విదేశాల్లో మనోళ్లురయ్‌.. రయ్‌.. | - | Sakshi
Sakshi News home page

విదేశాల్లో మనోళ్లురయ్‌.. రయ్‌..

Published Sun, Sep 22 2024 2:44 AM | Last Updated on Sun, Sep 22 2024 12:27 PM

-

ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు యువత

చదువు, ఉద్యోగంతోపాటు పార్ట్‌టైం డ్రైవింగ్‌ చేస్తూ సంపాదన

ఉమ్మడి జిల్లాలో ఏటా పెరుగుతున్న ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ పర్మిట్లు

విదేశీ రోడ్లపై మనోళ్లు డ్రైవింగ్‌లో రయ్‌.. రయ్‌మంటూ దూసుకెళ్తున్నారు. చదువు, ఉద్యోగం, పర్యాటకం పేరుతో చాలామంది విదేశాలకు వెళ్తుంటారు. అక్కడ వాహనం నడపాలంటే కచ్చితంగా ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ పర్మిట్‌(ఐడీపీ) ఉండాలి. విదేశాలకు వెళ్లే వారంతా ఐడీపీ లైసెన్స్‌లు పొందడానికి ఆసక్తి చూపుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ లైసెన్స్‌లు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది.  

నల్లగొండ, సూర్యాపేటటౌన్‌, భువనగిరి టౌన్‌ : విదేశాల్లో ఎటు వెళ్లాలన్నా కూడా కారు తప్పనిసరి. ఉద్యోగ నిమిత్తం, ఎంఎస్‌, ఎంబీఏ, ఎంబీబీఎస్‌ లాంటి ఉన్నత చదువులకు వెళ్లేవారు వేలాది మంది ఉంటారు. ఆయా దేశాలను బట్టి వారానికి రెండు నుంచి మూడు రోజులే కళాశాలలు, ఆఫీస్‌లు ఉండటంతో మిగతా రోజులు పార్ట్‌టైంగా డ్రైవింగ్‌ చేస్తూ ఉపాధి పొందుతారు. దీంతో ఐదేళ్లుగా ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకునే వారి సంఖ్య పెరిగింది.

అక్కడి లైసెన్స్‌ పొందాలి.. 
మనదేశంలో తీసుకున్న ఐడీపీతో దాదాపు 150 దేశాల్లో వాహనాలు నడపవచ్చు. ఇక్కడి ఐడీపీతో విదేశాలకు వెళ్లిన తర్వాత ఆ దేశాన్ని బట్టి ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు ఐడీపీ చెల్లుబాటు అవుతుంది. తర్వాత డ్రైవింగ్‌ చేయాలనుకునే వారు అక్కడి నిబంధనల ప్రకారం లైసెన్స్‌ పొందాలి. మనదేశంలో లైసెన్స్‌ పొంది, 3, 4 సంవత్సరాల అనుభవం ఉన్న వారికి విదేశాల్లో లైసెన్స్‌ త్వరగా వస్తుందని అధికారులు చెబుతున్నారు.

పార్ట్‌ టైం డ్రైవింగ్‌ చేస్తా
నేను 2021 నుంచి లండన్‌లో ఉంటున్న. 2023లో ఇక్కడ ఇంటర్నేషనల్‌ లైసెన్స్‌ తీసుకున్నా. అది వ్యాలిడిటీ అయిపోవడంతో లండన్‌లోనే ఇంటర్నేషనల్‌ లైసెన్స్‌ తీసుకున్నా. వారంలో మూడు రోజులు పార్ట్‌టైంగా డ్రైవింగ్‌, నాలుగు రోజులు సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తా. మూడు రోజులు డ్రైవింగ్‌ చేస్తే రూ.45వేలు వస్తే.. నాలుగు రోజులు సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తే రూ.38 వేలు వస్తున్నాయి. ఖర్చులు, రూం కిరాయి, ఇతర ఖర్చులు డ్రైవింగ్‌ మీదే వెళ్లదీస్తా.
– బి.రాజేష్‌కుమార్‌

ఏడాది పాటు చెల్లుబాటు అవుతుంది 
మన దేశంలో ఇంటర్నేషనల్‌ లైసెన్స్‌ తీసుకుంటే విదేశాల్లో ఏడాదిపాటు చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత మళ్లీ ఇక్కడ తీసుకోవచ్చు. వీలు కుదరకపోతే ఇక్కడి లైసెన్స్‌ను అక్కడ లెర్నింగ్‌గా ఉపయోగించుకోవచ్చు. దీన్ని చూపించి ఆయా దేశాల్లో ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. 
– సురేష్‌రెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి, సూర్యాపేట

ఐడీపీ తీసుకునేవారి సంఖ్య పెరుగుతోంది
విదేశాలకు వెళ్తున్న వారు తప్పని సరిగా ఐడీపీ లైసెన్స్‌ తీసుకుంటున్నారు. విదేశాల్లో ఈ లైసెన్స్‌ను ప్రామాణికంగా తీసుకుని అక్కడి లైసెన్స్‌ ఇస్తారు. అంతర్జాతీయ లైసెన్స్‌కు రెన్యువల్‌ 
ఉండదు. కాలపరిమితి ముగిస్తే మరోసారి తీసుకోవాలి్సందే.  
– సాయికుమార్, డీటీఓ, యాదాద్రి భువనగిరి జిల్లా 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement