చేతిరాతను బట్టి మనిషి గుణగణాలను అంచనా వెయ్యొచ్చని అంటారు. ఇప్పుడు కంప్యూటర్ యుగంలో చేతిరాతకు ప్రాధాన్యం తగ్గినప్పటికీరాత పరీక్షల్లో మాత్రం అందమైన చేతిరాతకు అదనపు విలువ తోడవుతుంది. అలాంటి చేతి రాత ఒకరి జీవిత గమనాన్ని మార్చింది. జెనెటిక్ ఇంజనీర్ అవుదామనే ఆలోచన నుంచి న్యూరో సైంటిస్ట్ కావాలనేలక్ష్యాన్ని నిర్దేశించింది. అలా చేతిరాతతో జీవితానికి చక్కటి బాటను దిద్దుకున్నారు సంగరాజు అశ్విని. తిరుపతిలోని ‘మేక్ మై బేబీ జీనియస్’(ఎంఎంబీజి) స్కూల్ యజమాని సంగరాజు భాస్కర రాజు కుమార్తె అశ్విని. తన లక్ష్యం మారడానికి వెనుక ఉన్న కారణాలను సాక్షితో పంచుకున్నారామె.
సెలవుల్లో ఆలోచన మారింది
‘‘జెనెటిక్ ఇంజనీరింగ్ చేయాలని చిన్నప్పటి నుంచి నా కోరిక. అందుకు అనుగుణంగానే పదో తరగతి వరకు చదివాను. మంచి మార్కులు వచ్చాయి. ఇంటర్‌లో ఎంబైపీసీ గ్రూపులో చేరాను. నాన్న చేతిరాత నిపుణులు కావడంతో వేసవి సెలవుల్లో చేతిరాతపై పిల్లలకు శిక్షణ శిబిరం నిర్వహించేవారు. అందమైన చేతి రాత కోసం నాన్న దగ్గరే శిక్షణ తీసుకున్నా. అయితే అందరిలా కాకుండా భిన్నంగా గుర్తింపు పొందాలనుకున్నా. అందమైన చేతిరాత కోసం నాన్న చాలా పరిశోధనలు చేశారు. అందులో నుంచి రూపుదిద్దుకున్నవే ప్యాటర్న్స్ (పలక లాంటి 8 పరికరాలు). ప్యాటర్న్స్‌లో రెండు చేతులతో రాయడం సాధన చేశాను. అదనంగా మిర్రర్ రైటింగ్, అప్ సైడ్ డౌన్ సాధన చేశాను. కుడి చేతితోనే కాకుండా ఎడమ చేతితో రాయడం కూడా సులభంగా నేర్చుకున్నా.
రెండు చేతులతో 21 భాషలు
‘‘సాధారణంగా ఒకటి, రెండు లేక మూడు భాషల్లో రాయగలం. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో రాయడాన్ని నేర్చుకున్నా. నాన్నకు చెప్పడంతో నాకు ప్రత్యేకంగా 18 భాషలకు సంబంధించిన పలకలు (ప్యాట్రెన్స్) చేయించారు. అందులో 18 భారతీయ భాషలు, మిగిలిన మూడు విదేశీ భాషలు. భారతీయ భాషల్లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కొంకణి, మరాఠీ, మైథిలి, మణిపురి, ఒరియా, పంజాబీ, సంస్కృతం, శాంథలి, సింధి, ఉర్దూలతోపాటు, విదేశీ భాషలు ఇంగ్లీషు, నేపాలి, అరబిక్‌లో రాయడం సాధన చేశాను. అలా మొత్తం 21 భాషల్లో కుడి, ఎడమ చేతులతో రాయగలను. మిర్రర్ రైటింగ్, అప్ సైడ్ డౌన్ రైటింగ్ కూడా వచ్చు. మిర్రర్ రైటింగ్ ఇండియాలో కొంతమంది రాయగలుగుతున్నప్పటికీ, అప్‌సైడ్ డౌన్ రైటింగ్ మాత్రం అసాధారణమే.
డిజార్డర్ పిల్లలకు బోధన
‘‘చేతిరాతలో నిపుణులైన నాన్న మేక్ మై బేబీ జీనియస్ అనే పేరుతో పాఠశాలను నెలకొల్పారు. చదువులో వెనుకబడ్డ పిల్లలను, అటెన్షన్ డెఫిషిట్ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ), అటెన్షన్ డెఫిషిట్ డిజార్డర్(ఏడీడీ), ఆటిజమ్ స్పెక్ట్రమ్ డిజార్డర్స్(ఏఎస్‌డీ) సమస్యలతో బాధ పడుతున్న పిల్లలకు బోధించడం ఈ స్కూల్ ప్రత్యేకత. సాధారణంగా ఇలాంటి పిల్లలను ఏ పాఠశాలలోనూ పెద్దగా పట్టించుకోరు. వారి సమస్యలు అర్థంకావు. వయసు పెరుగుతున్నా, తరగతులు మారుతున్నా చదువులో మాత్రం వెనుకంజలోనే ఉంటారు. ఇలాంటి పిల్లలకు మంచి చదువు అందించి సమాజంలో అందరిలా తీర్చిదిద్దాలన్నదే నాన్న కోరిక, నా లక్ష్యం కూడా అదే. దాని కోసం న్యూరో సైంటిస్టు కావాలనుకుంటున్నా.
లక్ష్యం మార్చిన ఘటన
‘‘తిరుపతి భవానీనగర్‌లో నివాసముంటున్న మోహన్‌మురళి చంద్రగిరి పీహెచ్‌సీలో సూపర్‌వైజర్. ఆయన కుమారుడు దేవనాగ్‌కు అప్పుడు 16ఏళ్లు. పుట్టినప్పటి నుంచే దృష్టి, నత్తి. దీంతో చదువులో వెనుకబడ్డాడు. ఆ వయసుకు పదో తరగతి పూర్తయి ఉండాలి. కానీ అతను ఎనిమిదో తరగతి చదువుతున్నా కనీసం పదాలు, ఎక్కాలు, గుణింతాలు ఏవీ రావు. తల్లిదండ్రులు చివరి ప్రయత్నంగా మా పాఠశాలలో చేర్పించారు. వారి వేదన వర్ణనాతీతంగా ఉండేది. పిల్లవాడి సమస్యను గుర్తించి ఇక్కడ వివిధ రకాల శిక్షణ ఇచ్చాం. దీంతో అతను రెండేళ్లకే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి సాధించాడు. ఈ సంవత్సరం ఓపెన్ స్కూల్ ద్వారా పదోతరగతి పరీక్ష రాసి పాసయ్యాడు. ప్యారడీ పాటలు రాస్తున్నాడు. సొంతంగా కథలు రాస్తున్నాడు. ఆ తల్లిదండ్రుల సంతోషం మాటల్లో వర్ణించలేం. అది నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. మొదట్లో జెనెటిక్ ఇంజనీరింగ్ చేయాలనుకున్న నా లక్ష్యాన్ని మార్చుకోవడానికి కారణం ఈ ఘటనే. న్యూరో సైన్స్ చదివి న్యూరో సైంటిస్ట్ అవుదామని నిశ్చయించుకున్నా. నాన్నకు తోడుగా ఉంటూ సహకారం అందించాలనుకున్నాను. దీనికోసం ఇంటర్‌లో ఎంబైపీసీ తీసుకున్నా. డిగ్రీలో బయోటెక్నాలజీ తీసుకున్నా. డిగ్రీ మొదటి సెమిస్టర్ వరకు రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లాను. ఆ తరువాత పాఠశాలలోనే పిల్లలకు బ్రెయిన్ జిమ్‌లో శిక్షణ ఇస్తూ డిగ్రీ పూర్తి చేశాను. న్యూరో సైన్స్ కోర్సు ఇండియాలో లేదు. విదేశాలకు వెళ్లాలి. దీనికోసం ఇక్కడే సైన్స్‌కు అనుబంధంగా ఉన్న పీజీ కోర్సు చేసి, ఆ తరువాత న్యూరో సైన్స్ చేయాలనుకుంటున్నా’’ అని చెప్పారు అశ్విని.
యంగ్ అచీవర్ అవార్డు
చేతిరాతను సాధనం చెయ్యడం చదువులో రాణించడానికి తనకు చాలా దోహదపడిందని అంటారు అశ్విని. ‘‘రెండు చేతులతో విభిన్న భాషల్లో విభిన్నంగా రాయడంతో మల్టిపుల్ స్కిల్స్ పెరిగాయి. నాలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, సృజనాత్మకతతోపాటు ఆత్మస్థైర్యం పెంపొందింది. అప్పటి వరకు గంట సమయంలో చదివి గుర్తు పెట్టుకునే అంశాలను కేవలం 15 నిమిషాల్లో పూర్తి చేసేస్తున్నా. దీంతో చదువుకోవడానికి సమయం చాలా కలిసొచ్చింది’’ అన్నారు అశ్విని. విలక్షణమైన ఆమె చేతిరాతకు అనేక అవార్డులు కూడా వచ్చాయి. జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, రికార్డ్ హోల్డర్ రికార్డ్స్, అమేజింగ్ వరల్డ్ రికార్డ్స్.. ఇలా ఆయా సంస్థలు అవార్డులను ప్రదానం చేశాయి. ఇటీవల విజయవాడలో యంగ్ అచీవర్ అవార్డును అందుకున్నారు.
– ఎస్.శశికుమార్, సాక్షి, తిరుపతి
Comments
Please login to add a commentAdd a comment