జూన్ ఒకటి నుంచి కేంద్రం కొత్త చట్టం
గ్రేటర్‌లో అమలుపై సందిగ్ధం
రెండు ఎకరాల స్థలంలో ట్రాక్‌లు, మౌలిక వసతులు అవసరం
ఇక్కడ భూమి బంగారం కన్నా ప్రియం
ఇప్పటి వరకు అలాంటి స్కూళ్లు లేవంటున్న ఆర్టీఏ
అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూళ్లలోనే లైసెన్సులు
సాక్షి, హైదరాబాద్: రహదారి భద్రతా చట్టంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూళ్లకు శ్రీకారం చుట్టింది. ఈ స్కూళ్లలో శిక్షణ తీసుకున్నవారికి నేరుగా డ్రైవింగ్ లైసెన్సులు లభిస్తాయి. మరోవిధంగా చెప్పాలంటే డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియలో ప్రైవేట్ సంస్థలకు భాగస్వామ్యాన్ని కల్పిస్తూ కేంద్రం మోటారు వాహన చట్టంలో మార్పులు తెచ్చింది. జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇంతవరకు బాగా ఉందికానీ.. గ్రేటర్‌లో ఇప్పటి వరకు అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూళ్లు ఏర్పాటు కాలేదు. దీంతో లైసెన్సుల జారీలో కొత్త నిబంధనల అమలుపై సందిగ్ధం నెలకొంది. ‘కేంద్రం రూపొందించిన ఈ చట్టాన్ని కచి్చతంగా అమలు చేయాల్సిందే. అక్రిడేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు’ అని రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నిబంధనల మేరకు స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు సంస్థలు లేదా వ్యక్తులు ముందుకు వస్తే అనుమతివ్వనున్నట్లు పేర్కొన్నారు.
సమర్థంగా.. ప్రామాణికంగా..
అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూళ్లు ఇచ్చే నాణ్యమైన, సమర్థమైన శిక్షణే ప్రామాణికంగా భావించి లైసెన్సులు ఇవ్వాలనేది చట్టం ప్రధాన ఉద్దేశం. ఈ డ్రైవింగ్ స్కూళ్లు ఇచ్చే ‘5– ఏ’ సర్టిఫికెట్లు ఆధారంగా నేరుగా లైసెన్సులు పొందవచ్చు. డ్రైవింగ్ లైసెన్సుల జారీలో రవాణా అధికారాలను పూర్తిగా పరిమితం చేస్తూ ప్రవేశపెట్టిన అక్రిడేటెడ్ స్కూళ్ల ఏర్పాటు ఎంతో ఖరీదైన వ్యవహారం కావడంతో వ్యాపార సంస్థలు లేదా డ్రైవింగ్‌లో శిక్షణనిచ్చేందుకు ఆసక్తి ఉన్నవారు సైతం ముందుకు రావడం లేదు. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న సాధారణ డ్రైవింగ్ స్కూళ్లు కూడా నిరాసక్తత చూపుతున్నాయి. రెండు ఎకరాల్లో ట్రాక్‌లను ఏర్పాటు చేయడంతో పాటు వాహనాలు, మౌలిక సదుపాయాలను కలి్పంచాల్సి ఉంటుంది. కానీ.. పెద్దమొత్తంలో పెట్టుబడి పెడితే ఆదాయం ఆ స్థాయిలో ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ హకీంపేట్‌లో ఈ తరహా డ్రైవింగ్ స్కూల్‌ను నిర్వహిస్తోంది. ఆర్టీసీ డ్రైవర్లకు శిక్షణలో మెలకువలు నేర్పించేందుకు దీన్ని ఏర్పాటు చేశారు.
ఈ సదుపాయాలు తప్పనిసరి..
అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూళ్ల కోసం కనీసం 2 ఎకరాల్లో వివిధ రకాల టెస్ట్‌ట్రాక్‌లను ఏర్పాటు చేయాలి. ప్రాథమిక శిక్షణ కోసం సిమ్యులేటర్లను ఏర్పాటు అవసరం. శిక్షణ తరగతుల కోసం పక్కా భవనాలను నిర్మించాలి. తరగతి గదులు ఉండాలి. ఇంటర్నెట్ సదుపాయం, ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ. టీచింగ్ పరికరాలు తదితర సదుపాయాలు ఉండాలి.
స్థల లభ్యతే ప్రధాన సమస్య..
నగరంలో భూమి లభ్యతే ప్రధాన సమస్యగా మారింది. అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూళ్లకు ఎకరం నుంచి రెండెకరాల స్థలం అవసరం. కార్లు వంటి తేలికపాటి వాహనాలు నడిపేందుకు ఎకరం పరిధిలో డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్, బస్సులు, లారీలు వంటివి నేర్చుకొనేందుకు 2 ఎకరాలలో ట్రాక్‌లు ఉండాలి. నగరానికి నలువైపులా ఔటర్ రింగ్‌రోడ్డు పరిధిలో రియల్ ఎస్టేట్ భూమ్‌తో భూమి ధరలకు రెక్కలొచ్చాయి. రూ.కోట్లు వెచ్చించి భూమిని కొనుగోలు చేసి డ్రైవింగ్ స్కూళ్లు ఏర్పాటు చేయడం అసాధ్యమనే భావన ఉంది. ఇలా ఏర్పాటు చేసే అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూళ్లలో ఫీజులు కూడా భారీ మొత్తంలోనే ఉంటాయి. అలాంటప్పుడు శిక్షణ తీసుకొనేందుకు అభ్యర్థులు ముందుకు రాకపోవచ్చు. ఏ విధంగా చూసినా ఇది ఖరీదైన వ్యవహారంగా మారడంతో అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూళ్ల ఏర్పాటు సవాల్‌గా మారింది. ఈ క్రమంలో కేంద్రం కొత్త చట్టం అమలుపై సందిగ్ధత నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment