అద్వైతం... ఆత్మజ్ఞానప్రదాయకం | Omkaara Self-awareness | Sakshi
Sakshi News home page

అద్వైతం... ఆత్మజ్ఞానప్రదాయకం

Published Sat, Jun 25 2016 10:44 PM | Last Updated on Mon, Sep 4 2017 3:23 AM

అద్వైతం... ఆత్మజ్ఞానప్రదాయకం

అద్వైతం... ఆత్మజ్ఞానప్రదాయకం

మాండూక్యోపనిషత్తు

 

హరిః ఓమ్... ఓంకార స్వరూపాన్ని, ప్రాముఖ్యాన్నీ, వివిధ దశలనూ  వివరించే మాండూక్యోపనిషత్తు అధర్వణ వేదంలోనిది. కేవలం పన్నెండు మంత్రాల చిన్న ఉపనిషత్తు అయినా ప్రధానమైన పది ఉపనిషత్తులలో ప్రముఖ స్థానాన్ని పొందింది. సూత్రప్రాయంగా ఉన్న ఈ ఉపనిషత్తుకు ఆదిశంకరుల గురువైన గౌడపాదాచార్యులు వివరంగా కారికలు రాశారు. శంకరాచార్యుని అద్వైత ప్రతిపాదనలో మాండూక్యం ప్రధానపాత్ర వహించింది. ఓంకారాన్ని ‘ప్రణవం’ అంటారు. అనగా నిత్యనూతనం. అ, ఉ, మ అనే మూడు సాకారమైన అక్షర ధ్వనుల చివర వినపడే నిరాకార ధ్వనితో ఆత్మజ్ఞానాన్ని, పరబ్రహ్మతత్త్వాన్నీ మెలకువలో, కలలలో, గాఢనిద్రలో అన్ని దశలలో అందించే ఓంకారం ధ్వనితరంగాలతో ఏకాగ్రతను, శాంతినీ సాధించే శాస్త్రీయమైన నాదోపాసన. కులమతాలతో, స్త్రీపురుష భేదాలతో, వయస్సులతో సంబంధంలేని స్వచ్ఛధ్యానయోగకేంద్రం మాండూక్యం.

 

విశ్వమంతా ఓంకారమే. భూత, వర్తమాన, భవిష్యత్తులు అంతా ఓంకారమే. మూడుకాలాలకూ, అతీతమైన స్థితి కూడా ఓంకారమే. ఓంకారమే పరబ్రహ్మ. పరమాత్మ. ఇది నాలుగు పాదాలుగా అనగా నాలుగు స్థానాల్లో ఉంటుంది. మొదటిది మెలకువగల బాహ్యప్రజ్ఞ. ఇది అగ్నిస్వరూపం. అగ్నికి ఏడు అంగాలు, పందొమ్మిది ముఖాలు ఉంటాయి. స్థూలమైన అనగా భౌతికదృష్టి కలిగి ఉంటుంది.

 
రెండవది స్వప్నస్థానం. అంతఃప్రజ్ఞతో ఇది తేజోమయమై ఉంటుంది. ఈ తైజసరూపానికి కూడా ఏడు అంగాలు, పంతొమ్మిది ముఖాలు ఉంటాయి. ఈ తైజసమైన ఆత్మ స్వప్నావస్థలో ఏకాంతమైన మనోలోకంలో విహరిస్తూ ఉంటుంది.

 
ఏ కోరికలూ, కలలూ లేని గాఢనిద్రను ‘సుషుప్తి’ అంటారు. ఇది మూడవ స్థానం. పరబ్రహ్మ సుషుప్తస్థితిలో, ఒకే ఒక్కడుగా, ‘ప్రజ్ఞాన ఘనుడుగా, ఆనందమయుడుగా ఆనందాన్ని అనుభవిస్తూ, మనోముఖుడై, ప్రాజ్ఞుడై ఉంటాడు.

 
ఏష సర్వేశ్వరః ఏష సర్వజ్ఞ ఏషో తర్యామ్యేష యోనిః సర్వస్య ప్రభవాప్యయౌ హి భూతానామ్ ఇతడే సర్వేశ్వరుడు. సర్వజ్ఞుడు. అంతర్యామి. అన్నిటి పుట్టుకకు, నాశనానికి మూలకారణం ఇతడే. అద్వైతస్థానం నాలుగవది. ఇదే పరమాత్మ. అంతఃప్రజ్ఞకు, బహిఃప్రజ్ఞకు, ఉభయ ప్రజ్ఞకు అన్నిటికీ అతీతం. ప్రజ్ఞాసహితమూ కాదు. రహితమూ కాదు. కనపడదు. కదలికలు ఉండవు. పట్టుకోవడానికి దొరకదు. ఏ లక్షణాలూ ఉండవు. ఊహకు అందదు. వర్ణనాతీతం. ఏకైకం. పంచజ్ఞానేంద్రియ రహితం. శాంతం, మంగళప్రదం, అద్వైతం (రెండుకానిది) అయినది ఆత్మ. దానిని తెలుసుకోవాలి. దానికి ఓంకారమే ఆధారం.

 
వైశ్వానర, తైజస, సుషుప్త, తురీయస్థానాల్లో ఉన్న ఆత్మలో లీనం కావడానికి మానవులకు ఆధారమైనది ఓంకారం. ఆత్మ యొక్క నాలుగుదశలూ ఓంకారంలో ఉన్నాయి. శబ్దబ్రహ్మాన్ని ఏకాగ్రతతో ఉపాసించినవాడు రసాత్మకమైన పరబ్రహ్మం అవుతాడు. ఆనంద మయుడు అవుతాడు. శబ్దరూపమైన పరబ్రహ్మమే ఓంకారం. ఓంకారంలో మూడు మాత్రలు ఉన్నాయి. (మాత్ర అంటే చిటిక వేసినంత కాలం). అవి అ, ఉ, మ్ అనే మూడుపాదాలు. అ+ఉ గుణసంధితో ఓ అవుతాయి. దానికి మకారాన్ని కలిపితే ఓమ్ అయింది. దాని చివర నామరూపరహితమైన ధ్వని నాలుగోపాదం. దానితో ఓంకారం సంపూర్ణ పరబ్రహ్మం అవుతుంది.

 
ఓంకారంలోని మొదటిపాదం ‘అ’. ఇది జాగ్రత్ స్థానంలో ఉన్నా వైశ్వానరుని (అగ్ని) రూపం. వ్యాప్తి, ప్రథమస్థానం అనే లక్షణాలు అగ్నికీ, ‘అ’ కారానికీ సరిపోతాయి. ఇది తెలుసుకొని ఓంకారాన్ని ఆరాధించినవాడు అన్నిటినీ పొందుతాడు. సాధకులలో ప్రథముడు అవుతాడు. ప్వప్నస్థానంలో ైతె జసరూపంలో ఉన్న ఉ కారం రెండవపాదం అవుతుంది. మాత్ర ఎక్కువదనం వల్ల, రెండిటి మధ్య (అ, ఉ మ్) ఉండటం వల్ల ఉకారానికి తేజస్సుకీ పోలికలున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకుని ఓంకారాన్ని ఉపాసించినవాడు నిత్యజ్ఞానియై ద్వందాలకు (సుఖదుఃఖాలు, లాభనష్టాలు, నిందాస్తుతులు మొదలైనవి) అతీతుడు అవుతాడు. అతని వంశంలో బ్రహ్మజ్ఞానం లేనివాడు పుట్టడు.


 సుషుప్తస్థానంలో ప్రాజ్ఞరూపంలో ‘మ’కారం మూడోపాదం అవుతుంది. కొలత కొలిచే నేర్పు, గ్రహింపగల శక్తీ ఉన్న ‘మ’కారం ప్రాజ్ఞునితో సమానం. ఇది తెలుసుకున్నవాడు దేనినైనా అంచనా వేసి తెలుసుకోగలుగుతాడు. అమాత్ర శ్చతుర్థో వ్యవహార్యాః   ప్రపంచోపశమః శివోద్వైత ఏవ మోంకార ఆత్మైవ!   సంవిశత్యాత్మనాత్మానంయ ఏవం వేద, య ఏవం వేద


నామరూపరహితమైన నాలుగోపాదాన్ని ఎవరూ వర్ణించి చెప్పలేరు. అది వ్యవహారాలకు అందదు. జ్ఞానేంద్రియాలు ఉపశమించి శాంతించి ఉంటాయి. మంగళప్రదమూ, అద్వైతస్వరూపమూ అయిన ఓంకారాన్ని ఆత్మగా తెలుసుకున్నవాడు తానే పరబ్రహ్మమని తెలుసుకుంటాడు. ఇలా ఓంకారాన్ని గురించి నాలుగుదశలను గురించి తెలుసుకున్న వాడే నిజమైన జ్ఞాని. ఓంకారోపాసన నిరంతరమూ చేసేవానికి బ్రహ్మజ్ఞానం స్వయంగా లభిస్తుంది. ఏ గురువూ, ఏ విద్యా అవసరం లేకుండా ఓంకారధ్యానం లోనుంచి అది ఉద్భవిస్తుంది. సర్వజనులకూ అద్వైతాత్మజ్ఞానప్రదాయిని మాండూక్యోపనిషత్తు.

 ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః

 - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement