లెక్కలు, సైన్స్, ఇంగ్లిష్ ఈ మూడుసబ్జెక్టులంటే చాలామంది విద్యార్థులకు భయం. ఎలా చదవాలో, ఏ లెక్కనుఎలా సూత్రీకరించాలో అనే అయోమయం, సైన్స్ పాఠాలను తమకు తామే అవగతం చేసుకోవడం సాధ్యం కాక.. ఇంగ్లిష్ గ్రామర్ రహస్యాలను నిశితంగా వివరించే బోధనా సామర్థ్యం కలిగిన ప్రత్యేక సబ్జెక్టు ఉపాధ్యాయులు లేక పలు ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు అల్లాడుతున్నారు. చదవమని ఒత్తిడి తెచ్చేవారే తప్ప.. ఎలా చదవాలో చెప్పేవారు.. విషయపరిజ్ఞానాన్ని పెంచేవారు లేకుండా మార్కుల పోరాటంలో పిల్లలు సతమతమవుతున్నారు.
చిత్తూరు, సాక్షి: పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. ఏటా లెక్కలు, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్లులో ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాలేకపోతున్నారు. జిల్లాలో 88 మంది టీచర్ల కొరత కొంత ఉన్నా అదొక్కటే కారణం కాదని నిపుణుల విశ్లేషణ. బోధనలో నైపుణ్యం కొరవడుతోందనే విమర్శ ఉంది. సబ్జెక్టు నీడ్ ఉపాధ్యాయులు అన్ని పాఠశాలల్లో ఉన్నా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించకపోవడానికి గల కారణాలపై సమీక్ష ఫలితాల సమయంలో తప్పితే తరువాత పట్టించుకోవడం లేదు. ఉపాధ్యాయులు స్థానికంగా ఉండేలా చర్యలు తీసుకోకపోవడం వంటి కారణాలు కూడా ప్రభావం చూపుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో అమలు కావడం లేదు. కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు కూడా ఏమంత మెరుగ్గా లేవు.
పదో తరగతి ఫలితాల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో చతికిలపడటమే ఇందుకు సాక్ష్యం. కొన్ని స్కూళ్లు మాత్రం ఇందుకు భిన్నం. అనేక మంది విద్యార్థులు గణితం, ఇంగ్లిష్, సైన్స్‌లలోనే ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు దీనిపైనే చర్చ జరుగుతోంది. పలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధాన సబ్జెక్టులను బోధించే ఉపాధ్యాయులు లేకపోవడం, ఉన్న టీచర్లతోనే ఆయా సబ్జెక్టులను చెప్పించడం వారు సైతం అందుబాటులో లేక విద్యావాలంటీర్లతో అవకాశం ఉన్నంత వరకు పాఠాలు చెప్పించామనే భావన కల్పించడం వంటి కారణాలతో విద్యార్థులు ప్రధాన సబ్జెక్టుల్లో రాణించలేని స్థితి ఉంది. పదో తరగతి ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో సైతం ఈ సబ్జెక్టుల్లో అత్తెసరు మార్కులే వస్తుండటం గమనార్హం.
చిత్తశుద్ధి లేదా?
జిల్లాలో 573 ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రతి సంవత్సరం సుమారు 35 వేల మంది విద్యార్థులు సర్కారు బళ్లలో చదివి పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. మూడు సంవత్సరాల నుంచి ఉత్తీర్ణతలో అట్టడుగుస్థానంలో ఉన్నాం. ఉత్తీర్ణత పెంచేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం అని జిల్లా విద్యాశాఖ ప్రకటిస్తూనే ఉంటుంది. ఫలితం మాత్రం కనిపించడం లేదు. ప్రత్యేక తరగతులు నిర్వహించి.. విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నా రిజల్ట్ మాత్రం అంతంత మాత్రమే. చిత్తశుద్ధి లేకుండా పని చేస్తుండటం వల్లే దారుణమైన ఫలితాలు వస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి.
ఆ సబ్జెక్టుల్లోనే ఎక్కువగా ఫెయిల్..
గత ఏడాది మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో ఎక్కువ మంది ఫెయిలయ్యారు. పాసయిన వారిలో కూడా ఎక్కువ మందికి ఈ సబ్జెక్టుల్లో బొటాబొటీæ మార్కులు వచ్చాయి. మిగతా సబ్జెక్టులను అవలీలగా చదివేవారు ఈ సబ్జెక్టుల వద్దకు వచ్చేసరికి పట్టు సాధించలేకపోతున్నారు. గత ఏడాది ఫలితాల్లో తెలుగు, హిందీ, సోషియల్ వంటి సబ్జెక్టుల్లో తక్కువ మంది ఫెయిల్ కాగా, లెక్కలు, సైన్స్, ఇంగ్లిష్‌లలో ఎక్కువ మంది పాస్ మార్కుల కంటే తక్కువ మార్కులు తెచ్చుకున్నారు. గణితంలో 2133 మంది, సైన్స్ 1978 మంది, ఇంగ్లిష్ 2181 మంది ఉత్తీర్ణత సాధించలేకపోయారు. మిగతా సబ్జెక్టులతో పోలిస్తే వీటిలో ఫెయిల్ అయిన వారు ఎక్కువ మంది ఉన్నారు. ఈ మూడు కఠినమైన సబ్జెక్టులనే అభిప్రాయం విద్యార్థుల్లో ఉండటం, 9వ తరగతి వరకు ఈ సబ్జెక్టులను ఇటు విద్యార్థులు కానీ.. అటు ఉపాధ్యాయులు కానీ సీరియస్‌గా తీసుకోకపోవడం కారణం కావచ్చు. పదో తరగతికి రాగానే ఒక్కసారిగా విద్యార్థులను ఈ సబ్జెక్టులు గందరగోళానికి గురి చేస్తుంటాయి. లెక్కల్లో ఫార్ములాలు సరిగా అర్థం కాకపోవడం, ఇంగ్లిష్‌లో అప్పటికప్పుడు గ్రామర్ నేర్చుకోవాల్సి రావడం వంటి వాటితో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు.
సబ్జెక్టులపై వీడని భయం..
విద్యార్థులు ఎక్కువగా ఫెయిల్ అవుతున్న సబ్జెక్టులను గుర్తించి వాటిలో ఉత్తీర్ణత సాధించేందుకు జిల్లా విద్యాశాఖ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నా.. ఉపాధ్యాయుల నియామకం, సబ్జెక్ట్ నీడ్ టీచర్లతో బోధనకు అనేక చోట్ల ప్రాధాన్యం కొరవడటంతో విద్యార్థులు పూర్తిస్థాయిలో ప్రతిభ చాటలేకపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment