10 లక్షల ఈ–టోల్ ట్యాగ్స్ జారీ లక్ష్యం: ఎస్‌బీఐ
హైదరాబాద్: ప్రభుత్వ రంగ దిగ్గజ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి (2018, మార్చికి) 10 లక్షల ఎలక్ట్రానిక్ టోలింగ్ ట్యాగ్స్‌ను జారీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఎలక్ట్రానిక్ టోలింగ్ ట్యాగ్స్‌ను ఫాస్టాగ్‌లుగా పరిగణిస్తాం. వాహనదారులు నేషనల్ హైవేలపై వెళ్లేటప్పుడు టోల్ ప్లాజాల వద్ద ఆగి, గేట్ కట్టే ప్రక్రియను సులభతరం చేయడం కోసం ఫాస్టాగ్‌లను తీసుకువచ్చామని బ్యాంక్ తెలిపింది.
ఇప్పటిదాకా 80,000 ఎలక్ట్రానిక్ ట్యాగ్‌లను ఇష్యూ చేశామని, ఈ సంఖ్యను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరకు పది లక్షలకు తీసుకెళ్లడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, సీవోవో నీరజ్ వ్యాస్ తెలిపారు. ఈయన ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఎస్‌బీఐ ఫాస్టాగ్‌లను ఆవిష్కరించారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఎస్‌బీఐ (తెలంగాణ సర్కిల్) సీజీఎం హర్‌దయాళ్ ప్రసాద్ మాట్లాడుతూ.. తమ పరిధిలోని సర్కిల్‌లో ఇప్పటిదాకా 6,300 ఎలక్ట్రానిక్ ట్యాగ్స్‌ను ఇష్యూ చేశామని, ఈ సంఖ్యను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరకు 50,000లకు తీసుకెళ్తామని వివరించారు.
ఫాస్టాగ్స్ విధానం....: రేడియో ఫ్రిక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ(ఆర్‌ఎఫ్‌ఐడీ) ఆధారంగా ఫాస్టాగ్‌లను రూపొందిస్తారు. వీటిని వాహన అద్దంపై అతికించుకుంటే చాలు.. వాహనదారులు టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన పనిలేదు. గేట్ చార్జీలు ఎలక్ట్రానిక్ విధానంలో ఆటోమేటిక్‌గా డిడక్ట్ అవుతాయి. ఈ ట్యాగ్స్‌ను తర్వాత డబ్బులతో నింపుకోవచ్చు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) 2016 ఏప్రిల్‌లో ఫాస్టాగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న 360కుపైగా టోల్ ప్లాజాల వద్ద ఈ ఫాస్టాగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి.