‘ఫీజు’పై దుష్ప్రచారం దారుణం  | False articles by some media on fee reimbursement in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

‘ఫీజు’పై దుష్ప్రచారం దారుణం 

Published Thu, Mar 10 2022 3:40 AM | Last Updated on Thu, Mar 10 2022 9:50 AM

False articles by some media on fee reimbursement in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కొన్ని పత్రికలు తప్పుడు కథనాలతో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ గందరగోళం రేపాలని ప్రయత్నిస్తున్నాయని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో చిత్తశుద్ధితో తల్లిదండ్రులు, విద్యార్థులపై నయాపైసా భారం పడకుండా నాణ్యమైన ఉన్నత విద్యను అందించేలా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అమలు చేస్తూ అందరినీ ఆదుకుంటున్నారని చెప్పారు. దీన్ని చూసి ఓర్వలేని ఆ పత్రికలు తప్పుడు కథనాలు అల్లుతున్నాయని విమర్శించారు. బుధవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏడాదికోసారి ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. అదీ అరకొరగా ఇస్తూ కాలేజీలను ఇబ్బంది పెట్టేవారన్నారు. అప్పట్లో కాలేజీల యాజమాన్యాలు అనేకసార్లు ధర్నాలు చేసినా, ఈ పత్రికల్లో అందుకు సంబంధించిన వార్తలు కనిపించలేదని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తి ఫీజు ఇవ్వకుండా కేవలం రూ.35 వేలతోనే సరిపెట్టిన విషయం ఎవరికి తెలియదని నిలదీశారు. ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏమన్నారంటే..

ఎవరిలో ఎలాంటి ఆందోళన లేదు
► ప్రస్తుత ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందిస్తోంది. తల్లిదండ్రులు, విద్యార్థులు, కాలేజీల యాజమాన్యాల్లో ఎలాంటి ఆందోళన లేదు.  
► గత ప్రభుత్వం 2016–17లో రూ.2,391 కోట్లు, 2017–18లో రూ.2,828 కోట్లు, 2018–19లో రూ.1,687 కోట్లు  ఇచ్చింది. ఇందులో ఇంటర్‌ ట్యూషన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్, 2012–13కు సంబంధించిన బకాయిలు కూడా ఉన్నాయి. 
► ఈ ప్రభుత్వం వచ్చాక కేవలం ఉన్నత విద్యకు సంబంధించి 2019–20లో రూ.2,559 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ఇచ్చింది. 2017–18, 2018–19 విద్యా సంవత్సరాలకు గత టీడీపీ ప్రభుత్వం చెల్లించకుండా బకాయి ఉంచిన రూ.1,800 కోట్లు ప్రస్తుత ప్రభుత్వమే చెల్లించింది. 
► 2019–20లో కరోనా కష్టాల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.3,900 కోట్లు (ఇంటర్‌ విద్యార్థులకు అందించిన అమ్మ ఒడి నిధులు కలుపుకుని) ఇచ్చింది. గత ప్రభుత్వంలో కన్నా ఇది ఒకటిన్నర రెట్లు అధికం. 
► 2020–21కి వచ్చేసరికి కరోనా వల్ల ఆర్థికంగా ఇబ్బందులున్నా, ఏప్రిల్‌లో రూ.671.03 కోట్లు, జూలైలో రూ.693.27 కోట్లు, నవంబర్‌లో రూ.683.13 కోట్లు విడుదల చేశారు. నాలుగో త్రైమాసికానికి సంబంధించి.. కరోనా వల్ల గత నెలలో ఇవ్వాల్సింది ఈ నెలలో విడుదల చేయనున్నారు. ఇది కాకుండా అమ్మ ఒడి కింద రూ.1500 కోట్లు ఇవ్వనున్నారు. ఇవన్నీ కలుపుకుంటే ఈ విద్యా సంవత్సరంలో రూ.3,600 కోట్లు ప్రభుత్వం అందిస్తోంది.
► గత ప్రభుత్వ హయాంలో సకాలంలో ఫీజులు ఇవ్వక పోవడం వల్ల కాలేజీల యాజమాన్యాలపై రూ.1,000 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల వరకు వడ్డీల భారం పడింది. ప్రస్తుతం ప్రతి మూడు నెలలకోసారి ఇవ్వడం వల్ల యాజమాన్యాలకు ఏ ఇబ్బందీ లేదు.

మంచి నిర్ణయాలు కనిపించవా?
► ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఉన్నతాశయంతో విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించి, రాష్ట్రాన్ని నాలెడ్జి హబ్‌గా మార్చేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఇలాంటి వాటి గురించి ఆ పత్రికలు కథనాలు రాయవు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను నెలకొల్పింది. ఏ కాలేజీ అయినా విద్యార్థుల నుంచి అదనంగా, అధికంగా డబ్బులు వసూలు చేసినా, డిమాండ్‌ చేసినా ఈ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటుంది.
► రెండేళ్లలో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వల్ల గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంటు రేషియో (జీఈఆర్‌) రేట్‌లో మన రాష్ట్రం దేశంలో చాలా ముందుంది. 2018–19, 2019–20లో పరిశీలిస్తే జీఈఆర్‌ జాతీయ స్థాయిలో 26.3 నుంచి 27.1కు పెరిగింది. అదే ఏపీలో 32.4 నుంచి 35.2కు పెరిగింది. 
► ఎస్సీల చేరికల పెరుగుదల జాతీయ స్థాయిలో 1.7% అయితే రాష్ట్రంలో 7.5 శాతంగా ఉంది. ఎస్టీలలో జాతీయ స్థాయిలో 4.5% పెరుగుదల ఉంటే రాష్ట్రంలో 9.5 శాతంగా నమోదైంది. చేరికలతో సరిపెట్టకుండా వారికి నాణ్యమైన విద్య అందించేలా ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలను చేపట్టించారు. 
► 10 నెలల ఇంటర్న్‌షిప్, స్కిల్‌ కోర్సులు ఏర్పాటు చేశాం. ప్రైవేటు వర్సిటీల్లో పేద మెరిట్‌ విద్యార్థులకు కోటా కల్పించాం. రూ.5 లక్షల వరకు చెల్లించాల్సి వచ్చే ఆ వర్సిటీల్లో 35 శాతం సీట్లు పేద మెరిట్‌ విద్యార్థులకు దక్కేలా చేశాం. ఈ ఏడాది 2,118 మందికి అక్కడ సీట్లు అందించాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement