electronic tolling tags
-
‘స్లో’ట్యాగ్!
ఇది హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న రాజధాని బస్సు. దానికి ఫాస్టాగ్ ఉంది. టోల్‌ప్లాజాలో అక్కడి సెన్సార్ దాన్ని స్కాన్ చేసి రుసుము డిడక్ట్ చేసుకుని క్షణాల వ్యవధిలో గేట్ తెరుచుకోవాల్సి ఉంది. కానీ సెన్సార్లు ఆ పని చేయకపోవటంతో టోల్‌ప్లాజా సిబ్బంది హ్యాండ్‌హెల్డ్ యంత్రం ద్వారా స్కాన్ చేసే ప్రయత్నం చేశారు. అయినా సాధ్యం కాకపోవటంతో ఆ యంత్రాన్ని డ్రైవర్ చేతికే ఇచ్చారు. ఆయన కాసేపు అటూఇటూ కదిలిస్తూ తిప్పలుపడితేగాని పని కాలేదు. ఇందుకు ఐదారు నిమిషాల సమయం తీసుకుంది. ఈలోపు వెనక వాహనాలు నిలిచిపోయాయి. ఇది ఈ ఒక్క బస్సుకు ఎదురైన సమస్య కాదు. దాదాపు అన్ని బస్సులది ఇదే సమస్య.. – సాక్షి, హైదరాబాద్ కొత్తగా ఓ పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే దాన్ని ఎలా వినియోగించుకోవాలో కూడా తెలియాలి. అందుకు కొంత నేర్పు, అవగాహన, శిక్షణ అవసరం. ఇవేవీ లేకుండా ఆ పరిజ్ఞానాన్ని వినియోగిస్తే కొత్త ఇబ్బందులు రావటమే కాకుండా అభాసుపాలు కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫాస్టాగ్ విషయంలో ఇదే జరుగుతోంది. పాత పద్ధతిలో నగదు చెల్లించి టోకెన్ తీసుకునేందుకు పట్టే సమయం కంటే, ఫాస్టాగ్ వచ్చాక ట్యాగ్ స్కానింగ్‌కు ఎక్కువ సమయం పట్టాల్సి రావటం విశేషం. ఆర్టీసీ బస్సులు, కొన్ని ఇతర ప్రైవేటు బస్సులు, లారీలకు ఈ సమస్య ఎక్కువగా ఉత్పన్నమవుతోంది. టోల్గేట్ల పైభాగంలో ఉండే స్కానర్లు వీటి ట్యాగ్‌లను స్కాన్ చేయలేకపోతున్నాయి. ఎక్కడ అతికించాలో తెలియదు.. కేంద్ర ఉపరితల రవాణాశాఖ గడువు విధించి మరీ ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అంతకు కొన్ని నెలల ముందు నుంచే ప్రయోగాత్మకంగా దాన్ని అమలు చేయటం కూడా ప్రారంభించింది. నగదు చెల్లించే వాహనాలకు సంబంధించి కేవలం ఒక్క లేన్ మాత్రమే అందుబాటులో ఉంచుతామని, మిగతావన్నీ ఫాస్టాగ్ అతికించిన వాహనాలకే కేటాయిస్తామని, ట్యాగ్ లేని వాహనాలు టోల్ చెల్లించేందుకు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంటుందంటూ ప్రకటనల రూపంలో ప్రచారం కూడా చేసింది. దీంతో వాహనదారులు హడావుడిగా ట్యాగ్ కొంటూ వచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ కొన్న ట్యాగ్‌ను వాహనానికి ఎక్కడ అతికించాలనే విషయంలో చాలామందికి అవగాహన లేకుండా పోయింది. ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది. కార్లతో పోలిస్తే పెద్ద వాహనాల్లో ఈ సమస్య ఏర్పడింది. ట్యాగ్‌ను తోచిన చోట అతికించటంతో స్కానర్లు దాన్ని గుర్తించటం లేదు. పెద్ద వాహనాలకు ఆ చోటనే.. లారీలు, బస్సులు లాంటి పెద్ద వాహనాలకు ఫాస్టాగ్‌ను ముందు వైపుండే ఎడమ అద్దానికి దిగువ భాగంలో డ్రైవర్ వైపు అతికించాలి. సెన్సార్లు గుర్తించే స్థలం ఇదే. ఆటోమేటిక్‌గా స్కాన్ చేసి గ్రీన్‌సిగ్నల్ చూపి గేట్‌ను ఓపెన్ చేస్తుంది. కానీ చాలామంది డ్రైవర్ ముందుండే అద్దం పైభాగంలో అతికిస్తున్నారు. ఫలితంగా సెన్సార్లు మొండికేస్తున్నాయి. ఇక కార్లకు అయితే అద్దంపై భాగంలో అతికించాలి. అక్కడ ఉంటేనే సెన్సార్లు గుర్తిస్తాయి. ఆర్టీసీ స్టిక్కర్లు పాతబడి.. ఇటు స్టిక్కర్లు తప్పుడు ప్రాంతాల్లో అతికించటం వల్ల ఏర్పడ్డ సమస్యకు తోడు ఆర్టీసీ బస్సుల్లో మరో ఇబ్బంది వచ్చిపడింది. ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు విధానం ప్రయోగాత్మకంగా ప్రారంభించిన 2017లోనే ఆర్టీసీ కొన్ని దూర ప్రాంత బస్సులకు ఫాస్టాగ్‌లు తీసుకుంది. ఇప్పుడు అవి పాతబడిపోయాయి. బస్సు అద్దాలను కడిగే సమయంలో చాలా ట్యాగ్లు స్వల్పంగా దెబ్బతింటూ వచ్చాయి. దీంతో సెన్సార్లు వాటిని గుర్తించటం లేదు. కొన్ని బస్సులకు ట్యాగ్ ఉండి కూడా డ్రైవర్లు నగదు చెల్లించి పాత పద్ధతిలో టోకెన్ తీసుకోవాల్సి వస్తోంది. సమస్యను గుర్తించాం.. ‘ఆర్టీసీ బస్సుల్లో ఎదురవుతున్న సమస్యను గుర్తించాం. తప్పుడు చోట్ల అతికించిన వాటిని తొలగించి సరైన స్థానంలో అతికించుకోవాలని ఆర్టీసీకి సూచించాం. దీంతోపాటు పాతబడ్డ ట్యాగ్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసుకోవాలని కూడా పేర్కొన్నాం. గతంలో ట్యాగ్ అతికించిన కొన్ని బస్సులు ఇతర డిపోలకు మారటంతో వాటికి అక్కడ కొత్త ట్యాగ్లు తీసుకున్నారు. ఇలా రెండు ఉండటం వల్ల కూడా సమస్య ఎదురవుతోంది. మిగతా బస్సులకు కూడా ట్యాగ్లు ఏర్పాటు చేసే విషయంలో సోమవారం బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ లోపాలపై చర్చించి ఆర్టీసీ అధికారులకు సూచనలు జారీ చేశాం..’ – ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ -
టోల్గేట్..ఇక నో లేట్!
కేంద్రం ఎప్పట్నుంచో ప్రకటిస్తూ వస్తున్నట్టుగా డిసెంబర్ 1 నుంచి ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ విధానం అమల్లోకి రాబోతోంది. డిసెంబర్ నుంచి దీన్ని కచ్చితంగా అమలు చేస్తామని ఇప్పటికే పలుమార్లు కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. అనుకున్నట్టుగానే గత పక్షం రోజులుగా ఆ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. అది సాఫీగా సాగుతుండటంతో దేశవ్యాప్తంగా అనుకున్న సమయానికి ప్రారంభించబోతున్నారు. అయితే, మ్యానువల్ పద్ధతి కూడా కొంతకాలం కొనసాగనుంది. టోకెన్ కావాలనుకునేవారు టోల్ ప్లాజాల్లో డబ్బులు చెల్లించి తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ జాప్యమవుతుండటంతో ‘ఫాస్టాగ్’ వైపు.. పండుగలు, పార్టీల సమావేశాలు ఇతర ముఖ్య సమయాల్లో టోల్గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ మేరకు ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ విధానానికి రూపకల్పన చేశారు. దీనికి సంబంధించి వాహనాలకు నిర్ధారిత రుసుము చెల్లిస్తే ఫాస్టాగ్ పేరుతో స్టిక్కర్ రూపంలో ఉండే ప్రత్యేక ట్యాగ్‌ను ఇస్తారు. దాన్ని కారు అద్దానికి అతికించుకోవాలి. టోల్ గేట్ వద్దకు రాగానే, అక్కడి సెన్సార్లు ఆటోమేటిక్‌గా ఆ ట్యాగ్ నుంచి నిర్ధారిత రుసుమును మినహాయించుకుంటాయి. దీంతో ఆటోమేటిక్‌గా గేట్ తెరుచుకుని వాహనం ముందుకు వెళ్లేందుకు వీలు కలుగుతుంది. ఈ వ్యవస్థను దేశవ్యాప్తంగా ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో జాతీయ రహదారులపై అమలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తిగా సిద్ధంగా ఉన్నందున ఈ విధానాన్ని ముందు అనుకున్న సమయానికే అమలు చేయబోతున్నామని మూడ్రోజుల క్రితం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. బ్యాంకులతో పాటు పేటీఎంలో కూడా... ఫాస్టాగ్‌లను జాతీయ బ్యాంకులతోపాటు యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులతో పాటు పేటీఎం, అమెజాన్‌లలో అందుబాటులో ఉంచుతున్నారు. ఆయా వాహనాల కేటగిరీల ఆధారంగా వీటికి నిర్ధారిత రుసుములున్నాయి. కనిష్టంగా రూ. 100 నుంచి అవి ప్రారంభమవుతాయి. ట్యాగ్‌లో రుసుము అయిపోగానే మళ్లీ రీచార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. వాహన ఆర్సీ, ఫొటోతోపాటు ఆధార్/పాన్‌కార్డు/ఓటర్ ఐడీ కార్డు జిరాక్స్ ప్రతులను దాఖలు చేసి ట్యాగ్ పొందాల్సి ఉంటుంది. అవగాహన వచ్చేవరకు పాత పద్ధతి కూడా.. కేంద్రం తెచ్చిన కొత్త విధా నాన్ని అమలు చేయబోతున్నా మని ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ తెలిపారు. మన రాష్ట్రంలో జాతీయ రహదారులపై ఉన్న 17 టోల్‌ప్లాజాల్లో దీన్ని అమలు చేయనున్నట్టు ఆయన వెల్లడిం చారు. డిసెంబర్ 1 నుంచి ఈ విధానం మొదలైనా, ప్రస్తుతం కొనసాగుతున్న రుసుము చెల్లింపు విధానం కూడా అమలులో ఉండనుంది. మ్యానువల్‌గా టోల్ వసూలు చేసే ప్రస్తుత పద్ధతికి కొన్ని వరసలు కేటాయించనున్నారు. ఫాస్టాగ్‌పై వాహనదారుల్లో అవగాహన వచ్చేవరకు వీటిని కొనసాగించనున్నారు. వీలైనంత తొందరలో వారిని కొత్తపద్ధతి వైపు మళ్లించనున్నారు. కొత్త విధానం అమల్లోకి వచ్చాక టోల్ రుసుమును అప్పటికప్పుడు చెల్లించేవారు ప్రస్తుతమున్న మొత్తం కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. స్టేట్ రోడ్లపై గందరగోళం రాష్ట్రంలో జాతీయ రహదారులపై ఉన్న 17 టోల్‌ప్లాజాలు కాకుండా రాష్ట్ర రహదారులపై నాలుగున్నాయి. హైదరాబాద్–రామగుండం రాజీవ్ రహదారిపై దుద్దెడ, కొత్తపల్లి, రామగుండంల వద్ద ఒక్కోటి 6 లేన్లు చొప్పున మొత్తం 18 టోల్ వసూలు వరసలున్నాయి. ఇవి కాకుండా అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై తిప్పర్తి వద్ద 6 లేన్ల టోల్‌ప్లాజా ఉంది. వెరసి 24 లేన్ల టోల్ గేట్లలో ఈ పద్ధతి అమలుచేయటం గందరగోళంగా మారింది. దేశవ్యాప్తంగా అన్ని టోల్ బూత్‌లలో ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ విధానం ప్రారంభించాల్సి ఉన్నా, అందుకయ్యే వ్యయాన్ని ఎవరు భరించాల నే విషయంలో స్పష్టత రాక దాన్ని ఏర్పాటు చేయలేదు. ఈ టోల్ బూత్‌లలో ఒక్క లేన్‌కు మాత్రమే ఫాస్టాగ్ విధానాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికయ్యే వ్యయంలో 50 శాతాన్ని భరించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. కానీ మిగతా సగం, మిగిలిన లేన్లలో మొత్తం వ్యయాన్ని ఎవరు భరించాలన్నది గందరగోళంగా మారింది. రాష్ట్రప్రభుత్వం భరించాలా, కాంట్రాక్టర్ భరించాలా అన్న విషయంలో స్పష్టత రాలేదు. ఇప్పటివరకు కాంట్రాక్టర్లతో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో డిసెంబర్1 నుంచి రాష్ట్రప్రభుత్వం అధీనంలోని పీపీపీ రోడ్లపై ఉన్న టోల్గేట్ల వద్ద కొత్త విధానం అమలుపై స్పష్టత లేదు. ‘స్టేట్ రోడ్స్‌లోని టోల్ వసూలు కేంద్రాల వద్ద అయోమయం ఉంది. కొత్త విధానం డిసెంబర్ నుంచి అమలు చేయటం అనుమానంగానే ఉంది’అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. -
10 లక్షల ఈ–టోల్ ట్యాగ్స్ జారీ లక్ష్యం: ఎస్బీఐ
హైదరాబాద్: ప్రభుత్వ రంగ దిగ్గజ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి (2018, మార్చికి) 10 లక్షల ఎలక్ట్రానిక్ టోలింగ్ ట్యాగ్స్‌ను జారీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఎలక్ట్రానిక్ టోలింగ్ ట్యాగ్స్‌ను ఫాస్టాగ్‌లుగా పరిగణిస్తాం. వాహనదారులు నేషనల్ హైవేలపై వెళ్లేటప్పుడు టోల్ ప్లాజాల వద్ద ఆగి, గేట్ కట్టే ప్రక్రియను సులభతరం చేయడం కోసం ఫాస్టాగ్‌లను తీసుకువచ్చామని బ్యాంక్ తెలిపింది. ఇప్పటిదాకా 80,000 ఎలక్ట్రానిక్ ట్యాగ్‌లను ఇష్యూ చేశామని, ఈ సంఖ్యను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరకు పది లక్షలకు తీసుకెళ్లడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఎస్బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, సీవోవో నీరజ్ వ్యాస్ తెలిపారు. ఈయన ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఎస్బీఐ ఫాస్టాగ్‌లను ఆవిష్కరించారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఎస్బీఐ (తెలంగాణ సర్కిల్) సీజీఎం హర్దయాళ్ ప్రసాద్ మాట్లాడుతూ.. తమ పరిధిలోని సర్కిల్లో ఇప్పటిదాకా 6,300 ఎలక్ట్రానిక్ ట్యాగ్స్‌ను ఇష్యూ చేశామని, ఈ సంఖ్యను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరకు 50,000లకు తీసుకెళ్తామని వివరించారు. ఫాస్టాగ్స్ విధానం....: రేడియో ఫ్రిక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ(ఆర్ఎఫ్ఐడీ) ఆధారంగా ఫాస్టాగ్‌లను రూపొందిస్తారు. వీటిని వాహన అద్దంపై అతికించుకుంటే చాలు.. వాహనదారులు టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన పనిలేదు. గేట్ చార్జీలు ఎలక్ట్రానిక్ విధానంలో ఆటోమేటిక్‌గా డిడక్ట్ అవుతాయి. ఈ ట్యాగ్స్‌ను తర్వాత డబ్బులతో నింపుకోవచ్చు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) 2016 ఏప్రిల్‌లో ఫాస్టాగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న 360కుపైగా టోల్ ప్లాజాల వద్ద ఈ ఫాస్టాగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి.