Concentration
-
పిల్లల్లో ఏకాగ్రతలేదా? ఒక్క చోట నిలవడం లేదా?
పిల్లలకు ఏకాగ్రత ఉండటం లేదు, ఎదుగుదల సరిగా లేదు.. అని పెద్దల నుంచి కంప్లైంట్స్ తరచూ వింటూ ఉంటాం. పిల్లల్లో ఆందోళన, చికాకు తగ్గడానికి యోగాభ్యాసం ఎంతగానో ఉపయోగపడుతుంది. పెద్దలు చేసే విధంగా పిల్లలకు యోగా సాధన కుదరదు. చిన్న చిన్న మార్పులు చేసి, పిల్లలచే సాధన చేయిస్తే వారి ఉన్నతికి యోగా ఒక బలమైన పునాదిగా ఉంటుంది. ముందు ఓ పది నిమిషాలు పిల్లలతో చిన్న చిన్న స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయించాలి. దీనివల్ల వారి శరీరం యోగాభ్యాసానికి సిద్ధం అవుతుంది. ఆ తర్వాత 12 సూర్యనమస్కారాలు చేయించాలి. పిల్లలకు ఏకాగ్రత, ఎదుగుదలకు సహకరించేవి..ఆక్సీజన్ గా..ముందు నిటారుగా నిల్చోవాలి. రెండు కాళ్లలో ఒక కాలిని మోకాళ్ల వద్ద వంచుతూ, ΄ాదాన్ని నిలుచుని ఉన్న కాలు తొడ భాగంలో ఉంచాలి. హృదయం దగ్గర నమస్కార భంగిమ లో చేతులను ఉంచి, రెండు శ్వాసలు తీసుకుని వదిలాక, చేతులు రెండూ పైకి ఎత్తి నిల్చోవాలి. ఈ ఆసనం ద్వారా శరీరాన్ని బ్యాలెన్డ్స్‌గా ఎలా ఉంచాలో తెలుస్తుంది. ఒక చెట్టు ఆక్సిజన్‌ను ఎలా ఉత్పత్తి చేస్తుందో అలాంటి భంగిమ కాబట్టి పిల్లల శ్వాసక్రియ కూడా బాగా పనిచేస్తుంది. ఈ ఆసనం ద్వారా వారిలో ఏకాగ్రత పెరుగుతుంది. – జి. అనూ షారాకేష్యోగ గురు -
పుస్తకం చదవటంలో.. ఏకాగ్రత లోపమా? అయితే ఇలా చేయండి!
ఈ రోజుల్లో.. పిల్లలు చేత పుస్తకం పట్టి, పదినిమిషాలు చదవాలంటే.. ఓపికతో కూడుకున్న పనిగా, ఇబ్బందిగా భావిస్తున్నారు. అందులో వారికి ఇష్టంలేని సబ్జెక్ట్ గురించైతే చెప్పనవసరం లేదు. పుస్తకం ఇలాగ తెరిచి వామ్మో.. ఈ సబ్జెక్టా అంటూ పక్కనెట్టుస్తున్నారు. ప్రస్తుతం జనరేషన్ కి పుస్తక పఠనంపై దృష్టి పెట్టడమనేది చాలా పెద్ద సమస్యగా మారింది.దీనికి చాలా కారణాలు ఉండవచ్చు. ఆరోగ్య సమస్యలు, ఓపిక లేకపోవడం, ఇతర చిన్న చిన్న కారణాలు, మరెన్నో.. మరి ఇటువంటి కారణాలకు సహజంగా చదువుపై ఏకాగ్రత పొందాలంటే కొన్ని పర్యావసనాలు ఎంచుకోవాల్సిందే. తదుపరి విద్యార్థులకు చదువుపై శ్రద్ధ కలగడం, అంకితభావంతో తమ చదువుల్లో నిమగ్నమై ఉండటం, చదువులో పురోగతి సాధించడంవంటి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే, శ్రద్ధతో చదవడంతో విద్యార్థులు ఎక్కువ సబ్జెక్టులను అర్థం చేసుకోగలుగుతారు, దీంతో వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతంది.పాటించాల్సిన చర్యలు..పర్యావరణం..చదువుకోవడానికి ఎప్పుడూ ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. చుట్టూ ఉన్న స్థలం శుభ్రంగా ఉండటం మరీ ఉత్తమం. వీలైతే, సహజ కాంతి, సౌకర్యవంతమైన కుర్చీ, పొందిగ్గా కూర్చునే విధానం ఎంతో అవసరం. చదివేంతవరకైనా మన ఫోన్, ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలనుంచి ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలి.సమయం..మనకున్న రోజుకి 24 గంటల సమయంలో ఇతర అవసరాలకి చాలా సమయం పోగా, చదువుకై కొంత సమయాన్ని కెటాయంచుకోవడం అవసరం. అలా వీలు పడలేదంటే వెంటనే షెడ్యూల్‌ని తయారుచేసుకుని దానిని అనుసరించడం ఎంతో కీలకం. ప్రతిరోజూ చిన్న లక్ష్యాలను నిర్దేశించుకుని.. పెద్ద లక్ష్యాల వైపుగా కొనసాగడం సులభమైన మార్గం. ప్రతీ 45-60 నిమిషాలకు.. 5-10 నిమిషాల విరామం తీసుకోవడం అవసరం. ప్రస్తుత జనరేషన్ లో 7-8 గంటల నిద్ర మరీ ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామంతో దృష్టి, ఏకాగ్రత మెరుగుపడుతుంది.సాంకేతికత..ఓపిక, సహనానికై పోమోడోరో వంటి టెక్నిక్స్ సహాయంగా మారుతుంది. పోమోడోరో టెక్నిక్‌లో.. 25 నిమిషాల పనికి 5 నిమిషాల విరామంగా విడమర్చి ఉంటుంది. సంక్లిష్ట భావనలను అర్థం చేసుకోవడానికి, గుర్తుంచుకోవడానికి మైండ్ మ్యాపింగ్‌ని ఉపయోగించండి. పదజాలం, వాస్తవాలను గుర్తుంచుకోవడానికి ఫ్లాష్‌కార్డ్‌లను ఉపయోగించండి. మీ చదువులో మీకు సహాయపడే ఆన్లైన్ ట్యుటోరియల్లు, వీడియోలు, కథనాలతో కూడిన ఆన్లైన్ మాద్యమాలను ఉపయోగించడం సులభమైన మార్గం.మనస్తత్వం..ప్రతీనిమిషం సానుకూలంగా ఉండడానికే ప్రయత్నించాలి. ఎల్లప్పుడూ మన శక్తి సామర్థ్యాలపై విశ్వాసం వీడొద్దు. ధ్యానం మీ దృష్టిని, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. ఎవరైనా సహాయం కోరితే సానుకూలంగా స్పందించండి. ఇతరులనుంచి సాయంకోరడంలో ఇబ్బంది పడటం, చివరికి చిక్కుల్లో పడటం చేయకండి. సజావుగానే, తేలికగా అడగడానికి ప్రయత్నించండి.ప్రతీ వ్యక్తి భిన్నంగా ఉండాలనే నియమం ఎక్కడా కూడా లేదు. అది కొందరికి సాధ్యం అవచ్చు. మరికొందరికి కాకపోవచ్చు. అలా ఉండకపోవడానికి గల లోపాలను గుర్తించి, అవసరమైన జాగ్రత్తలు పాటించడం మేలు. శ్వాస విషయంలో గట్టిగా గాలి తీసుకోవడం, నెమ్మదిగా వదలడం ఇలా 5 నిమిషాల శ్వాసవ్యాయామంతో అలోచనా శక్తి మెరుగుపరుచుకోవచ్చు. -
మీలో ఏకాగ్రత ఎంత? అందుకోసం ఏం చేయాలంటే..!
ఏకాగ్రత లేకుండా చదవడం లేదా ఏ పనినైనా చేయడం అంటే చిల్లికుండలో నీళ్లు నింపడం లాంటిదే.ఏకాగ్రత లేకుండా చేసే పనివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. అయితే కొందరిలో ఎంత ప్రయత్నించినా ఏకాగ్రత ఉండదు. అలా ఏకాగ్రత లేకపోవడానికి మానసిక, శారీరక సమస్యలు కారణం కావచ్చు. ఇంకొంతమందికి ఎక్కువ సమయం ఒకే విషయం మీద ఫోకస్ చేసినా ఏకాగ్రత లోపిస్తుంది. నిద్రలేమి, ఇన్ఫెక్షన్లు, డిప్రెషన్ మొదలైన ఆరోగ్య సమస్యలు కూడా కారణాలు కావచ్చు. ఏకాగ్రత పెరగాలంటే.. ఏకాగ్రత ఉంటేనే ఏ పనినైనా సాధించగలం.అందుకే ఏకాగ్రత పెంచుకోవడం అందరికీ అవసరం. ముఖ్యంగా విద్యార్థులకు చాలా అవసరం. అందుకోసం ఏం చేయాలో చూద్దాం. ముందు మనం విద్యార్థుల కోసం చెప్పుకుందాం.. ⇒ చదువుకునేందుకు మంచి వాతావరణాన్ని సృష్టించుకోవాలి. టీవీ, ఫోన్ , కంప్యూటర్, మ్యూజిక్ ప్లేయర్‌కి దూరంగా ఉండాలి. ⇒ ఏకాగ్రత ఉంటేనే ఏ పనినైనా సాధించగలం. ⇒ ఏ పనికి ఎంత సమయం కేటాయించాలో పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. మల్టీ టాస్కింగ్ ఎప్పుడూ చేయకూడదు. ⇒ స్టడీసెషల్స్కు నలభైనుంచి యాభై నిమిషాలకంటే ఎక్కువ సమయం కేటాయించొద్దు. అలసిపోకుండా ఉండేందుకు మధ్యమధ్యలో విరామం అవసరం. ⇒ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. బాధలను, ఆందోళనలను మర్చిపోవాలి. ⇒ చదువుతున్నప్పుడు ముఖ్యమైన పాయింట్స్‌ను, టాపిక్స్‌ను నోట్ చేసుకోవాలి. అవసరమైనప్పుడు వాటిని రిఫర్ చేసుకోవాలి. యోగా, ధ్యానం మొదలైన టెక్నిక్స్ ఉపయోగపడతాయి. ఎస్క్యూ3ఆర్ పద్ధతి ఎస్ (సర్వే): చదివిన దాంట్లో ముఖ్యమైనవి ఒక సర్వే పుస్తకంలో రాసుకోవాలి. టైటిల్స్, సబ్–టైటిల్స్, క్యాప్షన్స్ లాంటివి రిఫరెన్స్‌కి బాగా తోడ్పడతాయి. క్యూ (క్వశ్చన్): పుస్తకంలో నోట్ చేసుకోవడం, చదవడం పూర్తయ్యాక క్వశ్చన్స్ వేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆర్ 1 (రీడ్): చాప్టర్ పూర్తవగానే క్వశ్చన్ , దానికి సరైన జవాబును తెలుసుకొని చదువుకోవాలి. అలా చదివితే మర్చిపోవడం అంటూ జరగదు. ఆర్ 2 (రిసైట్): చదివిన వాటిని తిరిగి ప్రశ్నించుకుంటూ వాటి జవాబులను గుర్తు చేసుకోవాలి. సొంతంగా జవాబులను తయారు చేసుకోవాలి. అవసరమైతే ముందు రాసుకున్న నోట్స్ తీసి చూడాలి. ఆర్ 3 (రివ్యూ): చదివిన తర్వాత అవన్నీ మెదడులో తాజాగా ఉండాలంటే మళ్లీమళ్లీ చదవాలి. మామూలుగా అందరూ కంటితో చూస్తూ చదువుతారు. ఒకటి కంటే ఎక్కువ ఇంద్రియాల ప్రమేయం చదివే ప్రక్రియలో మనం భాగం చేయగలిగితే ఏకాగ్రత మెరుగవుతుంది. 1) పైకి చదవడం– చదువుతున్నది చెప్పడమే కాకుండా వింటాం కూడా. 2) చదివేది పుస్తకంలో క్లుప్తంగా రాయడం. 3) ఇప్పుడు చాలా రకాలైన పుస్తకాలు, పిడిఎఫ్లు చదివి వినిపించే ఆప్స్ ఉన్నాయి. కుదిరితే ఇలా వింటూ, చూస్తూ, ఒక నోటు పుస్తకంలో ముఖ్యమైన వాటిని రాసుకుంటూ చదివితే ఏకాగ్రత కోల్పోవడం తగ్గుతుంది. మన ఏకాగ్రతకు భంగం కలిగించే వస్తువులు (సెల్ ఫోను), వ్యక్తులను చదువుతున్నప్పుడు దూరం పెట్టాలి. వీలయినంత వరకు చదవడానికి ఒక ప్రదేశం (లైబ్రరీ, ఇంటి లో ఒక గది) నిర్ణయించుకుని అక్కడే ప్రతిరోజు చదివితే, మన బుర్రలో అది స్థిరపడి, ఆ ప్రదేశానికి వెళ్లిన వెంటనే వేరే ఆలోచనలు తక్కువవుతాయి. కొంతమంది ఎక్కువసేపు ఒకచోట కూర్చోలేరు. అలాంటివారు 3–4 చోట్ల మధ్య మారుతూ మెల్లగా అలవాటు చేసుకోవచ్చు. చదివే వ్యాసాలను ఫ్లో– చార్ట్స్, డయాగ్రమ్స్గా నోటు పుస్తకాలలో రాసుకుంటే బాగా గుర్తుంటాయి. ఇవన్నీ చాలా చిన్న విషయాలుగా అనిపించినా తేలిగ్గా తీసుకోకుండా వాటిని పాటించడం వలన ఏకాగ్రత మెరుగుపరచుకోవచ్చు. (చదవండి: జంక్ ఫుడ్‌నే జంకేలా..తినడం స్టాప్ చేద్దాం ఇలా!) -
ఆ చిన్నారి నిద్రిస్తే.. ఏ క్షణంలోనైనా శ్వాస ఆగిపోతుంది!
ఎన్నో రకాల వింత వ్యాధుల గురించి విన్నాం. కానీ నిద్రిస్తే శ్వాస ఆగిపోవడం అనే వ్యాధి గురించి విని ఉండరు కదా! నిద్రిస్తేనే శ్వాస ఆగిపోతే ఎలా? నిద్రపోకుండా ఉండటం కూడా అసాధ్యమే. ఇదోకరకమైన అరుదైన వ్యాధి అట. దేనిపైన దీర్ఘంగా దృష్టి కేంద్రీకరించినా లేదా ఏకాగ్రత పెట్టినా.. శ్వాస ఆగిపోవడమే ఈ వ్యాధి లక్షణం. యూకేలోని ఓ చిన్నారి అచ్చం అలాంటి వ్యాధి బారినే పడింది. దీంతో తల్లిదండ్రులు ఆ చిన్నారిని రక్షించుకునేందుకు కంటిమీద కునుకు లేకుండా నానా అగచాట్లు పడుతున్నారు. అసలేం జరిగిందంటే.. యూకేలోని బర్మింగ్‌హామ్‌కు చెందిన 48 ఏళ్ల స్టార్ బౌయర్, ఆమె భర్త ఆండ్రూ బౌయర్ ఇద్దరు తమ కుమార్తె సాడీని రాత్రింబవళ్లు కంటి మీద కునుకులేకుండా అపురూపంగా చూసుకుంటున్నారు. సాడీ పుట్టిన ఆరు నెలల తర్వాత నుంచి శ్వాస సంబంధిత సమస్యను ఎదుర్కొనడం ప్రారంభమైంది. ఆ తర్వాత దీని గురించి ఆ చిన్నారి కొన్నాళ్లు ఇంటెన్సీవ్ కేర్‌లో కూడా చికిత్స తీసుకుంది. ఐతే ఆమె పుట్టుకతో సెంట్రల్ హైపోవెంటిలేషన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు వైద్యులు. దీని కారణంగా ఏదైనా సినిమా చూస్తూ ఉండిపోయినా లేదా గట్టిగా దేనిమీద అయినా ఏకాగ్రత పెట్టినా ఆమె మెదడు శ్వాస తీసుకోవడం మర్చిపోవడంతో ఆమె శరీరం నీలంగా మారి చనిపోయే స్టేజ్‌కి వెళ్లిపోతుంది. దీంతో వైద్యులు ఆ చిన్నారికి ట్రాకియోస్టోమీ చేశారు. అంటే మెడకు రంధ్రం చేసి శ్వాసనాళ నుంచి ఒక గొట్టం ఏర్పాటు చేశారు. ఇది శ్వాస తీసుకునేలా చేసి మెదడుకు సంకేతాలు పంపి గుండె కొట్టుకునేలా చేస్తుంది. ఇది ఆమె ఏకాగ్రతగా ఉన్నప్పుడూ (దీర్ఘంగా సినిమా చూస్తుండిపోయినప్పుడూ).. శ్వాస తీర్చుకోవడం మర్చిపోయిన ప్రతి సారి ఈ గొట్టం శ్వాస గురించి మెదడుకు సంకేతాలు పంపుతుంది. అదే ఒకవేళ ఆ చిన్నారి అకస్మాత్తుగా నిద్రపోయినా లేదా డీప్ స్లీప్‌లో ఉంటే అంతే సంగతి. శ్వాస ఆగిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. వెంటనే తల్లిదండ్రులు అది గమనించి వెంటిలేటర్‌పై ఉంచి కృత్రిమ శ్వాస అందించి తిరిగి బతికించుకుంటున్నారు. ఒకవేళ ఆమె శ్వాస ఆగిపోవడాన్ని గమనించనట్లయితే ఆమె శాశ్వతంగా దూరమైపోతుందని డాక్టర్లు హెచ్చరించారు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రలుకు కంటి మీద కునుకు లేకుండా అయింది. 24/7 ఆమెను పర్యవేక్షించడమే వారికి నిత్యకృత్యంగా మారిపోయింది. ఆమె రోజులో సాధారణ బిడ్డ మాదిరిగానే ఉన్నా.. నిద్రించిందా ఇక అంతే! ఆ చిన్నారి రూమ్ అంతా వైద్య పరికరాలతో నిండి ఉంటుంది. ఐతే తల్లిద్రండులు ఆమెకు వెంటిలేటర్ లేకుండా శ్వాస పీల్చుకునేలా ప్రత్యామ్నాయ మార్గం గరించి తెలుసుకున్నారు. నిద్రలో శ్వాస ఆగిపోకుండా డయాఫ్రాగ్మాటిక్ పేసర్లను అమర్చాలని నిర్ణయించుకున్నారు. దీన్ని అమర్చితే ఆ చిన్నారి నిద్రపోయినా పర్వాలేదు, పైగా తాము నిద్రపోకుండా చూసుకోవాల్సిన సమస్య తప్పదంటున్నారు తల్లిదండ్రులు. ఐతే అందుకోసం కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. ఆ డబ్బుల సేకరణ పనిలోనే తాము ఉన్నట్లు తల్లిదంద్రడులు వివరించారు. (చదవండి: మంచి తల్లిగా ఉండాలనే రాజకీయాల నుంచి తప్పుకున్నా!: జెసిండా) -
‘ఫోకస్’ తప్పుతోంది
కంచర్ల యాదగిరిరెడ్డి : అర నిమిషం తీరిక లేదు... అర్ధరూపాయి సంపాదన లేదు.. ఈ సామెత వింటుంటే ఈ తరం బడిపిల్లలు గుర్తుకు వస్తున్నారు. ఎప్పుడు చూసినా పుస్తకాల్లో తలమునకలై ఉంటారు. బాగా చదువుతున్నారే అని మురిసిపోయినా.. పరీక్షల్లో వచ్చిన మార్కులు చూస్తే అత్తెసరు. ఈ తరం పిల్లల్లో ఎక్కువ మంది ఫోకస్డ్గా లేకపోవడమే దీనికి కారణమని నిపుణులు చెప్తున్నారు. అసలు పెద్దవారి ఏకాగ్రత కూడా బాగా తగ్గిపోతోందని.. స్మార్ట్ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాలు, మాధ్యమాల వల్లే ఈ పరిస్థితి నెలకొందని స్పష్టం చేస్తున్నారు. దృష్టి మళ్లే దారులెన్నో.. మునుపటితో పోలిస్తే పిల్లల దృష్టి మళ్లేందుకు స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, టీవీలు ఇలా ఎన్నో కారణమవుతున్నాయి. నిత్యం ఎవరో ఒకరి నుంచో, ఏదో వాట్సాప్ గ్రూపులోనో మెసేజీలు రావడం, ఫేస్బుక్ నోటిఫికేషన్లు, స్మార్ట్ వాచ్ మెసేజ్.. ఇలా తరచూ మన దృష్టిని తప్పిస్తున్నాయని, దీనివల్ల తదేకంగా ఒక పనిని శ్రద్ధగా చేసే శక్తిని కోల్పోతున్నామని నిపుణులు చెప్తున్నారు. సెల్ఫోన్లు రాకముందు, సాంకేతిక విప్లవం లేనప్పుడు మనుషులు ఎలా ఉన్నారు? ఇప్పుడెలా ఉన్నారన్నదానిపై అమెరికాలోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్, అండ్ హ్యూమన్ డెవలప్మెంట్’ఇటీవల ఓ అధ్యయనం చేసింది. 1946–1975 మధ్య కాలంలో పుట్టి, రకరకాల రంగాల్లో పనిచేస్తున్న వారిని, 1976–2000 మధ్య పుట్టి పలు రంగాల్లో ఉన్న వారిని, ప్రైమరీ స్కూల్, హైసూ్కల్, కాలేజీ విద్యార్థులను ప్రశ్నించి.. ఐక్యూ టెస్ట్ పెట్టింది. ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లో ఈ అధ్యయనం సాగింది. ఏ పనికైనా ఫోకస్ అవసరం! మనం ఏ పనిచేయాలన్నా ఫోకస్ అనేది చాలా అవసరం. లేకుంటే ఏ పని సరిగా, త్వరగా పూర్తి చేయలేం. తరాలు మారుతున్న కొద్దీ ఫోకస్ టైం మారుతూ వస్తోందని అధ్యయనంలో తేలింది. ఉదాహరణకు బేబీ బూమర్లు అంటే 1946–1964 మధ్య పుట్టినవాళ్లకు ఫోకస్ టైం ఇరవై నిమిషాలు ఉండేది. తర్వాతి తరం జనరేషన్ ఎక్స్ అంటే 1965–1980 మధ్య పుట్టినవారి ఏకాగ్రత 12 నిమిషాలకు చేరింది. 1981, ఆ తర్వాత పుట్టినవారికి ఇది కేవలం ఎనిమిది నుంచి 12 నిమిషాలే.. ఫోకస్ పెట్టలేక పోయినప్పుడు అరగంటలో చేయాలనుకున్న పని గంట, గంటన్నర పడుతుంది. పైగా చేసే పనిలో నాణ్యత ఉండదని.. యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి సమస్యలూ వస్తాయని, మానసిక ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. నాలుగేళ్ల కితం జరిగిన ఒక పరిశోధన ప్రకారం.. ఇంటర్నెట్ వాడకం మన మెదడులోని పలు ప్రాంతాల్లో మార్పులకు కారణమవుతుందని తేలింది. ఇలా మారిపోయే విషయాల్లో మన జ్ఞాపకాలూ ఉన్నాయని వెల్లడైంది. ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్, అండ్ హ్యూమన్ డెవలప్మెంట్’అధ్యయనం ప్రకారం కూడా.. నిద్రకు ఉపక్రమించే ముందు స్మార్ట్‌ఫోన్ లేదా ఇతర డిజిటల్ స్క్రీన్లను చూడటం వల్ల నిద్రకు చేటు కలుగుతుంది. అది కాస్తా వారి రోజువారీ కార్యక్రమాలపై ప్రభావం చూపుతుంది. వాటితో కేవలం పరధ్యానమే.. కంప్యూటర్ల వాడకంతో మనుషుల మానసిక స్థితిపై కలిగే ప్రభావంపై ఇంకో అధ్యయనం కూడా జరిగింది. ఆ్రస్టేలియాకు చెందిన డాక్టర్ షరోన్ హార్వుడ్ నిర్వహించిన ఆ అధ్యయనం ప్రకారం.. టెక్నాలజీ అనేది మన మేధో సామర్థ్యాన్ని వెంటనే మార్చేస్తుందనడం పూర్తిగా వాస్తవమేమీ కాదు. యుగాలుగా రకరకాల పరిస్థితు లను ఎదుర్కొని పరిణామం చెందిన మెదడు పనితీరు ఒక్క తరంలో మారిపోదని ఆమె చెప్తున్నా రు. కాకపోతే డిజిటల్ పరికరాలు మన మనసును పరధ్యానంలో పడేస్తాయని స్పష్టం చేస్తున్నారు. పక్కన ఉన్నా ప్రభావమే.. మన పరిసరాల్లో స్మార్ట్‌ఫోన్, ఇతర డిజిటల్ స్క్రీన్ డివైజ్ ఉంటే చాలు మన ఏకాగ్రత స్థాయి గణనీయంగా తగ్గిపోతుందంటున్నారు నిపుణులు. ఆలోచించడం, గుర్తుంచుకోవడం, భావోద్వేగాల నియంత్రణకు కారణమైన విషయాలపై దృష్టిపెట్టడం వంటివాటిపై స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్ల వంటివి ప్రభావం చూపగలవని ఎన్నో అధ్యయనాల్లో తేలిందని స్పష్టం చేస్తున్నారు. చేతుల్లో, లేదా జేబులో, పక్కన టేబుల్‌పైనో స్మార్ట్‌ఫోన్ ఉంటే.. మన మనసు చేసే పనిపై కాకుండా ఫోన్‌కు వచ్చే నోటిఫికేషన్లు లేదా అది చేసే శబ్దాలపై పడుతుందని వెల్లడైందని వివరిస్తున్నారు. క్షణం విడిచి ఉండలేకుండా.. రోజులో గంటా రెండు గంటల పాటు స్మార్ట్‌ఫోన్ అందుబాటులో లేకపోయినా సరే నానా హైరానా పడే వారి సంఖ్య బాగా పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే పాశ్చాత్యదేశాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారని.. మన దేశంలోనూ ఆ పరిస్థితి వస్తోందని హెచ్చరిస్తున్నారు. తక్షణ తృప్తి (ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్) కారణంగానే మనుషులు డిజిటల్ పరికరాలకు బానిసలవుతున్నట్టు వివరిస్తున్నారు. చాలా దేశాల్లో పిల్లలు నిపుణులు సూచించిన దాని కంటే ఎక్కువ సమయం డిజిటల్ తెరల ముందు గడుపుతుండటం ఆందోళనకరమని స్పష్టం చేస్తున్నారు. సమస్యను గుర్తించడం ఎలా? ♦ చేపట్టిన పనిని పూర్తి చేసేందుకు కష్టపడుతుంటే, కష్టం అనిపిస్తుంటే, అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతుంటే ఫోకస్ కోల్పోయామని అర్థం. ♦ అకారణంగా చిరాకు అనిపిస్తున్నా, మన దృష్టి సులువుగా పక్కదారి పడుతున్నా, రెస్ట్‌లెస్‌గా అనిపిస్తున్నా.. ఫోకస్ కోల్పోయామని స్పష్టంగా తెలుస్తుంది. ♦ ముఖ్యమైన అంశాలను అప్పటికప్పుడు మర్చిపోతుంటే ఫోకస్ పోతున్నట్టే. ఏమిటి పరిష్కారం? ♦ ఫోకస్ పెంచుకునేందుకు సులువైన మార్గాలెన్నో ఉన్నాయి. మన ఏకాగ్రతను దెబ్బతీస్తున్న మొబైల్ ఫోన్ నోటిఫికేషన్, కంప్యూటర్ నోటిఫికేషన్ వంటివి ఆఫ్ చేయాలి లేదా అత్యవసరమైనవే వచ్చేలా సెట్ చేసుకోవాలి. ♦ ఏ పని ముందు చేయాలి? ఏ పని తరువాత చేయాలి? దేనికి ప్రాధాన్యత ఎక్కువ? దేనిని నిర్ణీత సమయం (డెడ్‌లైన్)లోపు పూర్తి చేసుకోవాలన్న దానిపై కొంత వర్క్ చేసుకుని ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయడం నేర్చుకుంటే ఫోకస్ పెరుగుతుంది. ♦ ప్రతిరోజు మైండ్ ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయాలి. అంటే పూర్తిగా చేసే పనిపైనే ధ్యాస నిలిపాలి. ఉదాహరణకు.. ఉదయం లేవగానే బ్రష్ చేసేటప్పుడు ఆ బ్రషింగ్పై మాత్రమే, కాఫీ తాగేటప్పుడు దానిపై మాత్రమే ధ్యాస నిలిపేందుకు ప్రయత్నించాలి. ఇలా అన్ని పనులకూ వర్తింపజేయాలి. దీనిని రోజూ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఫోకస్ ఆటోమేటిగ్గా పెరుగుతుంది. –విశేష్ , సైకాలజిస్ట్ ఇంటర్నెట్కు బానిసవుతున్న జనం ప్రపంచవ్యాప్తంగా జనం ఇంటర్నెట్కు బానిసగా మారుతున్నారని పలు అధ్యయనాల్లో తేలింది. వాటి ప్రకారం.. రోజులో ఒక్కొక్కరూ కనీసం 149 నిమిషాల పాటు స్మార్ట్‌ఫోన్‌ను చూస్తూ గడుపుతున్నారు. ప్రతి ఐదుగురిలో ఒకరు రాత్రిళ్లు నిద్రలేచి మరీ సోషల్ మీడియా పోస్టులు చూసుకుంటున్నారు. వీడియో గేమ్స్ ఆడే యువకులు వారంలో వాటిపై గడిపే సమయం 8 గంటలకు పైనే.. అమెరికాలో ట్రాఫిక్ ప్రమాదాల్లో 26శాతం స్మార్ట్‌ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయడం వల్లనే జరుగుతున్నాయి! -
యువతలో గజినీలు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): స్కూల్‌కు టైమ్ అవుతోందనే హడావుడిలో పిల్లలు అమ్మ ఇచ్చిన లంచ్ బాక్స్ మరిచిపోతున్నారు.. ఆఫీస్‌కు లేటవుతున్నామనే భావనతో ఉద్యోగులు బైక్ కీస్ మరిచి గబగబ మెట్లు దిగిపోతున్నారు. వీరే కాదు మతిమరుపుతో అవస్థలు పడుతున్న వారు మరెందరో ఉన్నారు. ఒకప్పుడు ఆరవై ఏళ్లు దాటితే కానీ కనిపించని మతిమరుపు ఇప్పుడు 16 ఏళ్లకే పలకరిస్తోంది. పాతికేళ్ల వారిలో ఇది తీవ్రస్థాయిలో కనిపిస్తోంది. పరీక్షల భయం, పని వత్తిడి, ఆందోళన వంటివి మతిమరుపునకు ప్రధాన కారణాలు. పౌష్టికాహార లోపం, కొన్ని రకాల వ్యాధులు కూడా మతిమరుపునకు దారితీస్తున్నాయని మానసిక వైద్య నిపుణులు చెపుతున్నారు. టీనేజ్లోనే బీజం మతిమరుపు సమస్యకు టీనేజ్‌లో బీజం పడుతోంది. 25 నుంచి 35 ఏళ్ల వయస్సు వారిలో అది తీవ్రస్థాయికి చేరుతోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. 20 నుంచి 30 శాతం మంది యువత మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. లోపిస్తున్న ఏకాగ్రత ఒక విషయాన్ని సమగ్రంగా వినడంలోనూ యువతలో ఏకాగ్రత లోపిస్తోంది. వినడం, విన్నదానిని మదిలో ముద్రించుకోవడం, తిరిగి దానిని చెప్పడం, చెప్పే విషయాల్లో యువతలో తీవ్రమైన మార్పులోస్తున్నాయి. విన్న విషయాన్ని మనసులో ముద్రించుకోకపోవడం వల్లే మతిమరుపు వస్తున్నట్లు వైద్యులు చెపుతున్నారు. చాలా మంది ఒక పనిని చేస్తూ మరికొరితో మాట్లాడుతుంటారు. ఈ సమయంలో వారు చెప్పే విషయాలు పెద్దగా వినక పోవడంతో ఆ తర్వాత గుర్తు చేసుకుందామన్నా జ్ఞప్తికి రాని పరిస్థితి ఉంటోంది. అంతు చూస్తున్న వత్తిడి చేసే పనిలో టెన్షన్, యాంగ్జ్జయిటీ, సైకలాజికల్ అంశాలు జ్ఞాపక శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యమైన అంశాలను గుర్తు పెట్టుకోవడంలోనూ యువతలో జ్ఞాపకశక్తి తగ్గుతోంది. ఉదయం లేవగానే ఏదో పనిచేయాలని అనుకుంటారు. తీరా చెప్పే సమయం వచ్చేసరికి అది గుర్తుకు రాదు. అంతలా వారి మెదడు మొద్దుబారుతోంది. యాంగ్జయిటీతో ముప్పు జ్ఞాపకశక్తి తగ్గిపోవడానికి, మానసిక సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం యాంగ్జాయిటీ. ఏ పనిచేసినా ఆందోళనతో చేయడం, హడావుడిగా మాట్లాడటం వల్ల ఒత్తిడి పెరిగిపోతోంది. అది మనసుపై ప్రభావం చూపుతోంది. దీంతో విన్న విషయం అవసరమైనప్పుడు గుర్తుకురావడం లేదు. ఉద్యోగంలో పనివత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థిక అంశాలు కూడా యువతపై ప్రభావం చూపుతున్నాయి. పిల్లల్లో హోం వర్క్, పరీక్షల మార్కులపై వత్తిడి, శిక్షలు, వారిలో వత్తిడి పెంచి అదికాస్తా మతిమరుపునకు కారణం అవుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. బీపీ, మధుమేహం ప్రభావం మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ వంటివి సోకి ఐదేళ్లు దాటిన వారిలో మతిమరుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధులు ఉన్న వారిలో హార్మోన్ల అభివృద్ధిలో లోపాలు చోటుచేసుకుంటాయి. జ్ఞాపకశక్తి పెరగడానికి విటమిన్ బీ–12 కారణమని, దాని లోపం వల్ల మతి మరుపు పెరుగుతుందని వైద్యులు చెపుతున్నారు. పౌష్టికాహారం లేక పోవడం వల్ల బ్రెయిన్ సెల్స్ అభివృద్ధి లోపిస్తుందని పేర్కొంటున్నారు. రెడీమేడ్ ఫుడ్ జోలికెళ్లకూడదని సూచిస్తున్నారు. మాంసాహారంలో బీ12 పుష్కలంగా లభిస్తుందని, పచ్చని ఆకు కూరగాయలు తింటే కాస్త జ్ఞాపకశక్తి పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఏకాగ్రత తగ్గుతోంది యువత, విద్యార్థుల్లో ఏకాగ్రత తగ్గుతోంది. దీంతో తాము చేయాల్సిన దానిపై దృష్టి సారించలేక పోతున్నారు. ప్రతి చిన్న విషయానికీ వస్తువులపై ఆధారపడుతున్నారు. లెక్కలు చేయాలంటే కాలిక్యులేటర్ వాడుతున్నారు. ఎక్కువ సమయం సెల్‌ఫోన్‌తో గడుపుతున్నారు. దీంతో ప్రతి విషయాన్నీ మరిచిపోతున్నారు. ఒత్తిడిని జయించేందుకు మెదడుకు పదును పెట్టాలి. స్వతహాగా లెక్కలు కట్టడం, ఫోన్ నంబర్లు గుర్తు పెట్టుకోవడం వంటివి చేయాలి. పౌష్టికాహారం తీసుకోవడం చాలా అవసరం. మార్కులు కోసం తల్లిదండ్రులు పిల్లలపై వత్తిడి తేకూడదు. ఇది వారిని మరింత ఆందోళనకు గురిచేస్తుంది. – డాక్టర్ వి.రాధికారెడ్డి, మానసిక వైద్య నిపుణులు, విజయవాడ ప్రభుత్వాస్పత్రి -
వజ్ర కాయమా..? వజ్రంలాంటి మనసా?
ధ్యానం, యోగం అనేవి చిత్త ఏకాగ్రత కోసం, దృఢ చిత్తం కోసం చేసే సాధనా మార్గాలు. అలాంటి మార్గంలో సాధన చేయాలనుకున్నారు ఏడుగురు అన్నదమ్ములు. వారు కాశీరాజ్యవాసులు. ఏడుగురూ సర్వాన్ని త్యజించి అడవికి వెళ్లారు. రాలిన పండ్లు, పక్షులు తిని వదిలిన పండ్లు మాత్రమే తినేవారు. పులులూ, సింహాలూ వేటాడి తిని వదిలేసిన మాంసాన్నే ముట్టేవారు.జీవహింస చేయకుండా అలా జీవిస్తున్నారు. వారు ఎంత ప్రయత్నించినా మనస్సును అదుపు చేయడం కాస్త కష్టంగానే తోచింది. దాంతో వారి సాధన మనస్సు నుండి శరీరానికి మారింది. యోగసాధన మారి క్రమేపీ యోగాసనాల సాధనకు మళ్లారు. రకరకాల ఆసనాలు వేస్తూ శరీరాన్ని వజ్రతుల్యంగా మార్చుకున్నారు. ఎండా, వానా, చలి బాధల్ని తట్టుకోగల శరీరాన్ని పొందారు. చివరికి శారీరక దృఢత్వమే యోగంగా నమ్మారు.కొన్నాళ్లకి ఆ ప్రాంతానికి ఒక ధ్యాని వచ్చాడు. వారి యోగసాధన చూసి, వారితో ‘‘యోగులు మిగిలింది మాత్రమే తినాలి. మీరు నిజంగా మిగిలిందే తింటున్నారా?’’అనడిగాడు.‘‘అవును స్వామీ! మేము జీవహింస చేయం. పక్షులూ, జంతువులూ తినగా మిగిలిందే తెచ్చుకు తింటున్నాం’’ అన్నారు.‘‘అయితే, ఎంగిలి తింటున్నారన్నమాట. ఎంగిలి తిని, ఎంగిలి సాధన చేస్తున్నారన్నమాట’’అన్నాడు. ‘‘మిగిలింది తినాలంటున్నారు. ఎంగిలి అంటున్నారు. ఏమి దీని మర్మం?’’అని అడిగారు వారు.‘‘మిగిలింది తినడం అంటే... ఒకరికి పెట్టగా మిగిలింది తినడం. ఒకరు తిని మిగిల్చింది తినడం కాదు. మొదటిది త్యాగం. రెండోది లోభం. అదే ఎంగిలి. ఏ యోగి దృఢచిత్తం కోసం సాధన చేస్తాడో ఆ యోగిసాధన ఒకరికి పెట్టగా మిగిలింది తినడంతో సమానం. ఏ యోగి దృఢశరీరం కోసం సాధన చేస్తాడో ఆ యోగ సాధన ఒకరు తిని మిగిల్చినది తిన్నదానితో సమానం’’ అని చెప్పాడు.ఆ సోదరులు తమ తప్పు తెలుసుకున్నారు. మిగిలింది తినడం అంటే ఏమిటో గ్రహించి, సరైన సాధన చేశారు. ధ్యానం అంటే మనోసాధన అని, బుద్ధుడు చెప్పిన సందేశం ఇది. డా. బొర్రా గోవర్ధన్ -
స్లీప్టెస్ట్తో నా సమస్య తెలుస్తుందా?
స్లీప్ కౌన్సెలింగ్ నా వయసు 26 ఏళ్లు. సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అవుతున్నాను. గత ఆర్నెల్లుగా నాకు సరిగా నిద్రపట్టడం లేదు. నిద్రలో ఉన్నప్పుడు తరచూ లేచికూర్చుంటున్నాను. అయితే నాకు ఆ విషయం తెలియడం లేదు. నా రూమ్మేట్స్ చెబుతున్నారు. పగటివేళ మగతగా ఉంటోంది. ఒక్కోసారి క్లాసులో పాఠం వింటూ నిద్రపోతున్నాను. వారం కిందట డాక్టర్‌కు చూపించుకుంటే స్లీప్ టెస్ట్ చేయించుకొమ్మన్నారు. ఆ టెస్ట్ వల్ల ఏం తెలుస్తుంది? – ఎన్ వైష్ణవి, వైజాగ్ స్లీప్ టెస్ట్‌ను వైద్యపరిభాషలో పాలీసోమ్నోగ్రఫీ అంటారు. ఇది ఒక వ్యక్తిలో స్లీప్ డిజార్డర్స్ (నిద్ర సంబంధిత సమస్యలను) గుర్తించి, నిర్ధారణ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఈ పరీక్షలో ఒక వ్యక్తి నిద్రలో ఉన్నప్పుడు అతడి బ్రెయిన్‌వేవ్స్, రక్తంలో ఆక్సిజన్ పాళ్లు, గుండె స్పందనల రేటు, శ్వాస స్థాయి, కనుగుడ్లు – కాళ్ల కదలికలను రికార్డు చేస్తారు. ఆసుపత్రి లేదా స్లీప్ సెంటర్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకోసం సాయంత్రం పొద్దుపోయాక రావాల్సిందిగా పేషెంట్‌కు సూచిస్తారు. రాత్రి ఆ వ్యక్తి నిద్రపోయినప్పుడు స్లీప్ పాటర్న్ లను నమోదు చేయడానికి వీలుకలుగుతుంది. ఒక వ్యక్తిలో స్లీప్ డిజార్డర్‌ను గుర్తించడమే కాకుండా ఇప్పటికే నిద్రసంబంధిత సమస్యలు ఉన్నట్లు నిర్ధారణ చేయడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. సాధారణంగా వయోజనులకు 7 – 8 గంటల నిద్ర అవసరం. అయితే ఈ నిద్రసమయంలో అందరిలోనూ ఒకేలా ఉండదు. ఇందులోనూ ఎన్నో దశలు ఉంటాయి. ఉదాహరణకు నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఎన్‌ఆర్‌ఈఎమ్) దశ ప్రారంభమైన తర్వాత ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ అనే దశకు మారుతుంది. నిద్రపోతున్న సమయంలో ఈ రెండు దశలు ఒక క్రమబద్ధమైన రీతిలో కొనసాగుతుండటం కనిపిస్తుంటుంది. ఎన్‌ఆర్‌ఈఎమ్ దశలో నిద్రలో ఉన్న వ్యక్తి కనుపాపల్లో కదలికలు ఉండవు. కానీ గంట తర్వాత ఆర్ఈఎమ్ దశలోకి ప్రవేశించగానే కనుపాపలు వేగంగా కదులుతాయి. వ్యక్తిలో కలలు వచ్చేది ఈ ఆర్ఈఎమ్ సమయంలోనే. ఎన్‌ఆర్‌ఈఎమ్ దశ, ఆర్ఈఎమ్ దశల మధ్య 90 నిమిషాల వ్యవధి ఉంటుంది. ఒక వ్యక్తి రాత్రి నిద్రపోయే సమయంలో ఆరుసార్లు ఈ ఎన్‌ఆర్‌ఈఎమ్, ఆర్ఈఎమ్ల సైకిల్స్ (చక్రభ్రమణాలు) సాగుతాయి. నిద్ర సమయం గడుస్తున్న కొద్దీ ఆర్ఈఎమ్ వ్యవధి పెరుగుతుంది. స్లీప్ డిజార్డర్స్ ఈ సైకిల్స్‌ను దెబ్బతీస్తాయి. పాలీసోమ్నోగ్రఫీ పరీక్షలో వ్యక్తి తాలూకు నిద్రలోని దశలను గమనించి, ఏ స్లీప్ పాటర్న్ దెబ్బతింటున్నది అన్న అంశాన్ని నిపుణులు గుర్తిస్తారు. పేషెంట్లో కొన్ని ప్రత్యేక లక్షణాలను గమనించినప్పుడు ఈ స్లీప్టెస్ట్ చేయించుకోవాల్సిందిగా డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. స్లీప్ ఆప్నియా కారణంగానో లేదా మరో ఇతర సమస్య వల్లనో వ్యక్తి తాలూకు శ్వాస తరచూ నిలిచిపోవడం; వ్యక్తి తన ప్రమేయం లేకుండా నిద్రలో తరచూ కాళ్లు కదుపుతుండటం, రోజంతా మగతగా ఉంటూ హఠాత్తుగా నిద్రలోకి జారుకుంటూ ఉండే నార్కోలెప్సీ వంటి పరిస్థితులు; నిద్రలో ఉండగా నడవడం లేదా లేచి తిరగడం వంటి అసాధారణ ప్రవర్తనలు; అకారణంగా కొనసాగుతున్న తీవ్రమైన నిద్రలేమి వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఈ స్లీప్ టెస్ట్‌ను చేయించుకోవాల్సిందిగా డాక్టర్లు సూచిస్తారు. ఈ పరీక్షతో సమస్యను కచ్చితంగా నిర్ధారణ చేసి, వెంటనే చికిత్స ప్రారంభించడానికి వీలుకలుగుతుంది. రాత్రంతా నిద్రపట్టడంలేదు... ఎందుకిలా? నా వయసు 47 ఏళ్లు. ఒక చిట్‌ఫండ్ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాను. ఏడాదికాలంగా నాకు రాత్రిళ్లు నిద్రపట్టడం చాలా కష్టమవుతోంది. ఒకరోజు తెలతెలవారేదాకా నిద్రపట్టక, పొద్దున్నే కాసేపు మాత్రం పడుకోగలుగుతున్నాను. రోజంతా నిస్సత్తువ, చికాకుగా ఉంటోంది. పనిమీద ఏకాగ్రత కుదరడం లేదు. మధ్యాహ్నం నిద్ర ముంచుకువస్తోంది. దాంతో ఈమధ్య రాత్రిళ్లు నిద్రమాత్రలు వేసుకోవడం మొదలుపెట్టాను. అయితే మా ఖాతాదారుగా ఉన్న ఓ వైద్యుడితో ఈ సమస్యను ప్రస్తావిస్తే వెంటనే నిద్రమాత్రలు మానేయమని అన్నారు. ఇది స్లీప్ డిజార్డర్లా అనిపిస్తోంది. హైదరాబాద్‌కు వెళ్లి స్పెషలిస్టుకు చూపించుకొమ్మని సలహా ఇచ్చారు. నా సమస్య ఏమిటి, ఎందువల్ల వస్తుంది. దయచేసి తెలియజేయండి. – సీహెచ్ మృత్యుంజయం, సిద్ధిపేట క్రమం తప్పకుండా తగినంత నిద్రపోలేకపోవటానికి సంబంధించిన చాలా లక్షణాలను కలుపుకొని స్లీప్ డిజార్డర్స్ (నిద్ర సంబంధిత ఆరోగ్య సమస్యలు)గా చెబుతుంటారు. ఈ సమస్యలకు ఏ అనారోగ్యమైనా కారణం కావచ్చు. లేదా తీవ్రమైన మానసిక ఒత్తిడి, తీరికలేని పనుల ఒత్తిడి, మరికొన్ని ఇతర కారణాలూ కావచ్చు. మొత్తం మీద ప్రతివ్యక్తీ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటారు. అయితే ఇది నెలల తరబడి కొనసాగుతున్నట్లయితే దాన్ని తీవ్రమైన సమస్యగా పరిగణించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా స్లీప్ డిజార్డర్స్ వల్ల బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మనదేశంలో పట్టణప్రాంతాల్లో వయోజనులు, ప్రత్యేకించి నలభౖయెదేళ్లకు పైబడిన వారిలో దాదాపు సగం మంది నిద్రలేమి, నిద్రసంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు అంచనా. ఇది వ్యక్తుల సాధారణ జీవితానికి ఆటంకం అవుతుంది. మీరు చెప్పిన లక్షణాలైన నిస్సత్తువ మాత్రమే గాక మానసికంగా అస్తవ్యస్తంగా అనిపిస్తుంటుంది. దేనిపైనా ఏకాగ్రత కుదరదు. ఊరికే చికాకు పడుతుంటారు. శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కొంతమందిలో శారీరక, మానసిక రుగ్మతల కారణంగా స్లీప్ డిజార్డర్స్ ఏర్పడతాయి. ఒకసారి ఆ రుగ్మతలకు చికిత్స చేయడం వల్ల వాటితోపాటే నిద్రలేమి సమస్య కూడా పరిష్కారమవుతుంది. అందు వల్ల ముందుగా మీరు మొదట ఫిజీషియన్‌ను కలిసి, ఆయన సూచించిన వైద్యపరీక్షలు చేయించుకోండి. ఎలాంటి వ్యాధులు లేవని నిర్ధారణ అయితే మీది స్లీప్ డిజార్డర్‌గా భావించవచ్చు. ఇలా ఆరోగ్యకారణాలు ఏవీ లేకుండా స్లీప్ డిజార్డర్స్ కనిపించినప్పుడు దానికి వైద్యపరమైన చికిత్సతో పాటు జీవనశైలి మార్పులు చేసుకోవడం కూడా అవసరం. ఇతరత్రా ఎలాంటి అనారో గ్యాలు లేకుండా నిద్రకు సంబంధించిన తీవ్రమైన సమస్యలు ఉన్నప్పుడు స్లీప్స్పెషలిస్ట్ను సంప్రదించండి. డాక్టర్ వై. గోపీకృష్ణ, సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
బహుభాషా లేఖిని
చేతిరాతను బట్టి మనిషి గుణగణాలను అంచనా వెయ్యొచ్చని అంటారు. ఇప్పుడు కంప్యూటర్ యుగంలో చేతిరాతకు ప్రాధాన్యం తగ్గినప్పటికీరాత పరీక్షల్లో మాత్రం అందమైన చేతిరాతకు అదనపు విలువ తోడవుతుంది. అలాంటి చేతి రాత ఒకరి జీవిత గమనాన్ని మార్చింది. జెనెటిక్ ఇంజనీర్ అవుదామనే ఆలోచన నుంచి న్యూరో సైంటిస్ట్ కావాలనేలక్ష్యాన్ని నిర్దేశించింది. అలా చేతిరాతతో జీవితానికి చక్కటి బాటను దిద్దుకున్నారు సంగరాజు అశ్విని. తిరుపతిలోని ‘మేక్ మై బేబీ జీనియస్’(ఎంఎంబీజి) స్కూల్ యజమాని సంగరాజు భాస్కర రాజు కుమార్తె అశ్విని. తన లక్ష్యం మారడానికి వెనుక ఉన్న కారణాలను సాక్షితో పంచుకున్నారామె. సెలవుల్లో ఆలోచన మారింది ‘‘జెనెటిక్ ఇంజనీరింగ్ చేయాలని చిన్నప్పటి నుంచి నా కోరిక. అందుకు అనుగుణంగానే పదో తరగతి వరకు చదివాను. మంచి మార్కులు వచ్చాయి. ఇంటర్లో ఎంబైపీసీ గ్రూపులో చేరాను. నాన్న చేతిరాత నిపుణులు కావడంతో వేసవి సెలవుల్లో చేతిరాతపై పిల్లలకు శిక్షణ శిబిరం నిర్వహించేవారు. అందమైన చేతి రాత కోసం నాన్న దగ్గరే శిక్షణ తీసుకున్నా. అయితే అందరిలా కాకుండా భిన్నంగా గుర్తింపు పొందాలనుకున్నా. అందమైన చేతిరాత కోసం నాన్న చాలా పరిశోధనలు చేశారు. అందులో నుంచి రూపుదిద్దుకున్నవే ప్యాటర్న్స్ (పలక లాంటి 8 పరికరాలు). ప్యాటర్న్స్‌లో రెండు చేతులతో రాయడం సాధన చేశాను. అదనంగా మిర్రర్ రైటింగ్, అప్ సైడ్ డౌన్ సాధన చేశాను. కుడి చేతితోనే కాకుండా ఎడమ చేతితో రాయడం కూడా సులభంగా నేర్చుకున్నా. రెండు చేతులతో 21 భాషలు ‘‘సాధారణంగా ఒకటి, రెండు లేక మూడు భాషల్లో రాయగలం. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో రాయడాన్ని నేర్చుకున్నా. నాన్నకు చెప్పడంతో నాకు ప్రత్యేకంగా 18 భాషలకు సంబంధించిన పలకలు (ప్యాట్రెన్స్) చేయించారు. అందులో 18 భారతీయ భాషలు, మిగిలిన మూడు విదేశీ భాషలు. భారతీయ భాషల్లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కొంకణి, మరాఠీ, మైథిలి, మణిపురి, ఒరియా, పంజాబీ, సంస్కృతం, శాంథలి, సింధి, ఉర్దూలతోపాటు, విదేశీ భాషలు ఇంగ్లీషు, నేపాలి, అరబిక్‌లో రాయడం సాధన చేశాను. అలా మొత్తం 21 భాషల్లో కుడి, ఎడమ చేతులతో రాయగలను. మిర్రర్ రైటింగ్, అప్ సైడ్ డౌన్ రైటింగ్ కూడా వచ్చు. మిర్రర్ రైటింగ్ ఇండియాలో కొంతమంది రాయగలుగుతున్నప్పటికీ, అప్‌సైడ్ డౌన్ రైటింగ్ మాత్రం అసాధారణమే. డిజార్డర్ పిల్లలకు బోధన ‘‘చేతిరాతలో నిపుణులైన నాన్న మేక్ మై బేబీ జీనియస్ అనే పేరుతో పాఠశాలను నెలకొల్పారు. చదువులో వెనుకబడ్డ పిల్లలను, అటెన్షన్ డెఫిషిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ), అటెన్షన్ డెఫిషిట్ డిజార్డర్(ఏడీడీ), ఆటిజమ్ స్పెక్ట్రమ్ డిజార్డర్స్(ఏఎస్డీ) సమస్యలతో బాధ పడుతున్న పిల్లలకు బోధించడం ఈ స్కూల్ ప్రత్యేకత. సాధారణంగా ఇలాంటి పిల్లలను ఏ పాఠశాలలోనూ పెద్దగా పట్టించుకోరు. వారి సమస్యలు అర్థంకావు. వయసు పెరుగుతున్నా, తరగతులు మారుతున్నా చదువులో మాత్రం వెనుకంజలోనే ఉంటారు. ఇలాంటి పిల్లలకు మంచి చదువు అందించి సమాజంలో అందరిలా తీర్చిదిద్దాలన్నదే నాన్న కోరిక, నా లక్ష్యం కూడా అదే. దాని కోసం న్యూరో సైంటిస్టు కావాలనుకుంటున్నా. లక్ష్యం మార్చిన ఘటన ‘‘తిరుపతి భవానీనగర్‌లో నివాసముంటున్న మోహన్‌మురళి చంద్రగిరి పీహెచ్సీలో సూపర్వైజర్. ఆయన కుమారుడు దేవనాగ్కు అప్పుడు 16ఏళ్లు. పుట్టినప్పటి నుంచే దృష్టి, నత్తి. దీంతో చదువులో వెనుకబడ్డాడు. ఆ వయసుకు పదో తరగతి పూర్తయి ఉండాలి. కానీ అతను ఎనిమిదో తరగతి చదువుతున్నా కనీసం పదాలు, ఎక్కాలు, గుణింతాలు ఏవీ రావు. తల్లిదండ్రులు చివరి ప్రయత్నంగా మా పాఠశాలలో చేర్పించారు. వారి వేదన వర్ణనాతీతంగా ఉండేది. పిల్లవాడి సమస్యను గుర్తించి ఇక్కడ వివిధ రకాల శిక్షణ ఇచ్చాం. దీంతో అతను రెండేళ్లకే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి సాధించాడు. ఈ సంవత్సరం ఓపెన్ స్కూల్ ద్వారా పదోతరగతి పరీక్ష రాసి పాసయ్యాడు. ప్యారడీ పాటలు రాస్తున్నాడు. సొంతంగా కథలు రాస్తున్నాడు. ఆ తల్లిదండ్రుల సంతోషం మాటల్లో వర్ణించలేం. అది నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. మొదట్లో జెనెటిక్ ఇంజనీరింగ్ చేయాలనుకున్న నా లక్ష్యాన్ని మార్చుకోవడానికి కారణం ఈ ఘటనే. న్యూరో సైన్స్ చదివి న్యూరో సైంటిస్ట్ అవుదామని నిశ్చయించుకున్నా. నాన్నకు తోడుగా ఉంటూ సహకారం అందించాలనుకున్నాను. దీనికోసం ఇంటర్లో ఎంబైపీసీ తీసుకున్నా. డిగ్రీలో బయోటెక్నాలజీ తీసుకున్నా. డిగ్రీ మొదటి సెమిస్టర్ వరకు రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లాను. ఆ తరువాత పాఠశాలలోనే పిల్లలకు బ్రెయిన్ జిమ్‌లో శిక్షణ ఇస్తూ డిగ్రీ పూర్తి చేశాను. న్యూరో సైన్స్ కోర్సు ఇండియాలో లేదు. విదేశాలకు వెళ్లాలి. దీనికోసం ఇక్కడే సైన్స్‌కు అనుబంధంగా ఉన్న పీజీ కోర్సు చేసి, ఆ తరువాత న్యూరో సైన్స్ చేయాలనుకుంటున్నా’’ అని చెప్పారు అశ్విని. యంగ్ అచీవర్ అవార్డు చేతిరాతను సాధనం చెయ్యడం చదువులో రాణించడానికి తనకు చాలా దోహదపడిందని అంటారు అశ్విని. ‘‘రెండు చేతులతో విభిన్న భాషల్లో విభిన్నంగా రాయడంతో మల్టిపుల్ స్కిల్స్ పెరిగాయి. నాలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, సృజనాత్మకతతోపాటు ఆత్మస్థైర్యం పెంపొందింది. అప్పటి వరకు గంట సమయంలో చదివి గుర్తు పెట్టుకునే అంశాలను కేవలం 15 నిమిషాల్లో పూర్తి చేసేస్తున్నా. దీంతో చదువుకోవడానికి సమయం చాలా కలిసొచ్చింది’’ అన్నారు అశ్విని. విలక్షణమైన ఆమె చేతిరాతకు అనేక అవార్డులు కూడా వచ్చాయి. జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, రికార్డ్ హోల్డర్ రికార్డ్స్, అమేజింగ్ వరల్డ్ రికార్డ్స్.. ఇలా ఆయా సంస్థలు అవార్డులను ప్రదానం చేశాయి. ఇటీవల విజయవాడలో యంగ్ అచీవర్ అవార్డును అందుకున్నారు. – ఎస్.శశికుమార్, సాక్షి, తిరుపతి -
ఏకాగ్రతకు 10 మెట్లు
