లబ్బీపేట (విజయవాడ తూర్పు): స్కూల్‌కు టైమ్ అవుతోందనే హడావుడిలో పిల్లలు అమ్మ ఇచ్చిన లంచ్ బాక్స్ మరిచిపోతున్నారు.. ఆఫీస్‌కు లేటవుతున్నామనే భావనతో ఉద్యోగులు బైక్ కీస్ మరిచి గబగబ మెట్లు దిగిపోతున్నారు. వీరే కాదు మతిమరుపుతో అవస్థలు పడుతున్న వారు మరెందరో ఉన్నారు. ఒకప్పుడు ఆరవై ఏళ్లు దాటితే కానీ కనిపించని మతిమరుపు ఇప్పుడు 16 ఏళ్లకే పలకరిస్తోంది. పాతికేళ్ల వారిలో ఇది తీవ్రస్థాయిలో కనిపిస్తోంది. పరీక్షల భయం, పని వత్తిడి, ఆందోళన వంటివి మతిమరుపునకు ప్రధాన కారణాలు. పౌష్టికాహార లోపం, కొన్ని రకాల వ్యాధులు కూడా మతిమరుపునకు దారితీస్తున్నాయని మానసిక వైద్య నిపుణులు చెపుతున్నారు.
టీనేజ్‌లోనే బీజం
మతిమరుపు సమస్యకు టీనేజ్‌లో బీజం పడుతోంది. 25 నుంచి 35 ఏళ్ల వయస్సు వారిలో అది తీవ్రస్థాయికి చేరుతోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. 20 నుంచి 30 శాతం మంది యువత మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
లోపిస్తున్న ఏకాగ్రత
ఒక విషయాన్ని సమగ్రంగా వినడంలోనూ యువతలో ఏకాగ్రత లోపిస్తోంది. వినడం, విన్నదానిని మదిలో ముద్రించుకోవడం, తిరిగి దానిని చెప్పడం, చెప్పే విషయాల్లో యువతలో తీవ్రమైన మార్పులోస్తున్నాయి. విన్న విషయాన్ని మనసులో ముద్రించుకోకపోవడం వల్లే మతిమరుపు వస్తున్నట్లు వైద్యులు చెపుతున్నారు. చాలా మంది ఒక పనిని చేస్తూ మరికొరితో మాట్లాడుతుంటారు. ఈ సమయంలో వారు చెప్పే విషయాలు పెద్దగా వినక పోవడంతో ఆ తర్వాత గుర్తు చేసుకుందామన్నా జ్ఞప్తికి రాని పరిస్థితి ఉంటోంది.
అంతు చూస్తున్న వత్తిడి
చేసే పనిలో టెన్షన్, యాంగ్జ్జయిటీ, సైకలాజికల్ అంశాలు జ్ఞాపక శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యమైన అంశాలను గుర్తు పెట్టుకోవడంలోనూ యువతలో జ్ఞాపకశక్తి తగ్గుతోంది. ఉదయం లేవగానే ఏదో పనిచేయాలని అనుకుంటారు. తీరా చెప్పే సమయం వచ్చేసరికి అది గుర్తుకు రాదు. అంతలా వారి మెదడు మొద్దుబారుతోంది.
యాంగ్జయిటీతో ముప్పు
జ్ఞాపకశక్తి తగ్గిపోవడానికి, మానసిక సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం యాంగ్జాయిటీ. ఏ పనిచేసినా ఆందోళనతో చేయడం, హడావుడిగా మాట్లాడటం వల్ల ఒత్తిడి పెరిగిపోతోంది. అది మనసుపై ప్రభావం చూపుతోంది. దీంతో విన్న విషయం అవసరమైనప్పుడు గుర్తుకురావడం లేదు. ఉద్యోగంలో పనివత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థిక అంశాలు కూడా యువతపై ప్రభావం చూపుతున్నాయి. పిల్లల్లో హోం వర్క్, పరీక్షల మార్కులపై వత్తిడి, శిక్షలు, వారిలో వత్తిడి పెంచి అదికాస్తా మతిమరుపునకు కారణం అవుతోందని వైద్యులు పేర్కొంటున్నారు.
బీపీ, మధుమేహం ప్రభావం
మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ వంటివి సోకి ఐదేళ్లు దాటిన వారిలో మతిమరుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధులు ఉన్న వారిలో హార్మోన్ల అభివృద్ధిలో లోపాలు చోటుచేసుకుంటాయి. జ్ఞాపకశక్తి పెరగడానికి విటమిన్ బీ–12 కారణమని, దాని లోపం వల్ల మతి మరుపు పెరుగుతుందని వైద్యులు చెపుతున్నారు. పౌష్టికాహారం లేక పోవడం వల్ల బ్రెయిన్ సెల్స్ అభివృద్ధి లోపిస్తుందని పేర్కొంటున్నారు. రెడీమేడ్ ఫుడ్ జోలికెళ్లకూడదని సూచిస్తున్నారు. మాంసాహారంలో బీ12 పుష్కలంగా లభిస్తుందని, పచ్చని ఆకు కూరగాయలు తింటే కాస్త జ్ఞాపకశక్తి పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
ఏకాగ్రత తగ్గుతోంది
యువత, విద్యార్థుల్లో ఏకాగ్రత తగ్గుతోంది. దీంతో తాము చేయాల్సిన దానిపై దృష్టి సారించలేక పోతున్నారు. ప్రతి చిన్న విషయానికీ వస్తువులపై ఆధారపడుతున్నారు. లెక్కలు చేయాలంటే కాలిక్యులేటర్ వాడుతున్నారు. ఎక్కువ సమయం సెల్‌ఫోన్‌తో గడుపుతున్నారు. దీంతో ప్రతి విషయాన్నీ మరిచిపోతున్నారు. ఒత్తిడిని జయించేందుకు మెదడుకు పదును పెట్టాలి. స్వతహాగా లెక్కలు కట్టడం, ఫోన్ నంబర్లు గుర్తు పెట్టుకోవడం వంటివి చేయాలి. పౌష్టికాహారం తీసుకోవడం చాలా అవసరం. మార్కులు కోసం తల్లిదండ్రులు పిల్లలపై వత్తిడి తేకూడదు. ఇది వారిని మరింత ఆందోళనకు గురిచేస్తుంది.
– డాక్టర్ వి.రాధికారెడ్డి, మానసిక వైద్య నిపుణులు, విజయవాడ ప్రభుత్వాస్పత్రి
Comments
Please login to add a commentAdd a comment