వెయిటింగ్ లిస్టులో ఉన్నారా.. నో ఫికర్
దసరా సీజన్ కారణంగా రైళ్లలో టికెట్లు దొరకడం గగనంగా ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో ముందురోజు తత్కాల్ కోసం ప్రయత్నిద్దాం అనుకునేవాళ్లే ఎక్కువగా కనపడుతున్నారు. కానీ, ఇప్పుడు అలా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, వెయిటింగ్ లిస్టులో ఉన్నవాళ్ల టికెట్లు రద్దు చేయడానికి బదులు, అదే మార్గంలో వెళ్లే మరో రైల్లో వాళ్లకు సీట్లు కేటాయించాలని రైల్వేశాఖ భావిస్తోంది. ఇది నవంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. ఈ కొత్త పద్ధతి ప్రకారం టికెట్లు బుక్ చేసుకునే సమయంలోనే మనకు వెయిటింగ్ లిస్టు వస్తే, ఆ రైలు కాక మరేదైనా రైల్లో వెళ్లాలనుకుంటే ఆ ఆప్షన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఒక స్టేషన్ కాకుండా చుట్టుపక్కల ఉండే మరేదైనా స్టేషన్ నుంచి అయినా బయల్దేరాలనుకుంటే ఆ వెసులుబాటు కూడా ఉంటుంది.
ప్రస్తుతం శతాబ్ది ఎక్స్ప్రెస్ లాంటి ప్రీమియం రైళ్లలో కూడా వెయిటింగ్ లిస్టు ఎక్కువగానే ఉంటోంది. దానికి తోడు కొంత వెయిటింగ్ లిస్టు దాటిన తర్వాత 'నో రూమ్' అనే సందేశం వచ్చేస్తుంది. అంటే, కనీసం వెయిటింగ్ లిస్టు టికెట్ బుక్ చేసుకోడానికి కూడా కుదరదు. దాంతో ఎక్కువ దూరాలు వెళ్లాలనుకునేవాళ్లు ఒకటికి రెండు మూడు రైళ్లలో టికెట్లు బుక్ చేసుకునేవారు. ఇక ఈ బాధలన్నీ తప్పిపోయినట్లే.
కొత్త వ్యవస్థలో ప్రయాణికులతో పాటు రైల్వేశాఖకు కూడా తలనొప్పులు తగ్గుతాయి. ప్రయాణికులు ఒకసారి టికెట్ బుక్ చేసుకుంటే చాలు.. ఆ మార్గంలో ఎంతమంది ఉన్నారో చూసుకుని అవసరమైతే ప్రత్యేక రైళ్లను కూడా అప్పటికప్పుడే వేసి, వాటిలోకి వీళ్లను సర్దేసే అవకాశం ఉంటుంది. అవసరమైతే మిగిలిన సీట్లను కరెంట్ బుకింగ్ ద్వారా కేటాయించొచ్చు. ఈ కొత్త వ్యవస్థను నవంబర్ 1 నుంచి అమలుచేయాలని ఇప్పటికే అన్ని జోనల్ కార్యాలయాలకు రైల్వేశాఖ నుంచి ఉత్తర్వులు వచ్చేశాయి.