కేంద్రం ఎప్పట్నుంచో ప్రకటిస్తూ వస్తున్నట్టుగా డిసెంబర్ 1 నుంచి ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ విధానం అమల్లోకి రాబోతోంది. డిసెంబర్ నుంచి దీన్ని కచ్చితంగా అమలు చేస్తామని ఇప్పటికే పలుమార్లు కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. అనుకున్నట్టుగానే గత పక్షం రోజులుగా ఆ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. అది సాఫీగా సాగుతుండటంతో దేశవ్యాప్తంగా అనుకున్న సమయానికి ప్రారంభించబోతున్నారు. అయితే, మ్యానువల్ పద్ధతి కూడా కొంతకాలం కొనసాగనుంది. టోకెన్ కావాలనుకునేవారు టోల్ ప్లాజాల్లో డబ్బులు చెల్లించి తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు.
– సాక్షి, హైదరాబాద్
జాప్యమవుతుండటంతో ‘ఫాస్టాగ్’ వైపు..
పండుగలు, పార్టీల సమావేశాలు ఇతర ముఖ్య సమయాల్లో టోల్‌గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ మేరకు ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ విధానానికి రూపకల్పన చేశారు. దీనికి సంబంధించి వాహనాలకు నిర్ధారిత రుసుము చెల్లిస్తే ఫాస్టాగ్ పేరుతో స్టిక్కర్ రూపంలో ఉండే ప్రత్యేక ట్యాగ్‌ను ఇస్తారు. దాన్ని కారు అద్దానికి అతికించుకోవాలి. టోల్ గేట్ వద్దకు రాగానే, అక్కడి సెన్సార్లు ఆటోమేటిక్‌గా ఆ ట్యాగ్ నుంచి నిర్ధారిత రుసుమును మినహాయించుకుంటాయి. దీంతో ఆటోమేటిక్‌గా గేట్ తెరుచుకుని వాహనం ముందుకు వెళ్లేందుకు వీలు కలుగుతుంది. ఈ వ్యవస్థను దేశవ్యాప్తంగా ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో జాతీయ రహదారులపై అమలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తిగా సిద్ధంగా ఉన్నందున ఈ విధానాన్ని ముందు అనుకున్న సమయానికే అమలు చేయబోతున్నామని మూడ్రోజుల క్రితం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.
బ్యాంకులతో పాటు పేటీఎంలో కూడా...
ఫాస్టాగ్‌లను జాతీయ బ్యాంకులతోపాటు యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులతో పాటు పేటీఎం, అమెజాన్‌లలో అందుబాటులో ఉంచుతున్నారు. ఆయా వాహనాల కేటగిరీల ఆధారంగా వీటికి నిర్ధారిత రుసుములున్నాయి. కనిష్టంగా రూ. 100 నుంచి అవి ప్రారంభమవుతాయి. ట్యాగ్‌లో రుసుము అయిపోగానే మళ్లీ రీచార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. వాహన ఆర్సీ, ఫొటోతోపాటు ఆధార్/పాన్‌కార్డు/ఓటర్ ఐడీ కార్డు జిరాక్స్ ప్రతులను దాఖలు చేసి ట్యాగ్ పొందాల్సి ఉంటుంది.
అవగాహన వచ్చేవరకు పాత పద్ధతి కూడా..
కేంద్రం తెచ్చిన కొత్త విధా నాన్ని అమలు చేయబోతున్నా మని ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ తెలిపారు. మన రాష్ట్రంలో జాతీయ రహదారులపై ఉన్న 17 టోల్‌ప్లాజాల్లో దీన్ని అమలు చేయనున్నట్టు ఆయన వెల్లడిం చారు. డిసెంబర్ 1 నుంచి ఈ విధానం మొదలైనా, ప్రస్తుతం కొనసాగుతున్న రుసుము చెల్లింపు విధానం కూడా అమలులో ఉండనుంది. మ్యానువల్‌గా టోల్ వసూలు చేసే ప్రస్తుత పద్ధతికి కొన్ని వరసలు కేటాయించనున్నారు. ఫాస్టాగ్‌పై వాహనదారుల్లో అవగాహన వచ్చేవరకు వీటిని కొనసాగించనున్నారు. వీలైనంత తొందరలో వారిని కొత్తపద్ధతి వైపు మళ్లించనున్నారు. కొత్త విధానం అమల్లోకి వచ్చాక టోల్ రుసుమును అప్పటికప్పుడు చెల్లించేవారు ప్రస్తుతమున్న మొత్తం కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
స్టేట్ రోడ్లపై గందరగోళం
రాష్ట్రంలో జాతీయ రహదారులపై ఉన్న 17 టోల్‌ప్లాజాలు కాకుండా రాష్ట్ర రహదారులపై నాలుగున్నాయి. హైదరాబాద్–రామగుండం రాజీవ్ రహదారిపై దుద్దెడ, కొత్తపల్లి, రామగుండంల వద్ద ఒక్కోటి 6 లేన్లు చొప్పున మొత్తం 18 టోల్ వసూలు వరసలున్నాయి. ఇవి కాకుండా అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై తిప్పర్తి వద్ద 6 లేన్ల టోల్‌ప్లాజా ఉంది. వెరసి 24 లేన్ల టోల్ గేట్లలో ఈ పద్ధతి అమలుచేయటం గందరగోళంగా మారింది. దేశవ్యాప్తంగా అన్ని టోల్ బూత్‌లలో ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ విధానం ప్రారంభించాల్సి ఉన్నా, అందుకయ్యే వ్యయాన్ని ఎవరు భరించాల నే విషయంలో స్పష్టత రాక దాన్ని ఏర్పాటు చేయలేదు. ఈ టోల్ బూత్‌లలో ఒక్క లేన్‌కు మాత్రమే ఫాస్టాగ్ విధానాన్ని ఏర్పాటు చేయనున్నారు.
దీనికయ్యే వ్యయంలో 50 శాతాన్ని భరించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. కానీ మిగతా సగం, మిగిలిన లేన్లలో మొత్తం వ్యయాన్ని ఎవరు భరించాలన్నది గందరగోళంగా మారింది. రాష్ట్రప్రభుత్వం భరించాలా, కాంట్రాక్టర్ భరించాలా అన్న విషయంలో స్పష్టత రాలేదు. ఇప్పటివరకు కాంట్రాక్టర్లతో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో డిసెంబర్1 నుంచి రాష్ట్రప్రభుత్వం అధీనంలోని పీపీపీ రోడ్లపై ఉన్న టోల్‌గేట్ల వద్ద కొత్త విధానం అమలుపై స్పష్టత లేదు. ‘స్టేట్ రోడ్స్‌లోని టోల్ వసూలు కేంద్రాల వద్ద అయోమయం ఉంది. కొత్త విధానం డిసెంబర్ నుంచి అమలు చేయటం అనుమానంగానే ఉంది’అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment