భూ రికార్డుల కోసం కొత్త వ్యవస్థ
► వర్చువల్ రెఫరెన్స్ సిస్టమ్ అమలుకు ప్రతిపాదనలు
► అదనపు సర్వేయర్ జనరల్ యు.ఎన్.గుర్జర్
సాక్షి, హైదరాబాద్: అత్యంత కచ్చితమైన భూమి రికార్డుల తయారీతోపాటు ఇతర లాభాలు కలిగిన వర్చువల్ రిఫరెన్స్ సిస్టమ్‌ను దేశంలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సర్వే ఆఫ్ ఇండియాలో శిక్షణ విభాగమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సర్వేయింగ్ అండ్ మ్యాపింగ్ (ఐఐఎస్‌ఎం) అదనపు సర్వేయర్ జనరల్ యు.ఎన్.గుర్జర్ తెలిపారు.
గురువారం హైదరాబాద్‌లోని ఐఐఎస్‌ఎంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వర్చువల్ రెఫరెన్స్ సిస్టమ్‌తో సెంటీమీటర్ల స్థాయి కచ్చితత్వంతో రికార్డులను నమోదు చేయవచ్చన్నారు. విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లతోపాటు ఎయిర్‌క్రాఫ్ట్ నావిగేషన్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌లలోనూ ఈ వ్యవస్థ ఉపయోగకరంగా ఉంటుం దన్నారు. దీని అమలుకు సంబంధించి ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించాల్సి ఉందన్నారు. తొలిసారి థాయ్‌లాండ్‌కు చెందిన జియో ఇన్ఫర్మేటిక్స్ అండ్ స్పేస్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ అధికారులకు త్వరలో 4 వారాలపాటు సర్వే రంగంలో శిక్షణ ఇవ్వనున్నామన్నారు.
త్వరలో 400 పట్టణాల మ్యాపింగ్...
నేషనల్ అర్బన్ ఇన్ఫర్మేషన్ స్కీమ్ కింద దేశంలోని 152 పట్టణ ప్రాంతాల మ్యాపింగ్ దాదాపు పూర్తయిందని, త్వరలో మరో 400 పట్టణాల మ్యాపింగ్ చేపట్టనున్నామని గుర్జర్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఆదిలాబాద్, ధర్మవరం, మదనపల్లి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నల్లగొండలలో మ్యాపింగ్ పూర్తయిందన్నారు.