administrative staff
-
AP: సరికొత్త పాలనకు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: చరిత్రాత్మకంగా ఏర్పాటైన కొత్త జిల్లాల్లో నేటి నుంచి కార్యకలాపాలు సాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. సోమవారం ఉదయం 9.05 గంటలకు 26 జిల్లాల కలెక్టర్లు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత మిగిలిన శాఖల జిల్లా అధికారులు బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత జిల్లా కేంద్రాలు, కొత్త జిల్లా కేంద్రాలకు కేటాయించిన ఉద్యోగులకు ఇప్పటికే ఆర్డర్ టు సెర్వ్ ఉత్తర్వులు జారీ చేయడంతో వారు కూడా నేటి ఉదయం విధుల్లో చేరనున్నారు. 9.45 గంటలలోపు అధికారులు, ఉద్యోగులు కొత్త జిల్లా కేంద్రాల్లో విధుల్లోకి రానున్నారు. ఇందుకోసం పాత జిల్లా కేంద్రాలు, కొత్తగా ఏర్పడుతున్న 13 జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాలు, కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయాలు, ఇతర జిల్లా కార్యాలయాలు ముస్తాబయ్యాయి. 70% కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేని చోట మాత్రమే ప్రైవేట్ భవనాలు ఎంపిక చేశారు. విజయవాడలో సిద్ధమైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్. అనకాపల్లి, పశ్చిమగోదావరి జిల్లా కేంద్రాలైన అనకాపల్లి, భీమవరంలో ప్రభుత్వ భవనాలు ఒక్కటీ అందుబాటులో లేకపోవడంతో అక్కడ కలెక్టరేట్ సహా అన్నింటినీ ప్రైవేటు భవనాల్లో ఏర్పాటు చేస్తున్నారు. పుట్టపర్తి కేంద్రంగా ఏర్పాటవుతున్న సత్యసాయి జిల్లాలో ఎస్పీ క్యాంపు కార్యాలయం మినహా మిగిలిన ముఖ్య కార్యాలయాలు సత్యసాయి ట్రస్ట్ భవనాల్లో పెడుతున్నారు. రాయచోటి కేంద్రంగా ఏర్పాటు కాబోతున్న అన్నమయ్య జిల్లాలోనూ ఎక్కువగా ప్రైవేటు భవనాలనే ఎంపిక చేశారు. నరసరావుపేట కేంద్రంగా ఏర్పాటు కానున్న పల్నాడు, తిరుపతి కేంద్రంగా ఏర్పాటవుతున్న బాలాజీ, నంద్యాల కేంద్రంగా ఉండే నంద్యాల, పార్వతీపురం కేంద్రంగా ఏర్పడుతున్న పార్వతీపురం మన్యం, రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటయ్యే తూర్పుగోదావరి, విజయవాడ కేంద్రంగా ఏర్పడుతున్న ఎన్టీఆర్ జిల్లాల్లో పూర్తిగా ప్రభుత్వ భవనాల్లోనే ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. కొత్త రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో రెండు, మూడు చోట్ల తప్ప ఆర్డీవో కార్యాలయాలన్నింటికీ ప్రభుత్వ భవనాలే ఎంపిక చేశారు. ఈ కార్యాలయాల్లో అవసరమైన సివిల్, విద్యుత్ మరమ్మతు పనులు పూర్తవడంతోపాటు ఫర్నిచర్ సమకూర్చారు. విజయవాడలో సిద్ధమైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్. కార్యాలయంలోని కలెక్టర్ చాంబర్ కార్లు, ఫర్నీచర్ విభజన పూర్తి ప్రస్తుత జిల్లా కేంద్రంలో ఉన్న కార్లు, ఇతర వాహనాలు, ఫర్నిచర్, స్టోరేజి ర్యాకుల విభజన చాలా వరకు పూర్తయింది. ప్రస్తుతం ఉన్న జిల్లాలకు అవసరమైన వాటిని అక్కడే ఉంచి మిగిలిన వాటిని కొత్తగా ఏర్పడుతున్న జిల్లాలకు ఇచ్చారు. ఆ జిల్లాలకు అవి చాలకపోతే, అవసరమైన మేరకు కొత్తగా సమకూర్చుకుంటున్నారు. కంప్యూటర్లు, ఇతర విడిభాగాలు, వీడియో కాన్ఫరెన్స్ ఎక్విప్మెంట్.. తదితర వాటి విభజన కూడా పూర్తయింది. పునర్వ్యవస్థీకరణను బట్టి జిల్లాల్లో ఫైళ్ల విభజన వేగంగా జరుగుతోంది. కొత్త జిల్లాల పరిధిలోకి వచ్చే రెవెన్యూ డివిజన్లు, మండలాలను బట్టి ఈ విభజన చేస్తున్నారు. ఇటీవల ఎక్కువగా ఈ–ఫైల్స్ వ్యవస్థ నడుస్తుండడంతో ఈ పనికి పెద్దగా ఇబ్బంది లేదని చెబుతున్నారు. -
హెచ్ఎండీఏకు కాలం చెల్లినట్టేనా?
⇒ కార్యకలాపాలు లేక స్తబ్ధత ⇒ విలీనం దిశగా సర్కార్ యోచన? ⇒ సాధ్యాసాధ్యాలపై ఉన్నతస్థాయిలో సమాలోచనలు ⇒ నూతన వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గు ⇒ రద్దు చేయడం ఆషామాషీ కాదంటున్న నిపుణులు సాక్షి, సిటీబ్యూరో: రాజకీయ అవసరాలు, భవిష్యత్ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు మంగళం పాడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు కాగానే మహా నగరాభివృద్ధికి సంబంధించి ఎజెండా పూర్తిగా మారి పోయింది. గత పరిపాలన అవశేషంగా ఉన్న హెచ్ఎండీఏను వదిలించుకొని తమ లక్ష్యాలకు అనుగుణంగా సరికొత్త వ్యవస్థ ద్వారా అభివృద్ధిలో ముందడుగు వేయాలని కొత్త ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే హెచ్ఎండీఏను రద్దు చేసి అందులోని కీలక విభాగాలను వివిధ ప్రభుత్వ శాఖల్లో విలీనం చేయాలన్న ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫైల్ కూడా ప్రస్తుతం జీఏడీలో కదిలిందన్న పుకార్లు గుప్పుమంటున్నాయి. ప్రధానంగా హెచ్ఎండీఏలో కీలకంగా ఉన్న ప్లానింగ్ విభాగాన్ని డీటీసీపీలో, ఇంజినీరింగ్ విభాగాన్ని ఆర్ అండ్ బి/ఇరిగేషన్ విభాగాల్లో, అర్బన్ ఫారెస్ట్రీని స్టేట్ ఫారెస్ట్ విభాగంలో, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న దిశగా ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. హెచ్ఎండీఏ ప్రధా న భూమిక పోషిస్తోన్న లేఅవుట్లు, బహుళ అంతస్తు భవనాల అనుమతి, ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్లు, భూ వినియోగ మార్పిడి, కొత్త పరిశ్రమలు తదితరాల అనుమతులను ఇకపై డెరైక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ (డీటీసీపీ) విభాగం నుంచి అందించాలని సర్కార్ యోచిస్తున్నట్టు సమాచారం. ఈ కారణంగానే హెచ్ఎండీఏకు రెగ్యులర్ కమిషనర్‌ను నియమించలేదని, కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులు కూడా అప్పగించలేదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఇదే విషయమై సచివాలయం స్థాయిలో కూడా చర్చ జరుగుతుండటంతో హెచ్ఎండీఏను ఇతర విభాగాల్లో విలీనం చేస్తారన్న వదంతులకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. రద్దు సాధ్యమయ్యేనా..? దేశంలో ఇప్పటివరకు ఏ డెవలప్మెంట్ అథారిటీకి ప్రత్యేకంగాా చట్టం లేదు. అయితే... హెచ్ఎండీఏకు మాత్రం 2008లో ప్రత్యేకంగా చట్టం చేసి అమల్లోకి తెచ్చారు. మొత్తం 5 జిల్లాల్లోని 849 గ్రామాలను కలుపుకొని 7257 చ.కి.మీటర్ల పరిధిలో విస్తరించిన హెచ్ఎండీఏ అంటే... రీజనల్ డెవలప్మెంట్ అథారిటీగా ప్రత్యేక గుర్తింపు పొందింది. దేశంలోని మాస్టర్ప్లాన్లలో ఇది అతిపెద్దది. ఇందులో అభివృద్ధి కార్యకలాపాల నిర్వహణకు ప్రత్యేకంగా ఓ వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవహారాలు నిర్వహిస్తున్న హెచ్ఎండీఏను రద్దు చేసినా... అదే స్థాయిలో పేరు మార్పుతో మరో వ్యవస్థను ఏర్పాటు చేయడం తప్ప మరో మార్గం ఉండదు. అసెంబ్లీలో ప్రత్యేకంగా చట్టం చేసి అమల్లోకి తెచ్చిన ‘హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ యాక్ట్-2008’ని రద్దు చేయాలంటే తిరిగి అసెంబ్లీలోనే ఈ అంశాన్ని ప్రవేశపెట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అన్ని పార్టీలు సుముఖత తెలిపాకే చట్టం రద్దవుతుంది. అయితే... ఇది అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. అర్బన్ ప్లాన్ డెవలప్మెంట్ యాక్ట్-1975 కింద హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (హుడా) ఏర్పాటైంది. ఆ తర్వాత ‘హుడా’ పరిధిని 5 జిల్లాలకు విస్తరిస్తూ 2008లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)ని అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాని పరిధిలో ఏ అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టాలన్నా హెచ్ఎండీఏ అనుమతి తప్పనిసరి చేసింది. దీని అధికారాల్లో కొన్నింటిని స్థానిక సంస్థలైన జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామపంచాయతీలకు బదలాయించింది. హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌కు లోబడే అనుమతులు ఇస్తున్నారు. ఇంతటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న హెచ్ఎండీఏను ఇప్పుడు ఇతర శాఖల్లో విలీనం చేయడం సాధ్యం కాదన్న వాదనలు బలంగా విన్పిస్తున్నాయి. భవిష్యత్‌లో హెచ్ఎండీఏ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే ప్రమాదం ఉందన్న అనుమానంతో ప్రభుత్వం ఈ వ్యవస్థను నిర్వీర్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐదు జిల్లాల్లో 7257 చ.కి.మీటర్ల మేర విస్తరించిన హెచ్ఎండీఏను ఇప్పుడు 625 చ.కి.మీటర్ల పరిధిలోని జీహెచ్ఎంసీలో కలపడమంటే సముద్రాన్ని... నదిలో కలిపినట్లుగా ఉంటుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెచ్ఎండీఏ రద్దుకు సర్కార్ నిర్ణయం తీసుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు హెచ్ఎండీఏ సిబ్బంది సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. -
నో కెమెరా...నో సెల్‌ఫోన్
- `ఐపీఎల్‌కు భద్రత కట్టుదిట్టం - పార్కింగ్ వివరాల ప్రకటన ఉప్పల్, న్యూస్‌లైన్: ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు వచ్చే ప్రేక్షకులకు గతంలోలాగే కట్టుదిట్టమైన నిబంధనలు విధించారు. ఈ సారి కూడా సెల్ఫోన్లు, కెమెరాలు, ల్యాప్‌టాప్‌లు, తినుబండారాలు, వాటర్ బాటిళ్లను మైదానంలోకి అనుమతించబోమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగే నాలుగు ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఆయన, శనివారం మీడియా సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. ఆనంద్‌తో పాటు సైబరాబాద్ సంయుక్త కమిషనర్ వై. గంగాధర్, ట్రాఫిక్ డీసీపీ అవినాశ్ మహంతి, డీపీసీ కేకే రావు, మల్కాజ్గిరి ఏసీపీ చెన్నయ్య కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ నెల 12, 14, 18, 20 తేదీలలో ఉప్పల్‌లో మ్యాచ్‌లు జరగనున్నాయి. భారీ సంఖ్యలో పోలీసు సిబ్బంది ప్రతీ మ్యాచ్‌కు ప్రేక్షకులు, నిర్వాహక సిబ్బంది కలిపి దాదాపు 35 వేల మంది వరకు మైదానంలో ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో... ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకున్నా అన్ని రకాలుగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసినట్లు ఆనంద్ చెప్పారు. ఐపీఎల్ కోసం లా అండ్ ఆర్డర్, ఆర్మ్డ్ ఫోర్సెస్, ఎస్బీ, సీసీఎస్, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ట్రాఫిక్ అధికారులు కలిపి దాదాపు 1500 మంది భద్రతా సిబ్బంది ఉంటారని కమిషనర్ వివరించారు. స్టేడియం లోపల, బయట కలిపి 58 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ప్రేక్షకులకు సహాయకారిగా ఉండేందుకు అన్ని విభాగాలతో కలిపి ఈ సారి జాయింట్ కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. వాహనాల మళ్లింపు మ్యాచ్ జరిగే రోజుల్లో స్టేడియం వైపు ఎలాంటి భారీ వాహనాలను అనుమతించరు. ఘట్కేసర్నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు అక్కడినుంచే కీసర వైపు దారి మళ్లిస్తారు. ఎల్బీ నగర్‌నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. అదే విధంగా సికింద్రాబాద్, నాచారంనుంచి వచ్చే వాహనాలను ఈసీఐఎల్ మీదుగా మళ్లిస్తారు. మ్యాచ్ రోజున ఉప్పల్ ఏక్ మినార్ మజీద్ వైపునుంచి రామంతాపూర్ వైపు ఏ రకమైన వాహనాలనూ అనుమతించరు. స్టేడియంలో విక్రేతలు ఎక్కువ ధరలకు అమ్మకుండా నిఘా ఉంచేందుకు ఈ సారి ప్రత్యేక టీమ్‌ను కూడా సిద్ధం చేశారు. పార్కింగ్ వివరాలు... కారు పాస్ ఉన్నవారికి గేట్ నం. 1, 2లనుంచి ప్రవేశం లభిస్తుంది. గేట్ నం. 3, 4, 5, 6, 7 నుంచి వెళ్లేవారు తమ కార్లను ఏపీఐఐసీ గ్రౌండ్స్‌లో, ద్విచక్ర వాహనాలను జెన్‌ప్యాక్ సర్వీస్ రోడ్డు, హబ్సిగూడనుంచి ఉప్పల్ వెళ్లే దారిలో పార్క్ చేసుకోవచ్చు. గేట్ నం. 11 నుంచి వెళ్లే ప్రేక్షకులకు ఉప్పల్ విద్యుత్ కార్యాలయం వద్ద. గేట్ నం. 8, 9, 10 ప్రేక్షకులు ద్విచక్ర వాహనాలు ఉప్పల్‌నుంచి రామంతాపూర్ రహదారి, హబ్సిగూడనుంచి ఉప్పల్ వెళ్లే రోడ్డులో పార్కింగ్ చేసుకోవచ్చు. ఫోర్ వీలర్స్ వారు రామంతపూర్నుంచి ఉప్పల్ రోడ్డులో పార్కింగ్ చేయవచ్చు. కార్పొరేట్ బాక్స్ గెస్ట్‌లు స్టేడియం పక్కన పెంగ్విన్ గ్రౌండ్లో, సిబ్బంది ఎన్జీఆర్ఐ గ్రౌండ్ గేట్ నం. 3లో తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవచ్చు