలేజీలు కూడా ఇందుకు అంగీకారాన్ని తెలిపాయి. అసలు గత ప్రభుత్వం మూడేళ్లపాటు ఫీజు రీయింబర్స్‌ ఇవ్వకపోవడం ఈనాడుకు కనిపించలేదు. అప్పటి బకాయిలనూ ప్రస్తుత ప్రభుత్వం దాదాపు రూ.1,800 కోట్లు విడుదలచేసింది.  టీడీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.35 వేలే ఇచ్చేది. కానీ, జగన్‌ సర్కార్‌ పూర్తి ఫీజుతోపాటు వసతి భోజనాలకు, వసతి దీవెన కింద ఏటా రూ.20వేలు అందిస్తోంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement