వడ్డీరేట్ల లెక్కింపునకు ఇక కొత్త విధానం | Base rate to be based on marginal cost of funds from April 1: RBI | Sakshi
Sakshi News home page

వడ్డీరేట్ల లెక్కింపునకు ఇక కొత్త విధానం

Published Fri, Dec 18 2015 12:14 AM | Last Updated on Sun, Sep 3 2017 2:09 PM

Base rate to be based on marginal cost of funds from April 1: RBI

ముంబై: కీలక పాలసీ రేట్లలో మార్పుల ప్రయోజనాలు సత్వరం రుణగ్రహీతలకు లభించాలనే లక్ష్యంలో భాగంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి బ్యాంకులు వడ్డీ రేట్ల లెక్కింపునకు కొత్త విధానాన్ని పాటించాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. బేస్ రేటును లెక్కించేందుకు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్‌ను ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుందని వివరించింది.
 
  దీనివల్ల వడ్డీ రేట్ల తగ్గుదల ప్రయోజనాలు రుణగ్రహీతలకు సత్వరం లభించడంతో పాటు బ్యాంకులు వడ్డీ రేట్లను నిర్ణయించేందుకు పాటించే విధానంలోనూ పారదర్శకత పెరుగుతుందని ఆర్‌బీఐ తెలిపింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేటు(ఎంసీఎల్‌ఆర్)ను బ్యాంకులు ప్రతి నెలా సమీక్షించి, ప్రకటిస్తాయని వివరించింది. ప్రస్తుతం సగటు నిధుల సమీకరణ వ్యయాల ప్రాతిపదికన బ్యాంకులు వడ్డీ రేట్లను నిర్ణయిస్తున్నాయి. కొత్త కరెంటు, సేవింగ్స్ డిపాజిట్లు, టర్మ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేట్ల ఆధారంగా నిధుల సమీకరణ వ్యయాన్ని మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ విధానంలో బ్యాంకులు లెక్కిస్తాయి.
 
 దీనికి అదనంగా మరికొన్ని అంశాలను జోడించి రుణాలపై కనీస వడ్డీ రేటు (బేస్ రేటు)ను నిర్ణయిస్తాయి. తుది మార్గదర్శకాలను స్వాగతిస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య చెప్పారు. నిర్దిష్ట తేది తర్వాత కొత్తగా రుణాలు తీసుకునే వారికి, రెన్యువల్ చేసుకునే వారికి కొత్త రేటు వర్తిస్తుందని ఆమె వివరించారు. పాత ఖాతాదారులు కూడా  కొన్ని షరతులకు లోబడి కొత్త విధానానికి మారే వెసులుబాటు కూడా కల్పించనున్నట్లు ఆమె తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement