హెచ్‌ఎండీఏకు కాలం చెల్లినట్టేనా? | Durgam Cheruvu to be made sewerage free soon | Sakshi
Sakshi News home page

హెచ్‌ఎండీఏకు కాలం చెల్లినట్టేనా?

Published Wed, Dec 31 2014 2:07 AM | Last Updated on Sat, Sep 2 2017 6:59 PM

హెచ్‌ఎండీఏకు కాలం చెల్లినట్టేనా?

హెచ్‌ఎండీఏకు కాలం చెల్లినట్టేనా?

కార్యకలాపాలు లేక స్తబ్ధత
విలీనం దిశగా సర్కార్ యోచన?
సాధ్యాసాధ్యాలపై ఉన్నతస్థాయిలో సమాలోచనలు
నూతన వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గు
రద్దు చేయడం ఆషామాషీ కాదంటున్న నిపుణులు

 సాక్షి, సిటీబ్యూరో: రాజకీయ అవసరాలు, భవిష్యత్ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు మంగళం పాడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు కాగానే మహా నగరాభివృద్ధికి సంబంధించి ఎజెండా పూర్తిగా మారి పోయింది. గత పరిపాలన అవశేషంగా ఉన్న హెచ్‌ఎండీఏను వదిలించుకొని తమ లక్ష్యాలకు అనుగుణంగా సరికొత్త వ్యవస్థ ద్వారా అభివృద్ధిలో ముందడుగు వేయాలని కొత్త ప్రభుత్వం భావిస్తోంది.

ఈ క్రమంలోనే హెచ్‌ఎండీఏను రద్దు చేసి అందులోని కీలక విభాగాలను వివిధ ప్రభుత్వ శాఖల్లో విలీనం చేయాలన్న ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫైల్ కూడా ప్రస్తుతం జీఏడీలో కదిలిందన్న పుకార్లు గుప్పుమంటున్నాయి.  ప్రధానంగా హెచ్‌ఎండీఏలో కీలకంగా ఉన్న ప్లానింగ్ విభాగాన్ని డీటీసీపీలో,  ఇంజినీరింగ్ విభాగాన్ని ఆర్ అండ్ బి/ఇరిగేషన్ విభాగాల్లో, అర్బన్ ఫారెస్ట్రీని స్టేట్ ఫారెస్ట్ విభాగంలో, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్‌ను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలన్న దిశగా ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

హెచ్‌ఎండీఏ ప్రధా న భూమిక పోషిస్తోన్న లేఅవుట్లు, బహుళ అంతస్తు భవనాల అనుమతి, ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్లు, భూ వినియోగ మార్పిడి, కొత్త పరిశ్రమలు తదితరాల అనుమతులను ఇకపై డెరైక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ (డీటీసీపీ) విభాగం నుంచి అందించాలని సర్కార్ యోచిస్తున్నట్టు సమాచారం. ఈ కారణంగానే హెచ్‌ఎండీఏకు రెగ్యులర్ కమిషనర్‌ను నియమించలేదని, కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులు కూడా అప్పగించలేదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఇదే విషయమై సచివాలయం స్థాయిలో కూడా చర్చ జరుగుతుండటంతో హెచ్‌ఎండీఏను ఇతర విభాగాల్లో విలీనం చేస్తారన్న వదంతులకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
 
రద్దు సాధ్యమయ్యేనా..?
దేశంలో ఇప్పటివరకు ఏ డెవలప్‌మెంట్ అథారిటీకి ప్రత్యేకంగాా చట్టం లేదు. అయితే... హెచ్‌ఎండీఏకు మాత్రం 2008లో ప్రత్యేకంగా చట్టం చేసి అమల్లోకి తెచ్చారు. మొత్తం 5 జిల్లాల్లోని 849 గ్రామాలను కలుపుకొని 7257 చ.కి.మీటర్ల పరిధిలో విస్తరించిన హెచ్‌ఎండీఏ అంటే... రీజనల్ డెవలప్‌మెంట్ అథారిటీగా ప్రత్యేక గుర్తింపు పొందింది. దేశంలోని మాస్టర్‌ప్లాన్‌లలో ఇది అతిపెద్దది. ఇందులో అభివృద్ధి కార్యకలాపాల నిర్వహణకు ప్రత్యేకంగా ఓ వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవహారాలు నిర్వహిస్తున్న హెచ్‌ఎండీఏను రద్దు చేసినా... అదే స్థాయిలో పేరు మార్పుతో మరో వ్యవస్థను ఏర్పాటు చేయడం తప్ప మరో మార్గం ఉండదు.
     
అసెంబ్లీలో ప్రత్యేకంగా చట్టం చేసి అమల్లోకి తెచ్చిన ‘హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ యాక్ట్-2008’ని రద్దు చేయాలంటే తిరిగి అసెంబ్లీలోనే ఈ అంశాన్ని ప్రవేశపెట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అన్ని పార్టీలు సుముఖత తెలిపాకే చట్టం రద్దవుతుంది. అయితే... ఇది అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు.
     
అర్బన్ ప్లాన్ డెవలప్‌మెంట్ యాక్ట్-1975 కింద హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) ఏర్పాటైంది. ఆ తర్వాత ‘హుడా’ పరిధిని 5 జిల్లాలకు విస్తరిస్తూ 2008లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ)ని అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాని పరిధిలో ఏ అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టాలన్నా హెచ్‌ఎండీఏ అనుమతి తప్పనిసరి చేసింది. దీని అధికారాల్లో కొన్నింటిని స్థానిక సంస్థలైన జీహెచ్‌ఎంసీ, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామపంచాయతీలకు బదలాయించింది. హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌కు లోబడే అనుమతులు ఇస్తున్నారు. ఇంతటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న హెచ్‌ఎండీఏను ఇప్పుడు ఇతర శాఖల్లో విలీనం చేయడం సాధ్యం కాదన్న వాదనలు బలంగా విన్పిస్తున్నాయి.
     
భవిష్యత్‌లో హెచ్‌ఎండీఏ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే ప్రమాదం ఉందన్న అనుమానంతో ప్రభుత్వం ఈ వ్యవస్థను నిర్వీర్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
     
ఐదు జిల్లాల్లో 7257 చ.కి.మీటర్ల మేర విస్తరించిన హెచ్‌ఎండీఏను ఇప్పుడు 625 చ.కి.మీటర్ల పరిధిలోని జీహెచ్‌ఎంసీలో కలపడమంటే సముద్రాన్ని... నదిలో కలిపినట్లుగా ఉంటుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెచ్‌ఎండీఏ రద్దుకు సర్కార్ నిర్ణయం తీసుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు హెచ్‌ఎండీఏ సిబ్బంది సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement