New system
-
లైసెన్స్.. సైలెన్స్!
సాక్షి, హైదరాబాద్: రహదారి భద్రతా చట్టంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూళ్లకు శ్రీకారం చుట్టింది. ఈ స్కూళ్లలో శిక్షణ తీసుకున్నవారికి నేరుగా డ్రైవింగ్ లైసెన్సులు లభిస్తాయి. మరోవిధంగా చెప్పాలంటే డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియలో ప్రైవేట్ సంస్థలకు భాగస్వామ్యాన్ని కల్పిస్తూ కేంద్రం మోటారు వాహన చట్టంలో మార్పులు తెచ్చింది. జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇంతవరకు బాగా ఉందికానీ.. గ్రేటర్లో ఇప్పటి వరకు అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూళ్లు ఏర్పాటు కాలేదు. దీంతో లైసెన్సుల జారీలో కొత్త నిబంధనల అమలుపై సందిగ్ధం నెలకొంది. ‘కేంద్రం రూపొందించిన ఈ చట్టాన్ని కచి్చతంగా అమలు చేయాల్సిందే. అక్రిడేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు’ అని రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నిబంధనల మేరకు స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు సంస్థలు లేదా వ్యక్తులు ముందుకు వస్తే అనుమతివ్వనున్నట్లు పేర్కొన్నారు. సమర్థంగా.. ప్రామాణికంగా.. అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూళ్లు ఇచ్చే నాణ్యమైన, సమర్థమైన శిక్షణే ప్రామాణికంగా భావించి లైసెన్సులు ఇవ్వాలనేది చట్టం ప్రధాన ఉద్దేశం. ఈ డ్రైవింగ్ స్కూళ్లు ఇచ్చే ‘5– ఏ’ సర్టిఫికెట్లు ఆధారంగా నేరుగా లైసెన్సులు పొందవచ్చు. డ్రైవింగ్ లైసెన్సుల జారీలో రవాణా అధికారాలను పూర్తిగా పరిమితం చేస్తూ ప్రవేశపెట్టిన అక్రిడేటెడ్ స్కూళ్ల ఏర్పాటు ఎంతో ఖరీదైన వ్యవహారం కావడంతో వ్యాపార సంస్థలు లేదా డ్రైవింగ్‌లో శిక్షణనిచ్చేందుకు ఆసక్తి ఉన్నవారు సైతం ముందుకు రావడం లేదు. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న సాధారణ డ్రైవింగ్ స్కూళ్లు కూడా నిరాసక్తత చూపుతున్నాయి. రెండు ఎకరాల్లో ట్రాక్‌లను ఏర్పాటు చేయడంతో పాటు వాహనాలు, మౌలిక సదుపాయాలను కలి్పంచాల్సి ఉంటుంది. కానీ.. పెద్దమొత్తంలో పెట్టుబడి పెడితే ఆదాయం ఆ స్థాయిలో ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ హకీంపేట్‌లో ఈ తరహా డ్రైవింగ్ స్కూల్‌ను నిర్వహిస్తోంది. ఆర్టీసీ డ్రైవర్లకు శిక్షణలో మెలకువలు నేర్పించేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. ఈ సదుపాయాలు తప్పనిసరి.. అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూళ్ల కోసం కనీసం 2 ఎకరాల్లో వివిధ రకాల టెస్ట్ట్రాక్లను ఏర్పాటు చేయాలి. ప్రాథమిక శిక్షణ కోసం సిమ్యులేటర్లను ఏర్పాటు అవసరం. శిక్షణ తరగతుల కోసం పక్కా భవనాలను నిర్మించాలి. తరగతి గదులు ఉండాలి. ఇంటర్నెట్ సదుపాయం, ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ. టీచింగ్ పరికరాలు తదితర సదుపాయాలు ఉండాలి.స్థల లభ్యతే ప్రధాన సమస్య.. నగరంలో భూమి లభ్యతే ప్రధాన సమస్యగా మారింది. అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూళ్లకు ఎకరం నుంచి రెండెకరాల స్థలం అవసరం. కార్లు వంటి తేలికపాటి వాహనాలు నడిపేందుకు ఎకరం పరిధిలో డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్, బస్సులు, లారీలు వంటివి నేర్చుకొనేందుకు 2 ఎకరాలలో ట్రాక్‌లు ఉండాలి. నగరానికి నలువైపులా ఔటర్ రింగ్‌రోడ్డు పరిధిలో రియల్ ఎస్టేట్ భూమ్‌తో భూమి ధరలకు రెక్కలొచ్చాయి. రూ.కోట్లు వెచ్చించి భూమిని కొనుగోలు చేసి డ్రైవింగ్ స్కూళ్లు ఏర్పాటు చేయడం అసాధ్యమనే భావన ఉంది. ఇలా ఏర్పాటు చేసే అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూళ్లలో ఫీజులు కూడా భారీ మొత్తంలోనే ఉంటాయి. అలాంటప్పుడు శిక్షణ తీసుకొనేందుకు అభ్యర్థులు ముందుకు రాకపోవచ్చు. ఏ విధంగా చూసినా ఇది ఖరీదైన వ్యవహారంగా మారడంతో అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూళ్ల ఏర్పాటు సవాల్‌గా మారింది. ఈ క్రమంలో కేంద్రం కొత్త చట్టం అమలుపై సందిగ్ధత నెలకొంది. -
ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఆగక్కర్లేదు
ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఆగక్కర్లేదు -
సుప్రీంకోర్టులో నూతన రోస్టర్ విధానం!
సాక్షి, న్యూఢిల్లీ: వేసవి సెలవుల అనంతరం జూలై 3వ తేదీ నుంచి దాఖలైన పిటిషన్ల కేటగిరీల ఆధారంగా సుప్రీంకోర్టులో నూతన రోస్టర్ విధానం అమలులోకి రానున్నట్లు సమాచారం. ప్రజా ప్రయోజన వ్యాజ్యా(పిల్)లు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) లేదా సీనియర్ జడ్జీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారిస్తుంది. తాజా కేసుల జాబితా, ప్రస్తావనలకు సంబంధించిన నూతన ప్రక్రియ కూడా జూలై 3 నుంచి అమలులోకి రానుంది. మంగళవారం నాటికి ధ్రువీకరించిన తాజా కేసులు ఆటోమేటిక్‌గా సోమవారానికి, మిగిలినవి శుక్రవారం జాబితా చేయనున్నారు. తాజా కేసులను సీఐఐ ఎదుట లాయర్లు ప్రస్తావించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు సర్క్యులర్‌లో పేర్కొంది. ప్రస్తావన ప్రొఫార్మాలు మధ్యాహ్నం 3 గంటలలోపు సమరి్పస్తే తదుపరి రోజు ధర్మాసనాలు వాటిపై నిర్ణయం తీసుకుంటాయి. అదే రోజున జాబితా చేర్చాలని కోరుకొనే పక్షంలో ఉదయం 10.30 గంటల లోపు అత్యవసర లేఖతో ప్రొఫార్మాను సంబంధిత అధికారికి అందజేయాలి. వీటిపై భోజన విరామ సమయంలో సీజేఐ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. -
కేంద్రం గుడ్ న్యూస్: మొబైల్ పోతే..మే 17 నుంచి కొత్త విధానం
న్యూఢిల్లీ: పోగొట్టుకున్న, చోరీ అయిన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేసేందుకు, ట్రాక్ చేసేందుకు ఉపయోగపడే విధానాన్ని (సీఈఐఆర్) కేంద్రం ఈ వారంలో ఆవిష్కరించనుంది. సెంటర్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీమాటిక్స్ (సీడాట్) రూపొందించిన ఈ సిస్టం ప్రస్తుతం ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాలతో పాటు కొన్ని టెలికం సర్కిల్స్ లో ప్రయోగాత్మకంగా అమలవుతోంది. దీన్ని తాజా గా మే 17న దేశవ్యాప్తంగా అమల్లోకి తేనున్నట్లు సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. అయి తే, ఇథమిత్థంగా తేదీని చెప్పనప్పటికీ ఈ త్రైమాసికంలో సీఈఐఆర్‌ను ప్రవేశపెట్టనున్నట్లు సీడాట్ సీఈవో రాజ్‌కుమార్ ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: స్వీట్ కపుల్ సక్సెస్ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు మొబైల్ ఫోన్ల దొంగతనాల ఉదంతాలు తగ్గుముఖం పట్టేందుకు, చోరీకి గురైన..పోయిన మొబైల్ ఫోన్ల జాడలు కనుగొనడంలో పోలీసులకు సహాయకరంగా ఉండేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు. అలాగే, మొబైల్ ఫోన్లను గుర్తించేందుకు వాడే ఐఎంఈఐ నంబర్ల క్లోనింగ్‌ను అరికట్టడంతో పాటు దానిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సహాయపడగలదని వివరించారు. సీఈఐఆర్ విధానాన్ని ఉపయోగించి ఇటీవలే కర్ణాటక పోలీసులు 2,500 పైచిలుకు ఫోన్లను రికవర్ చేసి, యజమానులకు అప్పగించారు. పోయిన మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసేందుకు యాపిల్ ఫోన్లలో ఇప్పటికే ప్రత్యేక సిస్టం ఉండగా.. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలో మాత్రం లేదు. మొబైల్ నంబరుకు అనుసంధానమైన డివైజ్ ఐఎంఈఐ నంబరు ద్వారా ఫోన్‌ను కనిపెట్టేందుకు సీఈఐఆర్ తోడ్పడుతుంది. -
‘సింగిల్ స్పెషల్’ డిగ్రీ! ఒక సబ్జెక్టు ప్రధానంగా కొత్త కరిక్యులమ్
సాక్షి, అమరావతి: విద్యా ప్రమాణాలను పెంపొందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగంగా డిగ్రీ విద్యలో సింగిల్ సబ్జెక్టు మేజర్‌గా కొత్త కరిక్యులమ్‌ను ప్రవేశపెడుతోంది. ఇప్పటివరకు డిగ్రీలో మూడు సబ్జెక్టులు ప్రధాన కాంబినేషన్‌తో విద్యాబోధన సాగుతుండగా ఇకపై ఒక మేజర్ సబ్జెక్టు ప్రధానంగా డిగ్రీ విద్య కొనసాగనుంది. జూన్ నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు కరిక్యులమ్‌లో మార్పులు చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. బుధవారం మంగళగిరిలోని కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య హేమచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ రామ్మోహన్రావు మీడియాకు వివరాలను వెల్లడించారు. ‘సెట్స్’ స్పెషల్ ఆఫీసర్ సుధీర్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్ అహ్మద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైనా ఒక సబ్జెక్ట్‌లో విద్యార్థులు సంపూర్ణ నైపుణ్యాలను సాధించే దిశగా కరిక్యులమ్‌ను సిద్ధం చేసినట్లు చెప్పారు. గతంలో బీఎస్సీ–ఎంపీసీ (మూడు సబ్జెక్టుల కాంబినేషన్) ఉండగా ఆ స్థానంలో బీఎస్సీ మ్యాథ్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీలో ఒక సబ్జెక్టును మేజర్‌గా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రెండో సెమిస్టర్ నుంచి దాదాపు 100 కోర్సుల నుంచి విద్యార్థులు తమకు నచ్చిన విభాగంలో మైనర్ సబ్జెకున్టు ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. తద్వారా మేజర్, మైనర్ సబ్జెక్టుల్లో ఏదో ఒకదానితో పీజీ విద్యను అభ్యసించేలా మార్పులు చేసినట్లు చెప్పారు. బీఎస్సీ, బీఏ, బీకామ్‌లో అమలు డిగ్రీలో మేజర్ సబ్జెక్టుతో పాటు కచ్చితంగా ఒక మైనర్ సబ్జెక్టు చదవాలి. ఉదాహరణకు ఒక సైన్స్ విద్యార్థి మైనర్ సబ్జెక్టుగా ఆర్థిక శాస్త్రం, చరిత్ర, సంగీతం, యోగా, డేటాసైన్స్, మార్కెటింగ్.. ఇలా ఇతర సబ్జెక్టులను ఎంపిక చేసుకోవచ్చు. ఆర్ట్స్ విద్యార్థులు మైనర్లో (ఇంటర్మీడియట్ కోర్సుల ఆధారంగా) నచ్చిన సబ్జెక్టు తీసుకోవచ్చు. కొత్త విధానాన్ని బీఎస్సీతో పాటు బీఏ, బీకామ్ డిగ్రీలో అమలు చేయనున్నట్టు తెలిపారు. డిగ్రీ విద్యలో ఉద్యోగ అవకాశాలను పెంపొందించడంతో పాటు ఇంజనీరింగ్‌తో సమానంగా తీర్చిదిద్దేందుకు ఈ విద్యా సంస్కరణలు దోహదం చేస్తాయని వివరించారు. వచ్చే జూన్‌లో కొత్త కరిక్యులమ్ ప్రకారం ప్రవేశాలు ఉంటాయని, దీనిపై డిగ్రీలో చేరే విద్యార్థులకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తామన్నారు. నాలుగో ఏడాది డిగ్రీకి అనుమతి జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం దేశంలో తొలిసారి విద్యా సంస్కరణలను మన రాష్ట్రంలోనే అమలు చేసినట్లు హేమచంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటికే నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీని ప్రవేశపెట్టామని, ప్రస్తుతం మూడో ఏడాది డిగ్రీ విద్య పూర్తయిందన్నారు. యూజీసీ ఫ్రేమ్ వర్క్స్ ప్రకారం ఆనర్స్ డిగ్రీని రెండు విధాలుగా విభజించామన్నారు. మూడేళ్ల డిగ్రీలో 75 శాతం మార్కులు సాధించినవారు రీసెర్చ్ ఆనర్స్ డిగ్రీ కోర్సులో చేరవచ్చు. ఇది పూర్తి చేసిన వారు పీజీ లేకుండా పీహెచ్డీ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మూడేళ్ల కోర్సులో ఉత్తీర్ణులైతే జనరల్ ఆనర్స్ కోర్సును అభ్యసించవచ్చు. ఇది పూర్తిచేసిన వారు పోస్టు గ్రాడ్యుయేషన్ రెండో ఏడాదిలో చేరవచ్చన్నారు. ఆనర్స్ కోర్సులను అందించేందుకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో గత మూడేళ్లలో వరుసగా 30 శాతం అడ్మిషన్లతో పాటు సంబంధిత కోర్సుల్లో ఇద్దరు డాక్టరేట్ కలిగిన ప్రొఫెసర్లు ఉంటేనే అనుమతులు మంజూరు చేస్తామన్నారు. డిగ్రీ విద్యార్థులకు 10 నెలల ఇంటర్న్‌షిప్ నూతన విద్యావిధానంలో భాగంగా డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసిందన్నారు. ఇంజనీరింగ్ తదితర ప్రొఫెషనల్ కోర్సులకు ఇంటర్న్‌షిప్ ఉన్నట్టుగానే నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల విద్యార్థులకు కూడా 10 నెలల ఇంటర్న్‌షిప్ ప్రవేశపెట్టామన్నారు. మైక్రోసాఫ్ట్ ద్వారా ఏడాదిలో 1.20 లక్షల సర్టిఫికేషన్ కోర్సులను అందించడం దేశంలో ఓ మైలురాయిగా అభివర్ణించారు. విద్యార్థుల్లో గందరగోళం సృష్టించొద్దు ఉన్నత విద్యలో ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక మార్పులను చూసి ఓర్వలేక కొన్ని పత్రికలు గందరగోళం సృష్టించే కథనాలు రాస్తున్నాయని హేమచంద్రారెడ్డి పేర్కొన్నారు. 2019 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యలో పలు సంస్కరణలు తెచ్చిందని, ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కళాశాలలపై కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. 2009 నుంచి ద్రవిడ వర్సిటీలో అడ్డగోలుగా చేపట్టిన 6055 పీహెచ్డీ అడ్మిషన్లను రద్దు చేశామన్నారు. 2014–18లో గత ప్రభుత్వ హయాంలో ఏకంగా 980 పీహెచ్డీ అడ్మిషన్లు ఇచ్చారని, వాటిపై విచారించి చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. రాయలసీమ వర్సిటీలోనూ 2008–2011 మధ్యలో చేపట్టిన 2,490 అక్రమ పీహెచ్డీ అడ్మిషన్లను రద్దు చేశామన్నారు. టీడీపీ హయాంలో అక్కడ 518 పీహెచ్డీ అడ్మిషన్లు ఇవ్వగా 2019 నుంచి ఇప్పటి వరకు 28 అడ్మిషన్లు మాత్రమే ఇచ్చామన్నారు. ఆర్–సెట్‌ను తీసుకొచ్చి పీహెచ్డీ అడ్మిషన్లలో పారదర్శకతకు పెద్దపీట వేశామన్నారు. వాస్తవాలను కప్పిపుచ్చి ఓ మీడియా అసత్య ప్రచారం చేయడం దారుణమని ఆక్షేపించారు. -
సైబర్ దాడులను ఎదుర్కొనే కొత్త వ్యవస్థలు
బెంగళూరు: సైబర్ దాడులను అధిగమించే వ్యవస్థలను ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతోందని, వచ్చే మార్చి నాటికి కొత్త వ్యవస్థ పనిచేయడం ప్రారంభిస్తుందని సెబీ చైర్పర్సన్ మాధవి పురి తెలిపారు. సైబర్ భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నట్టు ఆమె తెలిపారు. సంక్షోభం ఎదురైనప్పుడు దాన్ని అధిగమించే చక్కని ప్రణాళికను స్టాక్ ఎక్సే్ఛేంజ్‌లు, డిపాజిటరీలు కలిగి ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ‘‘ఏదో సాధారణ ప్రామాణిక విపత్తు రికవరీ ప్రణాళికలు అన్నవి కేవలం లొకేషన్ డౌన్‌టైమ్, హార్డ్‌వేర్, నెట్వర్క్ బ్రేక్‌డౌన్‌లనే పరిగణనలోకి తీసుకుంటాయి. సాఫ్ట్వేర్ బ్రేక్‌డౌన్, సమస్య విస్తరణను కాదు. సైబర్ దాడిలో సాఫ్ట్‌వేర్‌పైనే ప్రభావం పడుతుంది. దాంతో విపత్తు రికవరీ సైట్ కూడా ప్రభావానికి గురవుతుంది. దీనిపైనే మా ఆందోళన అంతా. అందుకే దేశంలోని రెండు పెద్ద స్టాక్ ఎకేŠస్ఛ్‌ంజ్‌లు అయిన ఎన్ఎస్ఈ, బీఎస్ఈ తగిన భద్రతా వ్యవస్థలను అమల్లో పెట్టేలా చర్యలను సెబీ తీసుకుంది’’అని మాధవి వివరించారు. ప్రస్తుతం ఈ పని పురోగతిలో ఉందంటూ, ఇది వచ్చే మార్చి నాటికి పనిచేయడం మొదలు పెడుతుందన్నారు. ‘‘ప్రతిపాదిత యంత్రాంగంలో ప్రతి క్లయింట్‌కు సంబంధించి అన్ని రకాల పొజిషన్లు, తనఖా తదితర వివరాలన్నీ ‘ఏ’ ఎక్సే్ఛేంజ్ (ఆన్లైన్)లో ఉంటాయి. ఈ డేటా అంతా కూడా వెళ్లి ఎక్సే్ఛేంజ్ ‘బీ’ లోని స్టోరేజ్ బాక్స్‌లో (డేటా సెంటర్) ఎప్పటికప్పుడు నిల్వ అవుతుంటుంది. ఒకవేళ ఎక్సే్ఛేంజ్ ఏ బ్రేక్‌డౌన్ అయితే, అది సాఫ్ట్వేర్ దాడి (సైబర్ దాడి) అని సెబీ నిర్ధారిస్తే.. అప్పుడు ఎక్సేంజ్ బీలో డేటా అప్లోడ్ అయ్యే బటన్‌ను సెబీ ప్రెస్ చేస్తుంది’’అని సెబీ చైర్పర్సన్ వివరించారు. -
జూన్‌లో టీఎస్–బీపాస్
సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణ అనుమతుల జారీలో పారదర్శకత కోసం ‘టీఎస్–బీపాస్’ వి ధానాన్ని ఇప్పటికే రాష్ట్రంలోని 87 పురపాలికల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టామని, జూన్ మొద టి వారంలో అన్ని పురపాలికల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ఈ మేరకు ఏ ర్పాట్లను పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. టీఎస్–బీపాస్ అమలుపై గురువారం ఆయనిక్కడ సమీక్ష నిర్వహిం చారు. ప్రస్తుతం 87 పురపాలికల్లో టీఎస్–బీపాస్ కింద 1,100 దరఖాస్తులను స్వీకరించడంతో పాటు ఇప్పటికే పలు అనుమతులను జారీ చేశామని అధికారులు కేటీఆర్‌కు వివరించారు. సాఫ్ట్వేర్, సపోర్ట్ సిస్టం పనితీరుపై క్షేత్రస్థాయి నుంచి సమాచారం వచ్చిందని, లోపాలుంటే సరిదిద్దేం దుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రా ష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలతోపాటు హైదరాబాద్‌లోనూ ఈ వ్యవస్థను ఏకకాలంలో ప్రారం భించేందుకు ఆలోచిస్తున్నట్లు తెలిపిన మంత్రి, ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు ప్రత్యేకంగా సూచించారు. ఇందుకోసం ఒకటి రెండు రోజుల్లోనే జీహెచ్ఎంసీ పరి ధిలోని జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ యంత్రాంగం టౌన్ ప్లానింగ్ అధికారులతో ప్రత్యేక సమావేశా న్ని ఏర్పాటు చేయాలని కేటీఆర్ పురపాలక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. జూన్ మొదటివారంలో టీఎస్–బీపాస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక ప్రజలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మీసేవ, పౌరసేవా కేంద్రాలతో పాటు వ్యక్తిగతంగా ఇంటర్నెట్, మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ఇవేవీ అందుబాటులో లేకుంటే నేరుగా దరఖాస్తులు స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉండాలని, దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. క్షేత్ర స్థాయి నుంచి వచ్చే సమాచారం ఆధారంగా మరింత సరళీకృతం చేయాలన్నారు. ఈ సమీక్షలో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, డైరెక్టర్ ఎ.సత్యనారాయణ పాల్గొన్నారు. టీఎస్–బీపాస్ అమలుపై సమీక్షిస్తున్న మంత్రి కేటీఆర్ -
ఆధునిక శోధనం.. అవసరానుగుణ విత్తనం
ఒకపక్క జనాభా పెరిగిపోతోంది.. వాతావరణ మార్పుల ప్రభావం ముంచుకొస్తోంది.. కానీ.. అందుబాటులో ఉన్న సాగుభూమి పెరగదు సరికదా.. దిగుబడులూ తగ్గిపోయే ప్రమాదమూ వెన్నాడుతోంది.ఈ వీటిని పరిష్కరించే లక్ష్యంతో అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది.మన అవసరాలకు తగ్గ కొత్త పంటలను అభివృద్ధి చేసేందుకు పట్టే సమయాన్ని సగానికి తగ్గించేందుకు.. వంగడ అభివృద్ధి ఆధునికీకరణను చేపట్టింది. ఆ పరిశోధనలేమిటో తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్త యాన్ దబానేను ‘సాక్షి’ సంప్రదించింది.. ఇవీ ఆ వివరాలు... ప్రశ్న: వంగడాల అభివృద్ధి ప్రక్రియను ఆధునికీకరించాలనే ఇక్రిశాట్ నిర్ణయం వెనుక ఉద్దేశం? జవాబు: ఒక్కమాటలో చెప్పాలంటే.. కొత్త, వినూత్న లక్షణాలున్న వంగడాలను వేగంగా అభివృద్ధి చేయడమే. అంతర్జాతీయ స్థాయిలో కొన్ని విత్తన కంపెనీలు విజయవంతంగా వాడిన సాంకేతికత, పద్ధతులను సామాన్య రైతులకు అందుబాటులోకి తేవాలని ఇక్రిశాట్ ఈ విత్తన ఆధునికీకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. నగరంలోని ఇక్రిశాట్ ప్రధాన కేంద్రంలో ‘ర్యాపిడ్‌జెన్’ పేరిట ప్రారంభించిన వ్యవస్థ ఈ దిశగా వేసిన తొలి అడుగు. ప్ర: ‘ర్యాపిడ్‌జెన్’ వ్యవస్థ తొలి అడుగు అంటున్నారు. ఇంకా ఎలాంటి సాంకేతికత, పద్ధతులు దీంట్లోకి చేర్చవచ్చు? జ: చాలా ఉన్నాయి. పంటలకు సంబంధించి నాణ్యమైన సమాచారం రాబట్టేందుకు ‘ర్యాపిడ్‌జెన్’ఉపయోగపడుతుంది. విత్తనోత్పత్తికి, పంట దిగుబడి, నాట్లకు చెందిన కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయవచ్చు. చీడపీడలను తట్టుకోవడంతోపాటు కరవు కాటకాలను, విపరీతమైన వేడిమిని ఓర్చుకునే పంటలు, మంచి పోషకాలు ఇవ్వగల వంగడాలను అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే అందుబాటులో ఉన్న మాలిక్యులర్ మార్కర్ టెక్నాలజీలను (కణస్థాయిలో మార్పులు చేయడం ద్వారా మొక్కల లక్షణాలను నియంత్రించడం) కూడా ఇందులో వాడుకోవచ్చు. ప్ర: ఇక్రిశాట్ చేపట్టిన వంగడ ఆధునికీకరణ పూర్తయ్యేందుకు ఎంత సమయం పడుతుంది? జ: సాంకేతికత అనేది కాలంతోపాటు అభివృద్ధి చెందుతుంటాయి. కాబట్టి నిర్దిష్టంగా ఇంత సమయం అని చెప్పలేము.ఎప్పటికప్పుడు మరింత వృద్ధి చేసేందుకు ఎప్పుడూ అవకాశం ఉంటుంది.‘ర్యాపిడ్‌జెన్’ద్వారా చేపట్టిన కొన్ని కార్యక్రమాలను రానున్న రెండేళ్లలోనే రైతులకు అందుబాటులోకి తేవచ్చు. ప్ర: మీరు అమలు చేయబోయే టెక్నాలజీలపై ఏవైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉందా? జ: అలాంటిదేమీ లేదు. వంగడ అభివృద్ధి ఆధునికీకరణలో ఉపయోగిస్తున్న టెక్నాలజీలన్నీ ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో విజయవంతంగా అమల్లో ఉన్నాయి.ఇక్రిశాట్ వాణిజ్య భాగస్వాములు కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. వీటిలో ఎక్కడా ఎలాంటి వ్యతిరేక పరిణామాలు సంభవించలేదు. ప్ర: ఇక్రిశాట్ ప్రధానంగా ఆరు పంటల (రాగి, సజ్జ, జొన్న, కంది, శనగ, వేరుశనగ)పై మాత్రమే పనిచేస్తోంది.వంగడ అభివృద్ధి ఆధునికీకరణను ఇతర పంటలకు విస్తరించే ఆలోచన ఏదైనా ఉందా? జ: ఇక్రిశాట్ అంతర్జాతీయ స్థాయిలో వేర్వేరు ప్రభుత్వ పరిశోధన సంస్థలతోనూ కలిసి పనిచేస్తోంది. భారత్‌లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్‌తోపాటు అంతర్జాతీయ మొక్కజొన్న, గోధుమ అభివృద్ధి కేంద్రం, అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం, ప్రపంచ కాయగూరల కేంద్రాలు వీటిలో ఉన్నాయి. మొక్కల అభివృద్ధికి ఇక్రిశాట్ ఈ సంస్థలకు తన దగ్గరున్న ఆరు పంటల జెర్మ్ప్లాసమ్ను సరఫరా చేస్తుంది. ఆయా సంస్థలు ఇతర పంటలపై కూడా పరిశోధనలు చేసుకుంటాయి. హైదరాబాద్‌లోని ఇక్రిశాట్ కేంద్రంలో ఇతర సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. ప్ర: చిన్న, సన్నకారు రైతులకు ఈ కార్యక్రమం ఎలా ఉపయోగపడుతుంది? జ: వాతావరణ మార్పుల నేపథ్యంలో చిన్న, సన్నకారు రైతులు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. చీడపీడల సమస్య పెరిగిపోనుంది. మారుతున్న వాతావరణాన్ని తట్టుకోగల వంగడాల అవసరం మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువగా ఉంది. ఇక్రిశాట్ చేపట్టిన వంగడ అభివృద్ధి ఆధునికీకరణ ద్వారా వీటికి వేగం గా పరిష్కారాలు లభించే అవకాశాలున్నాయి. -
ఇక తక్కువ సమయంలోనే కొత్త వంగడాల సృష్టి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయం కొత్త పుంతలు తొక్కేందుకు హైదరాబాద్‌లోని అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) వేదిక కానుంది. ర్యాపిడ్‌జెన్ పేరు గల ఈ వ్యవస్థ సాయంతో ఇప్పటివరకూ పది పన్నెండేళ్ల సమయం పట్టే కొత్త వంగడాల సృష్టిని అతితక్కువ సమయంలో సాధించవచ్చునని, ప్రభుత్వరంగ సంస్థల్లో ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు ఇదే తొలిసారని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ పీటర్ కార్‌బెరీ శుక్రవారం విలేకరులకు వివరించారు. ఇక్రిశాట్లోని జన్యుబ్యాంకులో మంచి లక్షణాలున్న పురాతన వంగడాలు చాలా ఉన్నాయని.. వాటిని వేగంగా రైతుల పొలాల్లోకి చేర్చేందుకు ర్యాపిడ్‌జెన్ ఉపయోగపడుతుందని వివరించారు. ఈ వ్యవస్థ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న సీనియర్ శాస్త్రవేత్త పూజా భట్నాగర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... ‘‘అధిక దిగుబడి నిచ్చే.. లేదా ఏ మంచి లక్షణంతో కూడిన వంగడాన్ని అభివృద్ధి చేయాలన్నా ఇప్పుడు ఏళ్ల సమయం పడుతుంది. ఆయా లక్షణాలున్న 2 వంగడాలను వేర్వేరు పద్ధతుల ద్వారా సంకరం చేసి మొక్కలను పెంచడం.. వాటిల్లో మనకు కావాల్సిన లక్షణాలు ఉన్న వాటిని వేరు చేసి మళ్లీ పెంచడం.. ఇలా సుమారు ఆరు నుంచి ఏడు తరాల పాటు మొక్కలు పెంచిన తరువాతగానీ మన అవసరాలకు తగిన లక్షణాలున్న వంగడం అభివృద్ధి కాదు. ఆ తరువాత వేర్వేరు వాతావరణ పరిస్థితుల్లో, నేలల్లో కొత్త వంగడాన్ని పండించి పరిశీలిస్తారు. ఆ తర్వాతే రైతులకు దాన్ని అందుబాటులోకి తెస్తారు. ఈ సుదీర్ఘకాలపు ప్రక్రియను కుదించేందుకు ర్యాపిడ్‌జెన్ ఉపయోగపడుతుంది. వాతావరణ పరిస్థితులు, పోషకాలు, వెలుతురు వంటి అన్నింటినీ కృత్రిమ పద్ధతుల్లో మొక్కలకు అందిస్తారు. మొక్కలు వేగంగా పుష్పించేలా.. విత్తనాలు ఇచ్చేలా చేస్తారు. తద్వారా ఒక్కో పంటకు ఏడాదిపాటు వేచి చూడాల్సిన అవసరం ఉండదు. 4 నెలల్లో పండాల్సిన ఖరీఫ్ పంట 50 రోజుల్లోనే పండిపోతుంది. పంటలను వేగంగా పండించి ఆ విత్తనాలను ఒకట్రెండేళ్లలోనే క్షేత్ర పరీక్షలకు సిద్ధం చేయవచ్చు’’అని తెలిపారు. ప్రస్తుతానికి తాము సంప్రదాయ వంగడ అభివృద్ధి ప్రక్రియను వేగంగా పూర్తి చేయడంపై మాత్రమే దృష్టి పెట్టామని, అత్యాధునిక జన్యు ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రైతులు, మార్కెట్ అవసరాలకు తగ్గ వంగడాలను సృష్టించేలా ర్యాపిడ్జెన్ను అభివృద్ధి చేస్తామని ఇక్రిశాట్ వంగడ అభివృద్ధి విభాగపు అంతర్జాతీయ అధ్యక్షుడు డాక్టర్ యాన్ దబానే తెలిపారు. -
టోల్గేట్..ఇక నో లేట్!
కేంద్రం ఎప్పట్నుంచో ప్రకటిస్తూ వస్తున్నట్టుగా డిసెంబర్ 1 నుంచి ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ విధానం అమల్లోకి రాబోతోంది. డిసెంబర్ నుంచి దీన్ని కచ్చితంగా అమలు చేస్తామని ఇప్పటికే పలుమార్లు కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. అనుకున్నట్టుగానే గత పక్షం రోజులుగా ఆ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. అది సాఫీగా సాగుతుండటంతో దేశవ్యాప్తంగా అనుకున్న సమయానికి ప్రారంభించబోతున్నారు. అయితే, మ్యానువల్ పద్ధతి కూడా కొంతకాలం కొనసాగనుంది. టోకెన్ కావాలనుకునేవారు టోల్ ప్లాజాల్లో డబ్బులు చెల్లించి తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ జాప్యమవుతుండటంతో ‘ఫాస్టాగ్’ వైపు.. పండుగలు, పార్టీల సమావేశాలు ఇతర ముఖ్య సమయాల్లో టోల్గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ మేరకు ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ విధానానికి రూపకల్పన చేశారు. దీనికి సంబంధించి వాహనాలకు నిర్ధారిత రుసుము చెల్లిస్తే ఫాస్టాగ్ పేరుతో స్టిక్కర్ రూపంలో ఉండే ప్రత్యేక ట్యాగ్‌ను ఇస్తారు. దాన్ని కారు అద్దానికి అతికించుకోవాలి. టోల్ గేట్ వద్దకు రాగానే, అక్కడి సెన్సార్లు ఆటోమేటిక్‌గా ఆ ట్యాగ్ నుంచి నిర్ధారిత రుసుమును మినహాయించుకుంటాయి. దీంతో ఆటోమేటిక్‌గా గేట్ తెరుచుకుని వాహనం ముందుకు వెళ్లేందుకు వీలు కలుగుతుంది. ఈ వ్యవస్థను దేశవ్యాప్తంగా ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో జాతీయ రహదారులపై అమలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తిగా సిద్ధంగా ఉన్నందున ఈ విధానాన్ని ముందు అనుకున్న సమయానికే అమలు చేయబోతున్నామని మూడ్రోజుల క్రితం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. బ్యాంకులతో పాటు పేటీఎంలో కూడా... ఫాస్టాగ్‌లను జాతీయ బ్యాంకులతోపాటు యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులతో పాటు పేటీఎం, అమెజాన్‌లలో అందుబాటులో ఉంచుతున్నారు. ఆయా వాహనాల కేటగిరీల ఆధారంగా వీటికి నిర్ధారిత రుసుములున్నాయి. కనిష్టంగా రూ. 100 నుంచి అవి ప్రారంభమవుతాయి. ట్యాగ్‌లో రుసుము అయిపోగానే మళ్లీ రీచార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. వాహన ఆర్సీ, ఫొటోతోపాటు ఆధార్/పాన్‌కార్డు/ఓటర్ ఐడీ కార్డు జిరాక్స్ ప్రతులను దాఖలు చేసి ట్యాగ్ పొందాల్సి ఉంటుంది. అవగాహన వచ్చేవరకు పాత పద్ధతి కూడా.. కేంద్రం తెచ్చిన కొత్త విధా నాన్ని అమలు చేయబోతున్నా మని ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ తెలిపారు. మన రాష్ట్రంలో జాతీయ రహదారులపై ఉన్న 17 టోల్‌ప్లాజాల్లో దీన్ని అమలు చేయనున్నట్టు ఆయన వెల్లడిం చారు. డిసెంబర్ 1 నుంచి ఈ విధానం మొదలైనా, ప్రస్తుతం కొనసాగుతున్న రుసుము చెల్లింపు విధానం కూడా అమలులో ఉండనుంది. మ్యానువల్‌గా టోల్ వసూలు చేసే ప్రస్తుత పద్ధతికి కొన్ని వరసలు కేటాయించనున్నారు. ఫాస్టాగ్‌పై వాహనదారుల్లో అవగాహన వచ్చేవరకు వీటిని కొనసాగించనున్నారు. వీలైనంత తొందరలో వారిని కొత్తపద్ధతి వైపు మళ్లించనున్నారు. కొత్త విధానం అమల్లోకి వచ్చాక టోల్ రుసుమును అప్పటికప్పుడు చెల్లించేవారు ప్రస్తుతమున్న మొత్తం కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. స్టేట్ రోడ్లపై గందరగోళం రాష్ట్రంలో జాతీయ రహదారులపై ఉన్న 17 టోల్‌ప్లాజాలు కాకుండా రాష్ట్ర రహదారులపై నాలుగున్నాయి. హైదరాబాద్–రామగుండం రాజీవ్ రహదారిపై దుద్దెడ, కొత్తపల్లి, రామగుండంల వద్ద ఒక్కోటి 6 లేన్లు చొప్పున మొత్తం 18 టోల్ వసూలు వరసలున్నాయి. ఇవి కాకుండా అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై తిప్పర్తి వద్ద 6 లేన్ల టోల్‌ప్లాజా ఉంది. వెరసి 24 లేన్ల టోల్ గేట్లలో ఈ పద్ధతి అమలుచేయటం గందరగోళంగా మారింది. దేశవ్యాప్తంగా అన్ని టోల్ బూత్‌లలో ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ విధానం ప్రారంభించాల్సి ఉన్నా, అందుకయ్యే వ్యయాన్ని ఎవరు భరించాల నే విషయంలో స్పష్టత రాక దాన్ని ఏర్పాటు చేయలేదు. ఈ టోల్ బూత్‌లలో ఒక్క లేన్‌కు మాత్రమే ఫాస్టాగ్ విధానాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికయ్యే వ్యయంలో 50 శాతాన్ని భరించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. కానీ మిగతా సగం, మిగిలిన లేన్లలో మొత్తం వ్యయాన్ని ఎవరు భరించాలన్నది గందరగోళంగా మారింది. రాష్ట్రప్రభుత్వం భరించాలా, కాంట్రాక్టర్ భరించాలా అన్న విషయంలో స్పష్టత రాలేదు. ఇప్పటివరకు కాంట్రాక్టర్లతో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో డిసెంబర్1 నుంచి రాష్ట్రప్రభుత్వం అధీనంలోని పీపీపీ రోడ్లపై ఉన్న టోల్గేట్ల వద్ద కొత్త విధానం అమలుపై స్పష్టత లేదు. ‘స్టేట్ రోడ్స్‌లోని టోల్ వసూలు కేంద్రాల వద్ద అయోమయం ఉంది. కొత్త విధానం డిసెంబర్ నుంచి అమలు చేయటం అనుమానంగానే ఉంది’అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. -
బడ్జెట్.. పంచతంత్ర..
బదులుగా ఆ శాఖ బాధ్యతలను నిర్వర్తిస్తున్న పియూష్ గోయల్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ కూడా ఇదే.. అయితే.. ఏమిటీ మధ్యంతర బడ్జెట్.. పూర్తిస్థాయి బడ్జెట్‌కు దీనికి తేడా ఏమిటి? ప్రజాకర్షక నిర్ణయాలు ఉంటాయి అంటున్నారు.. అలా తీసుకోవచ్చా లేదా.. ఇలాంటి చాలా కన్ఫ్యూజన్లు.. మరి.. వాటిని క్లియర్ చేసుకుందామా.. మధ్యంతర బడ్జెట్ అంటే.. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు(భారత్‌లో అది ఏప్రిల్ 1) కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. ఇదో ఆదాయ, వ్యయ పట్టిక. ఇందులో తనకు ఆదాయం వచ్చే మార్గాలను తెలపడంతోపాటు, ఆ ఆదాయాన్ని ఎలా ఖర్చు చేయబోతోందన్న విషయాన్నీ వివరిస్తుంది. మధ్యంతర బడ్జెట్ విషయానికొచ్చేసరికి కొంచెం తేడా ఉంటుంది. ఇది మొత్తం సంవత్సరానికి సంబంధించిన పద్దు కాదు. పరిమిత కాలానికి సంబంధించినది. అంటే.. ఎన్నికలయ్యాక కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవరకూ ఇది అమల్లో ఉంటుంది. ఓట్ ఆన్ అకౌంట్.. మధ్యంతర బడ్జెట్ ఒకటేనా.. సాధారణంగా ఒకదానికి బదులు ఒకదాన్ని వాడేస్తుంటాం కానీ.. రెండూ వేర్వేరు. ఓట్ ఆన్ అకౌంట్లో.. ఎన్నికలయ్యాక కొత్త ప్రభుత్వం వచ్చేవరకూ.. అంటే అధికార మార్పిడి కాలం వరకూ అయ్యే రోజువారీ వ్యయాలకు సంబంధించిన అంచనాలు మాత్రమే ఉంటాయి. అదే మధ్యంతర బడ్జెట్లో ఆదాయం, వ్యయం రెండింటి అంచనాలు ఉంటాయి. పాలసీపరమైన చర్యలు తీసుకోవచ్చు. రోజువారీ ఖర్చుల కోసం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా(సీఎఫ్ఐ) నుంచి నిధులను తీసుకునేందుకు కేంద్రం పార్లమెంటు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఏం చేయొచ్చు.. ఏం చేయకూడదు.. మధ్యంతర బడ్జెట్లో ఆర్థిక బిల్లు ఉండదు. దీని వల్ల ఆదాయపు పన్ను చట్టంలో మార్పులు చేయడానికి ఉండదు. శ్లాబ్‌లు పాతవే ఉంటాయి. ఎకనామిక్ సర్వే కూడా ఉండదని చెబుతున్నారు. సాధారణంగా అయితే రాబోయే ప్రభుత్వంపై భారం మోపేలా విధానపరమైన కీలక నిర్ణయాలేవీ ప్రకటించరు. అస్సలు తీసుకోవడానికి లేదా.. రాజ్యాంగపరంగా చెప్పాలంటే.. తీసుకోవచ్చు. ఎందుకంటే.. మధ్యంతర బడ్జెట్లో పాలసీ నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పే నిబంధనేదీ రాజ్యాంగంలో లేదు. సాధారణంగా తీసుకోరు అంతే.. ‘ఎన్నికల తేదీలను ప్రకటించడానికి ముందు మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టేటట్లయితే.. ప్రభుత్వం ఎలాంటి విధానపరమైన నిర్ణయాలనైనా తీసుకోవచ్చు’ అని ప్రముఖ న్యాయవాది అరవింద్ దతార్ ‘బ్లూమ్‌బర్గ్ క్వింట్’కు తెలిపారు. మరికొందరు కూడా ఈ వాదనను సమర్థిస్తున్నారు. అయితే, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా దీంతో విభేదిస్తున్నారు. ఎకనామిక్ సర్వే ఉండదు, ఆర్థిక బిల్లు ఉండదు.. అలాగే విధానపరమైన నిర్ణయాలు కూడా ఉండకూడదని పేర్కొంటున్నారు. ఈ మధ్యంతర బడ్జెట్లో ఏముండొచ్చు.. పాత సంప్రదాయాలకు భిన్నంగా మధ్యంతర బడ్జెట్ ఉండొచ్చన్నట్లుగా కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ ఇప్పటికే పలు వ్యాఖ్యలు చేశారు. దాన్ని బట్టి మోదీ సర్కారు కొన్ని విధానపరమైన కీలక నిర్ణయాలను ప్రకటించవచ్చనే ఊహాగానాలు వినవస్తున్నాయి. మళ్లీ అధికారంలోకి వస్తే.. వచ్చే ఐదేళ్లకు సంబంధించిన తమ ప్రాధాన్యతలు ఇవీ అని తెలియజేయడానికి ఈ మధ్యంతర బడ్జెట్‌ను ఓ అవకాశంగా వాడుకోవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా దేశంలోని రైతాంగానికి తెలంగాణలోని రైతు బంధు తరహా పథకాన్ని ప్రకటించవచ్చని అంటున్నారు. జైట్లీ మాటలను బట్టి చూస్తే.. పాత సంప్రదాయాలకు తిలోదకాలిస్తూ.. ఆదాయపు పన్ను వంటివాటిల్లో మినహాయింపులు ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదని పరిశీలకులు చెబుతున్నారు. -
‘మీ సేవ’లో నగదు
ఆదిలాబాద్‌అర్బన్: బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలంటే ఎటీఎంలు, బ్యాంకులకే వెళ్లాల్సిన అవసరం లేదు. దగ్గరలో ఉన్న మీ సేవ కేంద్రాల్లోనూ బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకు అదనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. బ్యాంకు పేరు, ఆధార్ నంబర్ చెప్పి బయోమెట్రిక్ ఇస్తే సరిపోతుంది. డబ్బులు చేతికొస్తాయి. ఈ కొత్త విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. మీ సేవ కేంద్రాల ద్వారా నగదు చెల్లింపులకు ఆర్బీఐ కూడా ఆమోదం తెలపడంతో ప్రభుత్వం నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద ఆగస్టు 1 నుంచి ప్రారంభించింది. వచ్చే అక్టోబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే జిల్లాలోని అన్ని మీ సేవ కేంద్రాల్లో ఈ విధానాన్ని అక్టోబర్ నుంచి ప్రారంభించే సాధ్యాసాధ్యాలపై మీసేవ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలో ఏర్పడిన నగదు కొరత, పెద్దనోట్ల రద్దు తర్వాత వచ్చిన నగదు సమస్యను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ సౌకర్యాన్ని అందుబాటులో తెచ్చింది. పనిచేసేదిలా.. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇదే రీతిలో ఆధార్ సమన్వయంతో డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు ‘ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం’(ఏఈపీఎస్)ను ప్రవేశపెట్టింది. ఈ సిస్టం ద్వారా మీ సేవ కేంద్రానికి వెళ్లి డబ్బు డ్రా చేసుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాటించే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ మార్గదర్శకాలను అనుసరించి ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఆధార్ నంబర్, బ్యాంకు పేరు చెప్పి బయోమెట్రిక్ వివరాలు ఇవ్వాలి. బ్యాంకు ఖాతా నంబర్ చెప్పకుండానే డబ్బు డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. త్వరలో మీ సేవలో ఈ సిస్టం అందుబాటులోకి రానుంది. ఉదాహరణకు.. ఒక వ్యక్తికి వివిధ రకాల నాలుగు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయనుకుందాం.. డబ్బు డ్రా చేసేందుకు సదరు వ్యక్తి మీ సేవ కేంద్రానికి వచ్చినప్పుడు ఆధార్ వివరాలు చెప్పాలి. ఇదివరకే బ్యాంకు ఖాతాకు ఆధార్ నంబర్ అనుసంధానమై ఉంది. మీ సేవ నిర్వాహకులు ఏఈపీఎస్ సిస్టంలో ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే ఆ వ్యక్తి పేరు మీద ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉన్నాయనేది స్పష్టంగా కన్పిస్తాయి. వ్యక్తి అభిప్రాయం మేరకు సదరు బ్యాంకు ఖాతా నుంచి డబ్బు డ్రా చేసి రశీదుతోపాటు నగదును మీసేవ నిర్వాహకులు సదరు వ్యక్తికి అందజేస్తారు. ఇలా ఒక రోజులో ఒక వ్యక్తి గరిష్టంగా రూ.10 వేలు మాత్రమే తీసుకునే వెసులుబాటు ఉంది. జిల్లాలో ఇలా.. జిల్లాలో అన్ని చోట బ్యాంకు బ్రాంచీలు అందుబాటులో లేవు. కానీ.. మీ సేవ కేంద్రాలు పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్నాయి. దీని దృష్ట్యా మీ సేవ కేంద్రాల ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసిస్తే.. నగదు కొరతను అధిగమించవచ్చనే దిశగా ప్రభుత్వ ఆలోచన చేస్తోంది. జిల్లాలోని 18 మండలాల పరిధిలో మొత్తం 93 వివిధ బ్యాంకు బ్రాంచీలు ఉన్నాయి. ఈ బ్రాంచీల పరిధిలో ప్రస్తుతం 12,86,171 మంది ఖాతాదారులు ఉన్నారు. జిల్లాలో 76 మీ సేవ కేంద్రాలు ఉన్నాయి. బ్యాంకు బ్రాంచీల కన్నా మీ సేవ కేంద్రాలు తక్కువగా ఉన్నా.. ఎక్కువ శాతం మీ సేవ సెంటర్లు గ్రామాల్లోనే ఉన్నాయి. మీసేవ కార్యకలాపాలు ఎక్కువగా నగదు రూపంలోనే జరుగుతుంటాయి. వివిధ రకాల సర్టిఫికెట్లు, ధ్రువపత్రాల జారీ, కరెంట్ బిల్లుల రూపంలో మీ సేవలకు వచ్చిన నగదును బ్యాంకు లావాదేవీలకు వాడనున్నారు. ఆధార్ ఆధారిత లావాదేవీలను ప్రవేశపెట్టడంతో ఇటు బ్యాంకులకు.. అటు మీ సేవ నిర్వాహకులకు ప్రయోజనం చేకూరే అవకాశాలున్నాయి. బ్యాంకు తరఫున లావాదేవీలు నిర్వహించినందుకు మీ సేవ కేంద్రం ఆపరేటర్లకు అదనపు ఆధాయం లభిస్తుంది. మీ సేవలకు వివిధ రకాల సేవలు అందించినందుకు చార్జీల రూపంలో వచ్చిన మొత్తాన్ని ఈఎస్డీ విభాగానికి పంపేందుకు ఆపరేటర్లు బ్యాంకుకు వెళ్లి డిపాజిట్ చేయాల్సి వస్తోంది. ఇలా డిపాజిట్ చేసినందుకుగాను సహజంగానే బ్యాంకు క్యాష్ హ్యాడ్లింగ్ చార్జీలు వసూలు చేస్తున్నాయి. దీంతో ఆపరేటర్లు తమ కష్టార్జీతాన్ని ఈ రూపంలో కోల్పోవాల్సి వస్తోంది. తాజా విధానంతో వినియోగదారులకే సొమ్ము అందించడంతో బ్యాంకుకు చెల్లించే చార్జీలు తగ్గడంతోపాటు అదనపు ఆదాయం రానున్నదని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. అక్టోబర్ నుంచి ప్రారంభం కావచ్చు మీ సేవ కేంద్రాల్లో బ్యాంకు సేవలను అక్టోబర్ నుంచి ప్రారంభించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఆగస్టు 1 నుంచి సేవలు ప్రారంభమయ్యాయి. ఈ విధానంతో నగదు కొరత అనేది ఉండదు. ఖాతాదారులకు బ్యాంకులు, ఏటీఎం చుట్టూ తిరిగే ఇబ్బందులు తప్పుతాయి. – రఘువీర్‌సింగ్, మీసేవ జిల్లా కో–ఆర్డినేటర్, ఆదిలాబాద్ -
భూ రికార్డుల కోసం కొత్త వ్యవస్థ
► వర్చువల్ రెఫరెన్స్ సిస్టమ్ అమలుకు ప్రతిపాదనలు ► అదనపు సర్వేయర్ జనరల్ యు.ఎన్.గుర్జర్ సాక్షి, హైదరాబాద్: అత్యంత కచ్చితమైన భూమి రికార్డుల తయారీతోపాటు ఇతర లాభాలు కలిగిన వర్చువల్ రిఫరెన్స్ సిస్టమ్‌ను దేశంలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సర్వే ఆఫ్ ఇండియాలో శిక్షణ విభాగమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్వేయింగ్ అండ్ మ్యాపింగ్ (ఐఐఎస్ఎం) అదనపు సర్వేయర్ జనరల్ యు.ఎన్.గుర్జర్ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని ఐఐఎస్‌ఎంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వర్చువల్ రెఫరెన్స్ సిస్టమ్‌తో సెంటీమీటర్ల స్థాయి కచ్చితత్వంతో రికార్డులను నమోదు చేయవచ్చన్నారు. విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లతోపాటు ఎయిర్‌క్రాఫ్ట్ నావిగేషన్, ట్రాఫిక్ మేనేజ్మెంట్లలోనూ ఈ వ్యవస్థ ఉపయోగకరంగా ఉంటుం దన్నారు. దీని అమలుకు సంబంధించి ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించాల్సి ఉందన్నారు. తొలిసారి థాయ్‌లాండ్‌కు చెందిన జియో ఇన్ఫర్మేటిక్స్ అండ్ స్పేస్ డెవలప్మెంట్ ఏజెన్సీ అధికారులకు త్వరలో 4 వారాలపాటు సర్వే రంగంలో శిక్షణ ఇవ్వనున్నామన్నారు. త్వరలో 400 పట్టణాల మ్యాపింగ్... నేషనల్ అర్బన్ ఇన్ఫర్మేషన్ స్కీమ్ కింద దేశంలోని 152 పట్టణ ప్రాంతాల మ్యాపింగ్ దాదాపు పూర్తయిందని, త్వరలో మరో 400 పట్టణాల మ్యాపింగ్ చేపట్టనున్నామని గుర్జర్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఆదిలాబాద్, ధర్మవరం, మదనపల్లి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నల్లగొండలలో మ్యాపింగ్ పూర్తయిందన్నారు. -
వడ్డీరేట్ల లెక్కింపునకు ఇక కొత్త విధానం
ముంబై: కీలక పాలసీ రేట్లలో మార్పుల ప్రయోజనాలు సత్వరం రుణగ్రహీతలకు లభించాలనే లక్ష్యంలో భాగంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి బ్యాంకులు వడ్డీ రేట్ల లెక్కింపునకు కొత్త విధానాన్ని పాటించాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. బేస్ రేటును లెక్కించేందుకు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్‌ను ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుందని వివరించింది. దీనివల్ల వడ్డీ రేట్ల తగ్గుదల ప్రయోజనాలు రుణగ్రహీతలకు సత్వరం లభించడంతో పాటు బ్యాంకులు వడ్డీ రేట్లను నిర్ణయించేందుకు పాటించే విధానంలోనూ పారదర్శకత పెరుగుతుందని ఆర్బీఐ తెలిపింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ను బ్యాంకులు ప్రతి నెలా సమీక్షించి, ప్రకటిస్తాయని వివరించింది. ప్రస్తుతం సగటు నిధుల సమీకరణ వ్యయాల ప్రాతిపదికన బ్యాంకులు వడ్డీ రేట్లను నిర్ణయిస్తున్నాయి. కొత్త కరెంటు, సేవింగ్స్ డిపాజిట్లు, టర్మ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేట్ల ఆధారంగా నిధుల సమీకరణ వ్యయాన్ని మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ విధానంలో బ్యాంకులు లెక్కిస్తాయి. దీనికి అదనంగా మరికొన్ని అంశాలను జోడించి రుణాలపై కనీస వడ్డీ రేటు (బేస్ రేటు)ను నిర్ణయిస్తాయి. తుది మార్గదర్శకాలను స్వాగతిస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య చెప్పారు. నిర్దిష్ట తేది తర్వాత కొత్తగా రుణాలు తీసుకునే వారికి, రెన్యువల్ చేసుకునే వారికి కొత్త రేటు వర్తిస్తుందని ఆమె వివరించారు. పాత ఖాతాదారులు కూడా కొన్ని షరతులకు లోబడి కొత్త విధానానికి మారే వెసులుబాటు కూడా కల్పించనున్నట్లు ఆమె తెలిపారు. -
వెయిటింగ్ లిస్టులో ఉన్నారా.. నో ఫికర్
దసరా సీజన్ కారణంగా రైళ్లలో టికెట్లు దొరకడం గగనంగా ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో ముందురోజు తత్కాల్ కోసం ప్రయత్నిద్దాం అనుకునేవాళ్లే ఎక్కువగా కనపడుతున్నారు. కానీ, ఇప్పుడు అలా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, వెయిటింగ్ లిస్టులో ఉన్నవాళ్ల టికెట్లు రద్దు చేయడానికి బదులు, అదే మార్గంలో వెళ్లే మరో రైల్లో వాళ్లకు సీట్లు కేటాయించాలని రైల్వేశాఖ భావిస్తోంది. ఇది నవంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. ఈ కొత్త పద్ధతి ప్రకారం టికెట్లు బుక్ చేసుకునే సమయంలోనే మనకు వెయిటింగ్ లిస్టు వస్తే, ఆ రైలు కాక మరేదైనా రైల్లో వెళ్లాలనుకుంటే ఆ ఆప్షన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఒక స్టేషన్ కాకుండా చుట్టుపక్కల ఉండే మరేదైనా స్టేషన్ నుంచి అయినా బయల్దేరాలనుకుంటే ఆ వెసులుబాటు కూడా ఉంటుంది. ప్రస్తుతం శతాబ్ది ఎక్స్‌ప్రెస్ లాంటి ప్రీమియం రైళ్లలో కూడా వెయిటింగ్ లిస్టు ఎక్కువగానే ఉంటోంది. దానికి తోడు కొంత వెయిటింగ్ లిస్టు దాటిన తర్వాత 'నో రూమ్' అనే సందేశం వచ్చేస్తుంది. అంటే, కనీసం వెయిటింగ్ లిస్టు టికెట్ బుక్ చేసుకోడానికి కూడా కుదరదు. దాంతో ఎక్కువ దూరాలు వెళ్లాలనుకునేవాళ్లు ఒకటికి రెండు మూడు రైళ్లలో టికెట్లు బుక్ చేసుకునేవారు. ఇక ఈ బాధలన్నీ తప్పిపోయినట్లే. కొత్త వ్యవస్థలో ప్రయాణికులతో పాటు రైల్వేశాఖకు కూడా తలనొప్పులు తగ్గుతాయి. ప్రయాణికులు ఒకసారి టికెట్ బుక్ చేసుకుంటే చాలు.. ఆ మార్గంలో ఎంతమంది ఉన్నారో చూసుకుని అవసరమైతే ప్రత్యేక రైళ్లను కూడా అప్పటికప్పుడే వేసి, వాటిలోకి వీళ్లను సర్దేసే అవకాశం ఉంటుంది. అవసరమైతే మిగిలిన సీట్లను కరెంట్ బుకింగ్ ద్వారా కేటాయించొచ్చు. ఈ కొత్త వ్యవస్థను నవంబర్ 1 నుంచి అమలుచేయాలని ఇప్పటికే అన్ని జోనల్ కార్యాలయాలకు రైల్వేశాఖ నుంచి ఉత్తర్వులు వచ్చేశాయి. -
హెచ్ఎండీఏకు కాలం చెల్లినట్టేనా?
⇒ కార్యకలాపాలు లేక స్తబ్ధత ⇒ విలీనం దిశగా సర్కార్ యోచన? ⇒ సాధ్యాసాధ్యాలపై ఉన్నతస్థాయిలో సమాలోచనలు ⇒ నూతన వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గు ⇒ రద్దు చేయడం ఆషామాషీ కాదంటున్న నిపుణులు సాక్షి, సిటీబ్యూరో: రాజకీయ అవసరాలు, భవిష్యత్ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు మంగళం పాడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు కాగానే మహా నగరాభివృద్ధికి సంబంధించి ఎజెండా పూర్తిగా మారి పోయింది. గత పరిపాలన అవశేషంగా ఉన్న హెచ్ఎండీఏను వదిలించుకొని తమ లక్ష్యాలకు అనుగుణంగా సరికొత్త వ్యవస్థ ద్వారా అభివృద్ధిలో ముందడుగు వేయాలని కొత్త ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే హెచ్ఎండీఏను రద్దు చేసి అందులోని కీలక విభాగాలను వివిధ ప్రభుత్వ శాఖల్లో విలీనం చేయాలన్న ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫైల్ కూడా ప్రస్తుతం జీఏడీలో కదిలిందన్న పుకార్లు గుప్పుమంటున్నాయి. ప్రధానంగా హెచ్ఎండీఏలో కీలకంగా ఉన్న ప్లానింగ్ విభాగాన్ని డీటీసీపీలో, ఇంజినీరింగ్ విభాగాన్ని ఆర్ అండ్ బి/ఇరిగేషన్ విభాగాల్లో, అర్బన్ ఫారెస్ట్రీని స్టేట్ ఫారెస్ట్ విభాగంలో, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న దిశగా ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. హెచ్ఎండీఏ ప్రధా న భూమిక పోషిస్తోన్న లేఅవుట్లు, బహుళ అంతస్తు భవనాల అనుమతి, ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్లు, భూ వినియోగ మార్పిడి, కొత్త పరిశ్రమలు తదితరాల అనుమతులను ఇకపై డెరైక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ (డీటీసీపీ) విభాగం నుంచి అందించాలని సర్కార్ యోచిస్తున్నట్టు సమాచారం. ఈ కారణంగానే హెచ్ఎండీఏకు రెగ్యులర్ కమిషనర్‌ను నియమించలేదని, కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులు కూడా అప్పగించలేదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఇదే విషయమై సచివాలయం స్థాయిలో కూడా చర్చ జరుగుతుండటంతో హెచ్ఎండీఏను ఇతర విభాగాల్లో విలీనం చేస్తారన్న వదంతులకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. రద్దు సాధ్యమయ్యేనా..? దేశంలో ఇప్పటివరకు ఏ డెవలప్మెంట్ అథారిటీకి ప్రత్యేకంగాా చట్టం లేదు. అయితే... హెచ్ఎండీఏకు మాత్రం 2008లో ప్రత్యేకంగా చట్టం చేసి అమల్లోకి తెచ్చారు. మొత్తం 5 జిల్లాల్లోని 849 గ్రామాలను కలుపుకొని 7257 చ.కి.మీటర్ల పరిధిలో విస్తరించిన హెచ్ఎండీఏ అంటే... రీజనల్ డెవలప్మెంట్ అథారిటీగా ప్రత్యేక గుర్తింపు పొందింది. దేశంలోని మాస్టర్ప్లాన్లలో ఇది అతిపెద్దది. ఇందులో అభివృద్ధి కార్యకలాపాల నిర్వహణకు ప్రత్యేకంగా ఓ వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవహారాలు నిర్వహిస్తున్న హెచ్ఎండీఏను రద్దు చేసినా... అదే స్థాయిలో పేరు మార్పుతో మరో వ్యవస్థను ఏర్పాటు చేయడం తప్ప మరో మార్గం ఉండదు. అసెంబ్లీలో ప్రత్యేకంగా చట్టం చేసి అమల్లోకి తెచ్చిన ‘హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ యాక్ట్-2008’ని రద్దు చేయాలంటే తిరిగి అసెంబ్లీలోనే ఈ అంశాన్ని ప్రవేశపెట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అన్ని పార్టీలు సుముఖత తెలిపాకే చట్టం రద్దవుతుంది. అయితే... ఇది అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. అర్బన్ ప్లాన్ డెవలప్మెంట్ యాక్ట్-1975 కింద హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (హుడా) ఏర్పాటైంది. ఆ తర్వాత ‘హుడా’ పరిధిని 5 జిల్లాలకు విస్తరిస్తూ 2008లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)ని అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాని పరిధిలో ఏ అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టాలన్నా హెచ్ఎండీఏ అనుమతి తప్పనిసరి చేసింది. దీని అధికారాల్లో కొన్నింటిని స్థానిక సంస్థలైన జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామపంచాయతీలకు బదలాయించింది. హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌కు లోబడే అనుమతులు ఇస్తున్నారు. ఇంతటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న హెచ్ఎండీఏను ఇప్పుడు ఇతర శాఖల్లో విలీనం చేయడం సాధ్యం కాదన్న వాదనలు బలంగా విన్పిస్తున్నాయి. భవిష్యత్‌లో హెచ్ఎండీఏ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే ప్రమాదం ఉందన్న అనుమానంతో ప్రభుత్వం ఈ వ్యవస్థను నిర్వీర్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐదు జిల్లాల్లో 7257 చ.కి.మీటర్ల మేర విస్తరించిన హెచ్ఎండీఏను ఇప్పుడు 625 చ.కి.మీటర్ల పరిధిలోని జీహెచ్ఎంసీలో కలపడమంటే సముద్రాన్ని... నదిలో కలిపినట్లుగా ఉంటుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెచ్ఎండీఏ రద్దుకు సర్కార్ నిర్ణయం తీసుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు హెచ్ఎండీఏ సిబ్బంది సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.