వేగాన్ని నియంత్రిస్తే ఏకాగ్రత కుదురుతుంది
ఆర్తచింత అంటే... ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనసు కదలడం. ఈ కదలికలు ఊపిరిమీద, దాని వేగంమీద ఆధారపడతాయి. అందుకే బాగా కోపంగా ఉన్నా, ఒక భోగం అనుభవించినా ఊపిరిలో వేగం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనసు బాగా కదులుతుంది. అక్కడ మనసును కదలకుండా నిలబెట్టడం చేతనయి ఉండాలి. అలా నిలబెట్టడం ప్రాణాయామంతో సాధ్యం. ఇది బాగా సాధనచేస్తే ఊపిరిని నియమిత వేగంతో పీల్చడం, విడిచిపెట్టడం సాధ్యమవుతుంది.
అందుకే పూజకు కూర్చున్నప్పుడు ముక్కుపట్టుకోమని ఊరికే చెప్పరు, ప్రాణాయామం చేయమని చెప్పేది ఎందుకంటే... ఊపిరి వేగాన్ని నియంత్రిస్తే, మనసు కుదురుగా నిలబడి భగవంతుడికి ఉపచారం ఏకాగ్రతతో చేస్తుంది. అలా చేసిన పూజనే పరమేశ్వరుడు పుచ్చుకుంటాడు. ఇక ఆఖరి ఊపిరి తీసినదైనా కావచ్చు, విడిచిపెట్టినదైనా కావచ్చు. తీసి విడిచిపెట్టకపోవచ్చు. విడిచిపెట్టి తీయకపోవచ్చు. ఈ రెండింటిలో ఏదయినా కావచ్చు మృత్యువు.
ఆఖరి ఊపిరియందు ఆఖరి కదలికలో మనసు వాసనా బలాన్ని పట్టుకుంటుంది. వాసన అన్నమాటకు ముందు రుచి అని ఉంటుంది. ఇది మిగిలిన వాటికి ఉండదు. ఒక్క మనుష్యుడినే రుచి, వాసన వేధిస్తాయి. రుచి అంటే... మనసుకు ఒక ఊహాజనితమైన మాట ఒకటి చెప్పారనుకోండి. ఆ సుఖం దానికి తెలియదు. ఒక చెట్టుకి ఊయల కట్టి భూమికి కాళ్ళు తగలకుండా ఊగుతుంటే ఎంత బాగుంటుందో... అన్నప్పుడు దానికి తెలియదు. ఒకసారి ఎక్కి ఊగించారనుకోండి.
దానికి బాగా నచ్చిందనుకోండి. వాసన లోపల బాగా పట్టుకుంటుంది. అది రుచి. చివరకు మనింట్లో కూడా ఊయలుంటే బాగుండుననే అన్వేషణ మొదలవుతుంది. ఇంట్లో దూలానికి ఊయలబల్ల ఏర్పాటుచేసుకుంటుంది. దానిలో ఉన్న హాయిని పట్టుకుంటుంది. దానిని వాసన అంటారు. ఈ వాసనలలో బాగా ఇష్టమైనదేదో దాన్ని ఆఖరిసారి ఊపిరి తీసినప్పుడు ఆఖరి కదలికలో మనసు పట్టుకుంటుంది. పట్టుకుని వెళ్ళిపోతుంది. ఏది పట్టుకుని వెళ్ళిపోయిందో దానికి అనుగుణమైన పునర్జన్మనిస్తాడు పరమేశ్వరుడు. ఆయనేం జోక్యం చేసుకోడు. ఆఖరున నీవు దేనిని స్మరించావో ఆయన పట్టగలడు. ఆయన చిత్రగుప్తుడు. చిత్రంగా ఇక్కడ కూర్చుని గుప్తంగా రాస్తాడు.
ఏమిరా, నీకు మనుష్య శరీరం ఇచ్చాను. ఆఖరున దేన్ని పట్టుకున్నావ్! ఒకడు పొలాన్ని పట్టుకున్నాడు, ఒకడు ఫలానా వాడిమీద కక్షతో రౌద్రచింతతో పోతాడు. వీరు చేసుకున్న పాపాలు మళ్ళీ అనుభవించడానికి కొన్ని కోట్ల జన్మల కిందకు వెళ్ళిపోతారు. తిర్యక్కులుగాగానీ, స్థావరములుగా గానీ, జంగమములుగా గానీ వెళ్ళిపోతారు. స్థావరము అంటే కదలలేకుండా ఉంటాడు. మేక వచ్చేస్తుంది, తనను తినేయబోతోందని తెలిసినా కదలలేడు.
దానిని స్థావరము అంటారు. జంగమములంటే కుక్క, పిల్లి, మేక, గొర్రె అలాంటివి. అంటే స్థావర, తిర్యక్, జంగమములన్నింటిలో కర్మచేసే అధికారంలేని ప్రాణిగా వెళ్ళిపోతాడు. అంటే శాస్త్రం, గురువు.. ఈ రెండింటితో సంబంధం ఉండదిక. ఈ రెండూ లేక ఇంకేం ఉంటాయి? షడూర్ములు అని ఆరు ఉంటాయి. వాటిని అనుభవిస్తుంటాడు. షడూర్ములు అంటే-జననం, మరణం, ఆకలి, దప్పిక, సుఖం, దుఃఖం.
మనుష్య ప్రాణి అలా కాదు. కొంత పుణ్యం చేసి మళ్ళీ మనుష్యుడిగా పునర్జన్మ పొందాడనుకోండి. అప్పుడు కూడా గతజన్మ తాలూకు వాసనాబలాన్ని వెంట తీసుకెడతాడు. దీనిని ఎలా గుర్తిస్తారంటే... అన్నప్రాశన చేసేటప్పుడు.. ‘వీడికి అన్నం పెడుతున్నాం. అది తిని బలం పుంజుకున్న శరీరంతో వీడేం చేయబోతున్నాడు, వీడి వాసనాబలం ఏమిటి?’ అన్నది గమనించడానికి... భగవద్గీత, డబ్బులు, బంగారం వంటివి పెడతారు.
వాడు పాకుతూ వెడుతుంటే... వీడేం ముట్టుకుంటాడోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. వాడు వెళ్ళి వెళ్ళి బంగారం ముట్టుకున్నాడనుకోండి. గతజన్మలోని వాసనాబలంతో ఆకర్షింపబడ్డాడు. వాడు బంగారం కోసం ముందుముందు ఏదయినా చెయ్యవచ్చు. అందుకని వాడికి చిన్నప్పటినుంచి రామాయణం చెప్పాలి. మడ్డినీళ్ళకు చిల్లగింజ విరుగుడయినట్లే వీడికి రామాయణం విరుగుడు. హమ్మయ్య మా వాడు భగవద్గీత పట్టుకున్నాడని వాడిని తీసుకెళ్ళి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేసి వదిలేయకూడదు. వాడు వృద్ధిలోకి రావడానికి వాడిని మంచి గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళడం, రోజూ ఇంట్లో భగవద్గీతను వినిపించడం చేయాలి. బీజం బద్దలై చెట్టు కావాలి. ఆ అవకాశమివ్వాలి.
అందుకే ఇప్పటికీ... చాలా చిన్న వయసులో మా వాడికి రాగాలన్నీ తెలిసిపోయాయంటూంటారు. అదెక్కడిదంటే.. కిందటి జన్మలోని సంగీతం పట్ల తాదాత్మ్యత. ఒక్కొక్కడికి భాగవత పద్యాలు ఒక్కసారి వింటే వచ్చేస్తాయి. అది వాసనాబలం... అక్కడినుంచి తెచ్చాడు వాడు. ఒక్కొక్కడు వెళ్ళిపోతున్నప్పుడు ‘అబ్బ, ఏం రామాయణంరా, ఏమి రామచంద్రప్రభువురా, ఏమి సీతమ్మ తల్లిరా..’ అని ఆలోచిస్తూ పోయాడనుకోండి. వాడు సాధనను ఇంకా కొనసాగించడానికి ఒక మహావిద్వాంసుడి కొడుకుగా పుట్టిస్తాడు. పుట్టుకతోనే ఒక మంచి గురువు దొరికినందువల్ల వాడికి ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. ధర్మప్రవర్తనతో, లోకంలో ధర్మపాలనకు ఉపకరిస్తాడు.