అర్జునుడు వీరత్వం వల్ల వీరుడు కాలేదు.కాన్సన్ట్రేషన్ వల్ల అయ్యాడు. పక్షి కన్ను మీద దృష్టి నిలపగలగడం వల్లే అతడు వీరుడుగా నిలబడగలిగాడు. ఏ మనిషికైనా ప్రథమ ఆయుధం ఏకాగ్రతే.అది వెంట ఉంటే మిగిలిన శక్తులన్నీ తోడు నిలుస్తాయి. లక్ష్య సాధన సులువవుతుంది. గమ్యం దరి చేరుతుంది.కాని ఆ ఏకాగ్రతకు భంగం వాటిల్లుతుంటే? దృష్టి ఒక అంశం మీద నుంచి మరో అంశం మీదకు వెంటవెంటనే మరులుతూ ఉంటే? సమస్య ఉన్నట్టే.ఏకాగ్రతను పెంచడానికి వ్యాయామాలూ, చిట్కాలు ఉన్నాయా?ఈ వ్యాయామాలు అందరికోసమే అయినా... ప్రత్యేకంగా ఇప్పుడు పరీక్షల సీజన్ కాబట్టి చదివే సమయంలో ఏకాగ్రత కలగడానికి ఏం చేయాలి? ఇక్కడ కొన్ని వ్యాయామాలు ఉన్నాయి. అనుసరించండి... ప్రయోజనం పొందండి. మీరు జిమ్‌లో చేరగానే పెద్ద బరువులెత్తుదామని ఉబలాటపడతారు. కానీ ఎత్తలేక ఇబ్బంది పడతారు. దాంతో తక్కువ బరువులతో మొదలుపెట్టి క్రమంగా శక్తిని పుంజుకుంటూ... ఒక దశ తర్వాత పెద్ద పెద్ద బరువులనూ చులాగ్గా, చురుగ్గా ఎత్తగలుగుతారు. ఏకాగ్రత విషయంలో కూడా ఇదే సూత్రం. మన మైండ్ కూడా ఒక మజిలే అని భావించి సాధన చేస్తే ఇది సాధ్యమే. థెరాన్ క్యూ డ్యుమాంట్ అనే రచయిత ‘ద పవర్ ఆఫ్ కాన్సంట్రేషన్’ పుస్తకంలోని మెదడు తన ఏకాగ్రత శక్తినిపెంచుకోవడానికి కొన్ని వ్యాయామాలు సూచించాడు.వీటిలో కొన్ని హాస్యాస్పదంగా అనిపించినా, వాటిని అనుసరించిన వారికి తగిన ఫలితాలు కనిపించాయని చాలా మంది తేల్చిచెప్పారు. ఆ చిట్కాలూ, వ్యాయామ సూచనలు ఇలా ఉన్నాయి. కుర్చీలో కదలకుండా కూర్చోండి అభ్యాసం–1 ఒక కుర్చీలో సౌకర్యంగా కదలకుండా కూర్చోండి. మొదట మీకిది చాలా సులభం అనిపిస్తుంది. కానీ కష్టం. కొద్దిసేపు కూర్చున్న తర్వాత బోర్‌గా అనిపిస్తుంది. అటు ఇటు కదలాలని, లేవాలని అనిపిస్తుంది. ఏ కదలికలూ లేకుండా కనీసం 15 నిమిషాల పాటు అలా కదలకుండా కూర్చోండి. అంతసేపు మీరు ఎలాంటి కదలికలూ లేకుండా కూర్చోగలిగారంటే ఆ తర్వాత ఎంత సేపైనా కూర్చోవచ్చని మీకు తెలుస్తుంది. అలా కూర్చొని ఎంతసేపైనా చదవుకోగలమనే నమ్మకం (కాన్ఫిడెన్స్) కలగడానికి మొదటి మెట్టు ఈ సాధన. నీళ్లు నిండిన గ్లాసుపై దృష్టి నిలపండి అభ్యాసం–2 ఒక గ్లాసులో నిండుగా నీళ్లు నింపండి. ఆ గ్లాసును వేళ్లతో పట్టుకొని మీ చేయి చాచి, దాన్నే చూస్తూ ఉండండి. నీళ్లు ఏమాత్రం బయటకు తొణకకుండా ఎంతసేపు ఉంచగలరో చూడండి. కొందరికి మొదట నిమిషంలోనే తొణకవచ్చు. ఇదే వ్యాయామాన్ని కొనసాగిస్తూ మీ వ్యవధిని ఒక నిమిషం నుంచి 5 నిమిషాలకు పెంచండి. మొదట ఒక చేత్తో చేశాక, తర్వాత మరో చేతితోనూ దీన్ని చేయండి. మీకు తెలియకుండానే కదలిపోయే కండరాలపై నియంత్రణకు ఈ వ్యాయామం దోహదపడుతుంది. ప్రతి కండరపు కదలికా మీ నియంత్రణలోకి వచ్చేందుకు దోహదం చేస్తుందీ వ్యాయామం. వాసన చూసే శక్తిని పెంచుకోండి అభ్యాసం–3 మీరు తోటలో నడుస్తున్నప్పుడు రకరకాల పూల వాసనలు తెలుస్తుండవచ్చు. కాని ఏది ఏ పువ్వు వాసన అని నిర్దిష్టంగా పసిగట్టేలా సాధన చేయండి. వాసనలను బట్టి అక్కడ ఉన్న పూవులేమిటి, మీరు మిస్ అయినవేమిటి అని చూసుకుంటూ సాధన చేస్తే... మీ ఏకాగ్రత పెరిగినట్టే భావించవచ్చు. ఇలా సూక్ష్మంగా వాసనలను పసిగట్టే సామర్థ్యం పెంపొందితే... ఒకనాడు ఎప్పుడో పీల్చిన నైట్‌క్వీన్ వాసనకూ, మల్లె వాసనలను పసిగట్టగలగడమే కాదు... అంతగా తెలియని వారికి అవి వేర్వేరు అని వివరించవచ్చు కూడా. రిలాక్స్డ్గాగుండె చప్పుడు వినండి అభ్యాసం–4 మొదట మంచం మీద రిలాక్స్డ్గా పడుకోవాలి. ప్రతి కండరమూ వదులుగా రిలాక్స్డ్గా ఉండేలా చూడాలి. అప్పుడు మన గుండె స్పందన మీద దృష్టి సారించాలి. మీలోని గుండె అంత చిన్నగా ఉన్నప్పటికీ, ఆ గొప్ప అవయవం మీ ఒంటి మొత్తానికీ అనుక్షణం, ప్రతిక్షణం ఎలా రక్తసరఫరా చేస్తుందో ఊహించుకోండి. ఒక చివరన ఉన్న మీ కాలి బొటనవేలు మొదలు మీ తల వరకు అన్ని అవయవాలకూ అనునిత్యం రక్తం అందుతున్న తీరును ఊహిస్తూ, ఆ అనుభూతిని ఆస్వాదించండి. ఈ అనుభూతితో కలిగే భావోద్వేగం... మిమ్మల్ని చాలా రిలాక్స్ చేయడంతో పాటు మీరు హాయిగా, సంతోషంగా ఉన్న ఫీలింగ్ కలగజేస్తుంది. మీరు సంతోషంగానూ, ఆరోగ్యకరంగానూ ఉన్నారన్న ఫీలింగ్ కారణంగా ఎలాంటి అంశంపైనైనా తదేకంగా, ఏకాగ్రతతో దృష్టికేంద్రీకరించగలమన్న ఆత్మవిశ్వాసాన్ని పొందడం సాధ్యమవుతుంది. నిద్రపై దృష్టి కేంద్రీకరించండి అభ్యాసం–5 దీన్ని ‘వాటర్ మెథడ్’ అని కూడా అంటారు. ఇది చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. కానీ ఇది చాలా ప్రభావపూర్వకమైనది. మీరు నిద్రించే గదిలోని ఒక బల్ల మీద ఒక గ్లాసు నిండా నీళ్లు నింపి ఉంచండి. ఒక కుర్చీని ఆ బల్ల దగ్గర వేసి, దానిలో మీరు రిలాక్స్డ్గా కూర్చొండి. అలా కూర్చున్న తర్వాత, నిలకడగా, స్పష్టంగా ఉన్న ఆ నీటిని తదేకంగా చూస్తూ... ఇలా ఆలోచించండి. ‘అబ్బ... ఆ నీళ్లు ఎంత స్పష్టంగా, పారదర్శకంగా, నిర్మలంగా ఉన్నాయి. నా మదిలోని ఆలోచనలు కూడా నెమ్మదించాలి. అవి అలా క్రమంగా నెమ్మదిస్తూ పోయి, నా హృదయం కూడా ఆ నీళ్లంతటి ప్రశాంతంగా మారాలి’ అంటూ మీకు మీరు చెప్పుకుంటూ పోండి. మీ నాడీకణాల్లో చెలరేగుతున్న ఆలోచనలను నెమ్మదించుకుంటూ పోతున్న అనుభూతి పొందుతూ అలా నిద్రలోకి జారుకుంటున్నట్లుగా భావించాలి. అలా మత్తుగా సోలిపోతున్నట్లుగా అనుభూతి చెందుతూ క్రమంగా బెడ్ మీదికి చేరి నిద్రలోకి జారిపోవాలి. ఈ అభ్యాసాన్ని క్రమం తప్పకుండా పాటిస్తూపోతే... ఒకనాటికి నిద్రలేమి రోగులు కూడా ప్రశాంతంగా నిద్రపోతూ తమ నిద్రలేమి (ఇన్సామ్నియా) వ్యాధిని అధిగమించగలరు. అద్దం ముందు మాట్లాడండి అభ్యాసం–6 మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటూ ఉండండి. మీ ప్రతిబింబంలో మీ కళ్లు కనిపించే చోట మరో రెండు కళ్ల బొమ్మలు గీయండి. ఆ రెండు కళ్లూ మిమ్మల్నే చూస్తున్నట్లుగా భావించండి. నిటారుగా కూర్చొని మీరు కూడా తదేకంగా ఆ కళ్లనే చూస్తుండండి. ఎదురుగా ఆ కళ్లు కలిగిన వేరే వ్యక్తి అక్కడెవరో ఉన్నట్లుగా భావిస్తూ... మీలో మెదలుతున్న ఆలోచనలపై దృష్టి కేంద్రీకరించండి. ఆ కళ్లు కలిగి ఉన్న వ్యక్తి మీకు చాలా నమ్మకమైన వ్యక్తిగా భావించండి. మీలో కలుగుతున్న పూర్తి అసంబద్ధమైన ఆలోచనలను సైతం నిస్సంకోచంగా ఆ కళ్లు కలిగి ఉన్న ఊహావ్యక్తితో పంచుకుంటున్నట్లుగా మాట్లాడుతూ ఉండండి. నెమ్మదిగా గాలిని ఊపిరితిత్తుల్లోకి లోతుగా పీల్చుకుంటూ ఉండండి. ఆ ఊహావ్యక్తితో అలా ఒక వాదనాసరళిలో మాట్లాడుతూ పోతే... అసంబద్ధమైన అంశాలే క్రమంగా సక్రమంగా మారిపోతాయి. ఒక సందిగ్ధపూరితమైన వేవరింగ్ కండిషన్ నుంచి మీకు స్పష్టత వచ్చేలా ఏకాగ్రత వైపునకు మీ ఆలోచనలు ప్రవహిస్తుంటాయి. మీరు ఈ అభ్యాసాన్ని కనీసం 3 నుంచి 5 నిమిషాలు చేసినా చాలు... మీరిలా సాధించిన ఆ ఏకాగ్రతతో క్రమబద్ధంగా లేని ఆ ఆలోచనలే సక్రమంగా మారుతాయి. మీకు మేలు చేకూర్చే మంచి ఆలోచనలుగా అవి ఆవిర్భవిస్తాయి. ఒకే ముక్కురంధ్రంతో శ్వాసించండి అభ్యాసం–7 ఒక కుర్చీలో ప్రశాంతంగా, నిటారుగా కూర్చొండి. మీ వేలితో ఒక ముక్కు రంధ్రాన్ని మూసేయండి. మరో ముక్కు రంధ్రంతో నెమ్మదిగా, గాఢంగా గాలిని లోపలికి పీలుస్తూ పోండి. ఊపిరితిత్తుల నిండా గాలి నిండాక ఒకే క్రమంలో 10 అంకెలు లెక్కబెట్టండి. అప్పుడు మెల్లగా గాలిని వదలండి. ఇలా మొదట కుడిముక్కు రంధ్రాన్ని మూసి ప్రాక్టీస్ చేశాక... తర్వాత ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసి అదే ప్రక్రియను ప్రాక్టీస్ చేయండి. ఇలా రోజూ 20 సార్లు చేయండి. మీ ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగడంతో పాటు, మీలో మంచి ఆక్సిజన్ చేరి, ఏకాగ్రతతో పాటు దృష్టికేంద్రీకరణ శక్తి పెరుగుతుంది. అనవసరపుఆలోచనలపై దృష్టి నిలపకండి అభ్యాసం 8 ముఖ్యమైన సమయంలో అనవసరమైన ఆలోచనలు దృష్టిని కేంద్రీకరించకుండా అడ్డుపడుతుంటాయి. అందుకే దేనిపై దృష్టి నిలపాలి అనే విషయాన్ని పదే పదే ఆలోచిస్తుండాలి. అప్రాధాన్యమైన అంశానికి... అసలు పని పూర్తయ్యాక ప్రాధాన్యం ఇవ్వవచ్చంటూ మనకు మనం సజెషన్ ఇచ్చుకోవాలి. మొదట ప్రాధాన్యాంశం మీదే మన దృష్టి ఉండేలా ప్రాక్టీస్ చేయాలి. మన ప్రాధాన్యాంశాన్ని మనం పూర్తి చేయగానే మనకు జరగబోయే మేలు, మనకు లభించబోయే అభినందనలూ, మనం పొందే ఆనందాలను పదే పదే గుర్తు చేసుకోవాలి. దాంతో మీ అప్రాధాన్య ఆలోచనలు, మీకు అప్పటికి అప్రస్తుతమైన కోరికలు మనసు నుండి తొలగిపోతాయి. ఇలా క్రమంగా మీ మనసుపై అదుపు సాధించవచ్చు. ఇది సాధించిన వారికి... ఆ తర్వాత ఎలాంటి లక్ష్యాన్ని అయినా సాధించడం పెద్ద లెక్క కాదు. స్పష్టత తెచ్చుకోండి అభ్యాసం–9 చదివే సమయంలో... మనం చదివే అంశాన్ని అర్థం చేసుకోకపోతే ఎంత చదివినా ప్రయోజనం ఉండదు. అందుకే చదివే సమయంలో అది మనకు ఎంత అర్థమైంది అన్న అంశాన్ని తెలుసుకోవడం కోసం ఒక అభ్యాసం చేయవచ్చు. మొదట ఒక విషయాన్ని పూర్తిగా చదవండి. ఆ తర్వాత మీరు చదివిన టెక్స్›్టలో మీకు అర్థమైనదాన్ని సంక్షిప్తంగా రాయండి. ఇలా రాసే క్రమంలో మీకు ఏకాగ్రత కుదరడమే కాకుండా... మీరు చదివి అర్థం చేసుకున్న విషయంలో మరింత స్పష్టత వస్తుంది. ఈ అభ్యాసం చేసే సమయంలో మీరు చదివిన అంశాలు కొన్నింటిని తొలుత మీరు మరచిపోయి ఉండవచ్చు. కానీ మీరు రాస్తున్న క్రమంలో అవి గుర్తుకువస్తూ ఉంటాయి. అలా మీకు గుర్తుకు వస్తూ ఉన్నయంటేనే... మీకు ఏకాగ్రత పెరుగుతోందని అర్థం. దృష్టి కేంద్రీకరణను గమనించండి అభ్యాసం–10 మీరు ప్రశాంతంగా కూర్చొని మీ గోడగడియారం లేదా చేతి గడియారంలోని సెకండ్ల ముల్లును చూస్తూ ఉండండి. ఒక ఐదు నిమిషాల పాటు మరే అంశంపైకీ దృష్టి పోకుండా కేవలం సెకండ్ల ముల్లునే గమనిస్తూ ఉంటానని మీకు మీరే చెప్పుకోండి. ఒక్కోసారి అకస్మాత్తుగా మీ దృష్టి సెకండ్ల ముల్లు నుంచి పక్కకు తొలగిపోవచ్చు. కానీ మళ్లీ దాన్ని తిరిగి సెకండ్ల ముల్లు మీదికి తెండి. ఇది మొదట చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ పోనుపోనూ మీకు ధ్యానం లాంటి స్థితిపైకి దృష్టి మళ్లించడం ఎలాగో తెలుస్తుంది. ఇలా మీరు అనవసరమైన ఆలోచనల్లోకి జారిపోకుండా ఉండటం ఎలాగో ప్రాక్టిస్ చేస్తే... తొందరలోనే మీకు పూర్తిగా ధ్యానం మీదే దృష్టి కేంద్రీకరించి, ఆ ధ్యానంలో నిమగ్నం కావడం ఎలాగో తెలుస్తుంది. అలా ఆ అభ్యాసాన్ని కొనసాగించుకుంటూ పోతే... ఎలాంటి ఆలోచనలూ లేకుండా మనసును పూర్తిగా ప్రశాంత పరచుకోవడం ఎలాగో తెలుస్తుంది. అప్పుడా ప్రశాంత చిత్తంతో ధ్యానం సాధ్యపడుతుంది. ఈ అభ్యాసం ముగించాక... మనం నిజంగా ఏదైనా అంశంపై దృష్టి కేంద్రీకరిస్తే... దానిపై పూర్తిగా నిమగ్నం అయ్యే శక్తి మనకు సమకూరుతుంది. -
ఉన్నతంగా ఎదిగే శక్తి మీలో ఉందా?
సెల్ఫ్ చెక్ వివిధ రకాల వృత్తులలో ఉన్నవారు వారి ప్రత్యేకత నిలుపుకోవటానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అనుకున్నది సాధించేవరకు పోరాడుతూనే ఉంటారు. ఉన్నతంగా ఎదగటానికి అవసరమైన శక్తియుక్తులు మీలో ఉన్నాయోలేవో తెలుసుకోండి. 1. ప్రస్తుతం మీరు సాధించినదానికన్నా ఉన్నతంగా ఎదగాలని పట్టుదలగా ఉన్నారు. ఎ. కాదు బి. అవును 2. ఇతరుల విజయాన్ని చూసి స్ఫూర్తి పొందుతారు. ఎ. కాదు బి. అవును 3. అన్ని విషయాల్లో ఇతరులకన్నా ప్రత్యేకంగా కనిపించే ప్రయత్నం ఎప్పుడూ చేస్తారు. ఎ. కాదు బి. అవును 4. ఏపనినైనా ఏకాగ్రతతో చేస్తారు. ఎ. కాదు బి. అవును 5. సాధించినవాటి పట్ల తేలికగా సంతృప్తి చెందరు. ఎ. అవును బి. కాదు 6. మిమ్మల్ని వ్యతిరేకించేవారిపై ద్వేషభావాన్ని పెంచుకోరు. ఎ. కాదు బి. అవును 7. లక్ష్యాలు సాధించేందుకు నిత్యం శ్రమిస్తుంటారు. ఎ. కాదు బి. అవును 8. అవకాశాలను ఏమాత్రం వదులుకోరు. ఎ. కాదు బి. అవును 9. కొత్తవిషయాలు నేర్చుకోటానికి ముందుంటారు. ఎ. కాదు బి. అవును 10. సందర్భానుసారం ప్రవర్తిస్తారు. ప్రతి విషయంలో మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఎ. కాదు బి. అవును ‘బి’ లు ఏడు దాటితే కెరియర్లో దూసుకుపోవటానికి అవసరమైన శక్తిసామర్థ్యాలు మీలో ఉన్నట్లే. ‘ఎ’ లు ‘బి’ ల కంటే ఎక్కువగా వస్తే జీవితంలో పైకి రావటానికి మీరింకా కృషి చేయాలని అర్థం. -
బాబు సమస్య ఏడీహెచ్‌డీ కావచ్చు!
హోమియో కౌన్సెలింగ్ మా బాబు వయసు ఎనిమిదేళ్లు. ఒక చోట కుదురుగా ఉండడు. ఏకాగ్రత తక్కువ. దాదాపు ప్రతిరోజూ స్కూల్ నుంచి ఎవరో ఒక టీచర్ మావాడి ప్రవర్తన గురించి కంప్లయింట్ చేస్తుంటారు. మా వాడి ప్రవర్తనకు కారణం ఏమిటి? హోమియోలో వాడి సమస్యకు ఏదైనా చికిత్స ఉందా? – పరంధామయ్య, నల్లగొండ మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ బాబుకు అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) అనే సమస్య ఉందని అనిపిస్తోంది. ఈ సమస్య ఉన్న పిల్లలకు సాధారణంగా ఏమీ గుర్తుండదు. ప్రపంచవ్యాప్తంగా 5 శాతం మంది పిల్లలు ఈ సమస్యతో బారిన పడుతుంటారు. కొంతమంది పిల్లల్లో వారు పెరుగుతున్న కొద్దీ సమస్య తగ్గుతుంది. ఏడీహెచ్‌డీ అనేది సాధారణంగా ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లల్లో వస్తుంది. ఏడీహెచ్‌డీతో బాధపడే పిల్లలు సాధారణ పిల్లల్లా ఉండరు. సమస్యకు కారణాలు: ∙జన్యుపరమైన కారణాలు ∙తల్లిదండ్రులు ఎవరిలో ఒకరికి ఈ సమస్య ఉండటం ∙తక్కువ బరువుతో ఉండే పిల్లల్లోనూ, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల సమస్య రావచ్చు. లక్షణాలు: ∙మతిమరపు, తలనొప్పి ∙ఆందోళన, వికారం, నిద్రలేమి, చిరాకు ∙మానసిక స్థితి చక్కగా లేకపోవడం ∙ఒక చోట స్థిమితంగా ఉండలేకపోవడం ∙ఇతరులను ఇబ్బంది పెట్టడం. నిర్ధారణ: రక్తపరీక్షలు, సీటీ స్కాన్, ఎమ్మారై చికిత్స: హోమియోలో ఏడీహెచ్‌డీ సమస్యకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి వ్యక్తమయ్యే తీరు, లక్షణాలను విశ్లేషించి మందులు ఇవ్వాలి. ఈ మందుల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ సమస్యకు హోమియోలో స్ట్రామోనియమ్, చైనా, అకోనైట్, బెల్లడోనా, మెడోరినమ్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ -
వేగాన్ని నియంత్రిస్తే ఏకాగ్రత కుదురుతుంది
ఆర్తచింత అంటే... ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనసు కదలడం. ఈ కదలికలు ఊపిరిమీద, దాని వేగంమీద ఆధారపడతాయి. అందుకే బాగా కోపంగా ఉన్నా, ఒక భోగం అనుభవించినా ఊపిరిలో వేగం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనసు బాగా కదులుతుంది. అక్కడ మనసును కదలకుండా నిలబెట్టడం చేతనయి ఉండాలి. అలా నిలబెట్టడం ప్రాణాయామంతో సాధ్యం. ఇది బాగా సాధనచేస్తే ఊపిరిని నియమిత వేగంతో పీల్చడం, విడిచిపెట్టడం సాధ్యమవుతుంది. అందుకే పూజకు కూర్చున్నప్పుడు ముక్కుపట్టుకోమని ఊరికే చెప్పరు, ప్రాణాయామం చేయమని చెప్పేది ఎందుకంటే... ఊపిరి వేగాన్ని నియంత్రిస్తే, మనసు కుదురుగా నిలబడి భగవంతుడికి ఉపచారం ఏకాగ్రతతో చేస్తుంది. అలా చేసిన పూజనే పరమేశ్వరుడు పుచ్చుకుంటాడు. ఇక ఆఖరి ఊపిరి తీసినదైనా కావచ్చు, విడిచిపెట్టినదైనా కావచ్చు. తీసి విడిచిపెట్టకపోవచ్చు. విడిచిపెట్టి తీయకపోవచ్చు. ఈ రెండింటిలో ఏదయినా కావచ్చు మృత్యువు. ఆఖరి ఊపిరియందు ఆఖరి కదలికలో మనసు వాసనా బలాన్ని పట్టుకుంటుంది. వాసన అన్నమాటకు ముందు రుచి అని ఉంటుంది. ఇది మిగిలిన వాటికి ఉండదు. ఒక్క మనుష్యుడినే రుచి, వాసన వేధిస్తాయి. రుచి అంటే... మనసుకు ఒక ఊహాజనితమైన మాట ఒకటి చెప్పారనుకోండి. ఆ సుఖం దానికి తెలియదు. ఒక చెట్టుకి ఊయల కట్టి భూమికి కాళ్ళు తగలకుండా ఊగుతుంటే ఎంత బాగుంటుందో... అన్నప్పుడు దానికి తెలియదు. ఒకసారి ఎక్కి ఊగించారనుకోండి. దానికి బాగా నచ్చిందనుకోండి. వాసన లోపల బాగా పట్టుకుంటుంది. అది రుచి. చివరకు మనింట్లో కూడా ఊయలుంటే బాగుండుననే అన్వేషణ మొదలవుతుంది. ఇంట్లో దూలానికి ఊయలబల్ల ఏర్పాటుచేసుకుంటుంది. దానిలో ఉన్న హాయిని పట్టుకుంటుంది. దానిని వాసన అంటారు. ఈ వాసనలలో బాగా ఇష్టమైనదేదో దాన్ని ఆఖరిసారి ఊపిరి తీసినప్పుడు ఆఖరి కదలికలో మనసు పట్టుకుంటుంది. పట్టుకుని వెళ్ళిపోతుంది. ఏది పట్టుకుని వెళ్ళిపోయిందో దానికి అనుగుణమైన పునర్జన్మనిస్తాడు పరమేశ్వరుడు. ఆయనేం జోక్యం చేసుకోడు. ఆఖరున నీవు దేనిని స్మరించావో ఆయన పట్టగలడు. ఆయన చిత్రగుప్తుడు. చిత్రంగా ఇక్కడ కూర్చుని గుప్తంగా రాస్తాడు. ఏమిరా, నీకు మనుష్య శరీరం ఇచ్చాను. ఆఖరున దేన్ని పట్టుకున్నావ్! ఒకడు పొలాన్ని పట్టుకున్నాడు, ఒకడు ఫలానా వాడిమీద కక్షతో రౌద్రచింతతో పోతాడు. వీరు చేసుకున్న పాపాలు మళ్ళీ అనుభవించడానికి కొన్ని కోట్ల జన్మల కిందకు వెళ్ళిపోతారు. తిర్యక్కులుగాగానీ, స్థావరములుగా గానీ, జంగమములుగా గానీ వెళ్ళిపోతారు. స్థావరము అంటే కదలలేకుండా ఉంటాడు. మేక వచ్చేస్తుంది, తనను తినేయబోతోందని తెలిసినా కదలలేడు. దానిని స్థావరము అంటారు. జంగమములంటే కుక్క, పిల్లి, మేక, గొర్రె అలాంటివి. అంటే స్థావర, తిర్యక్, జంగమములన్నింటిలో కర్మచేసే అధికారంలేని ప్రాణిగా వెళ్ళిపోతాడు. అంటే శాస్త్రం, గురువు.. ఈ రెండింటితో సంబంధం ఉండదిక. ఈ రెండూ లేక ఇంకేం ఉంటాయి? షడూర్ములు అని ఆరు ఉంటాయి. వాటిని అనుభవిస్తుంటాడు. షడూర్ములు అంటే-జననం, మరణం, ఆకలి, దప్పిక, సుఖం, దుఃఖం. మనుష్య ప్రాణి అలా కాదు. కొంత పుణ్యం చేసి మళ్ళీ మనుష్యుడిగా పునర్జన్మ పొందాడనుకోండి. అప్పుడు కూడా గతజన్మ తాలూకు వాసనాబలాన్ని వెంట తీసుకెడతాడు. దీనిని ఎలా గుర్తిస్తారంటే... అన్నప్రాశన చేసేటప్పుడు.. ‘వీడికి అన్నం పెడుతున్నాం. అది తిని బలం పుంజుకున్న శరీరంతో వీడేం చేయబోతున్నాడు, వీడి వాసనాబలం ఏమిటి?’ అన్నది గమనించడానికి... భగవద్గీత, డబ్బులు, బంగారం వంటివి పెడతారు. వాడు పాకుతూ వెడుతుంటే... వీడేం ముట్టుకుంటాడోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. వాడు వెళ్ళి వెళ్ళి బంగారం ముట్టుకున్నాడనుకోండి. గతజన్మలోని వాసనాబలంతో ఆకర్షింపబడ్డాడు. వాడు బంగారం కోసం ముందుముందు ఏదయినా చెయ్యవచ్చు. అందుకని వాడికి చిన్నప్పటినుంచి రామాయణం చెప్పాలి. మడ్డినీళ్ళకు చిల్లగింజ విరుగుడయినట్లే వీడికి రామాయణం విరుగుడు. హమ్మయ్య మా వాడు భగవద్గీత పట్టుకున్నాడని వాడిని తీసుకెళ్ళి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేసి వదిలేయకూడదు. వాడు వృద్ధిలోకి రావడానికి వాడిని మంచి గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళడం, రోజూ ఇంట్లో భగవద్గీతను వినిపించడం చేయాలి. బీజం బద్దలై చెట్టు కావాలి. ఆ అవకాశమివ్వాలి. అందుకే ఇప్పటికీ... చాలా చిన్న వయసులో మా వాడికి రాగాలన్నీ తెలిసిపోయాయంటూంటారు. అదెక్కడిదంటే.. కిందటి జన్మలోని సంగీతం పట్ల తాదాత్మ్యత. ఒక్కొక్కడికి భాగవత పద్యాలు ఒక్కసారి వింటే వచ్చేస్తాయి. అది వాసనాబలం... అక్కడినుంచి తెచ్చాడు వాడు. ఒక్కొక్కడు వెళ్ళిపోతున్నప్పుడు ‘అబ్బ, ఏం రామాయణంరా, ఏమి రామచంద్రప్రభువురా, ఏమి సీతమ్మ తల్లిరా..’ అని ఆలోచిస్తూ పోయాడనుకోండి. వాడు సాధనను ఇంకా కొనసాగించడానికి ఒక మహావిద్వాంసుడి కొడుకుగా పుట్టిస్తాడు. పుట్టుకతోనే ఒక మంచి గురువు దొరికినందువల్ల వాడికి ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. ధర్మప్రవర్తనతో, లోకంలో ధర్మపాలనకు ఉపకరిస్తాడు. -
ఇషాచావ్లా సందడి
గన్‌ఫౌండ్రీ : గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్(టీటీఐ)లో హీరోయిన్ ఇషాచావ్లా సందడి చేసింది. మద్యం తాగి వాహనాలు నడపవద్దని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డ్రైవింగ్ లైసెన్స్కై దళారులను ఆశ్రయించకుండా నేరుగా డ్రైవింగ్ టెస్ట్‌లో పాల్గొనాలని సూచించారు. తాను సైతం మొదటిసారి డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిలయ్యానని, రెండవసారి మాత్రం ఏకాగ్రతతో డ్రైవింగ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించి డ్రైవింగ్ లైసెన్స్ పొందినట్లు తెలిపారు.ట్రాఫిక్ డీసీపీ ఎ.వి. రంగనాథ్ మాట్లాడుతూ... నేటితరం పిల్లలకు స్కూల్ లాంటి ఇంటినుంచే ట్రాఫిక్ నిబంధనలను తెలియజేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందన్నారు. రాబోయే రోజుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లేని, నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేసే వాహనదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ఆధార్‌కార్డ్‌ను వెంట ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వ్యాపారవేత్త అనిల్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరహరి తదితరులు పాల్గొన్నారు. -
విలువిద్యతో ఏకాగ్రత
చౌటుప్పల్: విల్లు విద్య ఏకాగ్రతను పెంచేందుకు ఎంతో దోహదపడుతుందని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎండీ.మక్బూల్‌అహ్మద్ అన్నారు. మండలంలోని తంగడపల్లిలోని ఎంఎంఆర్ వ్యాయామ విద్య కళాశాలలో శుక్రవారం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు విల్లు విద్యను నేర్పించాలన్నారు. తద్వారా విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆత్మసై్థర్యం పెరుగుతాయన్నారు. అధ్యక్షుడిగా శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి అనంతరం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ నూతన కార్యవర్గంను ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షునిగా జి.నారాయణరెడ్డి, అధ్యక్షుడిగా శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎ.రామనర్సింహ్మారెడ్డి, జి.ఛండీదాస్, బుజ్జిబాయి, ప్రధాన కార్యదర్శిగా టి.విజయసాగర్, సహాయ కార్యదర్శులుగా నాగేశ్వర్రావు, ఎం.జోసెఫ్, ఎ.మల్లేష్, జి.స్వామిరాజు, కోశాధికారిగా కందాడి దశరథ, కార్యవర్గ సభ్యులుగా ఎన్.ప్రభాకర్‌రెడ్డి, టి.చంద్రశేఖర్, సీహెచ్.వేణుగోపాల్‌రెడ్డి, జి.రాంప్రసాద్, ఎస్.సుజన్‌కుమార్, టి.విజయ్‌కుమార్‌లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పి.శంకరయ్య, ఎస్.సారంగపాని, ఎస్.ఉదయభాస్కర్‌లు పాల్గొన్నారు. -
అద్వైతం... ఆత్మజ్ఞానప్రదాయకం
మాండూక్యోపనిషత్తు హరిః ఓమ్... ఓంకార స్వరూపాన్ని, ప్రాముఖ్యాన్నీ, వివిధ దశలనూ వివరించే మాండూక్యోపనిషత్తు అధర్వణ వేదంలోనిది. కేవలం పన్నెండు మంత్రాల చిన్న ఉపనిషత్తు అయినా ప్రధానమైన పది ఉపనిషత్తులలో ప్రముఖ స్థానాన్ని పొందింది. సూత్రప్రాయంగా ఉన్న ఈ ఉపనిషత్తుకు ఆదిశంకరుల గురువైన గౌడపాదాచార్యులు వివరంగా కారికలు రాశారు. శంకరాచార్యుని అద్వైత ప్రతిపాదనలో మాండూక్యం ప్రధానపాత్ర వహించింది. ఓంకారాన్ని ‘ప్రణవం’ అంటారు. అనగా నిత్యనూతనం. అ, ఉ, మ అనే మూడు సాకారమైన అక్షర ధ్వనుల చివర వినపడే నిరాకార ధ్వనితో ఆత్మజ్ఞానాన్ని, పరబ్రహ్మతత్త్వాన్నీ మెలకువలో, కలలలో, గాఢనిద్రలో అన్ని దశలలో అందించే ఓంకారం ధ్వనితరంగాలతో ఏకాగ్రతను, శాంతినీ సాధించే శాస్త్రీయమైన నాదోపాసన. కులమతాలతో, స్త్రీపురుష భేదాలతో, వయస్సులతో సంబంధంలేని స్వచ్ఛధ్యానయోగకేంద్రం మాండూక్యం. విశ్వమంతా ఓంకారమే. భూత, వర్తమాన, భవిష్యత్తులు అంతా ఓంకారమే. మూడుకాలాలకూ, అతీతమైన స్థితి కూడా ఓంకారమే. ఓంకారమే పరబ్రహ్మ. పరమాత్మ. ఇది నాలుగు పాదాలుగా అనగా నాలుగు స్థానాల్లో ఉంటుంది. మొదటిది మెలకువగల బాహ్యప్రజ్ఞ. ఇది అగ్నిస్వరూపం. అగ్నికి ఏడు అంగాలు, పందొమ్మిది ముఖాలు ఉంటాయి. స్థూలమైన అనగా భౌతికదృష్టి కలిగి ఉంటుంది. రెండవది స్వప్నస్థానం. అంతఃప్రజ్ఞతో ఇది తేజోమయమై ఉంటుంది. ఈ తైజసరూపానికి కూడా ఏడు అంగాలు, పంతొమ్మిది ముఖాలు ఉంటాయి. ఈ తైజసమైన ఆత్మ స్వప్నావస్థలో ఏకాంతమైన మనోలోకంలో విహరిస్తూ ఉంటుంది. ఏ కోరికలూ, కలలూ లేని గాఢనిద్రను ‘సుషుప్తి’ అంటారు. ఇది మూడవ స్థానం. పరబ్రహ్మ సుషుప్తస్థితిలో, ఒకే ఒక్కడుగా, ‘ప్రజ్ఞాన ఘనుడుగా, ఆనందమయుడుగా ఆనందాన్ని అనుభవిస్తూ, మనోముఖుడై, ప్రాజ్ఞుడై ఉంటాడు. ఏష సర్వేశ్వరః ఏష సర్వజ్ఞ ఏషో తర్యామ్యేష యోనిః సర్వస్య ప్రభవాప్యయౌ హి భూతానామ్ ఇతడే సర్వేశ్వరుడు. సర్వజ్ఞుడు. అంతర్యామి. అన్నిటి పుట్టుకకు, నాశనానికి మూలకారణం ఇతడే. అద్వైతస్థానం నాలుగవది. ఇదే పరమాత్మ. అంతఃప్రజ్ఞకు, బహిఃప్రజ్ఞకు, ఉభయ ప్రజ్ఞకు అన్నిటికీ అతీతం. ప్రజ్ఞాసహితమూ కాదు. రహితమూ కాదు. కనపడదు. కదలికలు ఉండవు. పట్టుకోవడానికి దొరకదు. ఏ లక్షణాలూ ఉండవు. ఊహకు అందదు. వర్ణనాతీతం. ఏకైకం. పంచజ్ఞానేంద్రియ రహితం. శాంతం, మంగళప్రదం, అద్వైతం (రెండుకానిది) అయినది ఆత్మ. దానిని తెలుసుకోవాలి. దానికి ఓంకారమే ఆధారం. వైశ్వానర, తైజస, సుషుప్త, తురీయస్థానాల్లో ఉన్న ఆత్మలో లీనం కావడానికి మానవులకు ఆధారమైనది ఓంకారం. ఆత్మ యొక్క నాలుగుదశలూ ఓంకారంలో ఉన్నాయి. శబ్దబ్రహ్మాన్ని ఏకాగ్రతతో ఉపాసించినవాడు రసాత్మకమైన పరబ్రహ్మం అవుతాడు. ఆనంద మయుడు అవుతాడు. శబ్దరూపమైన పరబ్రహ్మమే ఓంకారం. ఓంకారంలో మూడు మాత్రలు ఉన్నాయి. (మాత్ర అంటే చిటిక వేసినంత కాలం). అవి అ, ఉ, మ్ అనే మూడుపాదాలు. అ+ఉ గుణసంధితో ఓ అవుతాయి. దానికి మకారాన్ని కలిపితే ఓమ్ అయింది. దాని చివర నామరూపరహితమైన ధ్వని నాలుగోపాదం. దానితో ఓంకారం సంపూర్ణ పరబ్రహ్మం అవుతుంది. ఓంకారంలోని మొదటిపాదం ‘అ’. ఇది జాగ్రత్ స్థానంలో ఉన్నా వైశ్వానరుని (అగ్ని) రూపం. వ్యాప్తి, ప్రథమస్థానం అనే లక్షణాలు అగ్నికీ, ‘అ’ కారానికీ సరిపోతాయి. ఇది తెలుసుకొని ఓంకారాన్ని ఆరాధించినవాడు అన్నిటినీ పొందుతాడు. సాధకులలో ప్రథముడు అవుతాడు. ప్వప్నస్థానంలో ైతె జసరూపంలో ఉన్న ఉ కారం రెండవపాదం అవుతుంది. మాత్ర ఎక్కువదనం వల్ల, రెండిటి మధ్య (అ, ఉ మ్) ఉండటం వల్ల ఉకారానికి తేజస్సుకీ పోలికలున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకుని ఓంకారాన్ని ఉపాసించినవాడు నిత్యజ్ఞానియై ద్వందాలకు (సుఖదుఃఖాలు, లాభనష్టాలు, నిందాస్తుతులు మొదలైనవి) అతీతుడు అవుతాడు. అతని వంశంలో బ్రహ్మజ్ఞానం లేనివాడు పుట్టడు. సుషుప్తస్థానంలో ప్రాజ్ఞరూపంలో ‘మ’కారం మూడోపాదం అవుతుంది. కొలత కొలిచే నేర్పు, గ్రహింపగల శక్తీ ఉన్న ‘మ’కారం ప్రాజ్ఞునితో సమానం. ఇది తెలుసుకున్నవాడు దేనినైనా అంచనా వేసి తెలుసుకోగలుగుతాడు. అమాత్ర శ్చతుర్థో వ్యవహార్యాః ప్రపంచోపశమః శివోద్వైత ఏవ మోంకార ఆత్మైవ! సంవిశత్యాత్మనాత్మానంయ ఏవం వేద, య ఏవం వేద నామరూపరహితమైన నాలుగోపాదాన్ని ఎవరూ వర్ణించి చెప్పలేరు. అది వ్యవహారాలకు అందదు. జ్ఞానేంద్రియాలు ఉపశమించి శాంతించి ఉంటాయి. మంగళప్రదమూ, అద్వైతస్వరూపమూ అయిన ఓంకారాన్ని ఆత్మగా తెలుసుకున్నవాడు తానే పరబ్రహ్మమని తెలుసుకుంటాడు. ఇలా ఓంకారాన్ని గురించి నాలుగుదశలను గురించి తెలుసుకున్న వాడే నిజమైన జ్ఞాని. ఓంకారోపాసన నిరంతరమూ చేసేవానికి బ్రహ్మజ్ఞానం స్వయంగా లభిస్తుంది. ఏ గురువూ, ఏ విద్యా అవసరం లేకుండా ఓంకారధ్యానం లోనుంచి అది ఉద్భవిస్తుంది. సర్వజనులకూ అద్వైతాత్మజ్ఞానప్రదాయిని మాండూక్యోపనిషత్తు. ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ -
డేంజర్ అలారం
నేడు వరల్డ్ స్లీప్ డే ⇒మైగ్రేన్ తలనొప్పులు ఎసిడిటీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ డయాబెటిస్ స్థూలకాయం కేన్సర్ డిప్రెషన్. ⇒కంటినిండా నిద్రను మించిన స్వర్గం లేదు. ⇒నిద్ర కరువవడాన్ని మించిన నరకం లేదు. ⇒పసిపిల్లలు సహజ ప్రశాంతంగా నిద్రపోతారు. ⇒ వరిని నిద్రపుచ్చడానికి ఒక్క జోలపాట చాలు. ⇒పెరిగి పెద్దయ్యాక బతుకు భారమవడం మొదలవుతుంది. ⇒ఆశలు, ఆరాటాలు అంతు లేనంతగా పెరుగుతాయి. ⇒ఆశాభంగాలు, అభద్రతలు అడుగడుగునా ఎదురవుతాయి. ⇒ఎంత సంపాదించినా నిద్రాదరిద్రం మాత్రం తీరదు. ⇒దాని దెబ్బకు ఒంట్లోకి తీపిజబ్బు చేరి బతుకునే చేదెక్కిస్తుంది. ⇒ఏకాగ్రత కుదరక చిరాకులు, పరాకులు ⇒మనశ్శాంతిని దూరం చేస్తాయి. ⇒నరాల్లో నెత్తురు పోటెత్తి కోపతాపాలు ప్రతాపాన్ని చూపిస్తాయి. ⇒‘కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది’ అని మనసుకవి అన్నాడు గానీ, మనసు కుదురుగా లేని చాలామందికి కునుకే కనకమైపోయింది. రకరకాల ఒత్తిళ్లు, మానసిక అశాంతితో బతుకే పీడకలలా మారి, నిరంతర నిద్రాభంగం రోజువారీ అనుభవంగా మారుతోంది. ఎంత కలిమిగల ఆసాములైనా నిద్రలేమిని అధిగమించడంలో వెనుకబడి, దిగులు పెంచుకుని గుబులు చెందుతున్నారు. నానా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీసే నిద్రలేమిని వైద్య నిపుణులు ఒక రుగ్మతగా గుర్తించారు. వైద్య పరిభాషలో దీనిని ‘ఇన్సోమ్నియా’ అంటారు. ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడంలో ఇబ్బందులు కలగడం, నిద్రలో ఉండగా అకస్మాత్తుగా మెలకువ వస్తుండటం, అలా మెలకువ వచ్చాక తిరిగి నిద్రపట్టకపోవడం, మరీ వేకువ జామునే మెలకువ వచ్చేస్తుండటం, మేలుకున్న తర్వాత అలసటగా అనిపించడం వంటి లక్షణాలు యమయాతన పెడతాయి. రకరకాల నిద్రలేమి ఎలాంటి ఆరోగ్య సమస్యలతో నిమిత్తం లేకుండానే కొందరికి సక్రమంగా నిద్రపట్టదు. ఇలాంటి పరిస్థితిని ప్రైమరీ ఇన్సోమ్నియా అంటారు. ఉబ్బసం, డిప్రెషన్, ఆర్థరైటిస్, కేన్సర్, శరీరాన్ని బాధపెట్టే రకరకాల నొప్పులు, మితిమీరిన తాగుడు వంటి కారణాలు కొందరికి నిద్రలేమిని కలిగిస్తాయి. ఇలాంటి పరిస్థితిని సెకండరీ ఇన్సోమ్నియా అంటారు. నిద్రలేమి కొందరిలో తాత్కాలికంగా కనిపిస్తే, ఇంకొందరిని దీర్ఘకాలికంగా పట్టి పీడిస్తుంది. కొద్ది రోజులు లేదా కొద్ది వారాలు మాత్రమే ఉండే నిద్రలేమిని ‘అక్యూట్ ఇన్సోమ్నియా’ అంటారు. ఇంకొందరిలో ఈ పరిస్థితి నెలల తరబడి కొనసాగుతుంది. దీనిని ‘క్రానిక్ ఇన్సోమ్నియా’ అంటారు. తాత్కాలిక నిద్రలేమిని కొంత ప్రయత్నం ద్వారా, వ్యాయామం, ఆహ్లాదకరమైన సంగీతం వినడం వంటి తేలిక పాటి సహజ పద్ధతుల ద్వారా అధిగమించవచ్చు. క్రానిక్ ఇన్సోమ్నియా పీడిస్తుంటే మాత్రం తప్పనిసరిగా వైద్య సహాయం పొందాల్సిందే. నిద్రను దూరం చేసేవి ఇవే! ఉద్యోగం పోగొట్టుకోవడం, పరీక్షలు తప్పడం, ఆత్మీయుల మరణం, విడాకులు వంటి కారణాల వల్ల ఎదురయ్యే తీవ్రమైన మానసిక ఒత్తిడి, దీర్ఘకాలంగా పీడించే మొండి వ్యాధులు, ప్రశాంతత లేని పరిసరాలు, ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు కునుకు కరువయ్యేలా చేస్తాయి. డిప్రెషన్, హైబీపీ, ఆస్తమా వంటి వ్యాధులకు వాడే కొన్ని రకాల మందులు నిద్రలేమికి దారితీస్తాయి.పనివేళల్లో తరచు మార్పుల వల్ల రోజూ ఒకే వేళకు నిద్రకు ఉపక్రమించలేని పరిస్థితులు, సుదూర విమాన ప్రయాణాల వల్ల ఏర్పడే జెట్లాగ్ వంటి కారణాలు కూడా నిద్రకు దూరం చేస్తాయి. కునుకు కులాసా లేకుంటే... ముందురోజు రాత్రి నిద్ర పట్టకుంటే మర్నాటి పొద్దున్నే ఆ ప్రభావం కనిపిస్తుంది. ఏకాగ్రత దెబ్బతింటుంది. రంగులకు అనుగుణంగా సత్వరమే స్పందించే శక్తి సన్నగిల్లుతుంది. ఇలాంటి పరిస్థితికి గురైన వారు రోడ్డు సిగ్నల్స్‌కు అనుగుణంగా వెంటనే స్పందించలేక ప్రమాదాలకు గురయ్యే అవకాశాలూ ఉంటాయి. చిన్న చిన్న కారణాలకే మూడ్స్ మారిపోతుంటాయి. ప్రతి చిన్న విషయానికీ కోపం అదుపు తప్పిపోతుంది. ఇలాంటి వాళ్లు వాహనం నడుపుతూ ఉంటే, అడ్డుగా ఎవరైనా వచ్చినా, పొరపాటున మరో వాహనం తాకినా అక్కడికక్కడే తగాదాకు దిగుతారు. ఇంట్లో భార్యాభర్తల్లో ఏ ఒక్కరికి ఇలాంటి సమస్య ఉన్నా, ఇక ఆ ఇల్లు రణరంగమే అవుతుంది. దీర్ఘకాలికంగా ఇదే పరిస్థితి కొనసాగితే, ఇద్దరూ విడాకుల వరకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నెలల తరబడి నిద్రలేమి వెంటాడుతుంటే మైగ్రేన్ తలనొప్పులు, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్, డయాబెటిస్, స్థూలకాయం, రొమ్ము కేన్సర్, డిప్రెషన్, వంటి రుగ్మతలన్నీ ఒకదాని వెంట మరొకటి దాడిచేస్తాయి. వాటి ఫలితంగా అకాల వార్ధక్యం మీద పడుతుంది. అకాల వార్ధక్యం మీద పడటమంటే మృత్యువుకు చేరువ కావడమే! వయసు పెరుగుతున్న కొద్దీ ఈ నిద్ర వ్యవధి కాస్త అటు ఇటుగా ఉండవచ్చు. పడుకున్న అరగంటలో నిద్ర పట్టడంతో పాటు గాఢమైన నిద్రపడుతూ ఉంటే దాన్ని నాణ్యమైన నిద్రగా భావించండి. మధ్య మధ్య ఏదో కారణాల వల్ల నిద్రలేస్తుండే వారు పగటి నిద్రతో దాన్ని భర్తీ చేసుకుంటున్నామని భావించవద్దు. ఎందుకంటే నాణ్యమైన నిద్రతోనే నిద్రలేమి భర్తీ అవుతుంది. ఏదో ఒకటి లేదా రెండు గంటలు అదనంగా పడుకున్నంత మాత్రాన అది భర్తీ కాదు. అందుకే కంటి నిండా నిద్రపోడానికి స్వాభావికంగానే ప్రయత్నించండి. ఒకవేళ నిద్రపట్టకపోతే, ముందుగా స్వాభావికమైన అంశాలతో నిద్రకోసం ప్రయత్నించండి. అప్పటికీ నిద్రలేమి బాధిస్తుంటే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించండి. ప్రశాంతంగా నిద్రపోవాలంటే నిద్ర పట్టినా పట్టకపోయినా రోజూ క్రమం తప్పకుండా ఒకే వేళకు నిద్రకు ఉపక్రమించాలి.కెఫీన్, నికోటిన్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. ముఖ్యంగా నిద్రపోయే ముందు వీటిని తీసుకుంటే, ప్రశాంతమైన నిద్రకు దూరమయ్యే పరిస్థితి వాటిల్లుతుంది.రోజూ క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి. అలాగని నిద్రకు ఉపక్రమించే ముందు వ్యాయామం చేయడం తగదు. నిద్రకు, వ్యాయామానికి మధ్య కనీసం మూడు నాలుగు గంటల వ్యవధి ఉండాలి. పడక గదిలో వాతావరణం మరీ చల్లగా లేదా మరీ వేడిగా లేకుండా చూసుకోవాలి.రణగొణ ధ్వనులు నిద్రకు అంతరాయం కలిగిస్తున్నట్లయితే, ఇయర్ ప్లగ్స్ లేదా ‘వైట్ నాయిస్’ పరికరాన్ని వాడవచ్చు. నిద్రకు ముందు పుస్తకాలు చదవడం, ఆహ్లాదకరమైన సంగీతం వినడం లేదా స్నానం చేయడం వంటివి చేయవచ్చు.తగిన నిద్ర వల్ల ఒంటి బరువు అదుపులో ఉంటుంది. శరీర కదలికలు చురుగ్గా ఉంటాయి. భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. మొత్తానికి జీవితం ఆరోగ్యప్రదంగా ఉంటుంది. అందువల్ల ఆందోళనలన్నీ వదిలేసి ఆదమరచి ప్రశాంతంగా నిద్రపోండి. ఏ వయస్సు వారు ఎంత నిద్ర ►అప్పుడే పుట్టిన పిల్లల నుంచి రెండు నెలల వరకు 12-18 గం॥ ►మూడు నెలల నుంచి ఏడాది వయసు వరకు 14-15 గం॥ ►ఏడాది నుంచి మూడేళ్ల వరకు 12-14 గం॥ ►మూడు నుంచి ఐదేళ్ల వరకు 11-13 గం॥ ►ఐదు నుంచి పన్నెండేళ్ల వరకు 10-11 గం॥ ►పన్నెండు నుంచి పద్ధెనిమిదేళ్ల వరకు 8 - 10 గం॥ ►పద్ధెనిమిది ఏళ్లు ఆ పైబడిన వారు 7.30-9 గం॥ -
నోరు విప్పిన జయప్రకాశ్ నారాయణ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలపై చాలా కాలం తరువాత లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ నోరు విప్పారు. ప్రభుత్వ నిధులను ఖర్చుపెట్టే తీరును తప్పుపట్టారు. 30 కోట్ల రూపాయలతో ఆర్భాటంగా ప్రమాణం చేయడం అవసరమా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని ఏపీ సీఎం క్యాంపు ఆఫీస్ కోసం పది కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అవసరమా? అని అడిగారు. ఆర్థిక, పాలన కేంద్రీకరణ జాతి ప్రగతికి హానికరం అని హెచ్చరించారు. తెలుగుజాతి విడిపోవడానికి ఇదే కారణం అని చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం లక్షల కోట్ల రూపాయలు అవసరమంటూ మోసపూరితమైన కోరికలు కోరడం సరికాదని జయప్రకాశ్ నారాయణ అన్నారు. ** -
అక్రమ నిర్మాణాలపై ఆస్తిపన్ను
సాక్షి, హైదరాబాద్: పట్టణాలు, నగరాల్లో అనధికార నిర్మాణాలకు పాల్పడినవారి నుంచి నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థలు ఇప్పటివరకు ఎలాంటి ఆస్తిపన్ను వసూలు చేయడం లేదు. కానీ ఇకపై నిబంధనల ప్రకారం ఆస్తి పన్ను, అదనంగా భారీ మొత్తంలో జరిమానా వసూలు చేయనున్నాయి. ఈ వసూళ్లకు ప్రభుత్వం చట్టబద్దత కల్పించింది. ఈ మేరకు తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అనుమతి తీసుకున్న తరువాత నిర్మాణంలో ఉల్లంఘనల శాతం ఆధారంగా అదనపు పన్ను ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏకంగా వందశాతం అదనంగా ఆస్తిపన్ను విధించడానికి కూడా నగరపాలక, పురపాలక సంస్థలకు అధికారం కల్పించింది. భవన నిర్మాణానికి అనుమతించిన ప్రణాళిక (ప్లాన్)లో నాలుగువైపులా వదలాల్సిన స్థలంలో (సెట్‌బ్యాక్) పది శాతం ఉల్లంఘనతో నిర్మాణం జరిగితే ఆస్తిపన్నుతో పాటు అదనంగా 25 శాతం జరిమానా వసూలు చేస్తారు. పదిశాతం కంటే ఎక్కువ ఉల్లంఘన జరిగితే ఆస్తిపన్నుతో పాటు 50 శాతం జరిమానా, అనుమతికి మించి అదనపు అంతస్తులు నిర్మిస్తే వందశాతం జరిమానా, అలాగే పూర్తిగా అనుమతి లేని నిర్మాణానికి కూడా వందశాతం జరిమానా విధించడానికి అనుమతినిచ్చింది. ఆస్తిపన్ను వసూలు చేసినంత మాత్రాన ఆ ఇంటిని క్రమబద్ధం చేసినట్లు కాదని, ఇంటిని కూల్చే వరకు ఈ ఆస్తిపన్ను వసూలు చేస్తారని స్పష్టం చేసింది. దీంతో అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ చేసి భారీ మొత్తంలో ఆస్తిపన్ను, జరిమానాలు వసూలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఆస్తిపన్ను చెల్లించేవారికి, చెల్లించని వారికి ఒకే తరహా సౌకర్యాలు అందుతున్నాయని, ఆస్తిపన్ను చెల్లించకున్నా అనధికార కట్టడాల యజమానులు అన్ని సౌకర్యాలూ పొందుతున్నారని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఆస్తిపన్ను చెల్లించేవారికి ప్రోత్సాహకాలు ఆస్తిపన్ను క్రమం తప్పకుండా చెల్లించేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎలాంటి నోటీసు లేకుండా ఆస్తిపన్ను మొత్తాన్ని ఏప్రిల్ 30వ తేదీలోపు చెల్లిస్తే.. వారికి ఆస్తిపన్నుపై ఐదుశాతం రాయితీ ఇవ్వనున్నారు. గడువు దాటి చెల్లిస్తే నెలకు రెండు శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తారు. పనుల మంజూరు అధికారాల విస్తృతి గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్‌కు ప్రస్తుతమున్న రూ.20 లక్షల విలువ చేసే పనుల మంజూరు అధికారాన్ని రూ.50 లక్షలకు, స్టాండింగ్ కమిటీకి ఇప్పుడున్న రూ.50 లక్షల మంజూరు అధికారాన్ని రూ.2 కోట్లకు, సర్వసభ్య సమావేశానికి ప్రస్తుతమున్న రూ.2 కోట్ల మంజూరు అధికారాన్ని రూ.5 కోట్లకు పొడిగిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. విజయవాడ, విశాఖపట్నం కార్పొరేషన్ల కమిషనర్లు రూ.20 లక్షల వరకు, స్థాయీ సంఘం రూ.50 లక్షలు, సర్వసభ్య సమావేశం రూ.2 కోట్ల పనులు మంజూరు చేయవచ్చని, మిగిలిన కార్పొరేషన్లలో కమిషనర్లు రూ.10 లక్షలు, స్థాయీ సంఘం రూ.50 లక్షలు, సర్వసభ్య సమావేశం రూ.2 కోట్ల పనులు మంజూరు చేయవచ్చని పేర్కొంది. -
ఏమి చేస్తే స్థిమితం కలుగుతుంది?
మంచి, చెడు సంఘటనలు జరుగుతూనే ఉండటం మన జీవితాల్లో మామూలే. అయినా చెడునే ఎప్పుడూ తలపోస్తూ ఉంటాం. దీనివల్లనే ఆతురత, ఒత్తిడి, అసహనం, భయం, ఆవేదన వంటి మానసిక ఒత్తిడులకు గురవుతున్నాం. కలతతో కూడిన అవమానకర సంఘటనలనే అనుక్షణం తలచుకుంటూ దుఃఖానికి గురవుతూంటాం. పోనీలే వదిలేద్దాం అనుకున్నా, మన ఎరుక లేకుండానే ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. కోపతాపాల ఒరవడిలో, భావోద్వేగాల ఒత్తిడిలో ఉన్నప్పుడు మనమేం చేయాలి? ఏమి చేస్తే మనసుకు శాంతి, స్థిమితం కలుగుతాయి? మనో నిశ్చలతకు ఒక మార్గం... మంత్రం. మంత్రం అంటే మనసును గెలిచేది అని అర్థం. మంత్రాలు మనకు కొత్తేమీ కాదు. వాటిని యుగయుగాలుగా మననం చేస్తూనే ఉన్నాం. లాటిన్ అమెరికన్ చర్చలలో కూడా మరనాథ్ కనిపిస్తుంది. లాటిన్లో, సంస్కృతంలో దానికి ఒకటే అర్థం. లార్డ్ అనే పదాన్ని లాటిన్లో నాథ్ అంటారు. సంస్కృతంలో నాథ్‌కు అర్థం లార్డ్. మరనాథ్ అంటే మై లార్డ్. ఈ సంస్కృత పదాన్ని క్రైస్తవంలో కూడా ఇదే అర్థంతో వాడతారు. జై నం, బౌద్ధం, హైందవం, జొరాస్ట్రియనిజం, సిక్కిజం అన్ని దేశీయ మతాల్లో ఓంకార్ అనే పదాన్ని ఒకటే అర్థంతో వాడతాం. ఓం నమశ్శివాయ అనే మంత్రం మహామంత్రంగా చెప్పబడుతోంది. ఎందుకంటే పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ... అందులో కేంద్రీకృతమై ఉన్నాయి. న అంటే భూమి, మః అంటే నీరు, శి అంటే అగ్ని, వా అంటే వాయువు, య అంటే ఆకాశం. ఓం ఈ అన్నింటి మిళితం. మంత్రోచ్చారణ చేస్తున్నా కొన్నిసార్లు మనస్సు లగ్నంకాక, పనికిరాని వాటి మీదకు పరుగెడుతుంటుంది. అంగడి తెరిచారో లేదో, భోజనం ఈరోజెవరు వండుతారో... ఇటువంటి పనికిరాని ఆలోచనలు మనస్సులో మెదులుతుంటాయి. కానీ, అభ్యాసం ద్వారా ఏకాగ్రత మెరుగవుతూ వస్తుంది. కొద్దికొద్దిగా మనోనిగ్రహం వృద్ధి చెందుతూ, సంస్కారం కలుగుతుంది. మనస్సును అలాగనే నిలుపుకునే ప్రయత్నాలు కొనసాగించాలి. ఆందోళనల వలయంలో తలమునకలవుతుంటే మనలోని శక్తి తగ్గుతూ వస్తుంది. అటువంటప్పుడు మంత్రో చ్చారణ, ధ్యానం, ఆధ్యాత్మిక ప్రక్రియలను అవలంబించాలి. మహర్షి పతంజలి యోగశాస్త్రంలో ‘యాది స్థాన సంశయ అవిరాతి ప్రమాద ఆలస్య’ అన్నారు. జబ్బునుండి తప్పించుకోవటానికి ఉత్సాహం లేకుండా ఉండటం, అనుమానితులుగా ఉండటం, ఆందోళన తో గడపటం వంటి వాటిని నిరోధించాలంటే ఏకతత్త్వ అభాస్యమే మార్గం. ఒకేమంత్రం, ఒకే ఉచ్చారణ, ఒకే అక్షరం ఎక్కువమార్లు జపం చేయటం అలవరచుకోవాలి. ఆలోచనలు, మంత్రం రెండూ మనసులో తిరుగుతున్నప్పుడు మంత్రం మీదనే శ్రద్ధం ఉంచాలి. మంత్రానికి ఉండే అపూర్వశక్తి తరంగాల వలన మనసులోని ఆందోళనలు తగ్గుముఖం పడతాయి. మంత్రోచ్చారణే మహాశక్తిగా మారుతుంది. కొద్దికాలంలోనే మన ఇల్లు, మనస్సు, దేహం, మన పరిసరాలు మొత్తం అన్నీ శక్తితో నిండిపోయి నిర్మాణాత్మకత ఏర్పడుతుంది.