నో కెమెరా...నో సెల్‌ఫోన్ | no camera... no cellphones in ipl matches | Sakshi
Sakshi News home page

నో కెమెరా...నో సెల్‌ఫోన్

Published Sun, May 11 2014 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 7:11 AM

నో కెమెరా...నో సెల్‌ఫోన్

నో కెమెరా...నో సెల్‌ఫోన్

- `ఐపీఎల్‌కు భద్రత కట్టుదిట్టం
- పార్కింగ్ వివరాల ప్రకటన

 
 ఉప్పల్, న్యూస్‌లైన్: ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు వచ్చే ప్రేక్షకులకు గతంలోలాగే కట్టుదిట్టమైన నిబంధనలు విధించారు. ఈ సారి కూడా సెల్‌ఫోన్‌లు, కెమెరాలు, ల్యాప్‌టాప్‌లు, తినుబండారాలు, వాటర్ బాటిళ్లను మైదానంలోకి అనుమతించబోమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగే నాలుగు ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఆయన, శనివారం మీడియా సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. ఆనంద్‌తో పాటు సైబరాబాద్ సంయుక్త కమిషనర్ వై. గంగాధర్, ట్రాఫిక్ డీసీపీ అవినాశ్ మహంతి, డీపీసీ కేకే రావు, మల్కాజ్‌గిరి ఏసీపీ చెన్నయ్య కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ నెల 12, 14, 18, 20 తేదీలలో ఉప్పల్‌లో మ్యాచ్‌లు జరగనున్నాయి.
 
భారీ సంఖ్యలో పోలీసు సిబ్బంది
ప్రతీ మ్యాచ్‌కు ప్రేక్షకులు, నిర్వాహక సిబ్బంది కలిపి దాదాపు 35 వేల మంది వరకు మైదానంలో ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో... ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకున్నా అన్ని రకాలుగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసినట్లు ఆనంద్ చెప్పారు. ఐపీఎల్ కోసం లా అండ్ ఆర్డర్, ఆర్మ్‌డ్ ఫోర్సెస్, ఎస్‌బీ, సీసీఎస్, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ట్రాఫిక్ అధికారులు కలిపి దాదాపు 1500 మంది భద్రతా సిబ్బంది ఉంటారని కమిషనర్ వివరించారు. స్టేడియం లోపల, బయట కలిపి 58 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ప్రేక్షకులకు సహాయకారిగా ఉండేందుకు అన్ని విభాగాలతో కలిపి ఈ సారి జాయింట్ కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు.

వాహనాల మళ్లింపు
మ్యాచ్ జరిగే రోజుల్లో స్టేడియం వైపు ఎలాంటి భారీ వాహనాలను అనుమతించరు. ఘట్‌కేసర్‌నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు అక్కడినుంచే కీసర వైపు దారి మళ్లిస్తారు. ఎల్బీ నగర్‌నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. అదే విధంగా సికింద్రాబాద్, నాచారంనుంచి వచ్చే వాహనాలను ఈసీఐఎల్ మీదుగా మళ్లిస్తారు. మ్యాచ్ రోజున ఉప్పల్ ఏక్ మినార్ మజీద్ వైపునుంచి రామంతాపూర్ వైపు ఏ రకమైన వాహనాలనూ అనుమతించరు. స్టేడియంలో విక్రేతలు ఎక్కువ ధరలకు అమ్మకుండా నిఘా ఉంచేందుకు ఈ సారి ప్రత్యేక టీమ్‌ను కూడా సిద్ధం చేశారు.
 
పార్కింగ్ వివరాలు...
కారు పాస్ ఉన్నవారికి గేట్ నం. 1, 2లనుంచి ప్రవేశం లభిస్తుంది.
గేట్ నం. 3, 4, 5, 6, 7 నుంచి వెళ్లేవారు తమ కార్లను ఏపీఐఐసీ గ్రౌండ్స్‌లో, ద్విచక్ర వాహనాలను జెన్‌ప్యాక్ సర్వీస్ రోడ్డు, హబ్సిగూడనుంచి ఉప్పల్ వెళ్లే దారిలో పార్క్ చేసుకోవచ్చు.
గేట్ నం. 11 నుంచి వెళ్లే ప్రేక్షకులకు ఉప్పల్ విద్యుత్ కార్యాలయం వద్ద.
గేట్ నం. 8, 9, 10 ప్రేక్షకులు ద్విచక్ర వాహనాలు ఉప్పల్‌నుంచి రామంతాపూర్ రహదారి, హబ్సిగూడనుంచి ఉప్పల్ వెళ్లే రోడ్డులో పార్కింగ్ చేసుకోవచ్చు. ఫోర్ వీలర్స్ వారు రామంతపూర్‌నుంచి ఉప్పల్ రోడ్డులో పార్కింగ్ చేయవచ్చు.
కార్పొరేట్ బాక్స్ గెస్ట్‌లు స్టేడియం పక్కన పెంగ్విన్ గ్రౌండ్‌లో, సిబ్బంది ఎన్‌జీఆర్‌ఐ గ్రౌండ్ గేట్ నం. 3లో తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవచ్చు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement